అమృతప్రాప్తి

మహర్షులకు సూతుడిట్లు చెప్పెను. మరల క్షీర సాగరమును దేవదానవులు మథించుచుండ ఆయుర్వేద ప్రజాపతియగు ధన్వంతరి భగవానుడు జనుల చిత్తమును కలవరపరచు విశాల నేత్రయగు మదిర (మద్యాధి దేవత)యు అమృతమును సర్వభూతముల భయమును నశింపజేయు కామధేనువును జనించి కనబడిరి. లక్ష్మిని కౌస్తుభ మహామణిని విష్ణువును- ఐరావత గజేంద్రమును హయరత్నమును సహస్రాక్షుడును-లోకారోగ్య ప్రవర్తకుడగు ధన్వంతరిని భాస్కరుడును, ఛత్రమును వరుణుడును, కుండలములను శచీపతియు, పారిజాత వృక్షమును వాయుదేవుడు, గ్రహించి ముదితులైరి. అంతట మహాసుందరుడగు ధన్వంతరిదేవుడు అమతముతో నిండిన కమండలువును ధరించుచు పైకివచ్చెను; ఈ యద్భుతమును చూచినంతనే దానవులు అమృతార్థము ‘ఇది నాది’ అని అరచు మహానాదము చెలరేగెను; అంతట విభుడగు నారాయణుడు మోహినియగు మాయనవలంబించి నిరుపమాన స్త్రీ రూపము ధరించి దానవులపక్ష మాశ్ర యించెను; ఆమెయందే మనస్సులు నిలిపిన ఆ మూఢచిత్తులగు దానవదైత్యులా అమృతము నామెకిచ్చిరి. అంతట ఆ దైత్య దానవులు ఒక్కటిగ కూడి ముఖ్యములగు అస్త్రములను మహాయుధములను గ్రహించి దేవతలమీదకు పరువెత్తిరి; అంతలో వీర్య వంతుడగు విష్ణుడు నరునితో కూడి దానవేంద్రుల నుండి యదియంచుకొని యపహరించెను; అపుడు దేవతలును ఆ యమృతమును విష్ణువు నుండి గ్రహించి యందుకొని తుముల యుద్ధము జరుగునది జరుగుచుండగనే దానిని త్రావివేసిరి.

అట్లు దేవతలు తమ కీప్సితమగు అమృతమంతయు త్రావుచుండ రాహువు మాత్రము తాను దానవుడయ్యు దేవరూపుడై అది త్రావెను, అది వాని కంఠమును చేరునంతలో దేవహితార్థమయి చంద్రసూర్యులీ విషయము నారాయణునకు తెలిపిరి. అంతట ఆ భగవానుడు అలంకృతమగు వాని శిరమును వాడు అమృతము త్రావుచున్నపుడే ఆయుధోత్తమమగు చక్రముతో ఖండించెను, చక్రముతో ఖండితమై ఆదానవుని మహాశిరము పర్వత శిఖరమువలె వసుధాతలమును కంపింప జేయుచుపడెను; అప్పటి నుండి ఈరాహుముఖము చంద్ర సూర్యులతో శాశ్వత మగు వైరబంధము పెట్టుకొనెను; అందుచేతనే అది ఇప్పటికిని వారిని బాధించుచున్నది, హరి భగవానుడును అతులమగు ఆ స్త్రీరూపమును వదలి నానాయుధములతో దానవులను కంపింపజేయ సాగెను; ఆ అసురులును చక్ర ఖడ్గ శక్తిగదా నిర్భన్న దేహులయి బహురక్తమును క్రక్కుచు ధరణీ తలమున పడిరి, తప్తకాంచన మాల్య యుతములగు ఆ దానవ శిరములు ఆ దారుణ యుద్దమున పట్టి ఆయుధములతో భిన్నములయి ఎడతెగక పడుచుండెను, మహాసురులందరును రక్త లిప్తాంగులై గైరిక ధాతువులతో రక్త వర్ణములగు పర్వత శిఖరములవలె క్రింద పడుచుండిరి. అంతలో రవి అస్తమించుసమయ ఆసన్నమయి అతడు ఎర్రనగు చుండెను. ఇనుప పరిఘలను విసరి వేయుటతోను దగ్గర నున్నవారిని పిడికిళ్ళతో గ్రుద్దుటతోను యుద్ధమున పరస్పరము కొట్టు చున్నవారి ధ్వనులు ద్యులోకమును తాకుచున్నవో అనునట్లుండెను; నరకుము, చీల్చుము, పరు వెత్తుము, పడవేయుము, తొలగుము ఇట్టి మహాఘోర శబ్ధములు అందంతటను వినబడుచుండెను.

