మత్స్య మహా పురాణము
సారస్వత వ్రతము
మనువు మత్స్యనారాయణునితో ఇట్లనెను, సరస్వతికి సంబంధించిన ఏవ్రతముచేత జ్ఞానము సౌభాగ్యము విద్యలయందు అత్యంత కౌశలము దంపతుల నడుమను బంధుజనము లోను అభేద భావము విపులమగు ఆయుష్యము లభించునో దానిని నాకు తెలుపుము. అని ఇట్లడుగగా నారాయణుడిట్లనెను, రాజా! నీవు చక్కగా అడిగితివి. సారస్వత వ్రతమును తెలిపెదను. దీనిని కీర్తించినంత మాత్రముననే సరస్వతి సంతుష్టయగును.
ఈ వ్రతమును చేయదలచిన భక్తుడు ఆ దినారంభమున యథా శాస్త్ర విధానమున ఆరంభించి పూజ చేయవలయును. లేదా ఆదిత్యవారమున గ్రహ తారాబల యుక్త దినమున బ్రాహ్మణులచే పాయసమును భుజింపజేసి వారిచేత స్వస్తి పుణ్యాహవచనము జరిపించవలెను. వారికి తెల్లని వస్త్రములను బంగారును ఈయవలెను. తరువాత భక్తితో తెల్లని పూవులతో సుగంధపు పూతలతో గాయత్రిని పూజించవలెను.
“దేవీ! లోకపితామహుడు భగవానుడు అగు బ్రహ్మ సదా నిన్ను విడిచి యుండడు. అట్టి నీవు నాకు వరప్రదురాలవుకమ్ము. సర్వ వేదశాస్త్రములును నృత్తగీతాది విద్యలును నీ అధీనములు. అట్టి నీకృపవలన నాకును వాటి యందు సిద్ధులు కలుగుగాక! సరస్వతీ! లక్ష్మీ-మేధా-పరా (వార్తత్వము) పుష్టి-గౌరి- తుష్టి-ప్రభా-మతి-అను ఈ ఎనిమిది శరీరములతో కూడిన నీవు నన్ను రక్షించుము” అని దేవిని ప్రార్థించవలయును. వీణాక్షమాలా కమండలు పుస్తక ధారిణి యగు గాయత్రిని తెల్లని పూవులతో తెల్లని అక్షతలతో పూజించవలెను. సంప్రదాయ ధర్మమును ఎరిగి యజమానుడు ప్రతిపక్షమున పంచమి నాడు సాయం ప్రాతః కాలములందు దేవిని పూజించి సువాసినిని పూజించి మౌన వ్రతము పాటించి (హవిష్యమును) భుజించవలయును. కుంచెడు బియ్యమును ఘృతపాత్రమును పాలను బంగారమును ఆ ముత్తైదువకు “గాయత్రీ ప్రీయతామ్” అను మంత్రముతో దానమీయవలెను. ఈ వ్రత దినము నందు సంధ్యాకాలము నందు మౌన వ్రతమును పాటించవలయును. ఇట్లు పడుమూడు మాసములు జరుపవలెను. ఈ వ్రతకాలములో నియత కాలములందు నియత భోజనము తప్ప నడుమ ఏ ఆహారమును భుజింపరాదు. ఇట్లు వ్రతము ముగిసిన తరువాత తెల్లని బియ్యముతో నిండిన పాత్రలును వస్త్రముల జతను తెల్లని కంటి ఆవరణ వస్త్రముతో కూడ చక్కని గోవును దేవిని పూజించిన మండవపు చాందినీనుంచి తీసిన ముక్కను చందనమును అంగవస్త్రముల జతను పెరుగన్నముతో నిండిన గరిగ పాత్రనుకూడ దానముగ ఈయవలయును. తరువాత తనకు ఉపదేష్టయగు గురుని భక్తితో వస్త్రమాల్య సుగంధ ద్రవ్యములతో పూజించవలయును. ఏ విషయమునను ధనమునకు లోభము చూపరాదు.
ఈ విధానము ననుసరించి సారస్వత వ్రతము నాచరించువాడు విద్యావంతుడును ధనవంతుడును మధురమగు కంఠము కలవాడునునగును. సరస్వతీ ప్రసాదమున బ్రహ్మ లోకమున సుఖించును. దీనిని స్త్రీ ఆచరించినను ఈఫలమును పొందును. ముప్పదివేల కల్పము లంతకాలము బ్రహ్మలోకమున వసించును. ఈ సారస్వత వ్రతమును వినినను చదివినను అట్టివారు కూడ ముప్పదివేల కల్పముల కాలము విద్యాధర లోకమున వసింతురు.