బ్రహ్మ ప్రాణిజాతాదులను సృజించుట

శ్రీమత్స్యుడు మనువునకు చెప్పెనని సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. వేదతత్త్వ వేత్తలలో శ్రేష్ఠుడు మహాతేజుడగు బ్రహ్మ విష్ణుని నాభియందుండి ఉత్పన్నమయిన ఆ హిరణ్మయ కమలమునందు నిలువబడియుండి భుజములు పెకెత్తినవాడయి ఘోర తపమాశ్రయించెను. అతడు తన తేజోరాశులతో గాఢముగా మండుచున్నాడేమో యనునట్లుండెను. తన కాంతులతో చీకటులను పొగొట్టుచుండెను; సర్వ ధర్మములందును స్థిరుడయినిలిచి అతడు తన తేజః కిరణములతో వేయికిరణములు గల రవివలె ప్రకాశించుచుండెను.

ఇట్లు బ్రహ్మ తపమాచరించుచుండగా అతనియందు అనుగ్రహము కలిగి నారాయణుడు తాను అవ్యయుడు (ఏ వికారములును లేనివాడు) అయినను తాను ఇపుడు సృష్టిప్రవర్తకుడు కావలయును కావున తానుక్షీరార్ణవమున శయనించియున్న పురుషోత్తమ రూపము కాక మరి వేరు రూపములను ధరించి అతని ఎదుటకు వచ్చెను. ఆ రూపములలో నొకటి మహా యశ శ్శాలియు మహా తేజశ్శాలియు అగు యోగాచార్యుని రూపము; రెండవది బ్రాహ్మణ శ్రేష్ఠుడును మహామతిమంతుడును సాంఖ్యా చార్యుడునునగు కపిలుని రూపము. వీరిరువురును పరమునకు అపరమునకు (పరమాత్ముని పరాప్రకృత్య పరా ప్రకృతుల స్వరూపమును ఆ రెండింటి  -  విశేష) భేదమును బాగుగ ఎరిగినవారు, మహాఽఽత్ములు తమ అత్మను లోక కళ్యాణమునకే ఉపయోగించుచు ఉత్కృష్ట మొనర్చుకొనువారు) క్షేత్ర తత్త్వజ్ఞులు (అపర ప్రకృతితో ఏర్పడు పాంచభౌతిక సృష్టి రహస్యమును సంపూర్ణముగ ఎరిగినవారు;) తన తపో మహత్త్వముచే అమిత తేజఃసామర్థ్యములు కలిగియున్న బ్రహ్మకడకు వచ్చిరి. మహర్షి పూజితులగు ఆ ఇరువురును బ్రహ్మతో ఇట్లు పలికిరి: “బ్రహ్మ తాను ఆత్మరూపుడు; దృఢమగు అమరిక గలవాడు, విశాల రూపుడు; జగత్తును ఆశ్రయించియున్న వాడు; సర్వభూతములకును నాయకుడు; త్రైలోక్య పూజితుడు.”

వారు ఇరువురును పలికిన ఈ మాటను బ్రహ్మ వినెను. ఆ వచనములందు ప్రతిపాదింపబడిన యోగమును (సృష్టి ప్రక్రియను) తాను గ్రహించెను. ఆ యోగాచార్య సాంఖ్యాచార్యులు పలికిన శ్రుతి వచనమున తెలుపబడిన విధమున ఈ మూడు లోకములను సృజించెను. అవి పృథివీ - అంతరిక్షం - ద్యౌః - అనునవి. ఈ లోకత్రయముతో పాటు ఋషి (మాంస నేత్రములకు అందని దేశ కాలాతీత విషయములను ఎరుగగల) చతుర్ముఖుడు ‘భూః’ స్వాయంభువుడు’ అను మానస పుత్రుని కూడ ఉత్పాదించెను. (బ్రహ్మ తాను స్వయంభూ కావున అతని పుత్రుడు స్వాయంభువుడు.) ఈమానవ పుత్రుడు తాను పుట్టినంతనే తనపితయగు బ్రహ్మ ఎదుట మౌనియై నిలిచెను. మరియు అతడు “భగవానుడగు ఋషీ! నీకు నేను ఏమి సాహాయ్యము చేయవలయునో తెలుపుము” అని బ్రృహద్రూపుడును (బ్రహ్మ) వేదమూర్తియును (బ్రహ్మ) అజుడును (పుట్టుక లేనివాడు) అవ్యయుడునునగు విధాతతో పలికెను. “నాయనా! స్వాయంభువా! ఈ పరబ్రహ్మ రూపుడగు కపిలుడును పరమ యోగాచార్యుడగు నారాయణుడును నీకేమి చెప్పెదరో దాని నాచరించుము” అని బ్రహ్మ స్వాయంభవునితో ననెను. అంతట బ్రహ్మ వచనము విని మరల అతడు వారిరువురితో “నేను మీమాట విని దానిని ఆచరించదలచి యున్నాను. ఏమి చేయు మందురు” అని కృతాంజలియై పలికెను.