ఇట్లు మహాభయంకర తుములయుద్ధము జరుగుచుండ, నరనారాయణ దేవులా యుద్ధమునకు వచ్చిరి! అందు దానవ హంతయగు విష్ణుభగవానుడు నరుని దివ్య ధనువును చూచితానును చక్రమును స్మరించెను. చింతిత మాత్రమున మహా ప్రభాయుక్తమును శత్రు నాశకమును రవిసమానమును అమోఘవిక్రమమును భయంకరమును సహింప అలవికానిదియు ఉత్తమమును జ్వలించుచున్న అగ్నివలె తేజోవంతమును అగు చక్రము వెంటనే వచ్చెను. గజహస్త సమాన భుజుడు అచ్యుతుడు భయంకరమును మహాప్రభమును దానవదైత్య దారణమును ఉజ్జ్వల జ్వలన సమానరూపమును అగు ఆచక్రమును వదలెను, ప్రళయాగ్ని సమాన తేజో వంతమా చక్రము వేగవంతమయి వచ్చిపడి పురుషోత్తముని చేతియందు ధరించబడు చుండునది కావున ఆ శక్తితోనే వేలకొలదిగ దైత్యులను ఆహవమున సంహరించుచుండెను; అది వాయువుతోడయి మందు అగ్నివలె అసురగణములను నరకును కాల్చుచుండెను; అది అత్యంతము ప్రేరితమయి మాటిమాటికి అంతరిక్షమందును భూమియందును లేచుచు పడుచు దైత్యరక్తమును పిశాచమువలె త్రావుచు రక్తమయమయి కనబడుచుండెను; అధీన (ధీర) మనస్కులగు అసురులును మరల మరల విజృంభించుచు సురగణములను కొండలతో పిండిచేయుచుండిరి. జలమును స్రవించు మేఘములవలె ప్రకాశించు మహా పర్వతము అనేకములు వేలకొలదిగ దానవ ప్రేరితములయి ఆకాశమునందు కనబడుచుండెను. క్రింద పడుచు అవి అంతరిక్షమునకు నడుమనే తమయందలి వృక్షములతో కూడిన వయి మేఘ రూపములును భయ జనకములును నయి కనబడుచుండెను. ఆ మహాద్రులు తమ సానువులు జారిపడుచుండ శీఘ్రముగ పరస్పరము దగ్గరకు చేరుచు మండుచు ప్రకాశించుచుండెను.

ఆ సమయమున భూమి తనయందు పర్వతములతో అరణ్యములతో కూడ ప్రచలిత మగుచుండెను; అన్నివైపులను పర్వతములును వాయుహతములై కంపించుచుండెను; ఇట్లు ఆ రణరంగమున మిగుల భయంకర యుద్ధము ప్రవర్తిల్లుచుండ పరస్పర ఘాతధ్వనులతో అది అభిగర్జితమయి మేఘరాశివలె నుండెను. అంతట నరుడు మేలిమి బంగరు ఆభరణములతో భూషితములయిన బాణములతో గగనమావరించెను; అతడా మహాభయంకర సురాసుర యుద్ధమునందు తన బాణములతో గిరి శిఖరములను కూడ చీల్చివేయుచుండెను; అందు అసురులు దేవతలచే ఇట్లు బాధితులై భూమియందును లవణ సముద్రమందును ప్రవేశించిరి; జ్వలితాగ్ని సమాన కాంతియగు సుదర్శనము పరికుపితమయి అంతరిక్షమందు కనబడుట చూచి వారు భయమందిరి; పారిపోయిరి; ఇట్లు విజయమందిన దేవతలును మందరమును మిగుల పూజించి (స్తుతించి) దాని స్వస్థానమందు నిలిపిరి. మేఘములును గర్జితములతో అంతరిక్షమును ధ్వనింపజేయుచు తాము వచ్చిన చోటుల కాయాదిశలకు పోయిచేరెను, అంతట దేవతలును పుష్కలమగు పరమానందమంది తమకు లభించిన చోటుల కాయాదిశలకు పోయి చేరెను; అంతట దేవతలును పుష్కలమగు పరమానందమంది తమకు లభించిన అమృతమును చక్కగా భద్రపరచుకొనిరి. వారందరును ఏకాభిప్రాయముతో ఆ అమృతనిధిని రక్షించవలసినదిగా శ్రీమహావిష్ణుని వేడుకొని అది అతని కప్పగించిరి.