కలియుగ ధర్మములు

ద్వాపరయుగ సంధ్యా - సంధ్యాంశముల ప్రవృత్తి ముగియగానే తిష్య (కలి) యుగము ఆరంభ మగును. హింస-చౌర్యము-అనృతము-మాయ-తపస్సుల వధ-ఇవి కలియుగ ధర్మములు; ఆనాటి ప్రజలు ఈ ప్రవృత్తులను సాధింతురు. ఇదియే వారికి ధర్మము; వాస్తవమగు ధర్మ మంతయు పరిహీనమగును. (పూర్తిగా నశించును. )

కలియుగమున మనోవాక్కాయ కర్మములతో వార్త (లోకయాత్ర) నెరవేరునో జరుగునో లేదో కూడ చెప్పజాలము. కలియుగము ప్రాణులకు అధికముగా మరణప్రదము, ఎల్లప్పుడును రోగము ఆకలివలని భయము అనావృష్టి భయము దేశోపద్రవము ఉండును. ప్రజలు దేనినిగాని ప్రమాణముగా గ్రహించరు. ఇట్లీ ఘోర కలియుగమున గర్భస్థులుగా యౌవనస్థులుగా కౌమారమున వార్ధకమున ఇట్లనేక వయోదశలలో జనులు మరణింతురు. ప్రజలకు తేజోబలము అల్పములు; వారు పాపులు-మహాకోపులు-అధార్మికులు-గా నుందురు. అనృతమాడుటయే వారివ్రతము. వారు లోభపరులు; వారు అనుష్ఠించు యజనములు అధ్యయనములు ఆచారములు (ప్రమాణముగా గ్రహించు) ఆగమములు సరియైనవి కావు. (ముఖ్యముగా సమాజమునకు క్షేమము కలిగింప యత్నించవలసిన) బ్రాహ్మణులు ఆచరించు కర్మములందలి దోషముల ప్రభావమున ప్రజలు భయముల పాలగుదురు. ఈ యుగమున ప్రజలలో హింసా (దురభి) మానము ఈర్ష్య క్రోధము మాయ అక్షమ (ఓర్పు లేకుండుట) అధృతి (నిబ్బరము లేకపోవుట) లోభము మోహము అన్ని విధముల వ్యాప్తమగును. సర్వవిధములగు సంక్షోభములును మిక్కిగా కలుగును. బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయరు; (సరియగు) యాగములనుష్ఠించరు. ఇట్లు విప్రులే కాదు-క్షత్రియులును వైశ్యులును ఉత్సాదము (మానసికమగు నాశస్థితి) నందుదురు - శూద్రులకు బ్రాహ్మణులతో (వాస్తవమున బ్రాహ్మణులకు శూద్రులతో) మంత్రము-(వేదము) యోని (కామ ప్రవృత్తి) పడక-భోజనము కలిసి కూర్చుండుట మొదలగు విషయములలో సంబంధము ఏర్పడును. చాలవరకు శూద్రులు రాజు (పాలకులగుదురు. పాషండ (వేదశాస్త్రము లందు ప్రామాణ్య బుద్ధిలేని) ప్రవృత్తులధికమగును- ప్రజలు కాషాయ వస్త్రధారులు నిర్గ్రంథులు (కర్మానుష్ఠానములను వదలినవారు) నిష్కచ్ఛులు (లోపల గోచీవంటి దానిని ధరించకయే వస్త్రధారణ చేయువారు) కపాలాది ధారణము తమ ధర్మ లక్షణముగా ధరించు కాపాలికులు- దేశభక్తుల వేషములు ధరించిన లోకవంచకులు లోకనాశకులు ధర్మమును పాడుచేయువారు కొందరు దివావ్రతులు (పగలు మాత్రము జనులకు తాము సదాచారాది లక్షణ సంపన్నులని చూపుటకు వేషముతో నటన చేయుచు పరోక్షమునను మనస్సులోను దుష్ప్రవృత్తులతో ఉండు వారు) వృత్తినిమిత్తము (పొట్టకూటికై వేదాధ్యయ నాదికము చేసినట్లు నటించువారు అగుదురు. శూద్రులు వేదాధ్యతలుగా దర్మార్థ కోవిదులుగా అగుదురు. స్త్రీబాల గోవధ పరస్పర వధలు స్వార్థమునకై పరస్పరోపకారము చేయువారగుదురు. దుఃఖప్రాచుర్యము అల్పాయువు-ప్రజలు దేశములు వదలిపోవుట రోగములు చెందుట అధర్మమునందభినివేశము (గాఢాసక్తి) తమోగుణ ప్రవృత్తి భ్రూణ (సాంగ వేదాధ్యయనము వేద ధర్మానుష్ఠానము కల బ్రాహ్మణుల - గర్భస్థ శిశువుల- హత్య) ఆయుర్బల రూపహాని అధికమగును. (ప్రజలెల్లరు దుఃఖములతో అభిప్లుతులు (మునుక లెత్తినవారు) అగుదురు. వీరి పరమాయువు (ఎక్కువకు ఎక్కువయును) నూరు సంవత్సరములు. అదివరకు ఉన్నంత మంచిస్థితిలో కాదు సరేగదా ఏమాత్రమును మంచిస్థితిలో ఈయుగమున వేదములుండవు. కేవలము ధర్మ వ్యవస్థాపరిరక్షణలో అడ్డుకట్టలవలెనుండు యజ్ఞములు నడువక నశించును. ఇది కలియుగధర్మ ప్రవృత్తి స్వరూపము. ఇక కలి సంధ్యా సంధ్యాంశముల ధర్మస్వరూ పమును తెలిపెదను.

