మత్స్య మహా పురాణము
భృగు మహర్షి చేసిన శివ స్తుతి
కారణ కారణుడవును భూతనాధుడవును దివ్యరూపుడవునగు నిన్ను సమస్కరించినంతనే నేను సంసారమును దాటితిని; ఐనను ప్రభూ! భువనపతీ! ఏదో కొంచెము మనవి చేయుదును; వేయినోళ్లు గల వాసుకికూడ ఎన్నటికిని నీ గుణ సమూహమును వర్ణించ జాలడనిన మానుషు డెవ్వడు అది చేయగలడు? అయినను భువనపతీ! శంకరా! భక్తితో నిన్ను స్తుతించు తలపు నన్ను వాగునట్లు చేయుచున్నది. మహేశా! భగవన్! నేను పలుకు మాటల (లోని దోషముల)ను క్షమించుము. నీ చరణములయందు నిరతుడ (అత్యంతాసక్తుడ నగు నన్ను అగ్రహించుము; దేవా! నీవే సృష్టియందు రజో గుణముగా స్థితియందు సత్యముగా ప్రళయమందు తమముగా అగుదువు; భువనపతీ! భువనేశ్వరా! నీవుతప్ప మరి దైవతము ఏదియు లేనేలేదు. యమ నియమములు (యోగాంగములు) యజ్ఞములు దానములు వేదాభ్యాసములు ధారణాది యోగములుకాని ఉచ్ఛిష్ట విద్యా, రస విద్యా, రసాయన విద్యా, ఖడ్గ విద్యా, జన విద్యా, పాదుకా, విద్యా, వివర-(సురంగా-నిధి) విద్యా సిద్ధికాని ఇందేదియు నీ భక్తికి పదునారవ పాలునకు కూడ సమముకాదు; భవ (శివ) వ్రతులగు వారికి దేహములందు ఆ దేహికిగల నీ చిహ్నము పుట్టుకతోనే ప్రకటమయి కనబడును; దేవా! కొంటెతనముతో (నిన్ను పరీక్షించు తలంపుతో) నమస్కరించిన వానికే యైనను నీవు ఐశ్వర్యము కోరినవారికి అది ఇత్తువు. నాథా! జీవులకు సంసార బంధమును ఛేదించి (నశింపజేసి) వారికి ముక్తి నీయదలచి నీవందులకు సాధనముగా నీయందు భక్తినికూడ నీవే సృష్టించితివి. పరదార పరధనములందు ఆసక్తిగల వాడను పరులవలన పరాభవమునంది దుఃఖ శోకములచే సంతాప మందినవాడను ధనాధ్యాశచే పరుల ముఖముల వంగిచూచుట కలవాటుపడిన వాడను అగు నన్ను పరమేశ్వరా! రక్షించుము; మిథ్యాభిమానముతో దగ్ధుడను క్షణభంగురమగు విభవముల నంది మిడిసి పడువాడను క్రూరుడను కుపథా (చెడు త్రోవలకు) అభిముఖుడను పతితుడను అగు నన్ను దేవేశా! రక్షించుము, దీనులగు ద్విజ సమూహముల (హృదయముల) యందు మాకెవరైన ధనమీయవలయుననియు దీనులగు బంధుజనుల (హృదయముల) యందు మమ్ము ధనికులగు మా బంధు జనులు పోషించ వల యుననియు ఆశ ఉండుట దూషితము (తప్పిదము) కాదు; కాని శంకరా! ఋషినగు నన్నుకూడ మూఢునిగా జేసి ఆశ నన్ను తనకు వశునిగాచేసికొని వెక్కిరించుచున్నదే! ఇది బాగుగలేదు; శీఘ్రముగా ఆశను హరించుము; సదా నాహృదయమునందు నిలిచియుండు లక్ష్మిని(ఉన్నదే చాలునను హృదయాను భూతిని) ఇమ్ము. మదమోహ పాశములను ఛేదించుము; మహాదేవా! నన్ను సంసారము నుండి దాటించుము; కరుణాభ్యుదయమను ఈదివ్య స్తోత్రము సర్వసిద్ధి ప్రదము; దీనిని భక్తితో పఠించిన వాని విషయమున శివుడు భృగుని విషయమునందు వలెనే సంతుష్టుడగును. ఇది విని ఈశ్వరుడు “విప్రా! నేను నీ విషయమున సంతుష్టుడనయితిని; ఈప్సిత వరము ప్రార్థించుము అని ఉమతో కూడియున్న ఆ సోమదేవుడు భృగునకు వరము ఈయ సిద్ధపడెను.
