మత్స్య మహా పురాణము
ఈశ్వరుడు అంధకాసురుని చంపుట
ఋషులు సూతునితో ఇట్లనిరి, సూతా! నీవు పద్మోద్భవ వృత్తాంతమును విస్తరముగా మాకు చెప్పి వినిపించితివి. భైరవమాహాత్మ్యమును సంగ్రహముగా చెప్పి వినిపింపగోరుచున్నాము అన సూతుడిట్లు చెప్ప నారంభించెను. దేవదేవుడగు భైరడువు నిర్విర్తించిన ఉత్తమ కర్మమును చెప్పెద వినుడు. అంధకుడను దైత్యు డుండెడివాడు; వాడు అపుడే పగులగొట్టిన కాటుకరాశివలె మెరయువాడు. మహాతప మాచరించినవాడు; దేవతలకును అవధ్యుడు, వాడొకప్పుడు పార్వతితో కూడి విహరించుచున్న విభుని మహాదేవుని చూచి దేవి నపహరింప సమకట్టెను. అవంతీదేశమున ఘోరమగు మహాకాలవనమందు ఈ విషయమయి అంధకునకు శంభునితో యుద్ధము జరిగెను. దానియందు శివుడు అంధకునిచే మిగుల బాధనందెను. అపుడీశ్వరుడు పాశుపతమను అత్యుగ్ర బాణమును ప్రయోగించెను. రుద్రుడు తనబాణముతో అంధకుని చీల్చగా వాని రక్తమునుండి మరల అట్టివారే మరి కొందరంధకులు జనించిరి. వారితో సమస్త జగము వ్యాప్తమయ్యెను. ఇట్లు ఆ యంధకుడు మాయావి అగుట చూచి అదేవుడు అంధకుని రక్తమును త్రావుటకు మాతృకలను దేవతలను సృజించెను. (మహాకాలవనము ఉజ్జయిని దగ్గర ఉండెను.)
మహేశ్వరి, బ్రాహ్మి, కౌమారి, మాలిని, సౌపర్ణి, వాయవ్య, శాస్త్రి, వైనాయకి, సౌరి, సౌమ్య, శివదూతి, చాముండ, వారుణి, వారాహి, నారసింహి, వైష్ణవి, చలచ్ఛిఖ, శతానంద, భగానంద, పిచ్ఛిల, భగమాలిని, బల, అతిబల, రక్త, సురభి, సుఖమండిక, మాతృనంద, సునంద, బిడాలి, శకుని, రైవతి, శంకరి, చంద్ర, లాంగలి, కుదిని, జయ, విజయ, జయంతి, అపరాజిత, కాళి, మహాకాళి, దూతి, సుభగ, దుర్భగ, కరాళి, నందిని, అదితి, దితి, మారి, మృత్యు, కర్ణమోటి, యామ్య, ఉలూభి, ఘటోదరి, వజ్రహస్త, పిశాచి, కపాలి, రాక్షసి, భుసుండి, శాంకరి, లంబ, చంద్ర, కరభ, ఘోట, సులోచన, ధూమ్ర, వరవాణి, కరాళిక, విశాలదంష్ట్రిణి, శ్యామ, త్రిజటి, కుక్కుట, వినాయకి, వైతాళి, ఉన్మనా, బడబ, సిద్ధి, లేలిహానా, కేకరి గర్ధభి, ఉత్కట, బహుపుత్రి, ప్రేతయాన, విటంకిని, క్రౌంచి, శైలముఖి, వినత, సరమ, దను, ఉమ, రంభ, మేనక, సలిల, చిత్రరూపిణి, స్వధా, స్వాహా, వషట్కార ధృతి, జ్యేష్ఠ - కపర్దిని - మాయ - విచిత్రరూప - కామరూప - సంగమ మహానాన - మహాముఖీ - కుమారి - రోచన - భీమ - దామ, మదోద్ధత, లంబాక్షి, కాలజిహ్వి, కుంభకర్ణ, మహాసురి, కేశిని, కునఖి, పింగళాక్షి, తామసి, ఉల్కాముఖి, ధూమ్రశాఖా, కంపిని, పరికంపిని, మోహిని, కుండలి, చంద్రా, నిర్భయా, బాహుశాలిని, కరకర్ణి, ఏకాక్షి, విశోక, నందిని, జ్యోత్స్నాముఖి, రభన, నికుంభ, రక్తకంపన, అధికార, మహాచిత్ర, చంద్రసేన మనోరమ, అదర్శన, హరత్పాపా, మాతంగి, లంబమేఖలా, అబల, వంచన, కాళి, ప్రాణద, లాంగలావతి, చిత్త, చిత్తజల, కో(శో)ణా, శాంతిక, ధృష్టశాలిని, లంబస్తని, లంబసటా, విసటా, వానచూర్ణిని స్ఖలంతీ, దీర్ఘకేశీ, సుచిరా, సుందరీ, శుభా, అయోముఖీ, కద్రుముఖీ, క్రోధని, అశని, కుటుంబిక, ముక్తిక, చంద్రిక, బాలమోహినీ, సామాన్య నహినీ, లంబాలకోవిదారీ, మా(వా) సవి, శంకుకర్ణీ, మహానాథ, మహాదేవి, మహోదరి, హుంకారి, రుద్రసునటా, రుద్రేశీ, భూతదామరి, పిండజిహ్వ, చలజ్జ్వాల, శివా, జ్వాలాముఖి (189) ఈ మొదలగు మహాఘోర మాతృకలు శివునిచే సృజింపబడి అంధకుల రక్తమును త్రావిరి. ఆ అంధక రక్తములతో వారందరును మిగుల తృప్తినందిరి. వారు తృప్తినందిన అనంతరము మరల అంధకపుత్రులు జనించి శూల ముద్గరములు చేతులు ధరించి వానితో మహాదేవుని బాధింపసాగిరి.
