మత్స్య మహా పురాణము
దేవాసుర యుద్ధము - ఔర్వోత్పత్తి
పరస్పర జయకాంక్షులగు దేవతలకును దానవులకును ఆ సేనలతో తుములమగు యుద్ధము (ఎవరు ఎవరితో పోరుచున్నారనునదే తెలియని దొమ్మి యుద్ధము) జరిగెను. దానవులు నానాయుధ సన్నద్ధులయి యుద్దము చేయుచు పర్వతములు పర్వతములతోవలె దేవతలతో తలపడిరి. సురాసురుల పరస్పర సంయోగముతోడి ఆ యుద్ధము ధర్మాధర్మములకును దర్ప వినయములకును జరిగిన యుద్ధమువలె కనబడెను. ఆ సమయములో విశేషముగా ప్రేరించబడి ఎగిరి దుముకుచున్న రథములతో, మిగుల చోదింపబడిన గజములతో అన్నివైపుల నుండియు ఆకసమునకు ఎగిరి దుముకుచున్న ఖడ్గ హస్తులగు పదాతులతో, విసరివేయబడుచున్న ముసలములతో మీదికివచ్చి పడుచున్న బాణములతో సారించబడి ధ్వని చేయుచున్న ధనువులతో పడ వేయబడుచున్న ముద్గరములతో, దేవదానవులకు పరస్పరము జరుగుచుండిన ఆ సంకుల యుద్ధము యుగాంత (ప్రళయ)మువలె లోక భయంకరమయ్యెను. దానవులు తమ చేతులతో పరిఘలను పర్వతములను విసరివేయుచు ఇంద్రాది దేవతలను చావగొట్టుచుండిరి. జయ మందుచు ప్రకాశించు బలశాలురగు దానవులచే దెబ్బలు తినుచు, ఆర్తులయి దేవతలా యుద్ధమున ఏడుపు మొగములు పెట్టిరి. రాక్షసులు తమ్ము అస్త్రములతో, శూలములతో మిగుల మథించుచుండ పరిఘలతో తలలు పగులగొట్టుచుండ వక్షఃస్థలములు చీల్చుచుండ ఆగాయముల నుండి మిక్కిలిగా రక్తము స్రవించుచుండెను. అసురులు బాణపు వలలతో చుట్టగా ఆ దానవుల మాయలో చిక్కుకొని దేవతలు ప్రతీకార యత్నము చేయలేకపోగా కదలనైన కదలలేకుండిరి. ఇట్లు దేవతాబలమును దానవులు ఆయుధములతో యత్నమైన చేయనీయకపోవుటచే, అస్తమించినదో అనునట్లును నిద్రించినదో అనునట్లును అయ్యెను. బహునేత్రుడగు ఇంద్రుడు దైత్య ధనువులనుండి వదలబడిన వాడి అమ్ములను వజ్రముతో ఖండించి దైత్య సేనయందు ప్రవేశించెను. అతడంతట దైత్యులలో ప్రముఖులను చంపి ఆ మహాదానవ సేనను తామసమగు అస్త్రజాలముతో అంధకారమయమొనర్చెను. పురుహూతుని తేజముతో సృష్టించబడిన ఘోరమగు తమస్సు (మోహము)తో, ఆవిష్ణులై దానవులు తమ వారిని పరస్పరముకాని తమ వాహనములను గాని గుర్తింపజాలకుండిరి. అంతలో దేవతలు యత్నముచేసి దానవ మాయాపాశములను వదలించుకొని తమస్సుతో వ్యాప్తమయిన దానవ దేహములను పడగొట్టసాగిరి.
కాటుకవలె మెరయుచున్న తమముతో చీకాకుపడియు తెలివి కోలుపోయియు ఆ దానవులు రెక్కలు తెగిన కొండలవలె పడిపోయిరి. ఇంద్రుడు సృష్టించిన ఆ తమస్సు (అంధకారము - ఏమియు తెలియనీయని మోహము) మహా సముద్రమున (రాత్రులందు) వ్యాపించిన ఆంధకారమువలెనే దానవులందరు ఒకే ముద్దగా కనబడునట్లు చేసెను. ఇట్లు దేవతలచే జరుపబడిన దానవ నాశము అంధకార మయమేమో యనునట్లుండెను. అంతట మయుడు ఇంద్రుని ఆ తామసమాయను దహించు మహామాయను (సముద్రాంతఃస్థమగు ) ఔర్వాగ్ని (బడబాగ్ని)తో నిర్మించి సృష్టించెను. అది ప్రళయాగ్ని తేజస్సులవంటి తేజస్సులను జనింపజేసెను. మయుడట్లు విశేషముగ సృష్టించిన మయమాయ దేవతలనందరను కాల్చసాగెను. దైత్యులు వెంటనే రవి తేజస్కులయి లేచి రణ రంగమున నిలిచిరి. ఔర్వాగ్ని ప్రయుక్తమయిన మయమాయ తమ్ముచేరి దహించుచుండ దేవతలు చల్లని కిరణములు కలదియు జలము నిచ్చునదియు నగు చంద్రుడున్న ప్రదేశమును చేరిరి. వారు అట్లు ఔర్వాగ్నిచే దహింపబడుచు సంతాపమునకు తాళచేక తెలువులు తప్పి ఇంద్రునకు తమ అవస్థను అతనిని శరణు వేడిరి. తమ సేన అట్లు మయమాయతో దగ్ధ మగుచు సంతప్తమగు చుండ చూచి ప్రశ్నించిన దేవరాజుతో వరుణుడు ఇట్లు పలికెను.