మన్వంతర వివరణము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను, మనువు (సత్యవ్రతుడు) మత్స్య నారా యణుడు చెప్పిన ఈ విషయమును విని అస్వామితో ఇంకను ఇట్లు పలికెను, మధుసూదనా! పూర్వులగు మనువుల చరితమును నాకు వినిపింపుము అనమత్స్యమూర్తి ఇట్లు పలికెను, సూర్య పుత్రా! అన్ని మన్వంతరములను, మనువుల చరితమును మన్వంతరకాల పరిమాణమును వారి ఉత్పత్తిని సంక్షేపముగా అంతయు తెలిపెదను. ఏకచిత్తుడవై ప్రశాంతమగు మనస్సుతో వినుము.

స్వాయంభువ మన్వంతరమున యాములు అనువారు దేవతలు. లోగడ తెలిపిన మరీచి మొదలుగా నారదుని వరకునుగల పదిమందియు ఋషులు. ఆగ్నీధ్రుడు, అతిబాహుడు, పుత్రుడు, సవనుడు(లు), జ్యోతిష్మాన్, ద్యుతిమాన్, హవ్యుడు, మేధ, మేధాతిథి, వసువు అను పది మంది కుమారులు. వీరు ప్రతిసర్గమును (పాంచభౌతికములగు శరీరములుగల ఆయా ప్రాణి విశేషముల సృష్టిని) జరిపి వీరు పరమపదమున కేగిరి.

స్వారోచిషమనువునకు నభుడు, నభస్యుడు, ప్రభృతి, భరతుడు అను నలుగురు కుమారులు. దత్తుడు, నిశ్చ్యవనుడు, స్తంబుడు, ప్రాణుడు, కాశ్యపుడు, ఊర్వుడు, బృహస్పతి అనువారు ఏడు మంది ఋషులు. తుషితులు అనువారు దేవతలు. వసిష్ఠుని కుమారులగు హవి ఇంద్రుడు సుకృతుడు మూర్తి అపుడు జ్యోతి అయస్మయుడు అను ఏడుగురును సృష్టిని కొనసాగించు ప్రజాపతులు.

ఉత్తముడు మనువుగా ఉండగా ఆయన కుమారులు పది మందియు ప్రజాపతులు, వారు ఇషుడు, సహస్యుడు, ఊర్జుడు, శుచి, శుక్లుడు, మధుడు, మాధవుడు, నభస్యుడు, సభుడు, నహుడు అనువారు. ఈ కడపటివాడు ఉదారుడు చాలగొప్ప కీర్తిశాలి. భానువులు అనువారు ఊర్జులు అను గణమువారు సప్తఋషులు, వారి పేరులు, కౌకరండికుడు, కురండి, దాఖ్యుడు, కండి, ప్రవాహణుడు, మితుడు, సంహితుడు అనునవి.

నాలుగవదియగు తామసమన్వంతరమున కవి పృథువు అగ్ని అశ్వుడు కపిలుడు జన్యుడు ధీమాన్ అనువారు సప్తఋషులు. సాధ్యులు అను గణమువారు దేవతలు. అకల్మషుడు, ధన్వి, తపోబలుడు, తపోరతి, తపస్యుడు, సుతపుడు, తపోధ్యుతి, తపోనాథుడు అను తామసుని కుమారులు పది మందియు యుద్ధ విద్యల నెరిగినవారిలో శ్రేష్ఠులును వంశవృద్ధి చేయువారును అయిరి. రైవత మన్వంతరమున దేవబాహుడు, సుబాహుడు, పర్జన్యుడు, సోమపుడు ముని, హిరణ్యరోముడు, సప్తాక్షుడు అనువారు సప్త ఋషులు. భూతరజసులు అను గణమువారు దేవతలు. రైవతుని కుమారులు అరుణుడు, తత్త్వదర్శి, ధృతిమాన్, హవ్యపుడు, స్వజిత్, యుక్తుడు, నిరుత్సుకుడు, సత్యుడు, నిమేషుడు, అంతఃప్రకాశకుడు అనువారు పదిమందియు ధర్మము వీర్యము బలము కలవారు. వీరు ఆ మన్వంతరమున ప్రజావృద్ధి చేయువారు.

