ధర్మ మూర్త్యుపాఖ్యానము

పూర్వము బృహత్కల్పమునందు ధర్మమూర్తి యను రాజుండెడివాడు. అతడు ఇంద్రునకు మిత్రుడు; వేల కొలదిగా రాక్షసుల జంపినవాడు; సోమ సూర్యాది జ్యోతిస్సులకంటెను తేజశ్శాలి. వందలకొలది శత్రువుల నోడించినవాడు; ఎవరిచేతను ఓటమిని ఎరుగనివాడు; కామరూపము ధరించగలవాడు. అతని పట్టపురాణి భానుమతి అనునామె త్రైలోక్య సుందరి; అమర సుందరు లను కూడ అందమున జయించినదియును లక్ష్మీదేవివలె రూపము కలదియును; ఆమె ఆ రాజునకు ప్రాణముల కంటెను మిన్నగా ప్రీతిపాత్రురాలు కూడను; రాజునకుగల పదివేల మంది స్త్రీజనములో ఆమె సాక్షాత్ లక్ష్మి వలె శోభించుచుండెడిది. వారిని వారి అధీనస్థులగు వేల కోటుల రాజులును ఎప్పుడును విడిచియుండెడి వారుకారు.

ఒకనాడా రాజు తనసభలోనున్న తనపురోహితుడగు వసిష్ఠునిజూచి మిగుల ఆశ్చర్య ముతో నిట్లు ప్రశ్నించెను: “భగవన్! ఏ (సత్) కర్మకు ఫలముగా నాకు ఇంత ఉత్తమమగు లక్ష్మియు నాశరీరమున సదా ఇంత ఉత్తమమగు విపుల తేజమును సిద్ధించినది?”

వసిష్ఠుడు రాజున కిట్లు సమాధానము ఇచ్చెను: పూర్వము శివుడే తనకు పరమాశ్రయ ముగా భావించు లీలావతి యను వేశ్య యుండెను ఆమె (ఒక) చతుర్దశినాడు తన ఆచార్యునకు లవణ పర్వతమును యథావత్ విధానానుసారము సువర్ణ వృక్షదేవతా ప్రతిమలతో కూడ దాన మిచ్చెను. ఆ లీలావతియింట భృత్యుడుగా ఆశ్రితుడుగా ‘సాండుడు’ అనుపేరుగల శూద్రుడు సువర్ణకారుడుండెను. అతడు (ఈవ్రతమునకై) శ్రద్ధాయుక్తుడై బంగారు చెట్లను దేవతా ప్రతిమలను చేసి ఇచ్చెను. ఇది దేవకార్యము గదాయను మంచితలంపుతో వాటిని మిగులరూప సంపన్నము లుగా నిర్మించియు వేతనము ఏమియు తీసికొనలేదు. ఆతని భార్యయును ఆ వృక్ష ప్రతిమలకును దేవతా ప్రతిమలకును మెరుగుపెట్టెను. ఇంతేకాక ఆ శూద్ర దంపతులిద్దరును లీలావతి దానము చేయ సిద్ధపరచిన లవణ పర్వత సమీపమున బ్రాహ్మణ సేవాది రూపమున ఏమాత్రమును కపటము లేని సేవ ఎంతయో చేసిరి. ఆలీలావతియను వేశ్యయును చాలకాలము (అట్లు జీవించిన) తరువాత సర్వపాప వినిర్ముక్తురాలయి శివలోకము చేరెను. తాను దరిద్రుడగు బంగారు పనివాడై యుండియు అతిసత్యవంతుడై (ఈ పనికై) భృతితీసికొనని ఆతడే నీవు (ధర్మ మూర్తియను రాజు)గా ఇపుడున్నావు. సప్త ద్వీపాధిపతివి-పదివేల సూర్యుల తేజస్సు వంటి తేజస్సు కలవాడవు అయినావు. తన భర్తచేసిన బంగారు చెట్లకు భక్తితో మెరుగుపెట్టిన అలనాటి సువర్ణకారుని భార్య నీ ఈ భార్య భానుమతి; ఆ మెరుగుపెట్టిన పుణ్యముననే ఈమెకు నేడీ మేరమీరిన రూపమును ఇంతులందరలో మేలిదనము కలుగుటయునైనది. ఏమియు పొగరులేక లవణాచల దాన వ్రతకాలమున బ్రాహ్మణాదుల పరిచర్యలు చేసినందున అపరాజితుడవై ఆరోగ్య లక్ష్మీ సౌభాగ్యముల నందగలిగితివి.

కావున నీవు ఇపుడును విధానపూర్వకముగా ధాన్యాచలాది దశవిధ పర్వత దానములను ఆచరించుము. అనిన వసిష్ఠుని పాదములను ధర్మమూర్తి సంపూజించి ధాన్యా చలాదికములు అన్నియు అట్లే దానమిచ్చెను. తత్ఫలముగా సురపూజ్యమానుడగుచు శివలోక ప్రాప్తుడయ్యెను. ఇంతేకాదు. దరిద్రులేయైనను ఈ పర్వతదాన వ్రతములు జరుగుచుండగా చూచినను వాటిని తాకినను ఈ విషయములు వినినను ఇతరులకు తెలిపినను అట్టివాడును పాపవిముక్తుడై స్వర్గము చేరును. ఈపర్వత దానములన్నియు సంసారభయనాశకములు; దేవపూజ్య మానములు. విని ప్రభావమున మానవుడు దుఃఖశాంతి నొందును. వీని నన్నిటికి భక్తితో నాచరించినవాడు ఆత్మశాంతి నందుననుటలో సంశయమేలేదు.