ఆర్ద్రానంద తృతీయా వ్రతము

ఈశ్వరుడు గౌరి కిట్లు చెప్పెను, ఇట్టిదియే పాపనాశనియగు మరియొక తృతీయా వ్రతమును చెప్పెదను. దీనికి లోకమున ఆర్ధానందకర తృతీయా వ్రతమని ప్రసిద్ధి. శుక్లపక్షమున తదియనాడు ఆషాఢ ద్వయముకాని రోహిణీ మఘాహస్తమూల నక్షత్రములలో ఏదైన కాని ఉన్న దినమున యజమానుడు దర్భలతో పవిత్రమయిన సుగంధ జలములతో స్నానమాడవలెను. తెల్లని వస్త్రము లను తెల్లని పుష్పములను తెల్లని సుగంధపు పూతలను తాల్చవలెను. భవానీ మహాదేవులను మహాసనమున నిలిపి సుగంధవంతములగు తెల్లని పూవులతో పూజించవలెను.

ఇట్లు పార్వతీ పరమేశ్వరులను యథావిధిగా పూజించి మరల వారిముందు మ్రుగ్గు పొడితో పద్మములు కలువలు శంఖచక్రములు కడియములు శంఖచక్రములు చామరములు అంకుశములు మ్రుగ్గులువేయవలెను. అచ్చటి భూమిపై ఎన్ని మ్రుగ్గు ధూళి కణములు పడునో అన్ని వేల ఏండ్లు యజమానుడు శివలోకమున ఆదరపాత్రుడై యుండును. తరువాత అచ్చట బ్రాహ్మణునకు యథాశక్తిగా నాలుగు నేతిపాత్రలను అన్నపానీయములను బంగారమును కరక (గరిగ అను మట్టి పాత్ర)పై నాలుగు సక్తు (పేల పిండి) పాత్రలను నాల్గు తిల పాత్రలను కూడ ఉంచి అవియును దానమీయవలెను. ఇట్లు నాలుగు మాసములు ప్రతి శుక్లపక్షమునందును చేయుచుండ వలయును. మార్గశిరము మొదలు కార్తీక మాసము వరకు పండ్రెండు మాసములలో వరుసగా ఈ మంచి గంధము వేసిన నీరు - పుష్పజలము-నల్ల (నూవుల) పొడి కలిపిన నీరు- వట్టి వేళ్లు వేసిన నీరు- యవల పొడివేసిన నీరు - నూవులు వేసిన నీరు ఆ వ్రత దినములందు రెండు పక్షములలో దేనియందయినను ఆహారముగా ఉపవసింపవలెను. వ్రతమునకు శుక్లపక్షమే చాల మంచిది. దాన కాలమున “ఇప్పుడు గౌరి నాయందు ప్రీతురాలై మంగళ (శుభకరురాలు) పాప నాశమును లలిత సౌభాగ్యమును భవాని సర్వసిద్ధులను కలిగించుగాక!” అను అర్థమిచ్చు మంత్రము చెప్పవలెను.

ఇట్లు సంవత్సరమయిన తరువాత లవణము, కుంకుమపూవు, చందనము, నేత్రపటము (కండ్లపై ధరించు ముసుగు వస్త్రము) బంగారు తామరపూవు చెరకుగడ - పండ్లు-ఉమామహేశ్వర ప్రతిమ-పరపులతోను ఇతర పరికరములతోను కూడిన మంచము బ్రాహ్మణ దంపతులకు “గౌరీ మే ప్రీయతామ్” అను మంత్రముతో దానము చేయవలెను.

ఈ అర్ధానందకర తృతీయా వ్రతము పాపనాశకము; దీనియందు ఉపవాసముతో వ్రతము చేసినవారు ఇహలోకమున ధనసంపత్తి ఆయురారోగ్య సంతతి పరమానందములు పొంది శోకరహితులై పరమున శంభులోకమును పొందుదురు.

దీనిని వినినను, చదివినను, ఆచరించినను సువాసినియు కన్యయు విధవయు ఐనను దేవ్యనుగ్రహ పాత్రమయి ఈ చెప్పిన ఫలమునందును, ప్రతిపక్షమునందును మంత్రార్చన విధానము ననుసరించి ఉపవసించి వ్రతముచేసినవారు పునరావృత్తి రహితమగు రుద్రాణీలోకము పొందుదురు. ఇంద్రలోకమున ముప్పదివేల సంవత్సరములు గంధర్వులచే పూజించబడుదురు.