జంబూద్వీప వర్ణనము

ఇక జంబూద్వీప విస్తారమును దానియందలి ఆయా వర్షముల సీమా రేఖలను ఆయా వర్ష పర్వతముల పొడవును తత్సంబంధులగు అంశములను తెలిపెదను. వీనిలో నీల నిషధ పర్వతములు అను జత మొదటిది. మిగిలిన శ్వేత-హేమకూట- హిమవత్ - శృంగవత్ లను నాలుగును వీనికంటె తక్కువ పొడవు గలవి. ఏడవదగు ఋషభపర్వతము పొడవు జంబూద్వీపపు వైశాల్య మెన్ని యోజనములో అన్నియే యోజనములు. హేమకూటపు పొడవు దానిలో పండ్రెండవ వంతు తక్కువ; హిమాలయపు పశ్చిమ భాగమున (పర్వతము లేక లోయగా ఏర్పడియున్న నేటి ఖైబరుబోలన్ కనుమల భాగము వంటివి) ఈ పండ్రెండవ వంతులో పండ్రెండవ వంతు తగ్గియున్నది. హేమకూట మహాగిరి పొడవు ఎనుబది ఎనిమిదివేల యోజనములు, హిమవంతము ఎనుబదివేల యోజనముల పొడవున తూర్పుపడమరలుగ ఉన్నది. ఈ జంబూద్వీపపు మండలి భావము (గుండ్రని రూపము)ను బట్టి ఈ అవధి పర్వతముల పొడవులో ఎక్కువ తక్కువలు కనబడుచున్నవి. (అనగా దీనినిబట్టి వీని పొడవును కొలుచు పద్ధతిని ఎరుగవలెను.) ఈ రెండేసి వర్ష-అవధి-పర్వతముల నడుమ ఎన్నియో జనపదములు గలవు. (జనపదములు-గ్రామములును-మహాగ్రామములును) వాని సముదాయములే వర్షములు. అవి మొత్తము ఏడు. (మరి రెండు ముందు చెప్పబడును.) ప్రపాతముల (నిట్ట నిలువుగానున్న ఉన్నత శిలామయ ప్రదేశముల)తోను అంతకుమించిన పల్లములతోనూ నిండిన అనేక పర్వతములు ఈ వర్షములందును వానియందలి జనపదములందును అవరించి ఉన్నవి. ఈ పర్వతముల మూలమునకు అనేక నదుల మూలమునను ఇవి పరస్పరము-ఒక దానినుండి మరియొక దానికి- పోవుటకు వీలు కాకున్నవి. వానియందంతటను ఎన్నియో ప్రాణులును మూర్తములును అమూర్తములును అగు పదార్థములును వ్యాపించియున్నవి.

వానిలో మొదటిదగు భారతవర్షమునకు హైమవత వర్షమని, పర్వతమును బట్టియు పేరు. ఇట్లే దాని కావలనున్న హేమకూట పర్వతము అవధిగాగల వర్షము కింపురుష వర్షము. దాని కావలనున్న నిషధపర్వతము అవధిగానున్నది హరివర్షము. దానికావల మేరువు నాశ్రయించి యున్నది ఇలావృతవర్షము. దీని కావల నీలపర్వతము అవధిగా గలది రమ్యకవర్షము. దానికి ఆవల శ్వేతపర్వతము అవధిగాగలది హిరణ్యక వర్షము. దాని కావల శృంగవత్ పర్వతము అవధిగా గలది ఉత్తర కురు వర్షము. (ఇవి తమకు అవధిగాగల ఆయా పర్వతములను బట్టి నిషధ వర్షము నీలవర్షము ఈ మొదలగు పేరులతో కూడ వ్యవహరింపబడవచ్చును.)

