అమృతమథన కథ

ఋషులు సూతుని ఇట్లు అడిగిరి, సూతా! యథాక్రమముగా నారాయణ మాహాత్మ్యము ఎంత వినినను మాకు తృప్తికలుగుటలేదు; కావున ఇంకను అది తెలుపుము; పూర్వము దేవతలు విచక్షణులై, వివేకవంతులై అయి అమరత్వమును పొందిరి? ఏ తపస్సుచే ఏ కర్మము నాచరించు టచే ఎవరి అనుగ్రహముచే అమరులయిరి? అన సూతుడిట్లు చెప్పెను. నారాయణ దేవుడును శూలభృత్తగు మహాదేవుడును తామున్నచోట ఎల్ల (దేవతలకేకాదు) సర్వులకును అమరత్వమున సహాయులేయని పెద్దల తలంపు; పూర్వము దేవాసుర యుద్ధమున సురులచే వందలకొలదిగ చంపబడిన దైత్యేంద్రులను భృగునందనుడగు శుక్రుడు తన సంజీవినీ విద్యను ప్రయోగించి నిద్ర మేలుకాంచిన వారినివలె జీవించి లేచునట్లు చేయుచుండెను. ఎట్లన అతని తపముచే తుష్టుడైన మహాత్ముడగు శంకరుడు మహాప్రభయగు సంజీవినియను విద్యను అతనికి ఇచ్చి యుండెను; మహేశ్వర ముఖోదితయగు ఆ విద్య ఆ భార్గవు నందుండుట చూచి సర్వ దానవులును గర్వముచే మూడు అయిరి; దానితో ధీమంతుడగు శుక్రుడు సర్వలోకములందు ఎవరికిని దేవ యక్ష రాక్షస నాగాదులకును ఋషి బ్రహ్మేంద్రో -పేంద్ర విష్ణులకునులేని అమరత్వము దైత్యులకు సంపన్నమొనర్చెను. శంకరునుండి అట్టి ఆవిద్యను సంపాదించి శుక్రుడు పరమనిర్వృతి (ఆనం దము) నందెను. ఇట్లు శుక్రుని సంజీవినీ విద్యాప్రాప్తికి తరువాత సుమహా ఘోర దేవాసుర యుద్ధము జరిగెను. అందు దేవహతులగు దైత్యులను దైత్యేంద్రులను విచక్షణుడగు శుక్రుడు తన విద్యాబలముతో లీలగా లేవదీయుచుండెను, ఈవిధమగు స్థితిని ఇంద్రుడును ఉదార బుద్ధిశాలియగు బృహస్పతియు ఎరుగరు; దెబ్బలు తినుచున్న వందల వేలకొలది దేవులును అందరు వికలేంద్రియులును విషణ్ణవదనులు అయిరి; ఇట్లు వారు విషణ్ణులు కాగా జగత్పతియగు పద్మసంభవుడు మేరుపర్వత సానువునందు దేవతలతో ఇట్లనెను.

దేవతలారా! నామాట వినుడు; దానిపై ఆలోచించుడు; ఇప్పుడు దానవులతో సఖ్యము చేయవలయును, అది జరుగవలయును, అమృతమునకై యత్నించవలయును, వరుణుని సహాయునిగా చేసికొని మందరమును కవ్వముగాచేసి శేషుడను కవ్వపుత్రాటితో చుట్టి క్షీర సముద్రము మథించవలయును, చక్రపాణిని మేలుకొలుపవలయును; దానవేంద్రుడగు బలిని మన స్వామిగా చేసికొని మనము కొలది కాలము సేవింపవలయును; అవ్యయుడగు విష్ణుడు కూర్మరూపుడై పాతాళము నందుండునట్లు వేడవలయును; మందరశైలమును కూడ ప్రార్థించ వలయును; చిలుకుట కొనసాగవలయును; అనగా అమాట విని దేవతలు దానవ మందిరమున కేగిరి; బలితో ఇట్లనిరి, విరోధ భావము మానుదము; ఇకమీదట మేమును నీ బలమందలి భృత్యులము, అమృతమునకై ఉద్యోగింతము, శేషుడు కవ్వపు త్రాడగును, దైత్యా! నీవు ఈ మథనమున అమృతము నుత్పాదించగా నీప్రసాదమున మేమందరము అసంశయముగ అమరుల మయ్యెదము; దేవత లిట్లనగా ఆ బలిదానవుడు పరితుష్టుడయ్యెను; దేవతలారా! మీరు చెప్పినట్లే నేనిపుడు చేయుట ఉచితము; ఇందు నేనొక్కడనే క్షీరవారిధిని మథింప శక్తుడను; బాహువులతోనే క్షీరవారధి నంతటను కెలికి మీయందర అమృతత్వమునకై ఇప్పుడే దివ్యామృతమును తేగలను; కాని శత్రువులనైనను చాల దూరము నుండి చాల కాలమునకు తరువాత వచ్చి తన్నాశ్రయించు వారిని భక్తితో పూజించని వాడు ఇహపరముల రెంటను నాశమందును; కావున స్నేహాశ్రితులగు మిమ్ముల నందరను పాలింతును అనెను.

