మత్స్య మహా పురాణము
ధరణీ సముద్ధరణము
శౌనకుడు అర్జునునితో ఇట్లు చెప్పెను. ఈ జగమంతయు పూర్వము హిరణ్మయమగు అండముగ నుండెను; ప్రజాపతి మూర్తి ఇదియే అని వేదమున వినబడుచున్నది; వర్ష సహస్రాంత రము ఆ విభుడు దానిని సృష్టినిమిత్తమై మొదట ఊర్ధ్వాధః; కపాలములుగా భేదించెను; లోక జన్మకర్తయగు విష్ణుడు దానిని మరల ఎనిమిదిగా విభజించెను; విభాగకర్తయగు అతడు దీని యందు జగద్విభాగమొనర్చెను; వానితో ఊర్ధ్వము భావకాశ రంధ్ర మాకాశమును అధోరంధ్రము రసాతలముగా విశ్వయోగ యోగియగు ఆదేవుడు ఏర్పరచెను; ఆదేవుడు లోకసృష్టి సంకల్పముతో నిర్మించిన అండముతో ఏర్పడిన మావి బ్రహ్మాండాశ్రయమగు సలిలమందుపడి స్వర్ణమయ (మేరు) పర్వతమయ్యెను, వేలకొలది పర్వతములతో గహనమును విషమమును అగు మేదిని (భూమి) ఏర్పడెను, బహుయోజన విస్తరములును బరువును అగు సహస్ర పర్వతగణ సమూహ ముతో పీడితయై భూదేవి పీడిత అయ్యెను; భూరి బలయుతమును దివ్యమును నారాయణాత్మ కమును హిరణ్య మయమును సువర్ణ రూపమునునగు విష్ణు సృష్టమయిన ఆ తేజస్సును మోయజాలక ఆ భగవత్తేజః పీడితయగు క్షితిదేవత క్రిందకు క్రుంగిపోయెను, పాతాళమున ప్రవేశించెను, మధుసూదనుడటామె అధః ప్రవిష్టయగుచుండుట చూచి ఆమెకు హితమాచరించు తలంపుతో ఆమెను ఉద్ధరించ (పైకెత్త) దలచెను. అతడామెతో ఇట్లనెను: వసుధా దేవీ! పాపము (తపస్విని=దయనీయ, జాలిపడదగినది అగు) ఈనీవు నా తేజస్సు నీయందు నిలువగా మోయ జాలక దుర్బలయగు గోవు బురదయందువలె రసాతలమందు దిగబడితివి, అన పృథివి విష్ణు ఇట్లు స్తుతించెను.
త్రివిక్రమా! అమిత విక్రమా! మహావరాహా! సురోత్తమా! శ్రీ శార్జచక్రాసిధరా! గదాధరా; నీకు నమస్కారము; దేవోత్తమా! ప్రసన్నుడవు గమ్ము; దేవా! నీ దేహమునుండి జగము జనించినది, పుష్కర ద్వీపము ఉతితమయినది; లోకములను సృష్టించు బ్రహ్మయు సకల భూతములతో శాశ్వతుడవును నీవే యని వేదములును; నీ అనుగ్రమముననే ఈ పురందరుడు స్వర్గమనుభ వించుచున్నాడు. జనార్దనా! నీక్రోధముననే సర్వదైత్యులును (బె) చెదరిపోవుచున్నాడు; ధాత (స్రష్ట) విధాత (స్థితికర్త) సంహర్త, ఇందరును ఇదియంతయు నీయందే నిలిచియున్నది; మనువు యముడు అగ్ని వాయువు పర్జన్యుడు వర్ణములు ఆశ్రమ ధర్మములు సాగరములు పర్వతములు వృక్షములు నదులు ధర్మము కాముడు యజ్ఞములు యజ్ఞ క్రియలు విద్యయు (తెలియవలసినది) సత్త్వము-హ్రీ-శ్రీ-కీర్తి దృతి క్షమ పురాణములు వేదములు వేదాంగములు సాంఖ్యము యోగము భవము(సృష్టి) అభావము (ప్రళయము) స్థావర జంగమ (చర) భూతములు భూతము వర్తమానము భవిష్యము ఇంకను త్రిలోకముల యందున్నదంతయును ఈ ప్రభావమును ఆశ్రయించి ఉన్నవి; త్రిదశుల (దేవతల)నెడు ఉదార ఫలము నిచ్చునదియును స్వర్గస్త్రీ లనెడు మనోహర పల్లవములు కలదియును సర్వలోక మనోహరమును విమానములను అనేక శాఖలు కలదియు మేఘజలమను తేనెను స్రవించునదియు దివ్యలోకములను మహాస్కంధము (పెద్ద బోదె) సత్యలోకమను చిగురు కొమ్మ సాగర (జల)ములనెడు నిర్యాసము(జిగురు ఊట) రసాతలమనెడు పాతు ఆదిశేషు డనెడు తల్లివేరు జంతువులు పక్షులు