మత్స్య మహా పురాణము
కార్తవీర్యార్జున కథాశేషము
ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి: కార్తవీర్యుడు ప్రజారక్షకుడని వినియుంటిమి. అటువంటివాడు విక్రమము చూపి మహాత్ముడగు భార్గవముని వనము నేల దహించెను?
సూతుడు ఋషులతోనిట్లు చెప్ప నారంభించెను: ఆదిత్యుడు విప్రరూపమున కార్తవీర్యుని కడకు వచ్చి “నేనాదిత్యుడను. నాకు తృప్తి కలిగించుము” అని కోరెను. నీకు దేనిచే తృప్తి కలుగును? నీకెట్టి భోజనము కావలెనో తెలిసిన నది ఏర్పరతునని కార్తవీర్యుడన నాకు స్థావర రూపమగు ఆహారమునేదైన నిమ్ము. దానిచే తృప్తి కలుగునని ఆదిత్యుడు పలికెను. వేడిమినిచ్చు వారిలో శ్రేష్ఠుడవగు నీకు నమస్కారము. నా తపస్సుచే కాని బలముచే కాని స్థావరములన్నిటిని కాల్చుట నాకు శక్యముకాదు అని కార్తవీర్యుడు గాన ఆదిత్యుడును నీభక్తికి నీమాటకు సంతోషించితిని. అక్షయములును సర్వతోముఖములును (ఎటయిన ప్రసరించునవి) అగు బాణములు నీకిత్తును. అవి నీవు ప్రయోగించునపుడు వానియందు నా తేజస్సు ప్రవేశించి అవి మండి వృక్షాదిక స్థావరములను ఎండించును. వాటిని నేను భస్మముచేసి తృప్తి పొందుదు ననెను. తరువాత నాతడు తానన్నట్లు అర్జునునకు శరములనిచ్చి వాటి మూలమున ఎండిన స్థావరములను కాల్చి వాటితో పాటు గ్రామములు ఆశ్రమములు పల్లెలు నగరములు రమ్యములగు తపోవనములు వనములు ఉపవనములు ఆయా తావులందలి పక్షులు మొదలగు అన్నింటిని కాల్చెను. సూర్యుని భయంకర తేజస్సుచే భూమిపై (అతడు కాల్చినంతమేర) వృక్షములు కాని గడ్డికాని లేకుండ అయ్యెను. ఈకాలమునందే భార్గవుడను మహాఋషి ఆ ప్రదేశమునందలి నీటిలో నుండి తపస్సాచరించుచుండెను. అతడుపదివేలయేండ్లు వ్రతముపూని తపస్సుచేసి అదిముగియగానే పైకి వచ్చి చూచెను. తన ఆశ్రమమంతయు కార్తవీర్యుడు కాల్చెనని ఎరిగి క్రోధముపూని లోగడ చెప్పినట్లు ఆతనిని శపించెను.
ఇక క్రోష్టువంశము తెలిపెదను. దానియందన్ని తరములవారు నుత్తములు. ఆ వంశమందే వృష్ణివంశ శ్రేష్ఠుడగు కృష్ణుడు జన్మించెను.