మేరువర్ణనము: మహామేరువునకు చుట్టును ఇలావృతవర్షము కలదు. ఇది ఉత్తరేలా వృతవర్షము దక్షిణేలావృతవర్షము అని రెండుగా ఉన్నది. మేరువునకు దక్షిణమున నిషధ పర్వతము-ఉత్తరమున నీలపర్వతము- ఈ రెండును తూర్పున గంధమాదనము పడమర మాల్యవంతము అను రెండు పర్వతములును ఉత్తర దక్షిణములుగా వ్యాపించి దక్షిణమున నిషధమును ఉత్తరమున నీలమున తాకుచున్నవి. కాని నిషధ - నీల పర్వతములు రెండును మహా మేరువునకు నడుమ భాగమునకు సరిసాటిగా ఉన్న భాగములో నిషధము మరికొంత దక్షిణమునకును నీలము మరికొంత ఉత్తరమునకును వంపు తిరిగి ధనురాకారముగ ఉన్నవి. ఇట్లున్న ఈ నీల గంధమాదన నిషధ మాల్యవత్పర్వతముల నడుమ ఇలా వృతవర్షమున్నది. ఈ నడుమ భాగము కొంత యజ్ఞవేదికయందలి దక్షిణోత్తరార్ధభాగములుగాను దీనియందే జనావాసభాగము ఉత్తర దక్షిణ ఆవృత భాగములుగాను ఉన్నది. ఈ చెప్పిన విధమున ఈ ఇలావృతవర్షపు (వేదిరూప ప్రదేశమందలి) రూపము తూర్పు పడమరలందు ఋజు రేఖారూపముగాను ఉత్తర దక్షిణము లందు (వృత్తఖండపు) వక్ర రేఖారూపమునను ఉన్నది. ఈ మాల్యవద్గంధమాదన పర్వతములు రెండును ఒక్కొక్కటి ముప్పదిరెండు వేలయోజనముల పొడవు కలిగిఉన్నవి. ఈ నాలుగు అవధుల నడుమగా మహామేరువునకు చుట్టును కొంతకొంతమేర వ్యాపించి సర్వరత్న విభూషితములగు విపుల సుపార్శ్వములనెడు రెండు పర్వతములుఉన్నవి. ఈ రెంటి నడుమను పైని తెలిపిన నీల మాల్యవత్ నిషధ గంధ మాదనములకు నడుమను ఉన్న మేరువు కనక పర్వతము అను ప్రసిద్ధితో ప్రకాశించుచున్నది. ఇది నాలుగు అస్రములందును (అస్రము = కోణము-అంచు) నాలుగు వర్ణములు కలిగిఉన్నది. ఎట్లన - తూర్పున తెలుపు- దక్షిణమున పీతము-పశ్చిమమున నలుపు-ఉత్తరమున ఎరుపుగా ఉన్నది. ఇట్లు ఆయాపరిమండల పర్వతాంశముల కాంతులను బట్టి దూరమునుండి చూచువారికి బంగారు కొండగాను రత్నమయ శాఖా పర్వతములతో కూడి రత్నమయముగాను, కనక పర్వతము రత్న సానువు (రత్నమయములగు సానువులు- నెత్తములు కలది) అని కీర్తింపబడుచు భూమికి నడుమ నున్న ఈ మేరువు (పామీరు శిలామయ తలము) ఎనుబది వేల యోజనముల ఎత్తు కలిగియున్నది. దీనికి గల పాతు (భూమిలోనికి గల లోతు నలుబది నాలుగు యోజనములు. వెడల్పునకు మూడింతలు దీని చుట్టుకొలత. ఇట్టి ఈ మేరు పర్వతము చాల గొప్పది; దివ్యమయినది; తన కాంతుల వ్యాప్తిచే బంగారుతో అలంకరించబడినవియో అనునట్లు తోచెడి సర్వభువనములును దీనిచుట్టునున్నవి. ఈ శైల రాజమునందే అంతటను సురరాక్షసులును అప్సరోగణాదికముతో సర్వదేవగణములును ఆనందించుచు విహరించుచుందురు. ఇట్లీ మేరువు సర్వభూతముల సృష్టి స్థితులకు హేతువులగు భువనములతో చుట్టబడి యున్నది.

నాలుగు వర్షములు, దీని నానా పార్శ్వములయందు (తూర్పున) భద్రాశ్వ వర్ష (మహాదేశ)ము (దక్షిణమున) భారతవర్ష (మహాదేశ)ము (పడమట) కేతుమాల వర్ష (మహాదేశ)ము (ఉత్తరమున) ఉత్తర కురువర్ష (మహాదేశ)ము ఉన్నవి. ఈ ఉత్తర కురువులు పుణ్యము చేసికొన్న వారికి నివాసభూములు. ఈ మేరువునకు నలుమూలల ఈ వర్షములందు విష్కంభ (అవష్టంభ) పర్వతములు సర్వ రత్న విభూషితములు. మందర గంధమాదన విపుల సుపార్శ్వములనునవి కలవు. అరుణోదయము మానసము సితోదము భద్రము అను సరస్సులు ఈ వర్షములందు (ఈ పర్వతములపై) వరుసగా గలవు. ఇట్లే వరుసగ భద్రకదంబవృక్షము జంబూ ప్లక్ష (జువ్వి) వృక్షములు-అశ్వత్థ వృక్షము-వటవృక్షము కలవు.

