గోసహస్ర ప్రదాన విధానము

శ్రీమత్స్యుడు మనువుతో ఇట్లు చెప్పెను. ఇపుడిక క్రమములో రావలసిన గోసహస్ర ప్రదానము అను సర్వపాపహరమును, శుభకరమునగుమహోత్తమ మహాదానమును తెలిపెదను; యుగాది మన్వంతరాదులవంటి పుణ్యకర శుభతిథియందు వయోవ్రతుడై (క్షీరమాత్రా హారుడై) త్రిరాత్రముకాని ఏకరాత్రముకాని ఉండవలెను; తరువాత తులా పురుష దానమందువలె లోకపాల ఆవాహనము జరుపవలెను; అట్లే పుణ్యాహవాచన హోమములు జరుపవలెను; ఋత్విజులను మండపమును సంభారములను వస్త్రభూషణాదికమును సమకూర్చుకొనవలెను; వేదికా మధ్యమందు లవణసంయుక్తమగు వృక్షముననే (దేవతామూర్తికివలె) అధివాసనము జరుపవలెను; దానమునకై నిర్ణయించుకొన్న వేయి గోవులనుండి పదింటిని వేరుగ తీసికొనుచు మిగిలిన వానిని బయట నిలువబెట్టవలయును. వీనిని వస్త్రమాల్య విలేపన సువర్ణ శృంగాభరణములతో, వెండితో చేసిన కాలిగిట్టలతో అలంకరించి లోపల ప్రవేశింపజేసి, వానిని వస్త్రమాల్యములతో పూజించ వలెను, బంగరు చిరుగంటలు పాలు పిదుకు కంచు పాత్రలు బంగరు తిలకములు బంగరు మొగపు పట్టెలు అలంకరించి పట్టు వస్త్రములతో వానిని కప్పి మాల్యములు చుట్టి గంధములు పూసి కనకరత్నమయ శృంగములు అలంకరించి చామరపు కుచ్చులు కొమ్ముల నడుమకట్టి అలంకరించవలయును; పాదుకలు పాదరక్షలు ఛత్రములు పాత్రలు ఆసనములు ఈ పదింటిలో ప్రతియొక దానితో పాటు వేరువేరుగ ఉంచవలయును; వీని నడుమ కాంచన నందికేశ్వరుడు ఉండవలెను; అతనిని నూరు పలములకు - మూడు వేల పలములకు నడుమనుండు తూకపు బంగారుతో చేయించవలెను; మిగిలినవానిలో మరి నూరు గోవులకును నడుమ ఇందు పదియవ వంతు తూకముతో ఇది అంతయు చేయించవలెను; ఈ నందిని పట్టుబట్టలతో చుట్టి నానా భరణములతో భూషించి పూలతో చెరకు గడలతో పలములతో, ద్రోణ (తూమెడు) పరిమాణమగు ఉప్పుకల పాత్రయందు పై భాగమున (నూతన వస్త్రముపై) ఉంచవలెను. శుభసమయమున (ముహూర్తమునందు) యజమానుడు మంగళవాద్య గీతవాద్య ధ్వనుల నడుమ వేదపారంగతులగు బ్రాహ్మణ శ్రేష్ఠులచేత సరౌషధీ జలములతో స్నానము చేయించబడి దోసిట పూవులు పట్టుకొని ఈమంత్రము నుచ్చరించవలెను.

“విశ్వమూర్తులును విశ్వమాతలును లోకాధివాసినులు (అన్ని లోక భాగములను అధిష్ఠించి యుండువారును) నగు రోహిణీ రూపులగు ధేనువులకు నమస్సు; ఇరువదియొక లోకములును బ్రహ్మాది దేవతలును గోవుల అవయవము లందుండును; ఇటువంటి రోహిణీ మాతలు మమ్ము రక్షింతురుగాక! గోవులు నాకు ముందుండుగాక! గోవులు నావెనుక నుండు గాక! గోవులు నా శిరమందుండు గాక! నేను గోవుల నడుమనే వసింతును (వసించుచున్నాను.) వృషరూపముతో ఉన్న గోవా! నీవు సనాతన (శాశ్వత) ధర్మమవు! కావున ఇటువంటి నీవు అష్టమూర్తి (పంచ భూతములు రవిచంద్రులు యజమానుడు నను ఎనిమిది రూపులతో నున్న) శివునకు ఆశ్రయమయి (వృషభ రూపమున వాహనమవయి) యున్నావు; కావున సనాతనా! నన్ను రక్షించుము.”

ఇట్లు ఆమంత్రించిన తరువాత ఆచార్యునకు (గురునకు  -  ప్రధాన ఋత్విజునకు) నంది కేశ్వరుని సర్వోపకరణములను ఒక గోవును ఈయవలెను. పది గోవులలోను ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఋత్విజునకు ఈయవలయును; మిగిలిన వానిలో ఒక్కొక్క బ్రాహ్మణునకు నూరేసియో, ఏఐదేసియో, ఇరువదేసియో, ఐదేసియో, ఆచార్యుని అనుమతితో ఈయవలెను. ఒక గోవును అనేకులకు కలిపి ఈయరాదు; అది బహు దోషకరము; ఒకనికే అనేక గోవులను ఈయవచ్చును; అది ఆరోగ్యమును శ్రీని వృద్ధిపరచును, ఇట్లు గోసహస్ర దానమయిన తరువాత దాత ఒకనాడం తయు వయోవ్రతుడై (క్షీరమాత్రాహారుడై) యుండవలయును.