క్రోష్టునికి మహారథుడగు వృజినీవాన్ - అతనికి మహాబలుడగు స్వాహుడు - అతనికి పురుష శ్రేష్ఠుడగు ఉషంగుడు-అతనికి సార్థకనాముడగు చిత్రరథుడు-అతనికి వీరుడై విపుల దక్షిణలతో యజ్ఞములు చేసిన శశిబిందుడును కలిగిరి. అతడు గొప్ప చక్రవర్తి. అతని గూర్చి అనువంశ శ్లోకము ఈ యర్థమును ఇచ్చునది కలదు. “శశిబిందునకు నూరునూరు మంది (10000) కుమారులు కలరు. వారందరు చాల విద్వాంసులు సుందరులు. అధికమగు ధనమును తేజస్సును కలవారు. అతి ప్రధానులగు ఆ శశిబిందు పుత్రులలో ముఖ్యులు-మహాబలుడగు పృథు సత్త్వుడు-పృథుశ్రవుడు-పృథుయశుడు-పృథు ధర్ముడు పృథుంజయుడు-పృథుకీర్తి-పృథుమనసుడు అనువారు. పృథుసత్త్వునకు ప్రజ్ఞుడు-అతనికి సుయజ్ఞుడు-అతనికి ఉశనుడు కలిగిరి. ఉశనుడు ఉత్తమ ధార్మికుడగు చక్రవర్తియై నూరు అశ్వమేధము లొనరించెను. అతనికి తితిక్షువు-అతనికి రాజర్షి శ్రేష్ఠుడగు మరుంతుడు, అతనికి కంబళ బర్హిషుడు-అతనికి రుక్మ కవచుడు కలిగిరి. ఈతడు యుద్ధమున కవచధారులగు శత్రులను ధనుర్ధరులను వివిధ బాణములతో చంపి భూమినంతటిని స్వాధీనము చేసికొని అదియంతయు ఒక యజ్ఞములో బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చెను. అతనికి మహావీర్యులు మహాధనుర్ధరులునగు రుక్మేషువు-పృథురుక్ముడు-జ్యామేఘుడు - పరిఘుడు-హరి అను ఐదు మంది కుమారులు. వీరిలో పరిఘుని హరిని తండ్రి విదేశములకు పాలకులుగా పంపెను. రుక్మేషువు తండ్రి రాజ్యమునందు ఉండెను. పృథురుక్కుడు రుక్మేషుని ఆశ్రయించి యుండెను. వారిచే రాజ్యమునుండి వెడలగొట్టబడి జ్యామేఘుడు ప్రశాంతుడై ఒక ఆశ్రమమందుండెను.
ఒక బ్రాహ్మణుడు చేసిన బోధనముచే అతడు కేవలము జీవన వృత్తికై యుద్ధము చేయదలచి రథమునెక్కి ధనువును ధ్వజమును దాల్చి ఏకాకియై సర్మదాతీర దేశమునకు పోయెను. అచ్చట ఋక్షవంతమను పర్వతము ఇతరుల అనుభవములో లేకుండుట చూచి అచ్చట నివాసము నేర్పరచుకొనెను. అతనికి గొడ్రాలగు శైబ్య అను పతివ్రత భార్య. ఐనను అతడు మరియొక పెండ్లి చేసికొనకుండెను. అతడు ఒకమారు యుద్ధములో ఒక సుందరి యగు కన్యను గెలిచి తెచ్చెను. ఆమెను చూచి శైబ్య “ఈ సులోచనయగు కన్య ఎవరు? భార్యగా చేసికొనదలచి తెచ్చితివా? నాకు కుమారులు లేరు కావున ఈమె మనకు కోడలుగాజాలదు. నీకు మరియొక భార్యయు ఆమెకు కుమారులునులేరు. ఈమె మనకెట్లు కోడలగును? అనగా ఆతడు నీకు పుట్టబోవు కొడుకునకీమె భార్యయగును అనెను.
అపుడామె ఉగ్రతపముచేసి జ్యామేఘుని వలన విదర్భుడను కుమారునికనెను. ఈకన్య అతనికి భార్యయయ్యెను. విదర్శునకు ఈమెయందు క్రథుడు, కైశికుడు, రోమపాదుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వీరిలో రోమపాదునకు మనువు అతనికి జ్ఞాతి-కుమారులు. కైశికునకు బది అనువాడు కుమారుడు. అతని వంశము వారికి వైద్యులని పేరు. క్రథుడను వానికి కుంతి అతనికి వృషుడు-అతనికి ధృష్టుడు-అతనికి నివృత్తి-అతనికి విదూరథుడు - అతనికి విమలుడు-అతనికి భీమరథుడు-అతనికి నవరథుడు-అతనికి దృఢరథుడు-అతనికి శకుని-అతనికి కరంభుడు-అతనికి దేవరాతుడు-అతనికి దేవక్షత్రుడు-అతనికి మధుడు-అతనికి పురువసుడు-అతనికి పురుద్వాన్-అతనికి విదర్భరాజ పుత్రియగు భద్రసేనియందు జంతుడు అతనికి ఇక్ష్వాకు రాజపుత్రియందు సాత్వతుడు కలిగిరి.
