యయాతి వృత్తాంతములు

సూతుడు ఋషులతో ఇంకను ఈవిధముగా చెప్పెను, సంవత్సరము గడచిన తరువాత తారా గర్భము నుండి కుమారుడు జనించెను. అతడు పండ్రెండు మంది ఆదిత్యుల తేజస్సులను పోలిన తేజస్సుతో దీపించు చుండెను. దివ్యమగు పీతాంబరమును ధరించి, దివ్యములగు ఆభరణములతో అలంకరించుకొని, రూపమునందు చంద్రుని పోలి ఉండెను.

అతడు అర్ధ శాస్త్రమును సమగ్రముగా ఎరిగినవాడు. చాల బుద్ధిశాలి. సర్వశాస్త్రములను ప్రవర్తిల్లజేసినవాడు. రాజ పుత్రీయము అను పేరున ప్రసిద్ధమయియున్న గజ వైద్యశాస్త్రము ఈ తారాపుత్రుడు ప్రవర్తిల్ల జేసినదే. సోమునకు (చంద్రునకు) రాజఅనియు పేరుగలదు. చంద్రుని కుమారుడగుటచే ఇతడు రాజపుత్రుడు. అతడు ప్రవర్తిల్లజేసిన శాస్త్రము కనుక రాజ పుత్త్రీయము అని దానికి పేరువచ్చెను. సర్వశాస్త్రముల నెరిగిన పండితుడు కావున బుధుడని అతనికి పేరు ప్రసిద్ధమయ్యెను. అతడు పుట్టుకతోనే లోకములందలి సకల తేజస్సులను తన తేజస్సుతో జయించు వాడును బలశాలిగా ఉండెను. ఈతని జనన సమయమున బ్రహ్మదేవుడును దేవతలును దేవ ఋషులును బృహస్పతి గృహమునకు వచ్చిరి. అచ్చట వారందరును పుట్టిన కుమారునకు జాత కర్మమును జరుపుటకు పూనుకొనిరి. ఆ దేవతలందరును ఈ కుమారుడు ఎవరి వలన కలిగినవాడు? అని తారను అడిగిరి. ఆమె సిగ్గుపడి ఏమియు మాటాడక ఊర కుండెను. వారును మరలమరల అదే ప్రశ్నము నడుగసాగిరి. ఆ ఉత్తమాంగన సిగ్గుపడుచు చంద్రుని కుమారుడే అని చాలసేపటి తరువాత సమాధానము ఇచ్చెను. అంతట ఆ కుమారుని చంద్రుడు తీసికొనెను. అతడు అతనికి బుధుడని నామకరణము చేసెను. భూలోకమునందు రాజ్యమును కూడ ఇచ్చెను. తరువాత అతనిని యువరాజుగా చేసి అభిషేకము జరిపెను.

తరువాత బ్రహ్మ బ్రహ్మర్షులతో కూడి ఆలోచించి బుధునకు గ్రహత్వమును ఇచ్చి సర్వ లోకములును చూచుచుండ అచ్చటనే అంతర్ధానమునందెను.

బుధునకు లోగడ తెలిపినట్లు ఇలా గర్భమున కుమారుడు కలిగెను. అతడు పురూర వసుడు అనుపేర ప్రసిద్ధుడయి సర్వలోక జనుల నమస్కారములను అందుకొను వాడయ్యెను. తన ప్రతాపముతో అతడు సమగ్రముగా నూరు ఆశ్వమేధ యాగములు చేసెను.

