మత్స్య మహా పురాణము
దండోపాయ విచారము
శ్రీమత్స్యనారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ చెప్పిన మూడుపాయములతోను వశీకరించుకొన శక్యులు కాని వారిని దండో పాయముతో వశీకరించు కొనవలయును. ఏలయన దండము నరులను వశీకరించుకొని తీరును మహీపతి తగిన సహాయుల తోడ్పాటుతోను తాను తనబుద్ధితో విచారణ చేసియు ధర్మశాస్త్రానుసారముగ దండమును చక్కగా ఆచరణలో ఉంచవలెను. దానిని రాజు ఎట్లు లెస్సగా ఆచరణలో పెట్టవలయుననిన వానప్రస్థులు ధర్మజ్ఞులు నిర్మములు నిష్పరిగ్రహులు (ఎవరినుండియు ఏమియు తీసికొననివారు) సర్వదేశమందుగాని, పరదేశమందుగాని ఉండు ధర్మశాస్త్ర విశారదులు- ఇట్టివారిని పిలిపించి వారిచే విషయమును సమీక్షింప (బాగుగ పరిశీలింప) జేసి వారి యభిప్రాయము ననుసరించి దండమును ఆచరణ మందుంచవలెను. ఏలయన రాజ్య సమ్యక్పరిపాలన మంతయు దండమునందే నిలిచి యున్నది; బ్రహ్మ చర్యాద్యాశ్రమము లందున్న వాడుగాని సన్యాసిగాని పూజ్యుడు అగు మహావ్యక్తిగాని, గురువుగాని స్వధర్మము నందు నిలువని వాడయినచో రాజునకు దండ్యుడు కాని వాడెవడును ఉండడు; రాజు దండ్యులను దండింపకున్నను అదండ్యులను దండించినను అతడు ఇహమందు రాజ్య పరిభ్రష్టుడును పరమందు నరకప్రాప్తుడును అగును. కావున రాజు లోకానుగ్రహ కాంక్షతో తాను వినీతుడై (నమ్యగ్వర్తనము గలవాడై) ధర్మ శాస్త్రానుసారముగ దండోపాయమును ఆచరణ మందుంచవలెను. ప్రజానేత (రాజు) సరిగా చూచువాడయినచో ఎచట నల్లని దేహచ్ఛాయయు ఎర్రని కన్నులు గలవాడు అని శాస్త్రములందు చెప్పబడిన దండాధిష్ఠాన దేవత నిర్భయయై సంచరించునో అచ్చట ప్రజలు మోహము (ధర్మాధర్మ విషయములందు పొరబాటు) పొందరు. ఏలయన రాజు దండ్యుల విషయమున దండమును ప్రవర్తిల్లజేయనిచో బాలురు వృద్ధులు యతులు ద్విజులు స్త్రీలు విధవలు- ఇట్టివారు మాత్స్యన్యాయముతో (బలవంతులచే బలహీనులు హింసించ బడుటయు-తినబడుటయును అను విధానముతో) ఉందురు. దేవదైత్యోరగ గణములును సర్వ భూతములును పక్షులును మర్యాదాతిక్రమణమును చేయుదురు.
ఈ దండదేవత బ్రాహ్మణులిచ్చు శాపములందును సర్వాయుధము లందును సర్వ విక్రమములందును సర్వ కోపములందును దృఢ ప్రయత్నమునందును ప్రతిష్ఠితమయియున్నది. దండించువారినే దేవతలును పూజింతురు. దండించని వారి నెవ్వరును పూజించరు. మానవులలో కొందరు ప్రశాంతులగు బ్రహ్మ, విధాత, పూషన్, అర్యమన్, మొదలగు దేవతలను సర్వకర్మలందును పూజించకున్నారు. దండించువారగు రుద్రాగ్నీంద్ర, సూర్యచంద్ర, విష్ణులను ఇట్టి ఇతర దేవతలను పూజించుచున్నారు. ప్రజలనందరను దండమే శాసించుచున్నది. రక్షించుచున్నది. అందరును నిద్రించుచున్నను అది తాను మాత్రము మేలుకొనియుండును. కావుననే దండమే ధర్మ (స్వరూప) మని పండితులందురు. రాజదండ భయము వలన కొందరును యమదండ భయము వలన మరికొందరును పరస్పర భయమువలన ఇంకను కొందరును పాపము నాచరించకున్నారు. ఇట్లు లోక వ్యవహార సిద్ధి అంతయు దండమునందే నిలిచియున్నది; రాజాదులు అపరాధులయందు దండమును ప్రవర్తిల్ల జేయకున్నచో జనులు అంధతమస్సునందు మునిగిపోవుదురు. దుర్మదులను అణచి అదుపులో నుంచును. దండించును అను ఈరెండు హేతువులచే దండమునకు ఆ వ్యవహారము ప్రసిద్ధమయినది. శూలధరుడగు శివుడు దండించునను భయమువలననే దేవత లందరునుకూడి ఏకాభిప్రాయముతో అతనికి యజ్ఞము నందు భాగమునిచ్చిరి. శిశువులలో శ్రేష్ఠుడు (చాల పసివాడు) అయినను బలశాలియగు కుమా రుని దేవతల దండ భయమువలననే సేనాపతినిగా చేసిరి.