అంధకులతో వ్యాకు లీకృతుడై శంకర భగవానుడు - అజుడు విభుడు దేవుడు నగు వాసుదేవుని శరణు వేడెను. అంతట విష్ణు భగవానుడు శుష్కరేవతి - యను దేవతను సృజింపగా ఆమె క్షణములో అంధకరక్తపానము చేసెను. ఆమె అంధక రక్తము త్రావిన కొలదిని ఎండిపోవ సాగెను. ఆమె అట్లు వారి రక్తమును త్రావిన మీదట (క్రొత్తవారు పుట్టక పోగా) ఉన్న అంధకులను త్రిపురారి క్షయమందించెను. అంతట త్రిలోకధర్తయగు శంకరుడు శర్వుడు విక్రమించి (మొదటి) మూలాంధకుని మహావేగమున తన శూలాగ్రమున నిలుపగా మహావీర్యుడగు వాడును శంకరుని స్తుతించెను. భవోద్భవుడు (సంసార మూల కారణుడు) అగు శంకరుడు వాని విషయమున తుష్టుడయి వానికి నిత్యము తన సాన్నిధ్యమును, గణేశత్వమును ప్రసాదించెను. అంతట మాతృకలు శంకరునితో “భగవన్! దేవాసుర మానుషులతో కూడిన సకల జగత్తును భక్షింతుము. నీ అనుగ్రహము కావలెను. అనుజ్ఞనీయ వేడుచున్నాము” అనిరి. శంకరుడు ఇట్లనెను. (మీరు ప్రజల నందరను రక్షించవలయును, ఇది నిస్సంశయము కదా! కనుక ఈ ఘోరాభిప్రాయమును మరల్చుకొనుడు.”
శంకరుడు ఇట్లు పలికినను లెక్కపెట్టక వారు ఏ కలవరమును లేక స్థిరచిత్తముతో సచరాచరమగు త్రైలోక్యమును భక్షించిరి. అపుడు శివ భగవానుడు అనాదినిధనుడు దేవుడు సర్వలోక సృష్టికి మూలభూతుడు, దైత్యేంద్రుని వక్షమందలి రక్తముతో పూయబడిన గోళ్ల కొనలుకలవాడు, మెరపువంటి నాలుకగలవాడు, పెద్ద కోరలవాడు, మెరయు జూలిరాశి కలవాడు, ప్రళయ వాయువుతో కలతపడు మహాసాగరము వలె ధ్వని చేయువాడు, వజ్రములవంటి వాడి గోళ్లవాడు భయంకరుడు చెవుల వరకు తెరచిన నోరివాడు, మేరుపర్వతమువలె ప్రకాశించువాడు, ఉదయరవినిపోలు కన్నులవాడు, హిమాద్రిశిఖరాకారుడు మనోహరములగు కోరలతో ఉజ్జ్వలమగు మొగము కలవాడు, గోళ్లనుండి వెలికి వచ్చుచున్న రోషాగ్ని జ్వాలలనెడు జూలి పంక్తులు కలవాడు, బంగారపు భుజకీర్తులు కిరీటము హారములు కటి సూత్రము సొమ్మలుగా దాల్చినవాడు, నల్లకలువ రేకులవలె చామనచాయ కలవాడు, వస్త్రయుగళము అలంకారముగా దాల్చినవాడు, తన తేజముతో సకల బ్రహ్మాండాంతరాళమను మండపమును క్రమ్మినవాడు, వాయుబలముచే త్రిప్పబడుచున్నవి తమయందు వేల్చబడిన హవిస్సును కొనిపోవునవియునగు అగ్నిజ్వాలల సుడులతో సమానాకారముకల వెంట్రుకలతో కూడినవాడు, సర్వవర్ణ విచిత్ర పుష్పములతో కూర్చబడిన మహామాలను దాల్చినవాడునగు నృసింహమూర్తిని ధ్యానించెను. రుద్రుడు భక్తి పూర్వకమగు ఏ రూపము కలవానిగా తను ధ్యానించెనో అదే రూపమున నృసింహ దేవుడు అతనికిని ధ్యానించి నంతనే దర్శన మొసంగెను. కాని ఆ రూపము దేవతలకును చూడశక్యము కానిది. శంకరుడా దేవునికి నమస్కరించి ఇట్లు స్తుతించెను.