ఆ పురూరవుడు మనోహరమగు హిమవత్పర్వత శిఖరమునందు (తపస్సు చేసి) శ్రీమహా విష్ణుని మెప్పించెను. జనార్దనుని వరప్రభావమున లోకేశ్వరుడయ్యెను. భూలోకమునందలి సప్తద్వీపములకును అధిపతి అయ్యెను. ఈతడు కేశి మొదలగు కోట్లకొలదిగా రాక్షసులను చంపెను. ఆతని రూపమునుచూచి మోహితురాలయి ఊర్వశి అతనికి భార్య అయ్యెను. అతడు సర్వలోకముల హితమును కోరి సప్త ద్వీపములతోను పర్వతములతో కాననముల (చిన్న అడవుల లేదా చెట్ల తోపుల) తోను కూడిన భూమిని అంతటిని ధర్మానుసారముగా పాలించెను. కీర్తి అతనికి వింజామరను పట్టి వీచెడి సేవికగా, ఒడలు పట్టెడి సేవకురాలుగా అయ్యెను. విష్ణుని అనుగ్రహ ప్రభావమున దేవేంద్రుడు అతనికి తన అర్ధాసనమును ఇచ్చెను. ధర్మము, అర్థము కామము అనెడి మూడు పురుషార్ధములను ధర్మానుసారము సమభావముతో అతడు పాలించెను. పూర్వము ఒకానొకప్పుడు ధర్మార్థ కామములకు మూవురకు ఈతడు మనలను ముగ్గురను ఎట్లు సమానముగా చూచుచున్నాడో పరీక్షింపవలెనని కుతూహలము కలిగెను. అందుచే వారు అతని నడవడిని తెలిసికొనగోరి ఆ పురూరవుని కడకు వచ్చిరి. ఆరాజపుంగవుడు బంగారు తొడుగుతోను అలంకారములతోను కూడిన దివ్యములగు పీఠములను తెప్పించి వారిని వాటిపై కూర్చుండ బెట్టెను. భక్తి పూర్వకముగా అర్ఘ్యము పాద్యము మొదలగు వానితో వారిని పూజించెను. వారిని పీఠములపై కూర్చుండబెట్టి పూజించుటలో ఆ రాజు ధర్మమునందు అధికము అగు భక్తిని చూపెను. దానిచే కోపించి అర్థము నీవు లోభముచేత నశింతువు అని పురూరవుని శపించెను. కామమును గంధమాదన పర్వతమున కుమారవనము నందు ఊర్వశితోడి వియోగము కారణముగా నీకు ఉన్మాదము కలుగును అని అతనిని శపించెను. ధర్మము అతనితో ఇట్లు పలికెను:”నీవు దీర్ఘాయువవును, ధార్మికుడవును అయ్యెదవు. నీ సంతానమును చంద్రార్క నక్షత్రములు ఉన్నంత వరకును నూరుల కొలదిగా వృద్ధి పొందుచుండును. అది ఎన్నటికిని భూలోకమునందు నశించదు అని పలికి, ధర్మార్థకామములు మూడును అంతర్ధానము నందెను. ఆనాటి నుండియు ఆ పురూరవుడు రాజ్యమును ధర్మానుసారముగా అనుభవించెను.