ఇట్లు పలికి, ఆ దైత్యేంద్రుడపుడే దేవతలతో కూడ పోయెను; మందరధరాధరమును సహాయత్వమునకై ప్రార్థించెను. ఇపుడు అమృత మంథనమున నీవు మాకు కవ్వమగుము; ఏలయన ఇది సురాసురుల కందరకు కావలసిన మహాకార్యము; అనగా మందరము ఎందు నిలిచి నేను భ్రమింతునో సముద్రమును మథింతునో అట్టి ఆధారమున్నచో అట్లే చేయుదును, సహస్రఫణలుకల శేషుని ఇందు కవ్వపు త్రాడుగ చేసికొనుడు అనెను. అంతట విష్ణుని చతుర్థాంశ రూపులయి ధరణీధారణ కార్యమందు నిలిచియున్న మహాబలులు శేషుడును కూర్ముడును వెలికివచ్చిరి; వారు గర్వ సంయుక్త వచనమిట్లు పలికిరి; త్రైలోక్యధారణముచే కూడ మాకిందు గ్లాని కలుగుట లేదు; అనగా ఈ విశ్వమందు ఘటిక (చిన్న ఉండ) వంటి క్షుద్ర వస్తువగు మందరము వలనమాకేమి శ్రమము? అనిరి; శేషుడిట్లనెను: బ్రహ్మాండమునే నాయందు చుట్టినను నాలో బ్రహ్మాండమునే మథించినను, నాదేహమునకు గ్లాని కలుగదు; అనగా మందరము (నాచుట్టు) ఉండుటచే నాకేమి అగును? అంతట తక్షణమే ఆనాగుడు ఆశైలమును లీలగా ఉత్పాటించి క్షీరసాగరమున ఎత్తి పడవేసెను; అంతట దానిక్రింద కూర్ముడు నిలిచెను, ఎపుడు దేవదానవులు క్షీరోదసాగర మథనమునకై నిరాధారమగు మందరమును భ్రమింపజేయుటలో అశక్తులయిరో అపుడు వారు బలసమన్వితులై స్వయముగ దేవదేవేశుడగు జనార్దనుడున్న నారాయణ నివాసమున కేగిరి; అచట శ్వేతపద్మ సదృశుడును, శుభుడును యోగనిద్రా నిరతుడును పీతాంబరుడును అచ్యుతుడును హార కేయూర భూషితాంగుడును హేమపర్యంక స్థితుడును తన పాదపద్మములతో లక్ష్మీ నాభిమండలమును స్పృశించుచు గరుత్మంతునిచే తనరెక్కల విసన కర్రతో గాలి వీవబడుచు తనకన్ని వైపుల నిలిచిన సిద్ధచారణ కిన్నరులచేతను మూర్తి మంత ములగు ఆయుధములచేతను స్తుతింప బడుచు ఎడమబాహువును దిండుగా పెట్టుకొనియున్న అదేవుని దర్శించి దేవదానవులెల్లరు కృతాంజలి పుటులై ప్రణతులై అతనిని ఇట్లు స్తుతించిరి.