శ్రీభగవానుడగు నారాయణుడు ఇట్లనెను, నాయనా! బ్రహ్మన్ సత్యము, అక్షరము (నశించనిది) అష్టాదశ విధము (మనోబుద్ధ్యహంకారములు పంచ తన్మాత్రలు -  పంచస్థూల భూతములు - పంచేంద్రియములు అను అపరా ప్రకృతిగల పదునెనిమిది భేదములుగా విస్తరిల్లినది) సత్యము, ఋతము (బుద్ధి వ్యాపారముతో ఈ తత్త్వము ఇట్టిదని నిశ్చితరూపమున తెలిసికొనబడునది ఇట్లు మనో - వాక్ - కాయ - వ్యాపారములతో తెలిసికొనుట - నోటితో చెప్పుట -  శారీరకాను స్థానముతో స్వాధీన మొనర్చు కొనుట - అను త్రికరణ సాధ్యతత్త్వము పరమాత్మతత్త్వము అని సారము) అగు పరమపదము (సర్వోన్నత స్థానమందున్నది ప్రణవ శబ్దమునకు వాచ్యమగునదియగు వైష్ణవతత్త్వము) ఏది కలదో - దానిని అనుస్మరించుము (అను స్మరణము -  నిరంతరమైన స్మరణము  -  అనగా ఉపాసనము) అని నారాయణుడు అనెను.

ఈ మాటను విని ఆ స్వాయంభవుడు ఉత్తరదిశకు పోయెను. అతడచ్చటకు పోయి జ్ఞాన తేజముతో బ్రహ్మత్వమందెను.

తరువాత మహా మనస్కుడగు చతుర్ముఖ బ్రహ్మ ‘భువుడు’ అను రెండవ మానస పుత్రుని జనింపజేసెను. అతడును తండ్రియగు పితామహుని (బ్రహ్మదేవుని)తో నేనేమి చేయ వలయునని పలికి అతని సమాజ్ఞతో బ్రహ్మదేవుని ఉపాసించి అతని ఉపదేశానుసారముగా యోగాచార్య సాంఖ్యాచార్యుల కడకు పోయెను. వారి యాదేశముచే పృథివీ స్థానమునందుండి బ్రహ్మాభ్యాసమును (పరబ్రహ్మో పాసనమును) అనుష్ఠించి ఉన్నతినంది తానును పరమమగు వైష్ణవ స్థానమును అందెను.

ఇట్లా రెండవ పుత్రుడును పోగా విభుడు (సర్వవ్యాపి) ప్రభు (సమర్థు)డగు చతుర్ముఖుడు భూర్భువుడను మూడవ మానసపుత్రుని జనింపజేసెను. అతడు సాంఖ్యతత్త్వము నెరిగి ఆ విజ్ఞానమును వృద్ధిపరచి ప్రవర్తింపజేయుటలో నేర్పరి, అతడును ‘గోపతి’ ‘ద్యులోకాధిపతి’ యయి వారు పొందిన పద్ధతిని పొందెను.

ఇట్లు మహాత్ముడు చతుర్ముఖుడు అగు బ్రహ్మకు జనించిన మొదటి సంతానమగు ముగ్గురు పుత్రుల విషయమును తెలుపుటయైనది. ఇట్లు నారాయణ భగవానుడును యతీశ్వరుడగు కపిలుడును చతుర్ముఖుని పుత్ర త్రయమును తమ మార్గమునకు త్రిప్పుకొని ముక్తినందించి తామును తమ ఉపాసనామార్గమున సాధించిన ఉత్తమగతిని పొందిరి.

