యదువంశాను వర్ణనము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, ఇట్లు శౌనకుడు చెప్పిన యయాతి చరితమును విని శతానీకుడు అధికానందముతోపాటు ఆశ్చర్యమును పొంది పూర్ణచంద్రునివలె ప్రకాశించెను. మరియు అనంతరము శౌనకుని శాస్త్రవిధానానుసారము గోవులతో సువర్ణములతో రత్నములతో వివిధవస్త్రములతో పూజించెను. రాజు తనకుపంపిన ధనమంతయుస్వీకరించి శౌనకుడు దానిని బ్రాహ్మణులకిచ్చి అంతర్ధానమునందెను. అనగా విని ఋషులు సూతునితో ఇట్లనిరి, “అయ్యా యయాతి వంశము యదువు మొదలగు ఆతని పుత్రులతో లోకమున ఎట్లు ప్రతిష్ఠితమయ్యెనో తెలుప వేడుచున్నాము.”

సూతుడిట్లనెను, ఉత్తమ తేజశ్శాలియు యయాతికి జ్యేష్ఠపుత్రుడునునగు యదుని వంశమును అనుపూర్వితో విస్తరముగా చెప్పెదను వినుడు. యదువునకు దేవకుమారులను పోలిన ఐదుగురు కుమారులు కలిగిరి. వారు మహాధానుష్కులు; మహారథులు. వారి పేర్లు: సహస్రజిత్-క్రోష్టుడు-నీలుడు-బకుడు-లఘువు-అనునవి. సహస్రజితుని కుమారుడు శతజిత్. అతనికి హైహయ-హయ-వేణుహయులు ముగ్గురు కుమారులు. వీరిలో హైహయునికి ధర్మనేత్రుడు-అతనికి కుంతి-అతనికి సంహతుడు-అతనికి మహిముడు-అతనికి భద్రశ్రేణ్యుడు కుమారులు. ఈ భద్రశ్రేణ్యుడు వారాణనియందు రాజుగా ప్రసిద్ధుడుగా ఉండెను. భద్రశ్రేణ్యుని కుమారుడు దుర్దముడు. అతని కుమారుడు కనకుడు. అతని కుమారులు లోకవిశ్రుతులగు కృతవీర్యుడు కృతాగ్ని కృతధర్ముడు కృతౌజుడు అను నలుగురు. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అతడు వేయి చేతులు కలవాడుగా-సప్తద్వీపములకు అధిపతియగు రాజుగా అయ్యెను. ఆ రాజు పదివేల సంవత్సరముల పాటు ఇతరులు ఆచరించజాలని తపస్సును ఆచరించెను. కార్తవీర్యుడు అత్రి కుమారుడగు దత్తుని ఆరాధించెను. అతడు అతనిని నాలుగు వరములు కోరుకొమ్మనెను. ఆ రాజసత్తముడు సహస్ర బాహువులను తా నధర్మము నాచరించుచున్నచో సత్పురుషులు దాని నుండి తను నివారించుట-యుద్ధముతో పృథివిని జయించి ధర్మముననుస రించి దానిని పాలించుట-సంగ్రామమునందు తనకంటె అధికుని చేతిలో మరణము అను నాలుగు వరములను కోరెను.

అతడు సప్తద్వీపములు పర్వతములు కలిగి సప్తసముద్రములనడుమ నున్న పృథివిని తన విక్రమముతో జయించెను. అతడు కోరుకొనినట్లు యుద్ధముల యందు రథములుగా ధ్వజములుగా భుజసహస్రము ఉత్పన్న మయ్యెడిదని పరంపరలో వినుచుందుము అతడాయా రాజుల ద్వీపములందు నిరాటంకముగా పదివేల యజ్ఞములను నిర్వర్తించెనని వినుచున్నాము. అతని సర్వ యజ్ఞములకు అవభృథములు (యజ్ఞ దీక్షాంతస్నానములు) జరిగెను. భూరిదక్షిణలతో కాంచన యూపము (యజ్ఞపశువును బంధించు స్తంభము)లతో కాంచన వేదికలతో ఆ యజ్ఞములు జరిగెను.

కార్తవీర్యార్జునుని యజ్ఞములకు నారదుడు అను గంధర్వుడు వచ్చెడివాడు. అతడు తాను విమానములో రాగా అతని వెంట అనేక విమానములలో సర్వదేవతలు గంధర్వులు అప్సరసలును వచ్చెడివారు. అవిమానములలో అదేవజాతులతో ఉపశోభితుడగు నారద గంధర్వుడు కార్తవీర్యార్జునుని మహిమమును ఇట్లు కొనియాడుచు “తమ యజ్ఞములచేగాని దానములచేగాని తపస్సులచే గాని విక్రమముచేగాని శాస్త్రాధ్యయనముచేగాని క్షత్త్రియులెవ్వరును కార్తవీర్యార్జునుడు పొందుగతిని పొందరు” అని అర్థము వచ్చు గాథను గానము చేసెడివాడు.