ప్రతి యుగమునందును ఆయా యుగపు సద్ ధర్మములు దాని సంధ్యాకాలమునందు మూడు వంతులు నశించి ఒక నాల్గవవంతు మాత్రము శేషించును. సంధ్యాకాల ధర్మములలో నాల్గవవంతు మాత్రమే ఆయుగపు సంధ్యాంశ కాలమున మిగులును. ఇట్టి కలియుగ సంధ్యా కాలము కూడ గడచి సంధ్యాంశకాలము వచ్చిన యుగావసాన సమయమున ఆనాటి ఆసాధు వర్తనులను రాజులను దండించుటకై భృగు వంశమున జన్మించిన చంద్రుడను వాని గోత్రమున (మీదటి తరములలో) ప్రమతియను నాతడు జన్మించును. అతడా స్వాయంభువ మన్వంతరపు కలియుగ సంధ్యాంశకాలమున నిండుగ ముప్పదిఏండ్లు పృథివియంతయు సంచరించుచు అస్త్ర ప్రయోగముతో యుద్ధములు చేయుచు చతురంగ బలము వెంటరాగా ఆయుధములుపట్టి నూర్లకొలది వేలకొలది విప్రులు తను పరివారించి వచ్చుచుండగా సర్వ మ్లేచ్ఛులను సంహ రించును. శూత్రులగు రాజులను పాషణ్డులను నిఃశేషులనుగా చేసెను. అధార్మికుల నందరను - ఉదీచ్య మధ్యదేశ్య పార్వతీయ ప్రాచ్య ప్రతీచ్య వింధ్య పృష్ఠవాసులను అపరాంతికులను (భారత దేశపు పడమటి అంచులందలివారిని) దాక్షిణాత్య ద్రవిడ సింహళ జనులను గాంధార దరద పప్లవ యవన శకతుషార బర్బర పుళింద పుల్కన లింబకార్ధకరక చౌర జాతులను-సంహ రించును. తన చక్రము (సేన)ను ప్రవర్తిల్ల (సంచరింప) జేసి శూద్ర రాజులను అంతమొం దించును. (ధర్మవిరోధి) సర్వప్రాణులను తరుముచు ఈభూమియందు అంతటను అతడు సంచరించును. ఇతడు మను వంశమున జన్మించిన నృదేవునికి (రాజునకు) కుమారుడు, ఈ జన్మమునకు ముందు అతడు సాక్షాద్విష్ణువే. అతడు ప్రమతియను పేర చంద్రముడను రాజునకు వీర్యశాలియగు కుమారుడుగా పుట్టును. అతడు తన ముప్పదిరెండవ ఏట బయలుదేరి ఇరువది సంవత్సరములపాటు ఇట్లు మానవులలో సర్వప్రాణులను చంపిచంపి క్రూరకర్మము నాచరించి ఈపృథివిని మానవ బీజావశేషమునుగా (ఏకొలది మందియో మాత్రము మిగులునట్లు) చేసెను.

