మత్స్య మహా పురాణము
కావేరీ సంగమ మాహాత్యము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. యుధిష్టిరుడు మొదలగువారును తపోధనులగు ఋషులును మార్కండేయ మహామునిని ఇట్లడిగిరి, భగవన్! లోకముల హితమునకును మాకు శుభమగుటకును సదా పాపాసక్తులయి దుష్కృతము లాచరించువారు సర్వపాపనిర్ముక్తులయి పరమపదము చేరుటకును కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మాహాత్మ్యమును మాకు చెప్పి యది తెలుప ప్రార్థించుచున్నాము అన మార్కండేయుడిట్లు చెప్పెను. యుధిష్ఠిరాదులారా! అందరును వినుడు, వీరుడును మహా విక్రమశాలియునగు కుబేరుడను మహాయక్షుడుండెను. ఈ తీర్థమునకు వచ్చినందుననే యతడు యక్షాధిపతియయ్యెను, మహారాజా! అతనికి సిద్ధి కలిగిన విధము తెలిపెదను వినుము.
లోక విశ్రుతమగు కావేరీ (కౌబేరీ) నర్మదా నదుల సంగమము కలచోట సత్యవిక్రముడగు కుబేరుడను ఆయక్ష శ్రేష్ఠుడు స్నానమాడి శుచియై నూరు దివ్య వత్సరముల కాలముపాటు తపమాచరించెను, అతని విషయమున తుష్ఠుడయి మహాదేవుడు అతనికి ఉత్తమమగు వరమీయదలచి వచ్చి “మహాసత్త్వము (శక్తి) గల యక్షుడా! నీ యథేప్సిత వరమేమి? నీ మనస్సునందుగల కార్యము ఏదో తెలుపుము” అనగా కుబేరుడు ఇట్లనెను: దేవేశా! నీవు తుష్టుడవయి నాకు వరమీయదలచినచో ఇది మొదలు నేను యక్షులకు అధిపతి యగుదుగాక!’ ‘ అనెను. కుబేరుని వచనమును విని మహాదేవుడు పరితుష్టుడయి సరేయని యంతర్ధానమందెను; ఆ కుబేరుడను యక్షపుంగవుడును వరమంది వెంటనే యక్ష నివాసమునకేగి సర్వయక్షుల పూజలనందుకొని వారిచే వారి కధిపతిగా అభిషిక్తుడయ్యెను.
ఇట్టి సర్వపాప ప్రణాశకమగు కావేరీ (కౌబేరీ) సంగమము నెరుగనివారు జీవితమున వంచితులయినట్లే, కావున ఇది ఎరిగి మానవుడు అందు స్నానమాడవలయును, కావేరీ (కౌబేరీ) నర్మదలు రెండును మహాపుణ్య ప్రదములగు మహానదులే; వాటి సంగమమందు సర్వ ప్రయత్నము లతో స్నానమాడి వృషభధ్వజు నర్చించినచో అశ్వమేధ ఫల మంది రుద్ర లోకమున పూజితుడయి సుఖించును, అచ్చట అగ్ని ప్రవేశముతోగాని ప్రాయోపవేశముతోగాని దేహత్యాగము చేసినచో పునరావృత్తి రహిత గతినందును, ఉత్తమ స్త్రీల పరిచర్య అందుకొనుచు ద్యులోకమున రుద్రునివలె సుఖించును; రుద్ర లోకమునందు నివసించుచు కోరినచోటికెల్ల పోవుచు సంచరించుచు ఆరువది కోట్ల ఆరువది వేల సంవత్సరములు రుద్రలోక మందుండి సుఖించును, పుణ్యక్షయానంతర రుద్రలోకము నుండి భ్రంశమునంది పడినను, ధార్మికుడు భోగవంతుడు దానశీలుడు మహావంశ సంజాతుడునగు రాజగును, అచటి జలమును త్రాగినచో చాంద్రాయణ వ్రతమాచరించిన ఫలము లభించును; స్వర్గ ప్రాప్తియగును, కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ స్నానముచే గంగా యమునా సంగమ స్నానఫలము లభించును, రాజేంద్రా! కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మహత్త్వము ఇట్టిది, ఇది పుణ్య కరము, మహా ఫలప్రదము, సర్వపాప ప్రణాశనకరము. (ఈ కావేరీనది దక్షిణభార దేశమునందలి కావేరీ కాదు. నర్మదానదికి ఉపనదియై కౌబేరీ అను ఉపనామముగల కావేరీ నది)