ఇట్లు యోగాచార్యుడగు నారాయణుడును సాంఖ్యాచార్యుడగు కపిలుడును (ఈ ఇరువురును నారాయణ మూర్తులే) ముక్తులయి వెడలిన తరువాత చతుర్ముఖుడు అనగా పద్మోద్భవ బ్రహ్మ మరల ఘోరతమమగు పరమతపో వ్రతమవలంబించి అనుష్ఠించెను. ప్రభుడగు అతడు అంతటి తపమాచరించుచుండియు ఒంటరితనమున అతని కానందము కలుగలేదు. అందుచే అతడు తన శారీరకమగు పరితృప్తికై శుభరూపురాలగు స్త్రీని తనకు భార్యగా ఉండదగిన ఆమెను సృజించుకొనెను. ఆమె తపమున తేజమున వర్చస్సున నియమ పాలనమున తనకు సమానయనియు తానదివరకు సంకల్పించిన లోకసృష్టియందు సమర్థురాలనియు బ్రహ్మ ఎరిగెను. ఈ మారు అతడు ఆమెతో కూడి అచ్చట ఆపద్మమునందే తపమాచరింపసాగెను. ఇప్పుడతనికి వెనుకటివలె ఒంటరి తనపు భావన లేక తృప్తికలిగెను. ఆమె తోడ్పాటుతోనే అతడు ప్రభుడై మున్ముందు ప్రజాపతులను సాగరాదికమును సృజింపగలిగెను.

ఈ గాయత్రీ మూలతత్త్వము నుండి బ్రహ్మ తాను సృష్టిని సాగించిన విధము. అనంతరము పద్మోద్భవుడు దేవ పూజితయగు త్రిపదా (మూడు అష్టాక్షర పాదములుగల) గాయత్రిని ఉచ్చరించెను. అందుండి సంభూతములగు నాలుగు వేదములను గూడ అనంతర మతడు పలికెను. అంతట అతడు తనవంటి వారేయగు సర్వప్రజాపతులను పుత్రులుగా సృజించెను. వారినుండియే లోకములన్నియు నిష్పన్నములు అయ్యెను. అందునను మొదట అతడు విశ్వమునకు అధిపతియగు ధర్ముడను కుమారుని సృజించెను. ఈతడు మహా తపస్వి, సర్వమంత్రములకును హితకరుడు; పుణ్యకరుడు; పవిత్రుడు.

అనంతరము దక్షుడు మరీచి అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు వసిష్ఠుడు గౌతముడు భృగుడు అంగిరుడు అను పదిమంది ప్రజాపతులను సృజించెను. అందరికంటె కడపట ‘అద్భుతుడు’ అను కుమారుని కూడ సృజించెను. వీరందరును బ్రహ్మమానస పుత్రులగు అది ఋషులు; వీరినే పైతామహ (పితామహుని నుండి మానసులుగా జనించిన) ఋషులందురు. వీరిలో ధర్ముడు పదమూడు గుణములు (లక్షణములు) కలవాడు, అతనిని మహర్షులును ఉపాసింప సాగిరి. దక్షుడు తన కుమార్తెలలో అదితి - దితి  -  దనువు  -  కాల - అనాయువు  -  సింహిక -  ముని - తామ్ర - క్రోధ - సరస - వినత - కద్రూ అను పండ్రెండు మందిని మరీచి ప్రజాపతి పుత్త్రుడగు కశ్యపునకు ఇచ్చి పెండ్లిచేసెను. ఈకశ్యపుడు తపోమూర్తి; ఈదక్షుడు తన కుమార్తెలలో మరికొందరు అగు రోహిణి మొదలగు ఇరువదిఏడు నక్షత్రములను సోమునకు ఇచ్చెను. వీరందరును పవిత్ర మూర్తులు.