సాత్వతునకు భాగి-భజమానుడు-దివ్యుడు దేవావృధుడు-అంధకుడు-వృష్ణి-మహాభోజుడు-అను ఏడుగురు కుమారులు కల్గిరి. వారిలో నలుగురి వంశములు విస్తరిల్లినవి. నృంజయుడను రాజునకు ఇద్దరు కుమార్తెలుండిరి. వారిద్దరును భజమానునకు భార్యలైరి. వారికి అనేకులు కుమారులు కలిగిరి. ఆ అక్కాచెల్లెండ్రలో ‘బాహ్యక’ అను ఆమెకు జన్మించిన కుమారుల వంశమువారిని బాహ్యకు లందురు. బాహ్యక కుమారులలో ముఖ్యులు నిమి-కృమిలుడు-వృష్ణి-అనువారు. దేవామృధుడను రాజు బంధుమిత్రుల కానందము కలిగించువాడు. అతనికి సంతతి కలుగకుండెను. సర్వగుణోపేతుడగు కుమారునికోరి అతడు ఉత్తమ తపస్సాచరించెను. అతడు ఆద్యమగు మంత్ర(ప్రణవ)మును అనుసంధానముచేయుచు పర్లాశా నదీ జలమును స్పృశించెను. (నదీ దేవతను అనుసంధానము చేయుచు జపించెను.) ఇట్లు నిరంతరమును ఉపస్పర్శనము చేయుచుండుటచేతను ఆరాజు శుభగుణములు కలవాడగుటచేతను ఆ నదీదేవత ప్రసన్నురాలై అతనికి ప్రియమును సమకూర్చగోరెను. ఆ దేవావృధుడును తన వలన అట్టి ఉత్తమ పుత్రుని కనకల స్త్రీ యెవ్వరును లభించుట లేదే యని చింతిల్లుచుండుటచే అది ఎరిగి పర్ణాశా నదీదేవత తానే అతనివలన సంతానవతి కాగోరెను. ఆమె సుందరియగు కన్యగా అయి రాజునకు తను తాను తెలుపుకొనెను. రాజమెయందు అనురాగము కలవాడయ్యెను. ఆ దంపతులకు సర్వగుణ సంపన్నుడగు బభ్రుడను కుమారుడు కలిగెను.
మహాత్ములగు ఈ దేవావృధ బభ్రులనెడి తండ్రి కొడుకులగూర్చి పురాణములయందు ‘దూరమునుండి వినుచున్నట్లే సమీపమునుండి చూచు చున్నాము. ఏమనిన-బభ్రువు మనుష్యులలో శ్రేష్ఠుడు. దేవావృధుడు దేవతలతో సమానుడు ఈ మహాత్ములు ఉపదేశించిన యోగము ననుష్ఠించి పదునాలుగువేల అరువదియైదు మంది మోక్షము పొందిరి.” అను అనువంశగీతము వినబడుచున్నది. బభ్రుడు యజ్ఞములు దానములు చేసినవాడు. వీరుడు తత్త్వజ్ఞుడు-దృఢ వ్రతుడు-రూపవంతుడు-మహాతేజశ్శాలి. శాస్త్రజ్ఞానము-వీరత్వముకలవాడు. అతనికి సురనాభుని కుమార్తెయందు కుకురుడు భజమానుడు అగ్ని కంబళబర్హిషుడు అను నలుగురు కుమారులు కలిగిరి. కుకురునకు వృష్ణి-అతనికి ధృతి-అతనికి కపోతరోముడు, అతనికి తైత్తిరి-అతని దౌహిత్రుడే ఇంద్రునికి మిత్రుడు విద్వాంసుడు అగు నలుడు. నందనోద్యానమునందలి దుందుభి అతని పేరుతోనే “నలము” అను పేర ప్రసిద్ధమయి యున్నది. తైత్తిరి చేసిన యజ్ఞ ఫలముగా అభిజాతుడు అతని కొడుకయ్యెను. అభిజాతుడు పుత్రార్థమై అశ్వమేధము చేసెను. ఆ యజ్ఞపు