లోకత్రయాధ్యక్షా! తేజోజిత భాస్కరా! విష్ణో! జిష్ణో! కైటభమర్దనా! సృష్టిక్రియాకర్తా! జగత్పాలయితా! నమస్కారము; రుద్రరూపా! శర్వా! సంహారకారిన్! శూలాయుధా! అదృష్యా! దానవ ఘాతిన్! నమస్కారము; పాదత్రయ క్రమాక్రాంత త్రైలోక్యా! అభవా! ప్రచండ దైత్యేంద్రతూల ప్రళయ మహాగ్నీ! నాభిహ్రద సంజాత పద్మగర్భ మహాచలా! పద్మభూత మహాభూతా! (పాద్మ కల్పమున పృథ్వీ మహాభూతము నారాయణుని నాభిపద్మమని చెప్పబడెను) కర్తా! హర్తా! జగత్రియా! అశేష లోకపాల జనకా! క్రియాకారణ కారిన్! దేవారి వినాశకా! మహా సమరశాలిన్; లక్ష్మీ ముఖ పద్మ మధుపా! కీర్తినివాసిన్! నమస్కారము; మాకు అమరత్వము కలిగింప నిశ్చ యించుము, సర్వశైలములలో గొప్పదియు అయుతాయుత యోజన విస్తారమును అగు ఈ మందరమును నీ అనంత బలబాహుద్వయ మందలి ఒక బాహువుతో, ఒక పాణితో నిలువ జెట్టి ధరించుము; స్వధా స్వాహార్ణహవిః కాములగు దేవతలకై అమృతమును మధించ వలయును; అనిన స్తోత్ర పూర్వక దేవ వచనమును విని మధుసూదనుడు యోగనిద్ర విడిచి ఇట్లనెను; సర్వ దేవతలారా! స్వాగతము; మీ అగమన కారణమేమి? మనః సంతాపము విడిచి మీరు వచ్చిన పని తెలుపుడు; అట నారాయణుడిట్లు పలుకగ విని దివౌకను లిట్లనిరి; దేవేశా! మాకు అమరత్వ ప్రాప్తికై చేయు ఈ మహోదధి మథనముచే మాకది లభించు ఉపాయ మొనరింపుము; మాధవా! కైటభమర్ధనా! విభూ! నీవు లేనిదే మాచే ఆ అమృతము పొంద శక్యముకాదు; కావున నీవు మా ముందుండుము.

దేవతలిట్లనగా అప్రదృష్యుడును శత్రు మర్దనుడు అగు విష్ణుడు దేవసహితుడై మందరాచల మున్నచోటి కేగెను; దానిని దేవదానవులు అనంతుని భోగరాశితో చుట్టి పట్టుకొనిరి; దేవతలు విషభీతులయి తోకవైపున నుండిరి; సైంహికేయ (రాహు) ప్రముఖ దానవులు ముఖము వైపున ఉండిరి; అంతట బలి అనాగుని సహస్రవదనమగు శిరమును ఎడమచేతితో మిగిలిన దేహమును కుడిచేతితో పట్టిలాగెను. నారాయణ భగవానుడు తన భుజద్వయముతో అమృత మథనమునకు కవ్వ మయిన మందరమును ధరించెను; అంతట దేవాసురు లెల్లరును జయ శబ్ద పూర్వకముగా ఆరంభించి సమగ్ర దివ్య శతవత్సరములు క్షీరసాగరమును మథించిరి; దైత్యదానవులు సర్వులు అప్పటికి శ్రాంతులయిరి. అపుడు దేవేంద్రుడు మేఘుడయి అమృత కల్పములగు జలశీకరముల వర్షించెను; శీతల వాయువును వీచెను; దేవతలలో చాలమంది చాలవరకు అలసినపుడెల్ల కమలాసనుడు మాత్రము అశ్రాంతుడై సముద్రమును మధించుడు; మధించుడు; ఉద్యోగ(ప్రయత్న) వంతుల కెప్పుడును అపారమగు శ్రీ లభించును అని ఎచ్చరించుచుండెను; బ్రహ్మప్రోత్సా హితులయి దేవతలు మరల అంబుధిని మథించుచుండిరి; అట్లు అయుత యోజనోన్నత శిఖర మగు శైలమును వారట్లు త్రిప్పుచుండ దానినుండి గజయూథములును వరాహ శరభాది మృగము లును అయుత లక్ష సంఖ్యలో శ్వాపదములును పుష్పఫలద్రుమములును పడసాగెను; ఫలవీర్యము (రసము)ను పుష్పాషధి రసమును క్షీరముతో