ఇట్టి స్థితిలో పరస్పర హేతువుల చేతను కాలవశమునను అకస్మికముగను (ఏ కారణమును లేకయును) ఒకటిగా ప్రమతివెంట కూడియున్న సేన ఈ చెప్పిన పని పూర్తికాగానే శీఘ్రకాలముననే గంగా యమునల నడుమ (ప్రయాగ క్షేత్రములో) సమాధి నవలంబించి ప్రమతితో కూడ దేహత్యాగమొనరించెను. ఇట్లు స్వాయంభువ మన్వంతర మందలి సంధ్యాం శమున క్రూరకర్ములగు జనులు పూర్తిగా నశించగా నాటి రాజుల నందరను నశింపజేసి ప్రమతి మొదలగు వారును గతించిపోగా సంధ్యాంశమందలి కడపటి కాలమాసన్నముకాగా స్వల్పావశిష్టులుగా మిగిలిన కొలదిమంది ప్రజలును అచ్చటచ్చట మిగిలియుందురు. వారును తమ క్షేమమే తాము చూచుకొనుచు స్వప్రధాన దృష్టి కలవారై సర్వ విధముల లోభావిఘ్టలయి పరస్పరము హింసించుకొనుచు దోచుకొనుచు నుండిరి. లోకమరాజకమై ప్రజల జీవితము సంశయగ్రస్తమయ్యెను. ప్రజలు పరస్పర భయపీడితులై వ్యాకులతనొంది ఒకరి కింకొకరికి పొత్తు పొంతనలు లేక కొందరు గృహములు విడిచిపోయిరి. మరికొందరు దేహములనే విడిచిరి. తమ్ము దయచూచువారు లేకపోగా తమతమ ప్రాణములు కాపాడుకొనుచు మిగుల దుఃఖపీడితు లైరి. శ్రోతస్మార్త ధర్మములు నశించెను. ప్రజలు కామక్రోధవశులు మర్యాద తప్పినవారు ఆనంద రహితులు స్నేహబుద్ధి సిగ్గు బిడియములు లేని వారునయిరి. ధర్మనాశమయ్యెను. వారాపదల పాలైరి. పొట్టివారును ఇరువదియైదేండ్లకంటె జీవించని వారునయిరి. ప్రజలు విషాదముతో వ్యాకులురై దారపుత్రుల విడిచి వానలు లేక ఇబ్బందులపాలయి జీవనోపాధులు విడిచి (లేక) దుఃఖితులై జింకచర్మములే ధరించుచు ఏ పనులును చేయక ఇచ్చువారును పుచ్చుకొనువారును లేక వర్ణాశ్రమ పరిబ్రష్టులయి ఘోరమగు ధర్మ సంకరము నొందిరి. మిగిలిన కొలదిమంది ప్రజలును ఈ స్థితినొందిరి. ఇతర ప్రాణులను ఆకలి పీడనందుచు జీవితముపై విసుగుచెందెను. చక్రములవలె నిలుకడలేక సంచరించుచు తమ దేశముల విడిచి విదేశముల నాశ్రయించిరి. వారు మాంసాహారులయి లేళ్ళు మొదలగు వానిని పందులను, ఎద్దులను మరి ఇతర వనచారి ప్రాణులను తినసాగిరి. సముద్ర, నదీ తీరముల నాశ్రయించిన ప్రజలును మత్స్యములు మొదలగు వానిని (వారు బ్రాహ్మణులైనను) తినిరి. భక్ష్యాభక్ష్య విచారణను వారు విడిచిరి. అభక్ష్యాహార దోషముచే జగత్తున ఒకే వర్ణమయ్యెను. ఇది కృతయుగపు స్థితివలె నుండెను. (కృతమున అందరును ధర్మపరులై ఒకేవర్ణము వారుగానయిరి. ఈకలియుగమున అధర్మవశులై ఏక వర్ణము వారైరి.) ఇట్లు కలియుగాంతమున ఎల్ల ప్రజలును శూద్రీభూతులయిరి. ఇట్లు నూరుదివ్యవర్షముల కాలము గడచెను. ఇది మానవ మానమున ముప్పదిఆరువేల సంవత్సరములు.