జగన్నాథా! నృసింహదేహధారిన్! హరీ (పాపముల హరించువాడా!) దైత్యనాథుని రక్తముతో నిండిన గోళ్ళు అనెడు శక్త్యాయుధములు కలవాడా! నీకు నమస్కారము. సకల జగమునందును వ్యాపించిన బంగారువంటి పచ్చనిమూర్తి కలవాడా! ప్రళయకాల మేఘ ధ్వనివంటి నాదము కలవాడా! పద్మనాభా! దేవతలకును ఇంద్రునకును సమస్త జగత్తునకును తండ్రీ! సహస్ర విధములగు మహాక్రోధము గలవాడా! సహసేంద్రులంత పరాక్రమము కలవాడా! సహస్ర ముఖములు సమృద్ధి కలవాడా! సహస్రపాదా! సహస్రకాలముల రచించువాడా! సహస్ర సంఖ్యాకములగు ఇంద్రియములను నిగ్రహించువాడా! సహస్ర భూలోకములకును మంచి ధైర్యము నొసంగువాడా! వేలుకొలదిగా అనంతమూర్తులు కలవాడా! సహస్ర చంద్ర సమానా! సహస్రగ్రమ విక్రమా; సహస్ర రుద్ర సమాన తేజశ్శాలీ! సహస్ర బ్రహ్మ వరిస్తుతా! సహస్ర వాయువేగ భయంకరా! సహస్ర నేత్రములతో చూచువాడా! వేలకొలదిగా యంత్రములను మధించువాడా! సహస్ర బంధనములనయిన విడిపించువాడా! నిన్ను నమస్కరించుచున్నాను. అంధకాసుర వినాశమునకై నేను సృష్టించిన మాతృకలు నామాట లెక్క పెట్టక ఇపుడు లోక ప్రజలను భక్షించుచున్నారు. అపరాజితా! నేనే సృష్టించి వారిని ఇప్పుడు నేనయి సంహరింప జాలకున్నాను. అని రుద్రుడు పలికినది విని నరసింహమూర్తియగు ఆ హరి భగవానుడు తన జిహ్వనుండి వాణీ(గీ)శ్వరిని హృదయము నుండి మాయను గుహ్యము (రహస్యాంగము) నుండి భగమాలినిని సృజించెను. ఆ దేవుడు ఇదివరకే తన ఎముకల నుండి కాళిని సృజించి యుండెను. అంధకుల రక్తమును త్రావిన శుష్కరేవతి ఆమెయే. ఇట్లు నలుగురను శక్తులను సృజించిన తరువాత వారికి పరివార దేవతలుగా మరి ముప్పది రెండు మంది దేవతాశక్తులను నృసింహుడు తన యవయవముల నుండి సృజించెను.
