మత్స్య మహా పురాణము
అవిముక్త క్షేత్ర మాహాత్మ్య విశిష్టత
ఈశ్వరుడిట్లనెను, పునర్జన్మ రాహిత్యముకోరు సిద్దులనేకులు సేవించినదగు అవిముక్తక్షేత్ర మహిమ నెరిగి ఆ పరమ క్షేత్రము నాశ్రయముగా చేసికొనవలెను. అది దేవదేవుని గుహ్య స్థానము, గుహ్య తీర్థము, తపోవనము, దానికేగిన వారు మరల జన్మించరు, పరమానందముకోరి జ్ఞానమునందు సమాహిత చిత్తులగు వారికి కలుగు ఉత్తమ గతి అవిముక్తమున మరణించినంతనే కలుగును: భవునకు దీనియందుగల ప్రీతి అనుత్తమమును అసమానమును; అచట అసంఖ్యేయ మగు ఫలమును అక్షయ గతియు లభించును; ఇది పరమ గుహ్యమగు శ్మశానము; దీనిని సేవింపని నరులు వంచితులయినట్లే; అచటి ధూళి రేణువులు గాలికి ఎగిరివచ్చి తాకినంతనే పాపకర్ములు కూడ ముక్తినందుదురు; శివుని నిత్య నివాసమగు అవిముక్తపు గుణములు ఇంతింత- ఇట్టివి అని చెప్ప శక్యముకానివి; వానిని దేవ దానవ మానవు లెవ్వరును వర్ణింపజాలరు; అహి తాగ్ని, యజ్ఞకర్త, శుచి, కాక తస్కరుడే ఐనను అవిముక్త మున వసించువాడు ఈశ్వరాలయమున వసించినట్లే, అచట పుణ్యవంతుడు కానివాడెవ్వడును లేడు; స్త్రీ కాని పురుషుడుకాని తెలిసియో మానవ సహజ బుద్ధితోనో చేసిన ఏ పాపకర్మ మయినను అవిముక్తమును ప్రవేశించినంతనే ఈశ్వర ప్రసాదమున నశించును; నదులు సముద్రములు పర్వతములు క్షేత్రములు తీర్థములు భూత ప్రేత పిశాచములు ప్రమథగణ మాతృ గణములు మొదలగు శ్మశాన సహజ పరివారములు అన్నియు ఆ మహాత్మునకు శివునకు ప్రియములు; అవి శివుని విడువవు; శివుడు వానిని విడు వడు; ఆ ప్రభువచట నుండి గణములతో విహరించు చుండును; పాప దుష్కృతకారులగు దీనులను కృపణులను అతడు దయతోచూచి అచట నుండువారికి పరమగతి నొసగును; భక్తానుకంపాపరుడగు ఆ భగవానునకు తిర్యగ్యోని గతములగు పశుపక్ష్యాది ప్రాణులయందును దయయే; భృగ్వంగిరసాదులగు మహావ్రతులగు సిద్దులును పరమ ఋషులును తమ పాపములు అగ్నియందు వేసిన దూదివలె దగ్ధమగుటకై ఎచటికి యాత్ర చేయుదురో అట్టి అవిముక్తము పరమోత్తమ స్థానమెట్లు కాకపోవును?