రాజరాజగు ఆ పురూరవుడు ప్రతి దినమునను స్వర్గమునకు పోయి దేవేంద్రుని దర్శించి వచ్చుచుండెడి వాడు. అట్లు జరుగుచుండ ఒకనాడు ఆ రాజు దక్షిణాయన గతిలోనున్న సూర్యునితో పాటు దక్షిణపు ఆకాశమున సంచరించుచున్న తన రథమును ఆరోహించి పోవుచు దానవరాజగు కేశియనువాడు ఊర్వశిని చిత్రలేఖను కొనిపోవుచుండుట చూచెను. బుధ పుత్రుడగు ఆ పురూరవసుడు ఇంద్రుని కూడ జయించియుండిన ఆ కేశిపై వాయవాస్త్రమును ప్రయోగించి వానిని జయించెను. ఇట్లతడు యుద్ధమున కేశి రాక్షసుని జయించి వానిని తన హస్తముతో పట్టివేసెను. తరువాత ఆ రాజు ఊర్వశిని ఇంద్రునికి ఒప్పగించెను. ఈ కారణముగా అతడు ఇంద్రాది దేవతలతో మైత్రిని సంపాదించెను. ఆనాడు మొదలుకొని దేవేంద్రుడు పురూరవునితో మైత్రిని అంగీకరించుటయేకాక అతనిపై ప్రీతిచెంది అతనికి సర్వ లోకాధికుడుగా నుండు నట్లును బలమును సామర్థ్యమును యశస్సును ఐశ్వర్యమును శోభను, భరతునిచే గానముచే కీర్తింపబడుటను వరముగా ఇచ్చెను. ఆఊర్వశీయును నాటినుండి పురూరవుని పూజ్యచరితమును పాడుచు ప్రీతి కలిగించుచుండెడిది. ఇట్లుండ ఒకనాడు దేవేంద్రుడు ఊర్వశీ, మేనకా, రంభలను భరతుడు రచించి ప్రవర్తిల్ల జేసిన లక్ష్మీ స్వయంవరమను నృత్య రూపకమును నృత్యమున అభినయించవలసినదిగా ఆజ్ఞాపించెను. ఆనృత్యాభినయ ప్రసంగములో ఊర్వశి, లక్ష్మీ రూపము ధరించి లయానుగుణముగా నాట్యము చేయుచుండెను. ఆమె పురూరవసుని చూచుచు నాట్యము చేయుచు కామపీడితురాలయ్యెను. ఈ హేతువుచే ఆమె తనకు భరతుడు ఉపదేశించిన అభినయము అంతయు మరచెను. భరతుడును అందులకు కోపించి ఈ రాజుతోడి వియోగమున నీవు భూలోకమున మిగుల సన్నని తీగవై ఉండుమని ఊర్వశిని భూలోకమునందే ఊర్వశి తీగయై యున్న పరిసరములందే పిశాచమయి ఉండురుని పురూరవసుని శపించెను. వెంటనే ఊర్వశియును శాపానుసారము భూలోకమున శాపకాలమంతయు లతగానుండి చాల కాలము నకు శాపము తీరి ఆ పురూరవసుని తనపతిగా చేసికొనెను. శ్వావసానమున ఆమెకు పురూర వసుని వలన ఎనమండ్రు కుమారులు కలిగిరి. వారు ఆయువు, దృఢాయువు, అశ్వాయువు, ధనాయువు, ధృతి, మతి, శుచి, శతాయువు అనువారు. వీరందరును వీరులును దివ్యములగు బలమును సామర్థ్యమును కలవారు. వీరిలో ఆయువు అనునతనికి నహుషుడు, వృద్ధశర్మ, రజి-రసుడు, విపాప్మ అను వారు కుమారులైరి. వారు ఐదుగురును మహారథులు అగు వీరులు. వారిలో రజికి నూరుగురు కుమారులు కలిగిరి. వీరి కందరకును రాజేయులు అని ప్రసిద్ధి. రజి పాపనాశకుడగు నారాయణుని ఆరాధించెను. అతని తపమునకు మెచ్చి నారాయణుడు ఆ మహీపతికి వరము నిచ్చెను. తత్ప్రభావమున అతడు దేవతలను, అసురులను కూడ జయించగలవాడయ్యెను.

ఇట్లుండ కొంత కాలమునకు దేవాసురులకు యుద్ధము సంభవించెను. అది మూడు నూరుల సంవత్సరములు ప్రవర్తిల్లెను. ప్రహ్లాదునకును ఇంద్రునకును జరిగిన ఆ యుద్ధములో ఎంతకాలమునకును ఎవరికిని గెలుపు కలుగక యుద్ధము సాగుచునే యుండెను. అపుడు దేవాసురులు ఇరువురును చతుర్ముఖునికడకు పోయి మాలో ఎవరికి గెలుపుకలుగునని ప్రశ్నించిరి. ఈ ఇరువురిలో ఎవరు జయింతురు అని చెప్పగలను? రజి జయించును అని బ్రహ్మ పలికెను. దైత్యులు రజి కడకు పోయి నీవు మాకు సహాయుడవు కమ్ము. అని అతనిని ప్రార్థించిరి. జయించిన తరువాత నేను మీకు అధిపతిగా ఉండుటకు అంగీకరించినచో నేను మీకు యుద్ధమున సాయము చేయుదునని రజి పలికెను. అది రాక్షసులు అంగీకరింపలేదు. దేవతలు అందులకు ఒప్పుకొనిరి. నీవు యుద్ధమున మా శత్రువుల నశింపజేయుము. తరువాత నీవే మా అధిపతివి కమ్ము-అని దేవతలనిరి. అంతట రజి అంతవరకును వజ్రపాణియగు దేవేంద్రు నకును అవధ్యులుగా ఉండిన రాక్షసులనందరను నశింపజేసెను. రజి తమకు చేసిన ఈ సాహాయ్యకృత్యమునకు మెచ్చి ఇంద్రుడు తానతనికి కుమారుడుగా ఉండ నంగీకరించెను. అంతట రజియును తన రాజ్యము నంతయు దేవేంద్రున కప్పగించి తాను తపస్సునకు పోయెను.