అనెడు ఆశ్రితులు శీలము ఆచారము ఆర్యులు అనెడు సుగంధము కలదియు అగు దివ్య సర్వలోకమయ వృక్షరూపుడవు నీవు, ద్వాదశార్కులనెడు ద్వీపములు ఏకాదశ రుద్రులనెడు పత్తనములు అష్ట వసువులనెడు పర్వతములు త్రైలోక్యమనెడు నీరు సిద్ధసాధ్యులనెడు జలోర్ములు సుపర్ణు (గరుడు) లనెడు వాయువులు యజ్ఞోరగ దైత్యలోక (గణ)మనెడు మహాగ్రాహ ములు పితామహుడు (బ్రహ్మ) అనెడు మహా ధీరత్వము స్వర్గస్త్రీలనెడు రత్నములు దీహ్రీ శ్రీకాంతులనెడు నదులు కాలాంశములు యోగములు మహాపర్వములు అనెడు ప్రయోగములు (పాటులు పోటులు) ఆత్మయోగమనెడు మహావీర్యముకల ఏకరాట్ ధర్మముతో ఉండు నారాయణుడను మహాసముద్రమవు; లోకత్రయమును నీచే సృష్టింపబడును, లయింపబడును; సర్వయోగులును నీచే బయటికి తేబడి నిన్నే ప్రవేశింతురు, యుగయుగ మందును నీవే ప్రళయకాలాగ్ని మేఘరూపుడ వగుదువు.
దేవా! నీవు యుగయుగమున మహీభారావతారణమునకై అవతరింతువు; కృత త్రేతా ద్వాపర కలియుగములందు వరుసగా శుక్ల(చంపక కుసుమ) హరితరక్త కృష్ణవర్ణుడవు; ఆయా యుగ సంధికాలములు వచ్చినపుడు వైవర్ణ్యము నందుదువు, వేదవేత్తవయి ఆయా కాలములందు సర్వధర్మములకును వైవర్జ్యము (సాంకర్యము కూడ కలిగింతువు, నీవే ప్రకాశింతువు వీచెదవు తపింపజేయుదువు రక్షింతువు కృత్యము లాచరింతువు క్రుద్ధుడవగుదువు క్షాంతినందుదువు దీపింపజేయుదువు వర్షింతువు విడుతువు వెలువడుదువు చల్లార్చెదవు మేలుకొందువు; యుగ క్షయమున కాలుడవయి సకలభూతములను నిఃశేష మొనరింతువు; అదే కాలరూపుడవై తేటయగు నీటితో ఆనందపరచెదవు, సర్వభూతములును యుగాంతాగ్నిచే నాకివేయ (దహించ) బడగా అన్నియు పోగా నీవే శేషింతువు; కనుకనే సంతతమును శేషుడవనబడెదవు; శేషించిన ఆత్మను (నీ స్వస్వరూపమును చూచికొని మరల విశేష (భేద) మును నీ రూపమునందును కలిగించు కొందువు; ఈ హేతువుచేతను నీవు (వి) శేషుడవు; బ్రహ్మేంద్ర వరుణాదులు చ్యవనము (చ్యుతి- నాశము) ఉత్పత్తి కలవారు. నీవు మాత్రము స్థానము నుండి చ్యుతుడవుకావు. కనుక అచ్యుతుడవు. బ్రహ్మేంద్ర రుద్ర యమ వరుణులనుగూడ నిగ్రహించి హరింతువుకావున హరివి. సదా (ఎల్లపుడు) భూతములను శరీరకీర్తి శ్రీలతో కూర్చుచు నీవు చిరస్థాయి వపువు (శరీరము)తో కూడియుందువు. కావున నీవు ‘సనా(దా) తనుడు’ (ఎల్లపుడు ఉండువాడు) అయితివి. బ్రహ్మాది దేవతలును ఉగ్ర తేజస్కులగు మునులును నిన్ను అందుకొనజాలరు. కావున అనంతుడవు (అంతము-అంతికము- సమీపము నకు వచ్చుట) శతకోటి కల్పములకయిన నీవు క్షయించవు, క్షరించవు (కరుగవు, తరుగవు) కావున అక్షరుడవు. స్థావర జంగమాత్మక జగత్తును విష్ణబ్ధము (నిలుపబడినది)గా చేయుదువు కావునను సచరాచర త్రైలోక్యమును విష్టంభించి (ఆశ్రయముగా చేసికొని ఉందువు, యక్ష గంధర్వ నగరములతో మహాభూత నాగులతో నిండిన సచరాచర త్రైలోక్యమును వ్యాప్తమయి నీయందు ప్రవేశించియున్నది కావునను నీవు విష్ణుడవు (విశంతి సర్వభూతాని ఏనం-విశంతి సర్వభూతాని అయమ్) సర్వభూతములును ఇతనియందు ప్రవేశించును. సర్వభూతములందు ఇతడు ప్రవేశించును’ అని స్వయంభువు చెప్పెను.
