మయాది దానవులు దీనస్థితి

సూతుడు ఋషులతో ఇట్లు చెప్ప నారంభించెను: ప్రమథుల చేతిలో యుద్ధమున భంగము నందిన మయాది త్రిపురదుర్గ దానవులు భయమంది ప్రమథుల చేతిలో విరిగిన గోపురాదులు

గల త్రిపురమును ప్రవేశించిరి. వారెల్లరును కోరలు చిదికిన సర్పములవలెను ఆయిరి. దైన్యముతో వారి ముఖములు వికృతములయ్యెను. వారు మృతప్రాయులయిరి. ఇక మీదట తాము ఏమి చేయ వలయునో తోచని వారయిరి. ఇట్లు వాడిన మనస్సులతో నున్న దానవులను చూచి పద్మ మువలె వికసితమగు ముఖముగలవాడయి దైన్యములేక దైత్యోత్తముడగు మయుడు ఇట్లు పలికెను: దైత్య దానవులారా! మీరు ప్రమథులతోను దేవతలతోను ఘోర యుద్ధములు చేసితిరి. వానియందు దేవతలను ప్రమథులను భయపెట్టితిరి. మొదట మీరే వారిని గెలిచితిరి. కాని తరువాత వారి చేతిలో ఓడిపోతిరి. ఇపుడు ప్రమథుల చేతిలోనే దెబ్బలు తిని మిగుల దుఃఖమంది భయపడుచు నగరమును ప్రవేశించితిరి. దేవతల చేతిలో మీకు ఎంతయో దుఃఖము ప్రాప్తించినది. ఇందు ఏమాత్రమును సందేహము లేదు. మనకు కలిగిన ఈ అవమానము వృషభములకు జరిగిన శృంగభంగము వంటిది. ఈనాడు ఇటువంటి త్రిపుర దుర్గమునకే ఇటువంటి ముట్టడి తటస్థించిన దనిన అహో! కాలమహిమ ఎంత యాశ్చర్యకర మయినది! కాలము ఎట్టి (మనవంటి వారికిని జయింపరానిదనుట ఆశ్చర్యకరమే కదా!

మహాబుద్ధిశాలియగు మయుడు ఇట్లు పలుకుచుండ అది వినుచున్న దైత్యదానవశ్రేష్ఠులు సూర్యోదయము కాగానే గ్రహములవలె కాంతిహీనులయిరి. అదే సమయమున వర్షాకాల మేఘముల వంటి నీలకాయులైన వాపీపాలురువచ్చి వినయము కలవారై దోసిలి యొగ్గి యముని వంటి మయునితో ఇట్లు పలికిరి.

ఎవరికిని ఎరుగరానట్లు అమృతరసపూర్ణమయిన ‘అమృతరసా’ అను వాపిని నీవు నిర్మిం చితివి గదా! దేవ దానవులెల్లరలో ఉత్తముడవగు మయా! దాని నెవరో రహస్యముగా త్రావివేసిరి. అనగా మరికొందరు దానవులు వచ్చి ఇట్లనిరి. మృత సంజీవనశక్తిగల వాపిని నీవు సృజించితివి గదా! దైత్యనాయకా! దాని నెవడో వృషభ రూపమున వచ్చి త్రావెను. ఎడములేక కలువల గుంపులతో మత్స్యములతో పక్షులతో పద్మములతో కూడియుండు దానియందేమియు నీరే లేకుండపోయినది. అనగా వాపీపాలురు పలికిన మాటలు విని దైత్యవరుడును ప్రభువును నగు మయుడు ‘ఇది ఎంత జరుగరాని బాధాకరమగు విషయము జరిగినది!’ అని ఒకమారు పలికి దానవులతో ఇట్లు పలికెను: అసురులారా! నేను నా మాయాబలముతో నిర్మించిన ‘అమృత రస’ వాపినే ఎవరో త్రావిపోయినారనిన దానవులారా! మన త్రిపురదుర్గము కూడ లేకుండ పోయినదనియే నిస్సందేహముగా చెప్పవచ్చును. దేవతల చేతిలో ఎన్నిమారులు చచ్చినవారి నైనను దైత్యదానవులను మరలమరలా జీవింపజేయుచుండిన అమృతరసవాపిని ఎవరో త్రావి రనిన అది ఎవరో కాదు పీతాంబరుడగు విష్ణువే త్రావియుండును. నేను నా మాయతో గుప్తపరచి నిర్మించిన అమృత జలదాయినియగు ‘వాపి’ని అజరుడును గదాధరుడును నగు విష్ణువుతప్ప మరి ఎవ్వరు పానము చేయగలరు? ఏలయన మిగుల గూఢముగా నుంచినదైనను దైత్యు ప్రతియొక విషయమును మరిఎవ్వరికిని తెలియకున్నను అతనికి తప్పక తెలియును. దేవతలు సహజముగా సర్వతోముఖులు కారు; ఐనను వారు సర్వతోముఖులయి ఇది ఎరిగిరచిన అది విష్ణువు పనియే.

ఇదిగో! మన దుర్గము ఇపుడున్న ప్రదేశము చూడుడు చదునైన బయలు; దీనియందు వృక్షములు లేవు; పర్వతములు లేవు. అందుచేత మనము రథాది చతురంగ బలముండియు లేనివారమయితిమి. అందుచేతనే మనలను ప్రమథులును దేవతలును బాధించగలుగుచున్నారు. కనుక ఇదిఎరిగి మీరు ఇష్టపడినచో మనము సముద్రోపరితలమును మనఆశ్రయముగా ఏర్పరచు కొందము. అట్లయినచో ప్రమథులు ఎంతగా మనోవేగము గలవారే అయినను వారి వేగమును మనము ఓర్చుకొనగలము. వారుచేయు సంరంభములును ప్రయత్నములును అన్నియు సాగర జలమధ్యమున శక్తిహీనములగును. అమరులును అచటికి వచ్చుటకు మార్గముండదు. కావున వారును నిరుత్సాహులగుదురు. ఏలయన సాగరము ఆకాశమువంటిదే. మనము శత్రువులతో యుద్ధము చేసినను వారిని కొట్టినను తరిమినను సాగరము మనకు ఆశ్రయముగా నుండగా వారు మనలను ఏమియు చేయజాలరు.

