దక్షసృష్ట్యాది వివరణము

ఈ వృత్తాంతమును వినిన ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి, సూతా! దేవతలు దానవులు గంధర్వులు నాగులు రాక్షసులు మొదలగువారి ఉత్పత్తిని ఇకమీదట మాకు విస్తరించి చెప్ప వేడుచున్నాము.

వారి ప్రార్థనకు సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను, దక్ష ప్రజాపతికంటె ముందు వారు చేసిన సృష్టి సంకల్పమున దర్శన మాత్రమున స్పర్శనము వలన జరిగెడిది. ప్రాచేతసుడగు దక్షుని మొదలుకొని సృష్టి స్త్రీ పురుషుల సంయోగమువలన సంతానోత్పత్తి జరుగుటతో ఆరంభమయినది. స్వయం భువుని ఆజ్ఞానుసారము దక్షుడు సృష్టి జరిపిన విధము తెలిపెదను వినుడు. అతడు జరిపిన సృష్టిలో దేవతలు, ఋషులు, నాగులు మొదలగు వారందరును అన్ని ప్రాణులును మైథునము (స్త్రీ పురుషుల కూడిక) వలన జనించి వృద్ధి పొందిరి. ఆ దక్షునకు మొదట ఏబదివేల మంది కుమారులు కలిగిరి. వారు వివిధ ప్రజలను సృష్టింపదలచి యుండుట చూచి నారదుడు వారితో ఇట్లు పలికెను. ఋషిసత్తములారా! మీరు మొదట భూమి పరిమాణమెంతయో పూర్తిగా తెలిసికొని పిమ్మట దానియందు సరిపోవునంత మంది ప్రజలను సృష్టించుడు. వారు ఆ మాటవిని అందులకై బయలుదేరి అన్ని వైపులకు వెళ్ళిరి. సముద్రములోనికి పోయిన నదులు మరలిరానట్లు హర్యక్షుడు మొదలగు ఆ దక్షుని కుమారులు ఇప్పటికిని మరలిరాకున్నారు. అంతట దక్షుడు వైరిణి అను భార్యయందు వేయిమంది కుమారులను కనెను. శబలులు అను పేరుగల ఆ దక్షపుత్రులు సృష్టికి హేతుభూతులై ఉండిరి. నారదుడు వారికడకును వచ్చి మొదటి వలెనే ఇట్లు పలికెను. ఋషి సత్తములారా! మీరుపోయి భూప్రమాణమును మీ అన్నల జాడను కూడ తెలిసికొనివచ్చి పిమ్మట సృష్టిని విశేషముగ ఆరంభించుడు. అనగా విని వారును అన్ని దిక్కులకు పోయిరి. కాని మరలిరాలేదు. అందుచేతనే లోకములో తప్పిపోయిన అన్నల జాడ కనుగొనుటకు తమ్ములు పోరు. అట్లు ఒకవేళ వెదకుటకు పోయినచో కీడు కలుగును. కనుక అట్లు చేయరాదు శబలులు కూడ మరలి రాకపోగా ప్రాచేతసుడు దక్షుడు వైరిణియను భార్యయందు అరువదిమంది కూతుండ్రను కనెను. వారిలో పదిమందిని ధర్మునకును, పదుముగ్గురను కశ్యపునకును ఇద్దరను అంగిరసునకును ఇచ్చెను. ఈ దేవమాతల వలన జరిగిన ప్రజా విస్తరమును ఆదినుండి చెప్పెదను వినుడు. మొదటి పదిమందియును మరుత్వతి, వసువు, జామి, రేవా, బానువు, అరుంధతి, సంకల్ప, ముహూర్త, సాధ్యా, విశ్వ అను వారు ధర్ముని భార్యలు.

విశ్వకు విశ్వదేవులు సాధ్యకు సాధ్యులు మరుత్వతికి మరుత్వతులు వసువునకు వసువులు భానువునకు భానువులు ముహూర్తకు మహూర్తగణము రేవకు ఘోషులు అను దేవగణములు జామికి నాగవీథ్యాదులు, అరుంధతికి పృథివీ తలమునందలి ప్రాణి సమూహము సంకల్పకు సంకల్పుడు అను వారు పుట్టిరి.

వీరిలో వసువుల సృష్టిని తెలిపెదను వినుడు. వీరు జ్యోతిష్మంతులు (ప్రకాశము కలవారు.) అన్ని దిక్కులందును వ్యాపించువారు. అంతట వ్యాపించి వసించువారు కనుకనే వారికి వసువులు అని వ్యవహారము. వారి పేర్లు ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనునవి. వీరిలో అపునకు శాంతుడు, దండుడు, సాంబుడు, మణివక్త్రుడు అను నలుగురు కుమారులు. వీరు యజ్ఞరక్షణకు అధికారులు. ధ్రువునకు కాళుడు సోమునకు వర్చసుడు, ధరునకు కల్పానీకుడు, ప్రాణుడు అనువారు అనిలునకు రమణుడు, శిశిరుడు అను ఇద్దరు, అనలునకు శాఖుడు విశాఖుడు కార్తికేయుడు (కృత్తికలయందు) అను ముగ్గురును, ప్రత్యూషునకు దేవలుడు అను సమర్థుడగు ఋషి ప్రభాసునకు విశ్వకర్మ అను ప్రజాపతియగు దేవశిల్పియు కుమారులు. ఈ విశ్వకర్మ ప్రాసాదములు భవనములు ఉద్యానములు ప్రతిమలు ఆభరణములు గృహములు, ఆరామములు, కూపములు మొదలైన వాని నిర్మాణములలో దేవతలకు వడ్లంగి.

ధర్ముని సంతానమే యగు అజైకపాదుడు, అహిర్భుధ్య్నుడు, విరూపాక్షుడు, రైవతుడు, హర్యశ్వుడు, బహురూపుడు, ప్రబకుడు, సురేశ్వరుడు, సావిత్రుడు, జయంతుడు, పినాకి ఆనువారు ఏకాదశ రుద్రులు. వీరు గణదేవతలు. వీరి బలగము ఎనుబదికోట్ల మంది కలరు. వీరు వారికి అధిపతులై అన్ని దిక్కుల నుండి లోకరక్షణ చేయుదురు. గర్భము నుండి జనించిన ఆది సంతానరూపమగు ప్రజాపతి పుత్ర పౌత్రుల వివరణము ఇది.