తత్త్వదర్శులగు ఋషులు అప్పు(జలము)లను ‘నారములు’ అందురు, (సృష్టికి) పూర్వ మతనికవి అయనము (ఆశ్రయ, లయ, స్థానము) కావున నారాయణుడవు, యుగయుగము నందును ప్రణాశమందిన గోవును (ధర్మమును, భూమిని, నన్ను) తాత్త్వికముగా యథాస్థితిని పొందింతువు; (గో-విద్) కావున నీవు ఋషులచే గోవిందుడనబడెదవు; తత్త్వజ్ఞాన విశారదులు ఇంద్రియములను హృషీకములందురు, వానికి ఈశుడవై వర్తిల్లుదువు కావున హృషీకేశుడవు, యుగ క్షయ మందును బ్రహ్మాది భూతములు నీయందు వసించును, నీవును వానియందు వసింతువు, కావున వాసుదేవుడవు; ప్రతికల్పము నందును భూతములను సంకర్షింతువు (దగ్గరకు లాగికొందువు, లయింతువు) కావున సంకర్షణుడవు అని తత్త్వజ్ఞాన విశారదులందురు, దేవాసురు రాక్షసులు ప్రతివ్యూహము (అమరిక)తో నీ బలముననే యున్నారు; సర్వధర్మముల తత్త్వములను ఎరుగుచున్నారు; కావున (ప్ర-దివ్; ప్ర-విద్) ప్రద్యుమ్నుడవు, భూతముల యందు ఏయొకడును ఇతని కంటె మించి నిరోధము (ఆటంకము) ఒనరించువాడు (తన అదుపునందుకొనువాడు) లేడు కావున మహర్షులచే అనిరుద్ధుడనబడెదవు, విశ్వము నీచే ధరించబడును, సంహరించ బడును, నీవు భూతములను ధరింతువు, భువనమును భరింతువు; ఏ కొంచె (తత్త్వ)మయినను తేజముచేకొని బలము చేకొని మొదట నీచే ధరించబడును; తరువాత నాచే ధరించబడును; నీచే ధరించబడనిదే నాచే ధరించబడదు; ఈ విశ్వమందు నీచేత ధరించబడనిది ఏదియు లేదు; నారాయణా! యుగయుగమునను జగములకు హితముచేయు కామనతో నీవే మహీభారము నవతరించ(దిగునట్లు) చేయుదువు; నీ తేజస్సుతోనే ఆక్రాంతికై (వ్యాప్తికై) రసాతలతలమును చేరియున్న నన్ను రక్షించుము, సురశ్రేష్ఠా! నిన్నే శరణందితిని; క్రోధతత్పరులగు దానవులచే రాక్షసులచే పీడింపబడుచున్న నేను సనాతనుడవగు నిన్నే శరణు పొందుచున్నాను; కుకుద్మి (దేవ వృషభుడు) అగు నిన్ను మనసా శరణందనంతవరకు నాకు భయము ఉండనే యున్నది. నూరు విధములుగా ఆలోచించినను నీకుఉపమానము నాకు కనబడుటలేడు. ఇంద్రాది దేవ తలును నిన్నెవరితోను పోల్చుటకును శక్తులుకారు. ఎల్లపుడును ఈ విషయములన్నియు నీవే ఎరుగుదువు. ఇకమీదట (ఇంతకుమించి) పైగా చెప్పవలసినది ఏమియులేదు.
