లవణ పర్వత దానము

ఈశ్వరుడు ఇట్లు చెప్పెను, ఇప్పుడు ఇక లవణ పర్వత దాన విషయము చెప్పెదను. అది ఉత్తమమయినది. దాని దానానుగ్రహమున మానవుడు శివున కాశ్రయమగు లోకములను పొందును. పదునారుగాని, ఎనిమిదిగాని, నాలుగుగాని, ద్రోణముల పరిమితికల లవణము దీనికై కావలయును. అందులకును ధనశక్తిలేనివాడు ద్రోణ పరిమితికి తక్కువకాకుండ ఎంతతోనైన చేయవచ్చును. మొత్తము పరిమాణములో నాలుగవ వంతు లవణముతో విష్కంభ పర్వతముల నేర్పరచవలెను. బ్రహ్మాది దేవతలను బంగారు వృక్షములను లోకపాలురను సరస్సులను, వృక్షములను పైవలెనే చేయవలెను. రాత్రి జాగరణమును చేయవలెను. (దాన మంత్రము) లవణ రసము (రుచి) సౌభాగ్య రసముతో నిండినది. దానితో ఏర్పడిన పర్వతోత్తమా! నన్ను రక్షించుము. ఈ లవణ రసము లేనిదే మిగిలిన రుచులు స్పుటములు కావు; గొప్పవి కావు. ఈ లవణ రసము పార్వతీ పరమేశ్వరులకు ప్రియమయినది కూడను. ఇట్టి నీవు ఓ రసమా! నాకు శాంతి నిమ్ము. విష్ణుదేహము నుండి ఉద్భవించినదానవు ఆరోగ్యవర్ధనమవు అగు లవణ పర్వతమా! సంసార సాగరమునుండి నన్ను కాపాడుము. ఈ విధానముతో లవణ పర్వత దానము చేయువాడు కల్పకాలముపాటు ఉమాలోకము నందు వసించి ఉత్తమ గతినొందును.