అవిముక్త నివాసులకు కలుగు ఉత్తమగతి కురుక్షేత్రమునను గంగా ద్వారమునను పుష్కర మునను కలుగదు, తిర్యక్ర్పాణులయినను అచటికి పోయి అది తమ నివాసముగా చేసికొనినచో తమ కాలము వచ్చి మృతినంది ముక్తులగుదురు, మేరు మందర పర్వత సమాన పాపరాశి అయినను అవిముక్తమునకు పోగానే నశించును; ఇది మహా శ్మశానము నిత్య శివాలయము, దేవ దేవుని గుహ్యమగు తీర్థమును తపోవనమును; అచట శివుడనగు నాయందు భక్తిగల బ్రహ్మ విష్ణ్వాది దేవతలును యోగులును సిద్దులును వందలకొలదిమంది మద్భక్తులు నన్నే పరమగతిగా భావించి భగవానుడు, సనాతనుడు (శాశ్వతుడు) నగు, నన్ను ఉపాసింతురు; జ్ఞాన తపోవంతులకు యజ్ఞకర్తలకు కలుగు ఉత్తమగతులు అవిముక్త నివాసులకు కలుగును; లోకకర్తలును లోక సంహారకులునునగు బ్రహ్మాది దేవతలును సమ్రాట్ విరాట్స్వరూపులగు ఈశ్వరతత్త్వములును పునర్జన్మము కలుగనీయని ఉత్తమ లోకములును మహర్జనస్తప స్సత్య లోకాదులును నా నుండి ఉద్భవించునవన్నియు ఎచట నుండువారికి లభించునో ఏది మనస్సు నకును భూతభవిష్య వర్తమానములకును బ్రహ్మాది స్థావరాంత భూతములకును సాంఖ్య తత్త్వము నకును ముక్తికిని జన్మహేతువో అట్టి అవిముక్తము నాశ్రయించువారు వంచితులు కాక తమ జన్మమును సఫలమొనర్చుకొన్నవారే యగుదురు; అది అన్నితీర్థములందు స్థానము లందు క్షేత్రములందు శ్మశానములందు తటాకములందు కూపములందు జల ప్రవాహములందు శైలములందును ఉత్తమమయినది; దీనిని శివ భక్తులు మృతినందబోవుచు సేవించినను ముక్తు లగుదురు; ఇది బ్రహ్మకు పరమస్థానము; బ్రహ్మకు ఆశ్రయము; బ్రహ్మచే సేవితము; బ్రహ్మచే రక్షితము; బ్రహ్మలోకములగు సప్తభువనములును ఇవియే; కాంచన మేరుపర్వతము ఇదియే, ఇది మానన పరమయోగము; ఇది బ్రహ్మకు పరమ ప్రీతికరము; ఇచట భగవానుడగు బ్రహ్మ త్రిసంధ్యములందును ఈశ్వరునియందుండును. ఇది పుణ్యమగు వానిలో పుణ్యతమమగు స్థానము; పుణ్యము చేసినవారే దీనిని సేవింతురు, ఇచట ఆదిత్యోపాసన మొనర్చిన విప్రులు అమరత్వము నందిరి;
ప్రియా! ఇతరులగు మూడు వర్ణములవారును (క్షత్రియ వైశ్య శూద్రులును) సమాహితు లయి భవునియందు భక్తి గలిగి ఈ అవిముక్తమున తనువు విడిచినచో పరమగతి నందుదురు. ఇతరులగు కామ(స్వేచ్ఛా) చారిణులును భోగపరాయణులగు స్త్రీలు కూడ ఇచట నివసించుచో తమ కాలము వచ్చి మృతి నందిన తరువాత పరమగతి (ముక్తి) నందుదురు. నియత మనస్కులగు యతులుకూడ ఇతర ప్రదేశము లందయినచో సంవత్సరమున ఎనిమిది మాసములు సంచరిం చుచు నాలుగు మాసము లొకచోట ఉండుట విహితము; ఈ అవిముక్తమున ప్రవేశించిన తరు వాత వారు సంచరించుచుండ నక్కరలేదు. (ఈ అవిముక్తమున యతులు ఏడాది పొడవునను కదలక ఒకేచోట నున్నను దోషముకాదు) అచటనుండు వారికి దేహము ఉండదు అని శాస్త్రము నందు కనబడుచున్నది. అచట పంచత్వము (మరణము) నందిన వారికి ముక్తి కలుగుట నిస్సంశయము; భవునియందు భక్తులయి సమాహితచిత్తలగు పతివ్రతలగు స్త్రీలును అవి ముక్తమున దేహత్యాగ మొనర్చి పరమగతి నందుదురు. ఇచట నరులకు దుర్లభమగు భోగముక్తులు రెండును లభించును. కావున ఇటకు వచ్చినవారు మరియే తపోవనమునకును పోవ పనిలేదు. బ్రాహ్మణుడు సర్వభావముతో భవుని సేవింపవలయును. అట్లు అవిముక్తమున వసించు విప్రుడు నాతో సమానుడగును; నేను దాని నెన్నడును విడువను. కావుననే దాని కవిముక్తమని పేరు; దానిని సేవింపని మూఢులు పాపయుతులయి మరల మరల మలమూత్ర రేతస్సుల నడుమ నుండువారే యగుదురు, కామము, క్రోధము, లోభము, దంభము, స్తంభము అనగా విర్రవీగుట, అతిమత్సరము, నిద్ర, బద్ధకము, అలసత్వము, కొండెములు చెప్పుట అను పదియు అవిముక్త మున ఇంద్రుడు స్వయముగ ఏర్పరచిన విఘ్నములు; వినాయకుడు కలిగించు ఉపద్రవము పదునొకొండవది ఎప్పుడును తలమీద కూర్చుండి యుండును; ఇన్ని ఉన్నను ఇవి భక్తులను అనుగ్రహించు బుద్ధితో వారికి శుభరకములే అగునను ఈ పరమ రహస్యము శాస్త్రముల పరిశీలించిన దేవదేవులును తత్త్వ దర్శులగు మునులును వచించిరి; మధుకైటభుల మేధస్సుతో తడిసినందున భూమికి మేదినియని వ్యవహారము కలిగెను; అవిముక్తము నందలి భూమికి మాత్రము వారి మేదస్సుతో సంబంధము లేదు; కావున ఇతర స్థానములందలి భూమికివలె ఇచటి భూమిని సంస్కరింపకున్నను అది స్వాభావికముగా పవిత్రము అగునని నిర్ణయించి మహాదేవుడిచటి భూపవిత్రతను రక్షించుచున్నాడు.
దేవదానవ గంధర్వ యక్షరక్షో మహానాగాది భక్తులెవరు అవిముక్తవాసియు వరదుడు అక్షరుడు పరమపదరూపుడు నగు మహాదేవుని పరమగమ్యముగ శ్రద్ధతో భావించి ఉపాసింతురో వారు అజ్యాహుతి అగ్నిహోత్రము నందువలె శివునియందే ప్రవేశింతురు; ఈశ్వరున కాశ్రయ మును శుభమును నగు అవిముక్తమును చేరినవారుతాము మహాదేవునందే చేరిరని భావించ వలయును; జపహోమ పరాయణులగు ఋషులును దేవాసురులును ముక్తికాములగు యుతులును అవిముక్తము నాశ్రయింతురు; ఇచట మృతినందిన పాపియు ఎవడును నరకము నందడు; దీని నాశ్రయించినవారెల్లరును ఈశ్వరానుగ్రహమున పరమగతి నందుదురు; ఈ క్షేత్రపు తూర్పు పడమరల పొడవు రెండున్నర యోజనములు (రెండు యోజనములని లోగడ చెప్పబడినది); దక్షిణోత్తరముల వెడల్పు అర్ధ యోజనము; ఇది వారాణసీ నదీ శుక్లనదుల నడుమ నున్నది; అని ఈక్షేత్ర విస్తారము ధీమంతుడగు మహాదేవుడు చెప్పెను; ఉత్తమ జ్ఞానమును మోక్షమును కోరి యోగసాధన నాశ్రయించి మన్నిష్ఠులు (నాయందే శ్రద్ధ కలవారు) మత్పరాయణులు (నన్నే పరమగమ్యముగా భావించిన వారు) అయి అవిముక్తమును విడువక ఇట నివసించిన వారు శోచ్యులు కారు (అభినందింప బడవలసినవారే); అన్ని నదులును సముద్రములును, పర్వతములును యోగక్షేమమును తపఃక్షేత్రమును సిద్ధ గంధర్వ సేవితమును నగు అవిముక్తము నందే యుండును; అవిముక్తము భూమ్యంతరిక్ష ద్యులోకములందలి సకల తీర్థములను తన ప్రభావముచే అతిశయించి యున్నది; ద్విజులు ఎవరు నిరతమును అవిముక్తము నందే యుండ ధ్యాన మవలంబించి మనస్సును భవునందు యోజించి సమాహిత చిత్తులయి ఇంద్రియముల నిగ్రహించి శత రుద్రియ(మను వేదభాగ) మును జపింతురో వారు కృతార్థులు; అట్టి భవభక్తులు నిశ్చయముగ ఆనంద మందుదురు; భక్తి కలిగి కామములను (ప) సంహరించి విషయ సుఖములకు బహిర్భూతులై శక్తి ననుసరించి అన్ని సంగములను విడిచి తప మాచరించుచు ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకొని అవిముక్తవాసులగు వారు శతకోటి కల్పముల తరువాతకూడ మరల జన్మింపరు; వారు పునర్జన్మ రహితులయి మహాదేవుడగు ఈశ్వరుని చేరి నిర్భయులయి యుందురు; ఇచట నుండువారిని భవుడు తానే దగ్గరకు తీసికొనును.