చాక్షుష మన్వంతరమున లేఖులు వసువులు ప్రవాచులు పారిసూవులు దివొకసులు అను ఏడు తెగల దేవతలుందురు. భృగువు సుధాముడు విరజుడు సహిష్టుడు నాదుడు వివస్వాన్ అత్రి అనువారు సప్త ఋషులు. ఇంతకుముందు తెలిపిన ఊరువు పురుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యవాక్ కవి అగ్నిష్టోముడు అతిరాత్రుడు సుదృష్టి అభిమన్యుడు అను పదిమంది మయు చాక్షుషుని కుమారులు ప్రజావృద్ధి చేయువారు.

వైవస్వత మన్వంతరమున అత్రి వసిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు సప్త ఋషులు, సాధ్యులు, విశ్వేదేవులు, రుద్రులు, మరుత్తులు, వసువులు, అశ్వినులు, ఆదిత్యులు అను ఏడు దేవగణములు ఉండును. ఇక్ష్వాకువు మొదలగు కుమారులు ప్రజావృద్ధి చేయువారు.

అన్ని మన్వంతరములందును ఏడేసిమంది మహర్షులు ధర్మ వ్యవస్థచేసి పరమ పదమును చేరెదరు. సావర్ణి మన్వంతరమున అశ్వత్థామ శరద్వాన్ కౌశికుడు గాలవుడు శతానందుడు కాశ్యపుడు రాముడు అనువారు సప్త ఋషులు. ధృతి, వరీయాన్, పవనుడు, సువర్ణుడు, విష్ణుడు, చరిష్ణుడు, ఇజ్యుడు, సుమతి బృహత్ క్షత్రుడు వీర్యవాన్ అనువారు పదిమంది సావర్ణి కుమారు లును ప్రజావృద్ధి చేయువారు.

వీరు కాక రౌచ్యుడు మొదలగు మరికొందరు మనువులును కాబోవుదురు. రుచి అను ప్రజాపతికి కుమారుడు రౌచ్యుడు. భూతి అను ప్రజాపతికి కుమారుడు భౌత్యుడు. వీరును కాబోవు మనువులలోనివారు.

తరువాత బ్రహ్మ కుమారుడగు మేరుసావర్ణి మనువు అగును.

క్రతువు ఋతుధాముడు విష్వక్సేనుడు అనువారు మరి ముగ్గురు మనువులు.

ఇట్లు గడచినవారు ఆరుమందియు గడచుచున్న వైవస్వతమనువును రానున్న మనువులు ఏడుమందియు మనువులు చెప్పబడినారు. ఇట్లు మొత్తము పదునలుగురు మనువులు. 

వీరు వేలకొలది దేవ యుగముల కాలము తపమాచరించి ఆ శక్తిచే లోకసృష్టిని ప్రజా పాలనమును జరుపుదురు.

ఈ మనువులు అందరును తమతమ అంతరములలో చరాచర ప్రాణులతో నిండిన జగత్తును సృష్టించి పాలింతురు. తుదకు కల్పాంతమునందు బ్రహ్మతో పాటు ముక్తిని పొందుదురు.

ఈ సృష్టియును కల్పమును ఒకటే కాదు. సృష్టులును కల్పములును అనంతములు. ప్రతి సృష్టియందును కల్పమునందును ఇట్లే బ్రహ్మలును మనువులును మరల మరల పుట్టుచు పోవు చుందురు. కనుక వీరు వేలకొలది దేవ యుగములు ముగిసిన తరువాత మరల మరల నశిం చుచుందురు. ఆ క్రమములో బ్రహ్మ మనువులు మొదలగువారు విష్ణు సాయుజ్యమును పొందుదురు. ఇక ముందును ఇట్లే పొందనున్నారు.