కుమారోపాఖ్యాన శ్రవణ ఫలము

స్కందునితో సంబద్ధమగు ఈ కథను ఏమర్యుడు పఠించునో వినునో వినిపించునో అట్టి నరుడు మహాతేజోవంతుడు, కీర్తిమంతుడును, బహ్వాయుష్మంతుడు, పత్నికి ప్రీతిపాత్రుడు, శ్రీమంతుడు, కాంతిమంతుడు, శుభదర్శనుడు, ఏ ప్రాణుల నుండియు నిర్భయుడు, ఏ దుఃఖములును లేనివాడు నగును. స్కందునికి నివేదనము చేయుచు స్కందుని ఉద్దేశించి బ్రాహ్మణులను అన్నాతురులను భుజింప జేయుచు ఈస్కంద చరితమును పారాయణము చేయుచో మహాధనపతి యగును. వ్యాధిగ్రస్తులగు బాలురకును రాజసేవా రూపములగు పదవులను ఆశ్రయించియుండు వారికిని ఇది పరమదివ్యమగు సాధనము; సర్వదా సర్వకామప్రదము; అట్టి నరుడు దేహము నశించిన తరువాత స్కంధునితో సాయుజ్యము పొందును.