అమరులు చేసిన కుమార స్తుతి

గొప్ప కాంతిగలవాడును, దానవులను నశింపజేయువాడును, నూతన రవి బింబతేజుడును, కాలరూపుడునునగు కుమారునకు, స్కందునకు, షణ్ముఖునకు, నమస్కారము. నానా భరణములను ధరించినవాడును లోకములకధిపతియు లోక పోషకుడును రణము నందు దారుణులగు వారినికూడ చీల్చువాడును రవిసమానతేజుడును యోగులకు తప్ప ఎరుకపడని రహస్య స్వరూపుడును దేవసేనా రక్షకుడును అగు నీకు నమస్కారము. లోకముల భయము పోగొట్టు వాడును కృపాపరుడును విశాలములయి దీర్ఘములగు నేత్రములు కలవాడును, మహా శ్రేష్ఠవ్రతుడు (వ్రతము=కర్మము - కృత్యము)ను అగు బాలుడగు విశాఖునకు నమస్కారము. మనస్సుల కానంద కారుడును సద్గుణములచే అందరను మించినవాడును, ప్రకాశించు మయూరము వాహనముగా గలవాడును భుజకీర్తులు ధరించినవాడును అగు నీకు వందనము. భయంకరము ఉన్నతమునగు పతాక ధరించిన వాడు ప్రభావశాలురచేత కూడ ప్రణామములందుకొనువాడు ఘంటను ధరించినవాడు వీర్యశాలి క్రియాపరులగు (పురుష కారము చేయుచుండు) వారికై జన్మించిన మంగళ స్వరూపుడు అగు నీకు నమస్కారము. యజ్ఞపతియగు కుమారుని యజ్ఞ (హవిర్గ్రహణ)పరులగు ఇంద్రాదులు ఇట్లు స్తుతించి నమస్కరించిరి. అంత షణ్ముఖుడగు గుహుడు సంతుష్టుడయి ఆ ఇంద్రాదులగు దేవశ్రేష్ఠులను అమలములగు నేత్రములతో చూచి ఇట్లు హృదయ సంతాపములను విడువుడు. మీశత్రువుల చంపుదును. (నామాటతో) సంతృప్తి చెంది మీరు మీకేమి కోరిక నేను తీర్చవలయునో చెప్పుడు. మీ హృదయ సంకల్పితము అది మీకు ఇంపయినచోచాలును అదిఎంత అసాధ్యము అయినను గొప్పది అయినను తీర్చెదను అనగా దేవతలు నమస్కారముతో శిరస్సువంచి మనస్సులతని యందే నిలిపి అందరును మహాత్ముడగు గుహునితో ఇట్లనిరి.

తారకుడను దైత్యేంద్రుడున్నాడు. వాడు సర్వదేవతా సమూహ నాశకుడు; బలవంతుడు  -  దుర్జయుడు  -  దుష్టుడు - దురాచారుడు - అతి కోపవంతుడు; మాకు భయము కలిగించుచున్నాడు. వానిని చంపుటయే మాహృయమందున్న కోరిక; అది తీర్చి వానివలన మా భయము పోగొట్టుము. అనగా కుమారుడు సరే అనెను. మరియు ఆ జగన్నాధుడు సర్వ అమరులును తన వెంటరాగా అమరేశ్వరులెల్ల జయ ధ్వనులతో తనను స్తుతించుచుండగా, లోక కంటకుడగు తారకుని వధింప బయలుదేరెను. తనకు ఇంతటి సమాశ్రయము దొరకుటతో, ఇంద్రుడును దానవ సింహుడగు తారకుని కడకు పరుషాక్షరములతో మాటాడగల దూతను పంపెను. భయంకర రూపముగల ఆ దూతయు వాని కడకుపోయి నిర్భయుడై ఇట్లు పలికెను. తారకా! దేవేశుడు స్వర్గపతియగు ఇంద్రుడు ఇట్లు చెప్పుచున్నాడు, అది విని ఇచ్ఛకును శక్తికిని తగినట్లు చేయుము. “దానవా! నీవు లోకములను చీల్చి (బాధ కలిగించి) పాపము సంపాదించితివి. భువనత్రయ పాలకుడ నగు నేను ఇప్పుడు నిన్ను అదుపులో ఉంచెదను.” (ఇది ఇంద్రుని సందేశము). తన విభవమంతయు చాలవరకు అప్పటికే నశించియున్న దుష్టాత్ముడు అ తారకుడు దూత వచనము విని క్రోధ సంరక్తనేత్రుడయి ఇట్లనెను:

శక్రా! నేను వందల మారులు రణమున నీ పౌరుషమును చూచితిని. దుర్మతివి; నీకు బిడియమును సిగ్గును రెండును లేవు. కనుక ఇట్లు మాటాడుచున్నావు అని తారకుడు పలుకగా విని దూత వెడలిపోయెను. తరువాత ఆదానవుడు ఇట్లు ఆలోచించెను. “ఏదియో ఆశ్రయము దొరకనిదే ఇంద్రుడు ఇట్లు పలుకజాలడు; ఓడిపోయినవాడు ఆకస్మికముగా సంశ్రయమును దేనినో ఆశ్రయముగా పొంది యుండును” అని ఇట్లనుకొనుచుండగనే వానికి (తమ) నాశమును తెలుపు దుర్నిమిత్తములును కనబడెను. ధూళివాన - రక్తపాతము అకసము నుండి నేలపై, ఎడమ భుజము, నేత్రము అదరుట, నోరు ఎండుట, మనోభ్రమము తన భార్యల ముఖపద్మములు అకారణముగా వాడిపోవుట, దుష్టప్రాణులు మరింత రౌద్ర రూపములగుట - దుష్ట సూచనలు ఇట్టివి వానికి కనబడెను. ఐనను వాడు వానిని లెక్కపెట్టక క్షణములో స్వస్థచిత్తుడై ఈ విషయము లను ఆలోచించుట మానెను. అంతలో వాడు తన ప్రాసాదము నారోహించగా వానికి దేవసేన కనబడెను. అది గజముల మందల ఘంటల ఘణత్కారరవముతో హద్దుమీరి గుర్రముల గుంపులు నలగగొట్టిన భూమి రేణువులతో ఎరుపు కలిసిన వర్ణముకలిగి సేనా బలములతోను భయము గొల్పు ధ్వజముల శ్రేణులతోను ప్రకాశించుచుండెను. ఇంకను ఆసేన ఆశ్చర్యము గొలుపు ఆకృతిగల విమానములును కదలుచున్న చామరములును భూషణాలంకార నిబంధములును కిన్నరులు బిగ్గరగా పాడుపాటలు అనేకములగు స్వర్గీయ వృక్షములందు పూచిన పూలతో కూర్చిన కొప్పులు ఒరనుండి బయటకు తీసిన ఖడ్గాద్యాయుధాలంకార శోభలు వంది జనులు బిగ్గరగా పాడుస్తోత్రముల ధ్వనులు నానా వాద్య ధ్వనులు కలిగి ఉండెను.

ఇది చూచి తారకుడు కొంచెముగా తన మనస్సు ఉద్భ్రాన్తము కాగా నాచే ఓటమి తినని క్రొత్త యోధుడు ఎవ్వడైయుండును? అనిఆలోచించుచు కలత నొందసాగెను. ఇంతలో వానికి వికట పరుషాక్షరములతో సిద్ధ (దేవతాజాతి) వందిజనులు బిగ్గరగా పాడుచుండిన హృదయదారణమగు ఈ “గాథ” వినబడెను: