మత్స్య మహా పురాణము
హిరణ్యకశిపుని చావును సూచించు ఉత్పాతములు
ఆ హిరణ్యకశిపుడును తన తేజస్సుతో మిగులదహించువాడువలె క్రోధముతో ప్రజ్జ్వలించ సాగెను. దానితో జగత్తు తమస్సుతో నిండెను. ఆవహము ప్రవహము వివహము ఉదావహము పరావహము, సంవహము, పరివహము అను శ్రీమంతములును, మహాబల పరాక్రమములును అగు గగనసంచారులగు ఈ సప్త వాయువులును ఉత్పాత భయమును సూచించుచు క్షోభిల్లెను. సర్వలోక క్షయ(ప్రళయ) కాలమున ప్రాదుర్భవించు గ్రహములు గగనమున తమ ఇచ్చకు వచ్చినట్లు తిరుగుచు కనబడెను. శత్రు నాశకుడు తారాపతి నిశాకరుడు నగు చంద్రుడు తన సహజ మార్గమును విడిచి గ్రహ నక్షత్రములతో కూడి మరియొక మార్గమున సంచరింపసాగెను. పగలు సూర్య భగవానుడు వివర్ణుడయ్యెను. అంతరిక్షమున నల్లని పెద్ద మొండెము కనబడెను. అగ్ని భగవానుడు భూమిపై ఉండియు అచట జ్వాలలతో వెలుగక, మాటిమాటికి ఆకాశమున మండుచు కనబడెను. అంతరిక్షమున పొగ వన్నెతో వెలుగు సప్త సూర్యులు ఉదయించి కనబడిరి. అంతరిక్షమున వెలుగు చంద్రుని కొమ్ములపై (పూర్ణిమకాని తిథులందు) గ్రహములు - ఎడమ కొమ్మున శుక్రుడు, కుడి కొమ్మున బృహస్పతి ఎడమను శనియు కుడి కొమ్మున అంగారకుడును ఈ ఇద్దరు మండు అగ్నివలె నుండి కనబడిరి. యుగాంతమున మాత్రమే ఇట్లు కనబడవలసిన అ గ్రహములు మెల్లగ ఇట్లు చంద్ర శృంగములపై నిలిచి కనబడెను. గ్రహములతో నక్షత్రములతో కూడి రోహిణీ సహితుడై లోకపు చీకట్లు పోగొట్టవలసిన చంద్రుడు రోహిణిని మెచ్చక ఆమెకు దూరమయ్యెను. ఇది చరాచర లోకనాశ సూచకము. చంద్రుని రాహువు (పూర్ణిమ కాకయే) మ్రింగెను. ఉల్కలు చంద్రునిక్రమ్మెను. అవి ప్రజ్వలించుచు తమ ఇచ్చ వచ్చిన కక్ష్యలలో చంద్రుని ఆశ్రయించి తిరుగసాగెను. దేవతలకు దేవుడు (రాజు) అగు ఇంద్రుడు నెత్తుటి వాన కురియించెను. గగనము నుండి మహాధ్వనులతో మెరపుల వంటి ఉల్కలు పడెను. వృక్షములు అకాలమందు పూచెను; ఫలించెను. (పండ్లు పండని) తీగలు ఫలించెను. ఇవన్నియు ఇట్లు దైత్య నాశమును సూచించెను. పండ్లనుండి పండ్లు పూలనుండి పూలు వచ్చుచుండెను. సర్వ దేవతా ప్రతిమలును కన్నులు తెరచును, మూయును, నవ్వును, ఏడ్చును, గంభీరముగా అరచును, పొగలు గ్రక్కుచు మండును - ఇట్లవి మహాభయమును సూచించసాగెను. గ్రామములందుండు మృగపక్షులు అరణ్య మృగపక్షులతో కలిసి తిరుగసాగెను. యుద్ధ సూచకములయి మృగములు భయంకర ధ్వనులు చేసెను. నదులు మలిన జలములతో ఎదురు ప్రవహించసాగెను. దిక్కులును నెత్తుటితో ధూళితో మలినములై కాంతిహీనము లయ్యెను. పూజార్హములగు వనస్పతులు (పూయక కాయుచెట్లు) వానస్పత్యములు (పూచి కాయుచెట్లు) పూజల నందుకొనకుండెను. (పూజించపోయిన వేళకు) అవి వాయువేగ వశమున వంగుటయో, విరుగుటయో నమస్కరించుచున్నట్లు నేలకు వాలుటయో జరుగుచుండెను. ఏ ప్రాణులకును నీడయే కానరాక, రవి మధ్యాహ్నము దాటి అపరాహ్ణమును ప్రవేశించు సమయమున హిరణ్యకశిపుని భవనము మీదను వాని భాండాగార ఆయుధాగారములందును తేనెతుట్టెలు పట్టెను. ఇట్లు ఇవియు ఇంకను అనేకములును దైత్యనాశమును దేవ జయమును సూచించునవియగు ఘోరోత్పాతములు కాల నిర్మితములై కనబడెను. మహాత్ముడగు దైత్యేంద్రుడు కోపముతో భూమిని కంపింప జేయుచుండ నాలుగు, ఐదు, ఏడు తలలు కల నాగులును వాసుకి తక్షకుడు కర్కోటక ధనంజయులు ఏలాముఖకాళీయ మహాపద్ములును విషజ్వాలలతో కలత నొందిన తమ నోళ్లనుండి అగ్నిని క్రక్కసాగిరి. సహస్ర శిరస్కుడు బంగరు తాటిచెట్టు ధ్వజముగాకలవాడు, మహాసమర్థులు మహాభాగుడు అనంతుడు అగు శేషుడు దేనికిని ఎన్నడును కంపింపనివాడుకూడ కంపించెను. నీటినడుమను సంచరించుచు ప్రకాశించు అన్ని ప్రాణులును అపుడా దైత్యేంద్ర కోపకంపితము లయ్యెను. పాతాళ తల సంచారులయి మేలగు తేజస్సుగల పాతాళమందలి నాగములును అవి ఎంతగా కంపించచేయుటకు అలవికానివయ్యును కంపితములుగా చేయబడెను.
హిరణ్యకశిపు దైత్యుడు అపుడు కోపముతో పెదవుల పుటమును కొరుకుచు తన అన్నయు యజ్ఞ వరాహుని చేతిలో మరణించువాడునగు హిరణ్యాక్షుడువలె భూమిని స్పృశించుచునే భూమినేకాక భాగీరథీ కౌశికీసరయూ యమునా కావేరీ కృష్ణవేణీ తుంగవేణీ గోదావరీ చర్మణ్వతీ సింధు నదులను మేకలమున పుట్టిన శుభ జలముగల నర్మదను మణివంటి నీరుగల శోణమును గోవుల మందలతో నిండిన గోమతిని పూర్ణా సరస్వతీ మహీకాలమహీ నదులను పూవులతో కూడి ప్రవహించు సరయూనదిని సర్వ రత్నములతో ప్రకాశించు జంబూ ద్వీపమును బంగరు గనులతో అలంకృతమగు సువర్ణ పుటక దేశమును మహానదములతో శైల వనములతో శోభించు లౌహిత్య దేశమును ఋషులకు వీరులకు గనియగు దేశమును కోశకారుల పట్టణమును మగధ మహాగ్రామాం (రాష్ట్రాం) ధ్రాంగకురు సాళ్వ విదేహ మాళవ కాశి కోసల దేశములను కూడ తాకినట్లయి ఇన్నియు కంపించెను. కైలాస శిఖరాకారమును విశ్వకర్మచే స్వయముగా నిర్మితమును అగు వైనతేయ (గరుడ) భవనమును ఎర్రని నీరు కలిగి మహాభంకరమగు లౌహిత్యమను సముద్రమును శతయోజనోన్నతమును బంగరు వేదికలు కలదియు మేఘ పంక్తులకు ఆశ్రయమును సూర్యునివలె ప్రకాశించు బంగరు సాలతాలతమాల పుష్పిత కర్ణికార