మానవులకు సిద్ది కలుగుటకై ఈ క్షేత్రమును శివుడుత్పాదించెను. అవిముక్తక్షేత్ర గుణములను ఉద్దేశ (పేరులు చెప్పుట) మాత్రముగా ఇట్లు తెలిపితిని; అవి సముద్రపు రత్నముల వలె అనంతములు; భక్తులు కానివారి బుద్ధికిని మోహమును (ఇంకను మూఢత్వమును) భక్తులగు ప్రాణులకు బుద్ధి వృద్ధిని కలిగించును; మూఢులు మోహితులయి ఇది శ్మశానమే యను భావ ముతో చూతురు, వందల విఘ్నములు కలుగుచున్నను ఇట వసించు వివేకులు శోకరహితమగు పరమపద మందుదురు; అది జన్మజరా మరణములు పోగొట్టు పరమ జ్ఞాన ప్రదమగు శివా లయము; పునరావృత్తి రహిత ముక్తి కోరువారికది పరమగతి; దీనిని చేరితిని కాని కృతకృత్యు డనయితినని భావించువాడు వివేకి, అవిముక్తమున లభించు ఇష్టగతి దానములతో యజ్ఞలతో తపముతో విద్యలతో లభించకపోవచ్చును; సంకరవర్ణులు, వర్ణరహితులు అనగా ఏ వర్ణవ్యవస్థయు లేని దేశములవారు, చండాలురు జుగుప్సితులు (జనులచే అసహించుకొన బడువారు) పాపపూర్ణ శరీరులు మహాపాతకులునగు వారికిని ఇది పరమౌషధము అని పండితులు చెప్పుచున్నారు; వేలకొలదిగా గల ఆయా ప్రాణి జాతులందు పుట్టియున్న దేహధారియైనను అవిముక్త క్షేత్రమున మృతినందినవాడు విశ్వేశ్వర భక్తుకుడే; వానికి పునర్జన్మ ముండదు; అందు ఆచరించిన జవహవన దానతపస్సు లన్నియు అక్షయ ఫలప్రదములు; ఇట్టివి చేసినవారు అచట నివసించుచు తమ కాలము వచ్చి మరణమంది నిశ్చయముగ శివసాయుజ్య మందుదురు; పాప సహస్రములు చేసినను పశ్చాత్తాప మంది అవిముక్తమున మరణించినను ముక్తి లభించును, అందు మరణించుటలో ఈకాలము శుభమా అశుభమాయని మీమాంస చేయపనిలేదు; స్థాణు (శాశ్వత) రూపుడు అద్భుత కార్యసమర్థుడు సర్వరక్షకుడు సర్వవిభుడునగు ఆ మహాదేవుని మాహాత్మ్యముచే ఉత్తరా యనమో దక్షిణాయనమో ఏదయినను మంచిదే.
పూర్వము స్కందుడు చెప్పిన ఈ అవిముక్త క్షేత్ర విషయక వృత్తాంతమును విని ఋషులు ఎల్లరును తమతమ శుభములగు అంతః కరణములతో దానిని భావన చేసిరి.