అంతట శార్ణచక్రధారియగు భగవానుడు హరి పృథివియందు ప్రీతుడై ఆమె కామములను యథాకామముగ పూరించెను. అంతేకాక - మహాదేవీ! మాధవుని ఈ స్తవోత్తమ మును మనస్సున ధరించు మర్త్యుడు పరాభవము నందుడు, నిష్కల్మషములగు వైష్ణవ లోకముల నందును. ఆ పురుషుడు వేదముల అధ్యయనము చేసినంతటివాడును ప్రీతిచిత్తుడును ముని యంతటి వాడునగును. ఏలయన ఈ మాధవీయస్తవోత్తమము మహాశ్చర్యకర విషయ సర్వస్వము. కల్యాణీ! ధరణీ! నాముందుగా నడువుము భయ మందకుము. ఇదిగో! ఇప్పుడే నిన్ను నీకు ఈప్సితమగు సముచిత స్థానమునకు చేర్చెదను అని మహాత్ముడు విష్ణుడు ‘నేను ఏరూపమును ధరించి ఈ ధరను ఉద్దరించగలను’ అని తదనుకూలమగు దివ్యరూపమును గూర్చి యోజించెను. వెంటనే మొదటి నుండియు జలమున విహరించుటయందు ఆసక్తిగల ఆ నారాయణుడు తదను కూలమగు వారాహరూపము దాల్చెను. ఆరూపము ఏ భూతములకును కనరానిది. వాగ్రూప మయినది- పరబ్రహ్మ మందు నిలుచునది. శతయోజన విస్తీర్ణము - ద్విశత యోజనోన్నతము. నీలమేఘ సమానము మేఘగర్జిత సమానధ్వని యుక్తము - పర్వతమువలె దృఢ నిర్మాణయుతము, భయంకరము, శ్వేతతీక్ష భయంకర దంష్ట్రాయుక్తము, విద్యుడగ్నులతో సమానము, రవి సమాస తేజస్కము, బలిసి గుండ్రనై పొడవైన భుజమూలములు కలది. గర్వించిన పులివలె నడుచునది. పీనమయి ఉన్నతమయిన కటి ప్రదేశముకలది. మహావృషభ లక్షణయుక్తము. ఊర్జితము (పుష్టి కలది) పృథివిని ఉద్ధరించదలచి నారాయణుడు అమితశక్తిమంతము విపులమునగు ఇట్టి వారా హము ధరించి రసాతలమున ప్రవేశించెను.
ఈ వరాహుడు యజ్ఞరూపుడు. అందుచే ఆతనికి వేదములు పాదములును యూప స్తంభములు దంష్ట్రలును క్రతువులు దంతములును వేదిక ముఖమును అగ్నులు జిహ్వయును దర్భలు రోమములును బ్రహ్మము (ప్రణవము) శీర్షమును అహోరాత్రములు కన్నులును వేదాంగ ములు కర్ణాభరణములును ఆజ్యము నాసికయు స్రువము తుండమును సామధ్వని సత్య ధర్మము లును క్రమగతములగు పాదవిన్యాసములును ప్రాయశ్చిత్తములు గోళ్లును యజ్ఞపశువులు జానువు లును యజ్ఞము శరీరాకృతియు ఉద్గాతయు హోతయు లింగమును బీజములును ఓషధులును మహావృషణములును వాయువు అంతరాత్మయు యజ్ఞ విశేషములు వివిధాస్థులును సోమము రక్తమును వేదవిశేషములు స్కంధములును హవ్యకవ్యరూప హవిస్సులు గంధమును ద్యుతిమం తమును నానా దీక్షాయుతమునగు ప్రాగ్వంశము కాయమును దక్షిణలు హృదయమును ఉపాక ర్మాష్టకము రుచకములుఅను ఆభరణములును ప్రవర్ద్యావృత్తులు భూషణ ములును నానా ఛందో గతులు మార్గములును గుహ్య(రహస్య)ములగు ఉపనిషత్తులు ఆసనమును ఛాయయను పత్నియు అయ్యెను. ఇట్టి మహాసత్ర (యాగ) మయుడగు ప్రభుడా వరాహుడు ఉన్నతమయి లేచిన మణి శృంగమువలె ఉన్నతుడైలేచి రసాతలమున మునిగి అడుగువరకు చేరిన ధరణిని తన కోరకొనతో లోకహితార్థమయి పైకి లేవనెత్తెను. తరువాత ఆ పృథివీధరుడు వసుంధరయగు పృథివిని మనస్సుతో ధరించి తరువాత ఆమెను స్వస్థానమునకు తెచ్చి విడిచెను. ఆ దేవుడు ధరించి నందున మేదిని సుఖము నందెను. మొదట శంభు (సుఖకారణు)డగు ఆ దేవునకు నమస్కారము చేసెను.
ఇట్లు పూర్వము భూత హితార్థియగు యజ్ఞ వరాహుడు సాగరాంతర్గత యగు పృథివిని ఉద్దరించెను, ఇట్లా దేవుడును అంబుజనేత్రుడునగు విష్ణుడు జగత్సంస్థాపన వాంఛతో భూమిని ఉద్ధరించి, అనంతరము పృథివిని ప్రవిభక్త మొనరించ సంకల్పించెను. అతులాచింత్య విక్రము డును సురోత్తముడును ఉత్తమ యజ్ఞ వరాహరూపధారియునగు వృషాకపి (ధర్మరక్షకుడు) నారాయణుడు ఒకేకోరతో మహాబలముతో ధరణిని ఇట్లు ఉద్ధరించెను.