వృక్షములతో ఆలంకృతమునగు ఉదయ పర్వతమును గైరిక ధాతువులతో అలంకృతమగు అయోముఖమను (పైభాగమునందు ఇనుప ధాతు శిలలుకల) పర్వతమును చీకటిచెట్ల అడవుల వాసనలతో నిండిన శుభమగు మలయ పర్వతమును సురాష్ట్ర బాహ్లికాభీర పాండ్య కళింగ వంగ భోజ తామ్రలిప్త పుండ్ర పౌండ్ర వానశూల దేశములును దేవతలు అప్సరసలును ఆ దైత్యునిచే కంపింపజేయబడెను. పూర్వమే ఎల్లరకు చేరరానిదిగా నిర్మించబడి నదియు సిద్ధచారణ సంఘములతో వ్యాప్తమును మనోరమమును అగు అగస్త్య భవనమును విచిత్ర నానాపక్షులు పూచిన పెద్ద చెట్లు స్వర్ణమయ శిఖరములు అప్సరోగణ సంగీత నాదములు కలిగి లక్ష్మీ (శోభా) యుక్తమయి చూచుటకింపగు పుష్పితకమను పర్వతమును సముద్రముచే చీల్చుకొని పైకి లేచినట్లుండి చంద్రసూర్యులకు విశ్రామ స్థానమై చంద్రసూర్య కిరణ సదృశములగు మహాశృంగములతో ఆకాశమును ఒరయుచున్నదో అనునట్లుండుచు సముద్రజలముతో చుట్టబడి శత యోజనోన్నతమయి ఋషులు ప్రసరింపజేయు మెరుపుల గుములుగల వైద్యుతమను మహాపర్వతమును శ్రీమంతమగు వృషభ పర్వతమును శుభమగు అగస్త్య గృహముగలదై విశాల కక్ష్యలు గలిగి ఎవరికి ఎదిరించనలవికాని కుంజర పర్వతమును సర్పముల కావాసమగు భోగవతీపురియు మహాసన గిరియు పారియాత్ర పర్వతమును గిరిశ్రేష్ఠమగు పర్వతములును లేత చక్రవంతమును వారాహ పర్వతమును సువర్ణమయమగుచు ఎదిరించ నలవికాని వాడు మేఘదుష్టాత్ముడు విశాలనేత్రుడు గంభీర ధ్వని కలవాడునగు నరకుడు వసించు శుభ ప్రాగ్జ్యోతిష పురమును అచ్చటి అరువది వేల సూర్యునివలె ప్రకాశించునది యక్షరాక్షస గంధర్వులు ఎల్లప్పుడు సేవించు నదియు తన నడుమ బంగరు కలదియు మేఘములకు మిత్రమును అగు మేరు పర్వతమును శైలేంద్రమగు కైలాసమును ఆ దానవేంద్రునిచే కంపింపచేయబడెను. బంగరు (వన్నె) నీటితో కప్పబడిన వైఖానన సరస్సు హంసకారండవ (జల) పక్షులతో కలతనొందుచుండు మానస సరస్సు త్రిశృంగమను పర్వతము కుమారీనది మంచురాశితో కప్పబడి యుండు మందల పర్వతము ఉశీరబిందు భద్రప్రస్థ పర్వతములు ప్రజాపతి పుష్కర దేవాభ్రవాలుకా పర్వతములు, క్రౌంచ - సప్తర్షి - ధూమవర్ణ - పర్వతములు మరియు ఆయా ఉద్యానములు పర్వతములు దేశములు జనపదములు నదులు సముద్రములు మహీపుత్త్రుడగు కపిలుడు వ్యాఘ్ర వంతుడు ఖేచరులు (గగన సంచారి దేవజాతులు) సతీపుత్రులు (సత్ లోక నివాసులు) పాతాళతల నివాసులగువారు వారు రౌద్రము అనునామముగల దేవగణము అంకుశ మాయుధముగాగల మేఘనాముడు భయంకర వేగముగల ఊర్ధ్వగుడు - ఈ అందరును హిరణ్య కశిపునిచే కంపింపజేయబడిరి.