అంతట భృగుడు “దేవేశా! నీవు నాయందు సంతుష్టుడవయినచో నాకు వరమీయ దగినచో నేను రుద్రతత్త్వమెరిగిన వాడను కావలయును అను నాకోరిక సంపన్నమగు (నెరవేరు) నట్లు వరమిమ్మనెను. ఈశ్వరుడు “విప్రేంద్రా! అట్లేయగుగాక! మరియు నీకికమీదట కోపము ఉండదు; నీ కుమారునకును నీకును ఏకాభిప్రాయముండదు అనెను అది మొదలు బ్రహ్మేంద్రులును దేవాసుర కిన్నరాదులును మహేశ్వరుడు భృగుని విషయమున తుష్టుడైన ఈ భృగు తీర్థమును సేవించుచున్నారు; అట ఆ దేవుని దర్శించినంతనే పాపముక్తియగును; తమ ఇచ్ఛతోనే కాని ఇచ్చలేక అనగా తెలియకగాని, అప్రయత్నముగా కాని అచట మరణించిన ప్రాణులకు పరమ రహస్య-ఉత్తమమగు సుగతి కలుగును, ఇది నిస్సంశయము; ఈ క్షేత్రము మహావిస్తరము; సర్వ పాప ప్రణాశనకరము; ఇచట మరణించినవారికి పునరావృత్తి లేని ద్యులోక ప్రాప్తియగును; ఇచట సూర్యగ్రహణ కాలమున పాదరక్షలు, ఛత్రము, అన్నము, కాంచనము యథాశక్తిగ దాన మొనర్చినను అది అక్షయమగును, చంద్ర సూర్యగ్రహణకాలము లందు అమరకంటకమున చేసిన దానాదికమెంత ఫలప్రదమో ఇచట చేసినది కూడ అంత ఫలప్రద మగును; ఇతరత్ర చేసిన సర్వదాన తపో యజ్ఞాది ఫలములయిన ఒకనాటికి క్షీణించ వచ్చును కాని భృగుతీర్థమున చేసినవి ఏవియు ఎన్నటికిని క్షీణించవు. సాక్షాత్ శంభుడు భృగుని ఉగ్ర తపముతో తుష్టుడైన ఈ భృగు తీర్థము త్రిలోక విఖ్యాతము, ఈ విషయమును స్వయముగా మహాదేవుడే దేవితో పలికినాడు, ఇది అంతగా అనుత్తమము. అయినను విష్ణువు మాయా విమోహితులగు వారు మాత్రము దీనిమహత్త్వ మెరుగజాలరు. నర్మదానది తీరమందు ఉన్న ఈ భృగు తీర్థ మాహాత్మ్య మును వినినవారు కూడ సర్వపాపముక్తులై రుద్రలోక మేగుదురు.
తరువాత గౌతమేశ్వర తీర్థము; అందు స్నానముచేసి ఆనాడచట ఉపవసించినవారు బంగరు విమానముపై బ్రహ్మలోక ప్రాప్తి నందుదురు; తరువాత నర్మదయందుండినదగు గౌత పాపతీర్ధము; దీనిని ధర్మరూపుడగు వృషభమే ఏర్పరచెను; ఈ తీర్థము తనయందు స్నానమాడిన వారి బ్రహ్మహత్యా దోషమును కూడ పోగొట్టును; ఇచ్చట ప్రాణత్యాగ మొనర్చువాడు చతుర్భుజుడును త్రినేత్రుడునునై రుద్ర సమాన బలుడగును; పదివేల కల్పములు సంపూర్ణముగా శివతుల్య పరాక్రముడై శివలోక సుఖమందును; చాలాకాలము తరువాత మరల భూలోకమునకు వచ్చినను పృథివి కంతటికి ఏకైక చక్రవర్తియగును; తరువాత ఉత్తమమగు ఐరండీ తీర్థము; ఇచ్చట స్నానమాత్రముననే ప్రయాగయందువలె మహాఫలము అబ్బును; భాద్రపద శుక్లాష్టమి నాడిచట స్నానమాడి ఒక అహోరాత్రము ఉపవసించినవారు యమదూతల వలని బాధలందక రుద్రలోకమేగుదురు, తరువాత సాక్షాత్తుగ విష్ణునకే సిద్ది కలిగించినదియు సర్వపాప ప్రణాశనము