సృష్టి ప్రక్రియను బాగుగ ఆలోచించిన బ్రహ్మచే పూర్వము సృష్టింపబడిన లక్ష్మీ  -  మరుత్వతీ -  సంధ్య (సాధ్య) విశ్వేశా - సరస్వతీ అను ఐదుమందిని ఆ బ్రహ్మ శుభరూపుడగు ధర్మునకు ఇచ్చెను. ఈ ఐదుగురును వరిష్టలును - దేవతా శ్రేష్టులును; శబ్ద స్వరూపమును అర్థమును కల ధర్ముని పత్ని (సరస్వతి) సురభియను రూపము ధరించి లోకహితము గోరి బ్రహ్మను సేవించరాగా లోకపూజితుడును లోకసృష్టి హేతువు అగు ప్రక్రియను ఎరిగినవాడు నగు బ్రహ్మ గోజాతి సృష్టి సంకల్పముతో ఆమెతో కూడెను. ఆమెయందు విశాలరూపులు పొగవంటి వారు సంధ్యాకాల మందలి మేఘములవలె ప్రకాశించువారు తీక్ష్ణతేజము గలవారు లోకములనే కాల్చివేయు నట్లున్న వారు కలిగిరి. వారు (రుదంతః -) ఏడ్చుచు (ద్రవంతః  -) పరుగెత్తుచు బ్రహ్మ కడకు పోయిరి. ఈ హేతువుచే వారు (ఈ రెండు పదములందలి ప్రథమాక్షరముల కూర్పుచే) ‘రుద్ర’ అను పదములో వ్యవహరింపబడిరి. వీరు నిరృతి - శంభుడు - అపరాజితుడు - మృగవ్యాధుడు  -  కపర్ది  -  ఖరుడు అహిర్బుధ్న్యుడు - కపాలి - పింగళుడు - సేనాని అని పదునొకండు మంది. ఆ సురభియందే బ్రహ్మవలన యజ్ఞముపై ఆధిపత్యముగల గోవులు ఉత్తమములగు మాయులు శాశ్వత యోగ్యతగల పశువులు మేకలు హంసలు ఉత్తమమగు అమృతము ఉత్తమములగు ఓషధులు జనించెను.

లక్ష్మి ధర్మునివలన కాముని కనెను; సాధ్య అను ఆమె ధర్ముని వలననే సాధ్యులను దేవజాతులను కనెను. సాధ్యుల నామములు - భవుడు ప్రభవుడు ఈశుడు అసురహుడు అరుణుడు ఆరుణి విశ్వావసువు బాలధ్రువుడు హవిష్యుడు వితానుడు విధానుడు శమితుడు వత్సరుడు సర్వాసుర నాశకుడగు భూతి సుపర్వన్ అనువారు మహాకాంతిశాలినియగు సాధ్యకు కుమారులైరి. మనస్ - మంతా - ప్రాణుడు నరుడు - అపానుడు -  వీర్యవాన్  - వినిర్భయుడు - నయుడు - దంశుడు -  నారాయణుడు - వృషుడు  -  ప్రముచుడు  -  అని అగ్ని పురాణమునందు కలదు.

సరస్వతీరూప విశేషమేయగు సురభి ధర్మునే అనుగమించి అతని వలన వసువు లనెడు దేవతా గణములను కనెను వారు: వరుడు అవ్యయుడగు ధ్రువుడు ఈశ్వరుడగు సోముడు ఆయుడు యముడు వాయువు నిరృతి అనువారు ఎనిమిది మంది.

ఈ వసువులు సురభి (సరస్వతి) యందు ధర్ముని వలన కలిగిన సంతతి.

విశ్వేశా (విశ్వా) అను ధర్ముని పత్నియందు ధర్ముని వలన విశ్వేదేవులను దేవగణములు కలిగిరి. వారు మొత్తము పదిమంది, వారు: మహాబాహుడగు దక్షుడు పుష్కరస్వనుడు చాక్షుషుడు మనువు (చాక్షుష మనువు) మధువు మహోరగుడు విశ్వాంతుడు వసువు బాలుడు (బాలుడగు వసువు) మహా యశశ్శాలియగు విష్కంభుడు అత్యధికమగు సత్త్వమును ఓజస్సును కలవాడు భాస్కరుడువలె కాంతిమంతుడునగు రురుడు అనువారు; దేవమాతలలో నొకతెయగు విశ్వేశయను నామె ధర్ముని వలన వీరిని జనింపజేసెను.