దైత్యాధిపుడగు మయుడు దానవులతో ఈ విధముగా పలికి త్రిపురదుర్గముతో కూడ సర్వనదీనాధుడగు సముద్రునికడకుపోయెను. సాగరేశ్వర సమీపమునకు ఆ త్రిపురము ఎగిరి పోయెను. త్రిపురములును వాని ఆయా గోపురములును ఇతరాలంకారములును ఆ దుర్గమెగురు టలో ఏమియు చెదరక అట్లే ఉండెను. త్రిపురదుర్గమట్లు తన స్థానము నుండి తొలగిపోవుటచూచి త్రిపురారియు త్రిలోచనుడునునగు శివుడు వేదవాదమునందు నిపుణుడగు బ్రహ్మ దేవునితో నిట్లు పలికెను. భగవన్! పితామహా! దానవులందరును చాల ఎక్కువగా భయమందిరి. అందుచే త్రిపురవాసులగు దానవులెల్లరు విపులమగు మహాసముద్రములోనికి వెళ్ళినారు. కావున నీవు శీఘ్రమే మనరథము నక్కడకు చేర్చుము. అనగా వెంటనే మహాదేవ రథమును చుట్టుముట్టి దేవత లందరును సాయుధులై హర్షముతో పశ్చిమ సముద్రమునకు పోయిరి. (దీనినిబట్టి దానవులు తమ త్రిపుర దుర్గముతో కూడ పశ్చిమ సముద్రములోనికి పోయిరని తెలియును. ఇది ఈనాటి అరేబియా సముద్రమే.) అంతట అసురులందరును అమరులకు గురుడు (తండ్రి - రక్షకుడు) అగు శుభకరుడగు హరుని పరివారించి అతనిని అనుసరించి త్వరితముగా దానవులకు ఆశ్రయ మగు సాగర ప్రదేశమునకు పోయిరి. మనోహరములగు పతాకలతో అలంకృతములయి పటహముల ఆడంబరములతో నిండినదియు శంఖముల ధ్వనులతో పూరితమునునగు త్రిపుర దుర్గము కనబడగానే దేవతలును దేవతా సైనిక జనులును మేఘములవలె గర్జన ధ్వనులు చేయసాగిరి. వెలుపల దేవతలవిషయము ఇట్లుండ త్రిపురదుర్గము నందును దారుణములగు మృదంగధ్వనుటు గంభీరమయి మేఘధ్వనులవలె వినబడుచుండ అవి దానవుల ధ్వనులతో మిశ్రితమయి సముద్ర ధ్వనితో సమానమయి వినబడుచు ఆ త్రిపురదుర్గము సముద్రమునకు ప్రతినిధియేమో యనిపించు చుండెను.

అంతట సకల భువనాధిపతియు సురలకు గతియునగు హరుడు శత్రువులనెడు మృగము లను వేటాడవలయునను లోభముగల లుబ్ధకుని (వేటగాని) వంటి బుద్ధి కలిగినవాడై దేవశత్రువు లగు త్రైపుర దానవులు బలవంతులయి జల మధ్యగతమయిన త్రిపుర దుర్గము నందుండుట చూచి దేవగణాధిపతియగు ఇంద్రునితో ఇట్లు పలికెను. దేవేంద్రా! ఇటు చూడుము; త్రిపుర దుర్గమను ఈ దానవపుర మెంత ఉత్తమముగా నున్నదో చూడుము. ఎమయిన నాకేమి లెక్క? యమ, వరుణ, కుబేర, షణ్ముఖులును, ప్రమథ గణాధిపతులును నాకు తోడుపడగా అంతటి దానినిగూడ నాశము చేయుదును. పరబలముల నభిహతముచేయు ఏప్రదేశమున ఈ త్రిపురదుర్గ మున్నదో అట్టి సముద్ర దేశమునకు పోవుదము పదండు-’భవుడగు శివుడు త్రైలోక్యమను రథమును ఆరోహించి తాను కడు సమర్థుడు గావున త్రిపుర దుర్గమును మరల ముట్టడించదలచి సముద్రముకడకు వచ్చును’.

అని ఇట్లు జరుగునని ఊహించి దైత్యులు లవణ సముద్రపు పైభాగమునందు దుర్గమును నిలుపుకొనియున్నారు. కనుక మీరు వారిని లెక్కపెట్టక దానవేంద్ర సహితముగా త్రిపురదుర్గమును శరవర్షములతో ముసల వజ్రాఘాతములతో ముట్టడిచేయుడు. నేనును నారథవరము నారోహించి సురేంద్రా! మీ వెనుకనే వచ్చుచుందును. అసురవరులను వధించుటకును ఉద్యమించిన వారికి ఏమేమి చేయవలయునో ఆ సహాయమంతయు చేయుదును.

ఇట్లు అనిన శివుని మాటల ప్రేరణతో ఇంద్రుడు సన్నద్ధుడై త్రిపుర దుర్గమును నాశ మొందించు తలంపుతో కడు వికసించిన లోచన పద్మములతో ముందునకు సాగిపోయెను.