కేతుమాల వర్షము, గంధమాదన పర్వత పార్శ్వమున పశ్చిమదిశగా మేలగు మండపము (పందిరి క్రిందవలె చల్లనిదై జనావాసయోగ్య ప్రదేశము) కలదు. శుభకర్మకారులగు కేతుమాలులు అను జనులచట ఉందురు. వారు నల్లని దేహచ్చాయయు మహాసత్త్వమును మహాబలమును గలవారు. స్త్రీలచట నల్లకలువలవంటి దేహచ్ఛాయ కలిగిన ప్రియదర్శనలు (వారిని దర్శించుట కన్నులకు ప్రీతి కలిగించును.) అచట చక్కని ఆకులతో ప్రకాశించు దివ్య పనసవృక్షము గలదు. అచటివారా వృక్షపు పండ్లరసమును త్రావుచు పదివేలఏండ్లు జీవింతురు. (దీని సంకేతితార్థము ఏమయినను ఇది నేటి ఆసియా పశ్చిమభాగము); ఇక భద్రాశ్వ వర్షము: మాల్యవత్ పర్వత పార్శ్వమున పౌర్వాపరాంతికులు (తూర్పు కడపటి మేరయందలి జనులు) నివసింతురు. ఇచట సదా ముదిత మానసముకల భద్రాశ్వము (మేలుజాతి గుర్రము) కలదు. ఈ చోటి వైశాల్యము ముప్పది రెండు చదరపు యోజనములు; ఈ భద్రాశ్వ వర్షమున భద్రసాలమను వనము కలదు; కాలామ్ర (నల్లని మామిడి) మహావృక్షము గలదు. అచటి జనులు తెల్లనివారు- మహోత్సాహ మహాబలములు గలవారు, అచటి స్త్రీలు తెల్ల కలువలకాంతివంటి-చంద్రునికాంతి వంటి దేహకాంతి చంద్రుని ప్రకాశమువంటి లావణ్యము పూర్ణచంద్రునివంటి మొగము కలిగిన ప్రియదర్శనలగు సుందరులు; ఆ స్త్రీల శరీరములు చంద్రునివలె చల్లనివి, కలువపూలవలె కమ్మని సువాసనలు కలవి, ఆచట జనులు ఏ వ్యాధులును లేక పదివేల సంవత్సరములు జీవింతురు. ఈ కాలామ్రరసపానముచే వారందరును స్థిరజీవనులై యుందురు. (ఈ భద్రాశ్వ వర్షము నేటి చీనాదిదేశములు); అని ఇట్లు స్వయంభూ బ్రహ్మ ఈ వర్షములు స్వాభావికస్థితిని ఋషులతో చెప్పెను. ఇది వారి అనుగ్రహమున నాకు తెలిసినందున నాచే తెలుపబడినది; మరి ఇంకేమి వినగోరెదరు, ఏమి చెప్పుమందురు? అని సూతుడనగా విని సంశితవ్రతులు (పవిత్ర కర్మానుష్ఠానము కలవారు) అగు ఆ నైమిశారణ్య ఋషులు ముదన్వితులును కుతూహలులునై జిజ్ఞాసతో ఇట్లు పలికిరి: మహామేరువునకు తూర్పు పడమరలందుగల రెండు మహాదేశముల విషయము మాకు తెలిపితిరి; మహామతీ! ఉత్తర దిశయందలి వర్షములును అచటి పర్వతముల ఉనికియు ఆ పర్వతములందు వసించు జనులును ఏవి-ఎట్టివి- ఎవరు -ఎట్టివారు అను విషయము యథాతత్త్వముగా మాకు దెలుప వేడుచున్నాము అని ఋషులడుగ సూతుడిట్లు చెప్ప నారంభించెను.

మునులారా! మీరందరును వినుడు, నే నిదివరకు చెప్పనివానిని ఇప్పుడు తెలిపెదను. రమ్మకవర్షము: నీల పర్వతమునకు దక్షిణమున నిషధపర్వతమునకు ఉత్తరమున ‘రమ్యకము’ అను వర్షము కలదు. అదియు ఉత్తమ ప్రజావాసము; అచటి జనులందరు జాతి ప్రధానులు (జన్మసిద్ధముగా శ్రేష్ఠతాలక్షణములు కలవారు) నిర్మలులు; పాపరహితమగు వంశమున పుట్టిన వారు-తెల్లని ఆనువంశికమగు దేహచ్ఛాయ కలవారు; ప్రియదర్శనులు (చూడముచ్చట గొలుపువారు; అచట గొప్పదియు పూజ్యమునునగు మర్రిచెట్టు కలదు; అచటి మహాభాగులు అగునరోత్తములు ఆపండ్లరసమును త్రావును హృష్ణు (సంతోషయుక్తు)లై పదునొకండు వేల సంవత్సరములు జీవింతురు.