ఆ రాజు సప్త ద్వీపములయందును రథమును అధిరోహించి ఖడ్గము చక్రము ధనువు ధరించి యోగియై తస్కరులను కనిపెట్టెడివాడు. అతడు ఎనుబదియైదు వేల సంవత్సరములపాటు సర్వరత్న సంపూర్ణుడగు చక్రవర్తిగా ఉండెను. అతడే పశుపాలుడుగా, క్షేత్రపాలుడుగా, వర్షము కురిపించుటతో పర్జన్యుడుగా యోగియై అర్జునుడుగా అయ్యెను. వింటి వారిని కఠోరముగా మ్రోయించుచు వేయి బాహువులు కలిగి శరత్కాలము నందలి వేయికిరణములతో భాస్కరుడు వెలిగినట్లు వెలిగెడివాడు. మహా విజేతయగు అ అర్జునుడు మనుష్యుల నడుమనున్న నాగుడను కర్కోటక సుతుని జయించి అతని మాహిష్మతీ నగరమును తన రాజధానిగా చేసికొనెను. (మహి+అహి+మత్=మహాహిష్మతీ= మహిష్మతీ) అతడు (తన యోగశక్తిచే) నోటితోనే సముద్రపు పోటులను వెనుకకునెట్టియు చెదరగొట్టియు వర్షా కాలములో సముద్ర వేగమును తగ్గించెడివాడు. అతని కనుబొమముడికి భయపడి నర్మదా నది అతని కడకురాగా దానియందు విశిష్టములగు పూలమాలలను ధరించిన తన స్త్రీలను క్రీడింపజేసెడివాడు. తనవేయి చేతులతో సముద్రమును పట్టివేసెడివాడు. వర్షాకాలమున పొంగిన నర్మదకు వేగమును పొంగును తగ్గించెడివాడు. అతడు తన భుజ సహస్రముతో సముద్రమును కలత పరచుచుండగా పాతాళమున (సముద్రమునకు అడుగున) ఉన్న మహాసురులు భయముతో ముడుచుకొని కదలక మెదలక యుండెడివారు. అతడు సముద్రమును తన భుజసహస్రముతో పళ్లెరమును పట్టినట్లు పట్టుకొని అటుఇటు ఊపుచుండెడివాడు. అపుడు దానియందలి పెద్ద అలలును వానిలోని నక్రములును మీనములును తిమింగిలములును కలవరపాటు చెందెడివి. గాలి ఒత్తిడిచే నురుగు పైకిలేచెడిది. సుడులు మరింత భయంకరముగారేగి దుఃసహములయ్యెడివి. అమృతమును ఉత్పత్తి చేయుటకై మందర పర్వతముతో సముద్రమును మధించుచున్నారేమో అను భయములతో మహాసర్పములు సాయాహ్న కాలమున గాలిలేని చోట కదలక ఉండు అరటి గుబురులవలె కదలక నిలిచి యుండెడివి.

బలశాలియగు అతడు లంకకుపోయి రావణుని మోహపరచి తన బలముచే ఐదు బాణములతో వానిని జయించి తన వింటినారితో బంధించి మాహిష్మతికి తెచ్చి చెరలో నుంచెను. తరువాత పులస్త్యుడు పోయి బ్రతిమాలగా నతడు రావణుని విడిచెను. అతడు తన భుజసహస్రముతో చేసెడి జ్యాధ్వనులు ప్రళయకాలపు వేయిమంది సూర్యుల నుండి పడెడి పిడుగులు మ్రోతలవలె చెవులకు వినబడెడివి. కాని విధిశక్తి ఎంత బలవత్తరమును విచిత్రమునునైనది! ఆబాహు సహస్రమును భార్గవుడగు పరశురాముడు బంగారు తాటితోపును నరకినట్లు నరకెను గదా! మహాసమర్థుడగు భార్గవుడను మహాముని క్రుద్ధుడై అర్జునుని ఇట్లు శపించెను.

“ఓ హైహయా! లోకప్రసిద్ధమగు నా వనమును నీవు దహించితివి కావున నీవు చేసిన దుష్కరమగు సుకృతపు ఫలమునంతటిని మరియొక మానవుడు హరించును. అట్లు నీ సుకృతమును పొంది కౌంతేయుడగు అర్జునుడు (నీ పేరుగలవాడు) రాజగును. నా వంశమునందు పుట్టిన తపస్వి బ్రాహ్మణు డొకడు తన శక్తిచే నీ బాహుసహస్రమును ఖండించి నిన్ను వధించును’’ అని శపించెను. దానికి ఫలముగా ముందుకాలమున పరశురాముడతనికి మృత్యువయ్యెను. అర్జునుడు పూర్వము దత్తాత్రేయుని వలన కోరిన వరము కూడ ఇదియే.

ఈ కార్త వీర్యార్జునునకు నూరు మంది కుమారులు-వారందరును మహారథులును అస్త్ర విశారదులును ధర్మాత్ములును మహాబలులునునై యుండిరి. శూరసేనుడు శూరుడు వృష్టి- కృష్ణుడు జయధ్వజుడు మొదలగువారు వీరిలో ముఖ్యులు. జయధ్వజుడు అవన్తి నగరమును నిర్మించెను. అతని కుమారుడు తాలజంఘుడు. అతనికి నూరుమంది కుమారులు కలిగిరి. వారికి తాలజంఘులని వ్యవహారము. వీరిలో ఐదుగురి వంశములు ప్రసిద్ధములు: వారు శర్యాతికోవలోని వీతిహోత్రులు-భోజులు-అవంతులు-తుండికేరులు-తాలజంఘులు అనువారు. వీతిహోత్రుని కొడుకు ఆనర్హుడు. అతని కొడుకు దుర్జయుడు. అతడు శత్రు విజేతయై మహారాజై సద్భావముతో ధర్మముతో ప్రజలను పాలించెను.

యదువంశములో కృతవీర్యుని కుమారుడు అగు అర్జునుడు ఇట్లు ప్రసిద్ధుడగు రాజు. అతడు సహస్ర బాహుడు. సాగర పర్యన్తమగు భూమిని అతడు తన ధనువుతో జయించెను. వేకువలో మేల్కొనగానే అతని పేరుతలచినవానికి ధన నాశము కలుగదు. పోయినదియు తిరిగి దొరకును.