వారి నామములు తెలిపెదను వినుము: 1.మహాభాగయగు ఘంటాకర్ణి; 2. పుణ్యయగు త్రైలోక్యమోహిని; 3. సర్వ సత్త్వవశంకరి; 4. చక్రహృదయ; 5. కామచారిణి; 6. శంఖిని; 7. లేఖిని; 8. కాల సంఘర్షణి - వీరు వాగీశ్వరి అను మొదటి శక్తికి అనుచరలు; 1. సంకర్షణి; 2.అశ్వత్థ; 3.బీజభావ; 4. అపరాజిత; 5. కల్యాణి; 6. మధుదంష్ట్రి; 7. కమలా; 8. ఉత్పల హస్తికా - అనువారు ఎనిమిది మందియు మాయాదేవికి అనుచరులు; 1. అజిత; 2. సూక్ష్మహృదయ, 3. వృద్ధ; 4. వేశాశ్మదంశనా; 5. నృసింహభైరవా; 6. బిల్వా: 7. గరుత్మద్ధృదయా; 8. జయా వీరు భగమాలినికి అనుచరలు; 1. ఆకర్షణీ; 2. సంభటా; 3. ఉత్తరమాలికా; 4. జ్వాలాముఖీ; 5. భీషణికా; 6. కామధేను; 7.బాలికా; 8.పద్మకరా - వీరు కాళికి - లేదా శుష్కరేవతికి అనుచరలు; ఈ ఎనిమిదేసి మంది (8 × 4 = 32) యును నృసింహదేవుని అవయవముల నుండి జనించినవారు, త్రైలోక్య సృష్టి సంహారములు చేయ సమర్థలు; వీరందరును తాము సృష్టింపబడిన వెంటనే మొదట రుద్రుడు సృష్టించిన మాతృగణము విధమున క్రుద్ధలయి క్రోధముతో మెరయు కన్నులతో వారిమీదకు పరువెత్తిరి. వారి దృష్టి తేజస్సతి దారుణమయి ఎంతమాత్రమును సహింపరానిదిగా నుండెను. అంతట ఆరుద్రసృష్టమాతృకలు నృసింహదేవునే శరణుచొచ్చిరి. వారితో నృసింహుడిట్లు పలికెను:
మనుష్యులును పశువులును తమ సుతులను చాలకాలము వరకు పోషించుచు పాలించుచునుండును కదా! దేవతలు కూడ ప్రజలను అట్లే చూడవలయును కదా! కావున మీరును నామాట పాటించి లోకపాలనము సేయుడు: మనుజులును దేవతలుకూడ పురాంతకు డగు శివుని ఆరాధించునట్టు చూడుడు; శివ భక్తులకును నా భక్తులకును మీకును బలు లొసంగి పూజించువారికిని ఏ బాధలును కలుగనీయక సర్వకామ ఫలములను ఇచ్చి రక్షించుచుండుడు, నేను చెప్పిన విధానము ననుసరించి ఉచ్చాటనాదికము చేయువారిని నా శాసనమును కూడ మీరు పాలించవలయును. ముఖ్యులగు మహాదేవులారా! మహదేవుడు ఇంతటి నుండి మీకు ఉగ్రమును ఉత్తమమునగు రూపమును అనుగ్రహించును; మీరును అతని మాటను పాటించుచు లోకరక్ష చేయుచుండుడు. లోకములకు కలుగు భయమును పోగొట్టగల మాతృకలను కొందరను నేను సృష్టించితిని గదా! తమ విశాల నేత్రములతో వారు సదా ప్రజలను కనుపెట్టి చూచుచు నావెంటనే ఉండి విహరించుచుందురు. మీరును వారును నాతోపాటుగనే నరులనుండి పూజల నందుకొను చుండుడు, లోకమున నాతోకాక వేరువేరుగ కూడ పూజలందు కొనుచు వారికి సర్వ కామములను పూరించుచుండుడు; పుత్రార్థులయి లోకము నందలి వారికి సర్వకామ ప్రదయగును.
అని ఇంతమాత్రము చెప్పి జ్వాలామాలలతో నిండిన శరీరముకల నృసింహ భగవానుడు తాను సృష్టించిన మాతృగణముతో కూడ అచ్చటనే అంతర్ధాన మందెను. అచ్చట కృతశౌచమను తీర్థము ఉత్పన్నమయ్యెను. సర్వ జగత్తుల కంటెను ముందే యున్నవాడును జగములు ఆర్తిని హరించువాడు నగు హరుడు అచ్చటనే తాను సృష్టించిన రౌద్ర మాతృవర్గమునకు రౌద్రమును దివ్యమును నగు మూర్తిని ప్రసాదించి అచ్చటనే మాతృకాగణ మధ్యమున తానును ఉండిపోయెను. అర్ధము నారిగా నుండిన ఈశ్వరుడగు ఆ శివుడు తాను సృష్టించిన మాతృకాగణమున ప్రధానలగు సప్త మాతృకలను అరుద్రస్థానము నందుండునట్లు చేసి తానును అచటనే అంతర్ధాన మందెను.