ఇట్లు చాలాకాలము గడచిన మీదట ఆకటి బాధతో ప్రజలు పశుపక్షులను మత్స్యము లను దొరకినచోట దొరకిన వెల్ల తిని వేయగా అవి ఏమాత్రమును మిగులకపోయెను. వాటి కలి సంధ్యాంశస్థితి ఇది. అంతట ప్రజలు నేలత్రవ్వికొని కందమూలములను-చెట్లనుండి ఫలము లను- తినసాగిరి. వారుండుట కిండ్లు లేకుండెను. వారికి చెట్లబెరడులే వస్త్రములు. నేలయే పడకలు. దాన పరిగ్రహములు వారిలో లేకుండెను. శుద్ధిలేకుండెను. ఇంకను మిగిలిన కొలది మంది కూడ ఇట్లు క్రమముగ నశించిరి. ఇంకను అల్పావశిష్టులుగా మిగిలినవారు ఆహారమును ఉన్నదానిని తిని వృద్ధి నొందిరి. ఇట్లు కలిసంధ్యాంశము నూరేండ్లును గడచెను. ఇట్లు వేల మానవ సంవత్సరముల తరువాత మిగిలిన కొలదిమంది ప్రజలును వారికుమారులును మిగిలి యున్న స్త్రీలతో దాంపత్య సంబంధమును వ్యవస్థ చేసికొనిరి. సంతానమును కనిరి. వారికి సంతానము కలిగిన కొలది కాలములోనే వారికి ముందటి తరముల జనులు (ఈ పుట్టిన సంతానపు తల్లిదండ్రుల తరఫు జనులు) మరణించిరి. (కలియుగపు జనులెవ్వరును మిగులలేదు.) ఇట్లంతట కృతయుగ మారంభమయ్యెను. జీవులు ఈ భూలోకపు దేహమును విడిచిన తరువాత వారి పుణ్య పాపముల ననుసరించి స్వర్గనరక సుఖదుఃఖానుభవార్థము మరియొక దేహము ఆ జీవులకు లభించునట్లే కలియుగపు జనులనుండి కృతయుగమునకు సంబంధించిన జనులకు దేహప్రాప్తియయ్యెను. ఇదికలియుగము ముగిసి కృతయుగ మారంభమయిన విధము. కలియుగము నుండి మిగిలిన వారెవ్వరైననున్నచో వారియందును ఈ కృతయుగ ప్రజల యందును విచారణా ప్రవృత్తి కలిగెను. దానిచే ప్రాపంచిక జీవితముపై విసుగు సత్త్వరజస్తమో గుణముల సమతాస్థితి దానిచే ఆత్మజ్ఞానము దానిచే ధర్మశీలము కలిగి మొదటి కృతయుగమందు వలె సజ్జనులగు ప్రజలుపుట్టిరి. దీని కంతటికిని భవితవ్యమగు అర్థము (జరుగవలసిన విష యము- జీవుల పూర్వ కర్మానుగుణమగు అదృష్టమను ధర్మాధర్మ ఫలములును) హేతువు. దీనికంతటికిని మూలతత్త్వమగు స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి మీకు ఈ యుగధర్మ ప్రవృత్తులన్నియు తెలిపితిని. యుగ ప్రవృత్తులు ప్రతి ఆవృత్తియందును ఇట్లే యుండును. ఇది యుగ ప్రవృత్తుల సమాన-వ్యాస-కథనము. (మొదట ఒక విషయమును సంగ్రహముగ చెప్పి పిదప దానియందలి ప్రత్యేకాంశముల గ్రహించి విస్తరించి చెప్పుట సమాస-వ్యాస కథనము. )