రజిపుత్రులు నూరుమందియు సద్గుణములుసు బలమును కలవారు. వారు తమ తండ్రి తపోవనమునకు పోయిన తరువాత ఇంద్రుని వైభవమును యజ్ఞభాగమును కూడ హరించిరి. ఇట్లు రజిపుత్రులచేత విశేషముగా బాధింపబడి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై పోయెను. అతడు తన గురువగు బృహస్పతి దగ్గరకు పోయెను. నేను రజిపుత్రులచేత మిగుల పీడింపబడి యున్నాను. నాకిపుడు రాజ్యములేదు. యజ్ఞభాగమునులేదు. అవి రెండును ఇపుడు రజి కుమారులకే చెందియున్నవి. నీవు బుద్ధిమంతులలో ఉత్తముడవు. నాకు మరల నారాజ్యము లభించుటకై యత్నము చేయ ప్రార్థించుచున్నాను అని ఇంద్రుడు గురుని ప్రార్థించెను.

బృహస్పతి తన నీతి బలమునను మంత్రబలమునను ఇంద్రుని మరల బలదర్పితునిగా జేసెను. శాస్త్ర విధానము ననుసరించి అతడు గ్రహశాంతిని పౌష్టిక కర్మలను ఆచరించెను. అంతేకాక ఆ బృహస్పతిపోయి తన బుద్ధిబలమున రజిపుత్రులను మోహపెట్టెను. వారి బుద్ధిని మార్చెను. దానిచే వారు వేదబాహ్యమగు అధర్మమును ఆశ్రయించిరి. ఇట్లు పండిత శ్రేష్ఠుడును వేదవేత్తయు అగు బృహస్పతి రాజేయులను వేద మార్గమునుండి పరిభ్రష్టులనుగా చేసెను. వారందరును వేద బాహ్యులుగా హేతువాదపరులుగా ఐరి. ఇది ఎరిగిన దేవేంద్రుడు ధర్మమార్గ బహిష్కిృతులగు ఆ రజిపుత్రులనందరను చంపెను.

ఇక నహుషుని కుమారులను పేరుకొందును. వారు యతి యయాతి సంయాతి ఉద్భవుడు, పాంచి సయాతి, మేఘ సంయాతి అను వారేడుమంది. వీరు ధార్మికులును వంశవృద్ధి కరులును. యతి అనునాతడు చిన్నతనము నందే యోగియై వానప్రస్థు డయ్యెను. యయాతి ధర్మమునకు తాను ఆశ్రయమై ధర్మమును తానాశ్రయించి రాజ్యమును పాలించెను. వృషపర్వుడను దానవ రాజు కుమార్తెయగు శర్మిష్ఠయు శుక్రుని కూతురగు దేవయానియు ఆతని భార్యలు. యయాతికి దేవయానివలన యదువు తుర్వసుడు అనువారును శర్మిష్ఠవలన ద్రుహ్యుడు అనువు పూరుడు అనువారును మొత్తము ఐదు మంది కుమారులు కలిగిరి. వీరైదుమందిలోను యదువు పూరుడు అనువారు ఇద్దరును వంశవృద్ధికరు లయిరి.

నహుష పుత్రుడగు ఈ యయాతి రాజుగా సత్యపరాక్రముడై (ధర్మము మొదలగు నత్ప్ర వృత్తుల యందు పూనిక కలిగి) భూమిని పాలించెను. వివిధములగు యజ్ఞములతో దేవతలను ఆరాధించెను. అతిభక్తితో ప్రయుతుడై (శరీరమునందును చిత్తమునను శుచియై) పితరులను దేవతలను కూడ అర్చించెను. అటు వలెనే శత్రువులవలన ఓటమి నెరుగని ఆ యయాతి ప్రజలను అందరను దృఢ బుద్ధితో పాలించెను.