అపుడు హిరణ్యకశిపుడు గదా శూలములు దాల్చి భయంకరుడై మేఘముల గణమువలె ప్రకాశించుచు అట్లే ధ్వని చేయుచు అట్లే వేగము కలిగి దేవశత్రుడగు ఆ దైత్యవీరుడు నృసింహుని మీదకు పరుగెత్తుకొనుచు వచ్చెను. అంతట మృగేంద్ర రూపుడగు హరి ఓంకారమాత్ర సహాయుడై వానిమీదకు దుమికి వాడియగు పెద్దగోళ్ళతో పోరి వానిని చీల్చి చంపెను. ఆ దైత్యుని నాశముతో భూమి కాలము చంద్రుడు ఆకసము గ్రహములు రవి సకల దిశలు నదులు పర్వతములు మహాసముద్రములు నైర్మల్యము నందెను. అంతట దేవతలు ఋషులు మునులు శాశ్వతుడగు ఆ దేవదేవుని దివ్య నామములతో స్తుతించిరి. దేవా! నీవు ఏ ఈనారసింహ రూపమును ధరించితివో - దానినే పరాపరతత్త్వ మెరిగినవారు అర్చన చేయుదురు అని పొగడిరి.
బ్రహ్మ ఆ నరసింహుని ఇట్లు స్తుతించెను, బ్రహ్మరుద్రుడు దేవసత్తముడగు మహేంద్రుడు లోకములకు కర్తయు వికర్తయు (పరిణామము నొందించువాడు - లయము నొందించువాడు) కారణభూతుడును అయియుండియు తాను ఏ మార్పును లేకయుండు తత్త్వము నీవే. పరుడు (ఉత్కృష్టుడు) అగు సిద్ధుడు పరదేవుడు పరమంత్రము పరమ హవిస్సు (దేవతల నుద్దేశించి అగ్నిలో అర్పించు ద్రవ్యము) పరమ ధర్మము పరమ పరమ విశ్వము పరమ సత్యము పరమ తపము పరమపవిత్రము పరమమార్గము (మోక్ష సాధనము) పరమ యజ్ఞము పరమ హోత్రము (హోమ సాధనము) పరమ శరీరము పరమ బ్రహ్మము పరమ యోగము పరమ వాణి (వాక్కు) పరమ రహస్యము పరమ గతి (మోక్షము) పరమము కంటె పరమమగు రహస్యము పరమ పరమపదము (స్థానము) పరమ పరమహృద్యము (ప్రీతికరమగు తత్త్వము) పరమ పరమ దేవుడు పరమ పరమ భూతము పరమ పరమ నిదానము (ఆది కారణము) పరమ పరమ పవిత్రము పరమ పరమదాంతము (అన్నిటిని అణచునది) నీవేయని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. ఇట్లు నారాయణ దేవుని స్తుతించి సర్వలోక పితామహుడు భగవానుడు ప్రభువునగు బ్రహ్మ తన లోకమున కేగెను. తూర్యములు మ్రోయుచుండ అప్సరసలు నృత్య మొనర్చుచుండ ఈశ్వరుడగు హరి క్షీరసాగరపు ఉత్తర తీరమున కేగెను. గరుడ ధ్వజుడగు ఆ దేవుడు అచ్చట ప్రకాశించుచున్న నారసింహ శరీరమును ఉంచి తన ఎప్పటి రూపము ధరించి అష్ట చక్రములు కలదియు భూతము (పంచ తన్మాత్ర)లతో కూడినదియు ప్రకాశించునదియు అగు వాహనముతో అవ్యక్త తత్త్వమునకు (మాయాశ బలమునకు) కూడ మూల ప్రకృతియగు (సర్వసాక్షి భూత శుద్ధ చైతన్య) రూపముతో ఆ ప్రభువు స్వస్థానమునకు ఏగెను.