మరుత్వతి యను నామెకు ధర్ముని వలన మరుతులను గణదేవతలు కలిగిరి. వారు, అగ్ని, చక్షుడు, రవి, జ్యోతి, సావిత్రుడు, మిత్రుడు, అమరుడు, శరవృష్టి, మహాభుజుడగు సుకర్షుడు, విరాట్, వాచ్, విశ్వుడు, వసుమతి, అశ్వవంతుడు, చిత్ర రశ్మి -  నిషధనుడు, హూయంతుడు, బాడబుడు, చారిత్రుడు, మదపన్నగుడు, బ్రహద్రూపుడగు బృహత్, పూతనానుగుడు అనువారు. ఇక కశ్యపుని భార్యలలో అదితియందు ఇంద్రుడు విష్ణువు భగుడు త్వష్ట వరుణుడు ఆర్యమన్ రవి పూషన్ మిత్రుడు ధనదుడు ధాత పర్జన్యుడు అను ద్వాదశాదిత్యులు కలిగిరి. వీరిలో (ద్వాదశాదిత్యాధిష్ఠాతయగు ) ఆదిత్యునకు అశ్వినులు నాసత్యులు అని ప్రసిద్ధిగల ఇద్దరు శ్రేష్ఠులగు సుతులు కలిగిరి. వారు తపములచే సద్గుణములచే గొప్పవారును స్వర్గమునకు పూజ్యులును; దనువునందు దానవులు దితియందు దైత్యులు కాలయందు కాలకేయులను అసురులు రాక్షసులు అనాయుషయందు మహాబలురగు వ్యాధులు సింహికయందు (ప్రాణులను పట్టి బాధించు) గ్రహములు ముని అనునామె యందు గంధర్వులు తామ్రయందప్సరసలు క్రోధయందు భూత పిశాచములు యక్షరాక్షసులు సురసయందు చతుష్పాత్రాపణులు గోజాతులు వినతయందు గరుడాది పక్షులు కద్రువ యందు పర్వతములు నాగులు కలిగిరి. ఇట్లు సర్వలోకములు కలిగి పరస్పర మేళనముచే వృద్ధినందెను.

మనురాజా! ఆది కాలమున మహాత్ముడగు బ్రహ్మకు కలిగిన పౌష్కర (పుష్కరము=జలము; పద్మము; దాని నుండి కలిగిన) ప్రాదుర్భావ స్వరూపము ఇటువంటిది; మత్స్యుడు మనువునకు చెప్పినదిగా ద్వైపాయనునిచే చెప్పబడినదానిని నేను (సూతుడు) మీకు (ఋషులకు) చెప్పితిని. పరమర్షుల స్తుతులనందుకొను ప్రభుని -  పురాణ పురుషుని - గూర్చి అనుపూర్వితో (క్రమముగా) మీకు తెలుపబడినది; అగ్ర్యము (మొదటిది -  ఉత్తమమునగు పురాణమును వైరాగ్య దృష్టితో ఎల్లప్పుడును విశేషించి పర్వదినములందును విను నరుడు ఇహమున ఉత్తమములగు లోకసుఖములను పొంది పరలోకమున స్వర్గసుఖమును పొందును. చక్షువుతో దర్శించి, మనస్సుతో ఆలోచించి, వాక్కుతో స్తుతించి, కాయముతో అర్చించి నాలుగు విధములుగ కృష్ణుని ఆరాధించి అనుగ్రహింప జేసికొను వానియందు కృష్ణుడనుగ్రహము చూపును. రాజు రాజ్యవృద్ధిని ధనహీనుడు ధనమును అల్పాయుష్కుడధికాయువును సుతకాముడు సుతులను పొందును. విష్ణు భక్తుడు యజ్ఞములను వేదములను కామములను వివిధ తపస్సులను వీటిని యథావిధిగా అనుష్టించుటచే కలుగు వివిధ పుణ్యమును పొందును. పలుమాటలేల? ఏది ఏది కొంచెమో గొప్పయో కోరునో అది ఎల్ల ఆ లోకేశ్వరుని వలన లభించును. మహాభాగా! మనూ! వ్యాసప్రోక్త శ్రుతి (పురాణ సంహిత)ని దర్శించిన (నిరూపించిన) దాని ననుసరించి నీకు మహాత్ముడగు చతుర్ముఖుని పౌష్కర ప్రాదుర్భావమును కీర్తించితిని. ఎవడైన ఇతర (వాఙ్మయ) మంతయు విడిచియు హరివలన కలిగిన ఈ పౌష్కర ప్రాదుర్భావ మాత్రమును అధ్యయనము చేసినను వాని కశుభములు సంభవింపకుండును; శుభములు కలుగును.