మత్స్య మహా పురాణము
దుర్గమందాయుధాది సంగ్రహణము
దుర్గమందు నానాయుధ యుక్త యంత్రములు వేలకొలదిమందిని చంపగలవియు గుప్త ద్వారములును ఉండవలయును. సర్వ విధానేకాయుధములును ధనువులు, వడిసెలలు, ఫిరంగులు, తోమరములు, ఖడ్గములు, కవచములు, రాలుముద్గరములు, పట్టన త్రిశూల, శూల ప్రాసశస్త్రశక్తి, పరశ్వథ, చక్రచర్మ (డాలు), వర్మ (కవచ), కుఠార (గొడ్డలి), క్షుర (చుర కత్తి) వేత్ర (ప్రేము కర్రలు బెత్తములు) పరిఘతుష (ధాన్యాదుల పొట్టు) దాత్రములు (కొడవళ్లు) అంగారములు (బొగ్గులు), సర్వశిల్పి భాండములు (ఆయా పనివారల పనిముట్లు), సర్వ వాద్యములు, ఔషధములు సమృద్ధిగా అనేక విధములగు యవనములు (మేత గడ్డి తెగలు) వంటకట్టెలు, బెల్లము సర్వతైలములు, సర్వరససామగ్రి (పాలు పెరుగు తేనె మొదలగు నవి) వస (క్రొవ్వువంటిది) మజ్జ-స్నాయువులు (నులినరములు) ఎముకలు ఎద్దుల చర్మముతో చేసిన తప్పెటలు మొదలగు చర్మ వాద్యములు సర్వ ధాన్యములు అభ్ర పటములు (శిబిరములు నిర్మింప పనికివచ్చు వస్త్రములు మొదలగునవి) యవలు, గోధుమలు, రత్నములు, సర్వవిధ వస్త్రములు సర్వవిధ లోహములు బఠాణి పెసలు, మినుములు, శనగలు, నూవులు ఇట్టి అన్ని పంట (ధాన్యము)లు ధూళులు, గోమయములు, జనుపనార సర్జ రసము భూర్ణ పత్రము జతు - లాక్షా (అను రెండు విధముల లక్కలు) టంకణము ఇట్టివింకెన్నియో దుర్గమందు సేకరించి ఉంచవలెను, వీటిలో ముఖ్యముగా రత్నములు సర్వ లోహములు సర్వవిధ వస్త్రములు కొర్రలు పెసలు, మినుములు, శనగలు, నూవులు ఇంకను ఇట్టి సర్వ సస్యములును ధూళులును గోమయమును పాములతో కూడిన కుంభములు (సింహాదులగు) క్రూర మృగములు, మృగములు, పక్షులు, మొదలగునవివాటి పరస్పర మైత్రీ ద్వేషముల నెరిగి నిలుపవలెను; పరస్పర విరోధముగల పదార్థములకును ప్రాణులకును ఏర్పరచు స్థానములు అతి రహస్యములు అయి సురక్షితములయి ఉండవలెను; రాజు ఈ విషయములందు ప్రయత్నపరుడు కావలెను; ఈ చెప్పినవియు ఇందు చెప్పనివియు ద్రవ్యములు పురమందు జనుల హితముకై సేకరించి రహస్యముగా భద్రపరచి ఉండవలెను.