అతిరాత్ర దీక్షయందు సభ్యాగ్ని హోత్రుని నుండి విద్వాంసుడు కర్మజ్ఞుడు యజ్వయగు పునర్వసుడు జన్మించెను. అతనికి ఆహుకుడు ఆహుకిఅను కవలలు పుట్టిరి. వారిద్దరును బుద్ధిమంతులలోకెల్ల గొప్పవారు. “అమ్ముల పొదులు ధనువులు మొదలైన పరికరములు ధ్వజములు కవచములు మొదలగు సాధనములతో నిండినరథములు-ఘంటలు మొదలగువాని మనోహర ధ్వనులతో కూడినవి-ఆహుకునకు పదివేలు గలవు. ఆహుకునిచేత పోషితులగు ఆయా విద్యావంతులు శిల్పులు మొదలగు వారిలో అసత్యవాది ఆతేజస్కుడు యజ్వ కానివాడు వేలకొలది ధనమును ఇతరులకు దానము చేయనివాడు అశుచి అవిద్వాంసుడు ఎవడును భోజజనపదము లందుండెడి వాడుకాడు.” అని ఆహుకుని గూర్చి వైదిక పురాణములందు పెద్దలు ఈ శ్లోకములు చెప్పుదురు. ఈ ఆహుకుడు తన సోదరియగు ఆహుకిని అవంతి దేశరాజునకు ఇచ్చి పెండ్లి చేసెను. అహుకునకు కాశ్యుని కూతువలన దేవకుమారులను పోలిన దేవకుడు ఉగ్రసేనుడు అను కుమారులు కలిగిరి. వీరిలో దేవకునకు దేవులతో సమానులగు వీరులగు కుమారులు దేవవాన్, ఉపదేవుడు, సుదేవుడు, దేవరక్షితుడు అనువారలును దేవకి, శ్రుతదేవి, యశోద, యశోధర, శ్రీదేవి, సత్యదేవి, సుతాపి అను ఏడుగురు కుమార్తెలును కలిగిరి. అతడు ఈకుమార్తెలను వసుదేవున కిచ్చి పెండ్లిచేసెను. ఉగ్రసేనునకు తొమ్మిదిమంది కుమారులు. వారు-కంసుడు-న్యగ్రోధుడు–సునాముడు-కంకుడు–శంకుడు–సుతంతు–రాష్ట్రపాలుడు–శుద్ధముష్టి - సముష్టిదుడు - అనువారు. ఐదుగురు కుమార్తెలు: కంస-కంసవతి-సుతంతు-రాష్ట్రపాలి. కంకా-అనువారు. ఇది కుకురు వంశమునకు చెందిన ఉగ్రసేనుడును అతని సంతతియును.
భజమానునకు విదూరథుడు-అతనికి రాజ్యాధిదేవుడు-అతనికి దేవసమానులు నియమ వ్రతప్రధానులు ఆగు శోణాశ్వశ్వేతవాహనులను వారు కలిగిరి. శోణాశ్వునకు శూరులు రణ విశారదులునగు శమీ-గదశర్మ, నికృతుడు, శక్రజిత్, శత్రుజిత్ అను ఐదుగురు కుమారులు. శమికి కుమారుడు ప్రతిక్షత్రుడు-అతనికి పరిక్షత్రుడు-అతనికి భోజుడు-అతనికి హృదికుడు కలిగిరి. హృదికునకు భీమ పరాక్రములగు పదిమంది కుమారులు కలిగిరి.
వారిలో కృతవర్మ పెద్దవాడు. శతధన్వుడు నడిమివాడు. మిగిలినవారు-దేవార్హుడు-నాభుడు-భీషణుడు-మహాబలుడు-అజాతుడు-వనజాతుడు-కనీయకుడు-కరంభకుడు అనువారు. దేవార్హునకు కంబళ బర్హిషుడు-అతనికి అసమంజుడు-అతనికి తమోజుడు అతనికి సుదంష్ట్రుడు సునాభుడు కృష్ణుడు అను ముగ్గురు కుమారులునుకలిగిరి. ఇది అంధకవంశ క్రమము.