సంఘర్షణమంది, దధి రూపమందెను: వేలకొలదిగ సర్వ జీవులును చూర్ణితములు కాగా వాని మేదస్సు నీటితో కూడి వారుణి (మద్యము) అయ్యెను. ఆ వారుణీ గంధ మాఘ్రాణించి దేవ దానవులు మోహితులయిరి; దాని నాస్వాదించి వారు బలశాలురునైరి. అంతట అతివేగముతో, అంతటను అసురులా నాగేంద్రుని కవ్వమగు మందరమును కూడ పట్టుకొనిరి; అందు మేరుపర్వతము మంథయష్టి(కవ్వపు కర్ర)గా నయ్యెను; మందరమును తన భుజములయందు బంధించుకొని ముందు విష్ణువు నిలిచెను; వాసుకి ఫణాలగ్నపాణియగు ఆ కృష్ణుడు పద్మకుముద పుష్పములతోకూడి అతి విస్తరమగు బ్రహ్మ దండమువలె ప్రకాశించెను; అంతట ఆ మథనముచే జలధినుండి మేఘసహస్ర ధ్వని ఉత్పన్న మయ్యెను; సర్పపు ద్వితీయ భాగమున మొదట ఇంద్రుడు - తరువాత క్రమముగా ఆదిత్య మహోత్సాహిరుద్రవసు గుహ్యకాదులును ఉండిరి; ముందు ముఖభాగమున విప్రచిత్తి సముచివృత్ర శంబర ద్విమూర్ధవజ్రదంష్ట్ర సైంహికేయ బలి ప్రముఖులగు బహు దైత్యులుండిరి; దర్పవంతులు బలవంతులు విభూషితులును అగు వీరందరును అంబుధిని మథించిరి; సురాసురులచే మందరముతో ఉదధి మథింపబడుచుండగా మహామేఘధ్వనిని పోలిన మహాఘోషమయ్యెను; అందు మందర మహాద్రిచే చెదర గొట్టబడి వందల వేలకొలదిగ నానా జలచరములు విలయ మందెను; ఆమందర మహీధరము పాతాళ తలవాసులగు వివిధ జలచర ప్రాణులను విలయ మందించెను. అట్లా అద్రి భ్రమింపజేయ బడుచుండ పరస్పర సంఘర్షమున ఆ పర్వతాగ్రము నుండి మహా వృక్షములు తమమీది పక్షులతో కూడ పడుచుండెను.

వాటి రాపిడిచే కలిగిన అగ్నికూడ మిగుల మండుచు తన జ్వాలలతో ఆ మందర పర్వతమును నీలమేఘమును మెరుపులతోవలె ఆవరించెను; వెలికివచ్చిన గజములను సింహములను దహించెను; వివిధ సర్వసత్త్వములును అగ్నిచే విగతప్రాణము లయ్యెను; ఎక్కడ బట్టిన అక్కడనే దహించుచున్న ఆ అగ్నిని అమరశ్రేష్ఠుడగు ఇంద్రుడు అంతటను కురిసిన మేఘ జలముతో చల్లార్చెను; అంతట అటు ఆ పర్వతము నుండి సాగర జలమందు నానారసములును పడెను; మహాద్రుమముల నిర్యాసము(బంక)లును అనేకౌషధీ రసములును అట్టివే. అమృత సమాన వీర్యయుక్తములగు రసప్రస్రవముచే సురలు కాంచనసమాన కాంతియుతులై అమరత్వమును అందిరి; అంతట ఆసముద్రపు క్షీరరూపజలము రసాంతరములతో విమిశ్రమయి ఘృత మేర్పడెను; అంతట (అలసి) కూర్చుండిన బ్రహ్మతో దేవత లిట్లనిరి: బ్రహ్మన్! నారాయణుడు తప్ప మిగిలిన సర్వదైత్యులును దేవోత్తములును అగు మనమందరమును మిగుల అలసిపోతిమి; ఇంతవరకును అమృత ముద్భవించలేదు; సాగరమును మనము మథించుట ఆరంభించి చాల కాలమయినది; అనగా బ్రహ్మ నారాయణ దేవునితో ఇట్లనెను; విష్ణో! నీవే మాకు పరాయణము, (ఉత్తమా శ్రయము) వీరికి బలము కలిగించుము; అనగా-ఎవరు ఈపని పూనియున్నారో- వారికందరకును బలము ఇచ్చుచున్నాను; సర్వులును క్రమశః సముద్రమును క్షోభిల్లజేయుచు మందరమును త్రిప్పుచుండుడు అని నారాయణుడు అనెను.