నగు హిరణ్య ద్వీపమను తీర్థము; ఇందు స్నానమాడిన వారు ధనవంతులును, రూపవంతులును నగుదురు; తరువాత గొప్పదియగు కనఖల తీర్థము. ఇందు గరుడుడు తపమొనరించెను. యోగినీశక్తి ఇందుండునని త్రిలోక ప్రసిద్ధమిది. ఆమె యోగులతో కలిసి విహరించును; శివునితో కలిసి నృత్యము చేయును; ఇందు స్నానమాడినవారు రుద్రలోక ప్రాప్తులగుదురు; తరువాత హంస తీర్థము; అందు హంసలు పాప వినిర్ముక్తములై ఊర్ధ్వలోక మేగెను; తరువాత వరాహ తీర్థము; అందు విష్ణువు కూడ సిద్ధినందెను; ఇచట శివుడు వరాహరూపుడై పూజింపబడును, ద్వాదశినాడు ఇందు స్నానమాడినవారు నరకమును చూడరు; విష్ణులోకమునకు ఏగుదురు; తరువాత అనుత్తమమగు చంద్రతీర్థము, ఇందు పూర్ణిమనాడు స్నానమాడుట అధిక ఫలప్రదము. దానిచే చంద్రలోక వాసమును దానిచే మహాసుఖ ప్రాప్తియు అగును.
తరువాత నర్మదాదక్షిణ తీరమందలి కన్యాతీర్ధము; ఇది చాల ప్రసిద్ధము; శుక్లపక్ష తృతీయ నాడు ఇందు స్నానమాడి ఈశ్వరునికి నమస్కరించి బలి (నివేదనము) ఇచ్చినచో రుద్రుడు ప్రసన్నుడగును; అంతరిక్షమునందు హరిత (ఆకుపచ్చని) కాంతితో చంద్రుని నగరము కనబడు చుండగా ఇంద్ర ధ్వజోత్సవము ముగిసిన తరువాత మాసములో (రాత్రివేళ) నగరములందలి జనము నిదురించు సమయమున నర్మద తన జల వేగముతో (తన తీరములందలి) వృక్షములను తేల్చివేయు కాలములో ఈ స్థానమునందు నివసించవలయును. ఇది అధిక ఫలప్రదము; అని విష్ణువు స్వయముగా శివునితో పలికెను; తరువాత ద్వీపేశ్వర తీర్థము; అందు స్నానము చేసినచో బహు సువర్ణము లభించును; (అధిక సంపద కలుగును. ) తరువాత రుద్రకన్యా (ఉపనది) సంగమ తీర్థము; అందు స్నానమాడిన మాత్రమున దేవీస్థాన ప్రాప్తుడగును; తరువాత మహోత్తమ మగు దేవతీర్థము; దానియందు స్నానమాడిన వారు దేవతలతో కూడి సుఖింతురు; తరువాత అనుత్తమమగు శిఖినీర్థము; అందు చేసిన దానములు ఇతరత్ర చేసిన అదే దానపు ఫలమునకు కోటిరెట్లుగ ఫలమునిచ్చును; కృష్ణ పక్షమున అమావాస్యనాడు అచ్చట స్నానమాడి బ్రాహ్మణుని ఒక్కని భుజింపజేసినను కోటిమంది బ్రాహ్మణులను భుజింపజేసినట్లు అగును; రాజేంద్రా! ధర్మజా! మొదట చెప్పిన భృగు తీర్థమునందు కోటితీర్థముల మహిమమున్నది; దాని మహిమము ఎట్టిదన ఇది భృగుతీర్థమని తెలిసికాని తెలియకకాని చిత్తములో కోరికలుండికాని లేకకాని ఇందు స్నానము చేసినంత మాత్రముననే మానవులకు సహస్రాశ్వమేధ యాగములు చేసినందున కలుగునంత ఫలము కలుగును; వారు దేవతలతో కూడి వారితోపాటుగ సుఖింతురు; ఏలయన ముని పుంగవుడగు భృగుడే మహాసిద్ధి పొందిన ప్రదేశమది; అందు మహాత్ముడగు శంకరుడు అతనికి సాక్షాత్కరించి తన అవతారముచూపెను.