ఇట్లు ఆయయాతి ధర్మానుసారము ప్రజలను పాలించుచుండ మహాఘోరమును సౌందర్యమును దేహదార్ఢ్యమును నశింపజేయునదియు నగు వార్ధక్యము ఆతనిని ఆవేశించెను. ముసలితనము తను క్రమ్ముకొనగా నాతడు తన కుమారులగు యదుపూరుతుర్వసు ధ్రుహ్య్వనువు లను పిలిచి ఇట్లు పలికెను. “యౌవనముతో మీరు అనుభవించు కామ సుఖముల ననుభవించ వలెనను కోరికతో నున్నాను. కుమారులారా! నాకు ఈ విషయమున సాహాయ్యము చేయుడు.” అనగా దేవయానీ జ్యేష్ఠ కుమారుడగు యదువు-యౌవనముతో మేము మీకు చేయదగిన సాహాయ్యము ఏమి?-అని ప్రశ్నించెను. యయాతి కుమారులతో ఇట్లు పలికెను.”నావార్ధకమును మీరు తీసికొనవలయును. మీ యౌవనముతో నేను విషయ సుఖములను అనుభవింతును. నేనింతవరకును దీర్ఘసత్రయాగములు (దీర్ఘకాలము దీక్ష వహించి ఆచరించవలసిన సత్రయాగ ములు) అనేకములు ఆచరించుచుండుటతోను శుక్రమహాముని ఇచ్చిన శాపముతోను ఈ వయః పరిణామము (ముసలితనము) కలిగినది. ఐనను అది ఇంకను కామ సుఖములను కోరుచున్నది. నాయనా! నేను ఈ హేతువుచే తపించి పోవుచున్నాను. కనుక మీలో నెవరైన ఒకరు ఈ నా వార్ధకమును తన శరీరముతో గ్రహించి స్వాధీనపరచుకొనవలెను. నేను సరిక్రొత్త శరీరమును పొంది దానితో పడుచువాడనై కామములను అనుభవింతును.”

కాని యదువు మొదలగు కుమారులెవ్వరును తమ తండ్రియగు యయాతి యొక్క వార్ధక్యమును స్వీకరించలేదు. ఆ హేతువుచే ఆ రాజర్షి యదుతుర్వసు ద్రుహ్య్వనువులు అను నలుగురను శపించెను అని పరంపరలో వినబడుచున్నది. కాని వారిలో ఐదవ వాడగు పూరుడు సత్యవిక్రముడు (ధర్మ ప్రధానమగు ప్రవృత్తికి సత్యమని పేరు. దానియందు తన శక్తిని ప్రయోగించి ప్రవర్తిల్లువాడు సత్యవిక్రముడు) కావున అతడు తనతండ్రితో “తండ్రీ! నాఅభినవ యౌవనమును నీవు తీసికొని సుఖములను అనుభ వించుము. నీ ఆజ్ఞానుసారముగా నీవార్ధాకమును గ్రహించి నీ అనుమతితో రాజ పదమునందు నిలిచియుందును. (రాజ్యమును పాలించుచుందును) అనెను.

పూరుడు ఇట్లు చెప్పగానే రాజర్షియగు యయాతి తన తపస్సామర్థ్య బలమును ఆధారముగా చేసికొని తన దేహమునందలి ముసలితనమును మహాత్ముడు (ఉన్నతమగు మనస్సు కలవాడు) అగు పూరుని శరీరమునందు వ్యాపింపజేసెను. పూరుని వయస్సును తాను గ్రహించి యౌవన మును పొందెను. యయాతినుండి గ్రహించిన వార్ధకముతో పూరుడు రాజ్యమును పాలించెను.

ఇట్లు వేలకొలది సంవత్సరములు గడచెను. మహాపరాక్రమ శాలియగు యయాతి కామ సుఖముల విషయమున తృప్తి పొందలేదేమో! అనునట్లే యుండి తన కుమారుడగు పూరునితో ఇట్లు పలికెను.”నేను నీ మూలముననే పుత్రులు కలవాడనయితిని. నా వంశమును నిలుపు కుమారుడవు నీవే. ఈ వంశమునకు లోకమున పౌరవ వంశము అను ఖ్యాతి కలుగును.” అని పలికి ఆ రాజశ్రేష్ఠుడు పూరుని రాజ్యమున అభిషేకించెను. చాలకాలము జీవించి అతడు యయాతి-కాలధర్మము నందెను. మునిశ్రేష్ఠులారా! ఇకమీదట పూరు వంశమును మీకు వివరించి తెలుపుదును. వినుడు. భరత వంశమును వృద్ధిచేయు భారతులు అనబడు పాండవ కౌరవులు ఆ వంశమునందే జన్మించిరి కదా.