హిరణ్యక వర్షము: శ్వేత పర్వతమునకు ఉత్తరమున శృంగవత్పర్వతమునకు దక్షిణమున హిరణ్యక వర్షము కలదు. అచట హైరణ్యక నది కలదు. అచటి మానవులందరును మహాబలులు మహాసత్త్వులు (సత్త్వము అనగా నిబ్బరము - శ్రమకు ఓర్చెడి యోగ్యత) సదా సంతుష్టమానసులు; తెల్లని దేహచ్ఛాయ కలవారు; ప్రియదర్శనులు; పదునొకండు వేల ఐదువందల ఏండ్లు జీవింతురు. అచట మనోహరములగు ఆకులు కొమ్మలు రెమ్మలు గల మహాశ్వత్థ వృక్షము కలదు. అచటివారు దాని పండ్లరసము త్రావి జీవింతురు. అచటి శృంగవత్పర్వతపు రమ్య మహా శిఖరము లనేకములలో ఒకటి మణిమయమును మరియొకటి స్వర్ణమయమును మూడవది సర్వరత్నమయమును భవనోపశోభితమును.

ఉత్తరకురు వర్షము: శృంగవత్పర్వతపు మూడు శిఖరములలో కడపటిదగు సర్వరత్నమయ శిఖరమునకు ఉత్తరపు అంచును తాకుచు (క్షారజల) సముద్రమును దక్షిణపు అంచునుతాకుచు ఉత్తర కురువర్షమును ఉన్నవి. ఈవర్షము సిద్ధజనులకు ఆశ్రయము. అచటి వృక్షములు మధు (తేనెయే-లేదా తేనెవంటి) రసములు కలవి. దివ్యమగు అమృత తుల్యమగు జలములు కలనదు లచట కలవు. అచటి వృక్షములు పండ్లతోపాటు ఆభరణములను కూడ ఫలించును. అచటి కొన్ని వృక్షములు మనోహరములును సర్వకామ ప్రదములులై వస్త్రములను షడ్రసోపేత భక్ష్యములను ఫలించును. క్షీరి వృక్షములు (పాలుగల చెట్లు) అను అచటి కొన్ని చెట్లు అమృత తుల్యమగు షడ్రస భోజనము నిచ్చును. అచటి భూమి అంతయు మణిమయ మును సన్నని బంగారుఇసుక కలదియు అంతటను సుఖకరమగు స్పర్శము కలదియు బురద లేనిదియు శుభకరమును బాధ కలిగించనిదియునై యుండును. తమ పుణ్యానుభవానంతరము దేవలోకము నుండి భువికి జారిపడిన శుభమానవులు అచట జన్మింతురు. వారందరును తెల్లని అనువంశిక మగు దేహచ్ఛాయయు స్థిర యౌవనమును కలవారు. అప్సరసల వంటి అచ్చటి స్త్రీలకు కవల పిల్లలు (దంపతులే) పుట్టుదురు. ఆ కవ శిశువులు అమృతోపమమగు అచటి క్షీరి వృక్షముల క్షీరమును త్రావుదురు. కవలు సమముగా (సమరూప గుణ లక్షణములతో) పుట్టుదురు - పెరుగుదురు - సమశీల రూపములుకలిగి జీవించి సమముగాసమ-కాలమున మరణింతురు. వారు పరస్పరము అనురక్తులై చక్రవాకములవలె జీవింతురు. వారు రోగరహితులు-శోకరహితులు-నిత్యము ముదిత మానసులు-మహాసత్త్వులు; వారును పదునొకండువేల ఏండ్లు జీవింతురు; ఏ స్త్రీయు ఆ దంపతుల జీవితముల నడుమ ప్రవర్తించదు.

భారత వర్షము మొదలగు వర్షముల స్వభావము ఇట్టిదియేయని పరమ తత్త్వజ్ఞులు దర్శించి తెలిపిరి. మీకు మరి ఇంకేమి చెప్పవలయును అని సూతుడు ఋషులతో పలికెను.

బుద్ధిశాలియగు సూతపుత్రుడు ఇట్లు వ్యాకరించి (విడుమరచి) చెప్పగా మరియు తరువాతి విషయము విను కుతూహలముతో ఋషులు అతని నింకను ప్రశ్నించిరి.