ఇట్లు ప్రవర్తిల్లిన కృతయుగమునందు ఆది కలియుగమునుండి మిగిలిన వారికి జనించిన వారే ఆది ప్రజలగుదురు. ఈ లోకమున ఎవరికిని కనబడక అదృష్టులై తిరుగుచుండు సిద్ధులును సప్త ఋషులతోను కూడ ద్యులోకమందుండు మహాపురుషులును లోకమున ఈ కృతయుగ ప్రజల ఉత్పత్తికి బీజరూపమున నిలిచియున్న బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర శేష ప్రజలును ఈ కృతయుగా రంభపు ఆది ప్రజలతో కలిసిమెలసి తత్సములయి యుండి వీరికి ధర్మము నుపదే శింతురు. వర్ణాశ్రమాచార ధర్మములను శ్రౌత స్మార్త కర్మ మూల ధర్మ ప్రవృత్తులును సప్తర్సులు వీరి కుపదేశింతురు. ఏలయన ధర్మవ్యవస్థా ప్రతిష్ఠార్థమై సప్తర్షులు ఈలోకపు ప్రజలు నడుమ ప్రతియుగమునను నిలుతురు. వారి యుపదేశముచే ప్రజలును ధర్మకర్మాచరణములందు ప్రతిష్ఠితులు (దృఢాభి నివేశముతో నిలిచినవారు) అగుదురు. ఈఋషులిట్లు మన్వంతర ప్రవర్తనాధి కారమునందు నిలిచియుండి లోకమున ధర్మప్రతిష్ఠా ప్రవృత్తులకు హేతుభూతులగుదురు. వనము లలో దావాగ్ని (దవమనగా అడవి) వలన తృణములు కాలిపోయినను దానిని చల్లార్చుటకై కురిసిన వాననీటి బొట్టు పడినందున ఆదావాగ్నిపాలయిన తృణపు మొదటి నుండియే ఈ దావాగ్నితో దగ్ధముకాక మిగిలిన ఈతృణ బీజ శేషమునుండి క్రొత్త తృణము మొలచును గదా! అట్లే యుగము తరువాత మరియొక యుగపు ఆరంభమున ప్రజాసంతానము (సంతానము= నైరంతర్యమున కొనసాగుట జరుగును. ఇట్లు రెండేసి యుగముల పరస్పర సహకారముతో యుగానంతర యుగ ప్రవృత్తి మన్వంతరము ముగియు వరకు అనవచ్ఛిన్నమయి సాగుచునే యుండును. కృతము మొదలు కలి వరకు యుగములలో ఆయుర్బల ధర్మార్థ కామములు క్రమమున నాల్గవ వంతు చొప్పున తగ్గుచు వచ్చును. ఇది ప్రతి సంధి (సంధ్యా సంధ్యాంశ) దశాప్రవృత్తి ప్రకారము (ప్రకారము=రీతి); ప్రతి చతుర్యుగము (చతుర్యుగము=మహాయుగము= కృత త్రేతా ద్వాపర కలియుగముల సముదాయము) నందును యుగ పరివర్తన క్రమమిట్లే యుండును.

 ఇటువంటి మహాయుగములు డెబ్బది యొకటి ఐనచో ఒక మన్వంతర మగును.

ప్రతి యుగమునందును కృతాదియుగ చతుష్టయమునందుచు ఏ యుగమునందు ఒకసారి ఏది ఎపుడు ఎట్లు జరుగునో అదియే అట్టి ప్రతియొక ఆవృత్తియందును జరుగును. ప్రతియొక యుగ సృష్టి యందును కొన్ని విశేషాంశములందు వీటికి పరస్పర భేదమును ఉండవచ్చును. ఇవియు అట్లే ప్రతియుగ మహాయుగా వృత్తియందును జరుగుచుండును. ఈ విషయము పదునాలుగు మన్వంతరములందును ఇట్లే ఆవృత్తమగును. మానవులు మాత్రమేకాక అసురులు యాతుధానులు, పిశాచులు, యక్షులు, రాక్షసులు మొదలగు జాతులవారు కూడ ఆయా యుగ మహాయుగ మన్వంతరములయందు సమాన లక్షణములతో నుందురు.

ఇట్లు మీకు యుగముల లక్షణము యథాక్రమముగ తెలిపితిని. ఇట్లే కల్పావసానము వరకు మన్వంతరములును పరివర్తనమునందుచు పోవును. ఇవి ఇప్పటికి ఎంతయో చిరకాలము నుండి ప్రవర్తిల్లుచు వచ్చుచున్నవి. ఇకముందును కొనసాగుచుండును. యుగ స్వభావమే ఇందులకు హేతువు. ఈ జీవలోకము క్షణకాలము కూడ ముందునకు సాగక మార్పు నొందక యుండదు. ఈ జీవలోకమునకు నాశము ఉత్పత్తి ఈ రెండును స్వాభావికములు.

ఇట్లు యథాక్రమమున మీకు యుగ స్వభావములను తెలిపితిని. ఈ కల్పమునందు గడచిన-గడుచుచున్న-గడువనున్న-మన్వంతరముల విషయమును కూడ తెలిపెదను.