మత్స్య మహా పురాణము
భవిష్యద్రాజాను కీర్తనము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, బృహద్రథులును వీతిహోత్రులును అవంతులును అను రాజవంశములు గడచిన తరువాత పులకుడను వాడు తన ప్రభుని వధించి తన కుమారుని రాజుగా అభిషేకించును; క్షత్రియులందరు చూచుచుండగనే ఏకపుత్రుడగు ఈబాలకుడునయ వర్జితుడు (రాజధర్మానుసారము యోగ్యత లేనివాడు) అయినను తనకు సామంతులెల్లరు ప్రణతులు కాగా నరోత్తముడు అనిపించుకొని ఇరువది మూడేండ్లు పాలించును; తరువాత పాలకుడు ఇరువది ఎనిమిదేండ్లు విశాఖయూపుడు ఏబది మూడేండ్లు సూర్యకుడు ఇరువది యొక్క ఏండ్లు వాని కొడుకు నందివర్ధనుడు ముప్పది ఏండ్లు పాలింతురు; ఇట్లు ఈ ఐదుగురు రాజులును నూట ఏబది రెండు ఏండ్లు (నూట ఏబదియైదేండ్లని యుండవలయును) పాలించి నశింతురు; తరువాత శిశునాగుడు వారి కీర్తియంతయు నశింపజేసి ఆవంశము నణచి, వారాణసి యందు తన కుమారుని రాజుగా నిలిపి తాను గిరివ్రజ మాశ్రయముగా చేసికొని పాలించును, అతడు నలువది ఏండ్లును అతని కుమారుడు కాకవర్ణుడు ఇరువది యారేండ్లును క్షేమధన్వుడు ఇరువది యారేండ్లును క్షేమజిత్తు నలువది ఏండ్లును వింధ్యసేనుడు ఇరువది ఎనిమిది ఏండ్లును కాణ్వాయనుడు తొమ్మిది ఏండ్లును అతని కుమారుడు భూమిమిత్రుడు పదునాలుగేండ్లును అజాత శత్రుడు ఇరువది ఏడు ఏండ్లును వంశకుడు ఇరువది నాలుగేండ్లును ఉదాసి ముప్పది మూడేండ్లును నందివర్ధనుడు నలువదేండ్లును మహానంది నలువది మూడేండ్లును రాజ్యము ఏలుదురు, ఇట్లు ఈ శిశునాగ(క) వంశపువారగు క్షత్ర బంధువులు (సుక్షత్రియులు కానివారు) మూడు వందల అరువది ఏండ్లు పాలింతురు; (ఈ చెప్పినవి కూడగా 350 మాత్రము అగును.)
ఈ శిశునాగులు పాలించుచున్న కాలమందే ఆయా దేశ భాగములందు ఇక్ష్వాకులు ఇరువది నలుగురును పాంచాలురు ఇరువది ఏడుగురును కాశీయులు ఇరువది నలుగురును హైహయులు ఇరువది ఎనిమిది మందియు కళింగులు ఇరువది ఇద్దరును అశ్మకులు ఇరువది యైదు మందియు కురువులు ఇరువదియారు మందియు మైథిలులు ఇరువది ఎనిమిది మందియు శూరసేనులు ఇరువది ముగ్గురును వీతిహోత్రులు ఇరువది మందియు పాలింతురు; మహానందికి శూద్ర స్త్రీయందు కలి అంశమున మహాపద్ముడను సర్వక్షత్రాంతకుడగు కుమారుడు కలుగును; అది మొదలు (ఆ వంశపు రాజులు శూద్ర యోనులు (జాతీయులు)అగుదురు, భవిష్యదదృష్ట ప్రేరితుడై సర్వ క్షత్రియులను నశింపజేసి అతడు ఈ పృథివియందు ఏకరాట్టును ఏకచ్ఛత్రుడును అగును. అతడట్లు ఎనుబది ఎనిమిదేండ్లు పాలించును; ఆ మహాపద్ముని కుమారులు పండ్రెండు మందియు సుమాల్యుడు మొదలగువారు పండ్రెండేండ్లు పాలింతురు, అటుతరువాత కౌటిల్యుడు వారిని పెల్లగించి చంద్రగుప్తుని రాజ్యాభిషిక్తుని చేయును; అతడు నూరేండ్లు రాజ్యమేలును; అటుతరువాత వారి రాజ్యము మౌర్యులలో అనంతర రాజులకు పోవును; తరువాత చంద్రగుప్తుని పుత్రుడు శతధన్వుడారేండ్లు వాని కుమారుడు బృహద్రథుడు డెబ్బది ఏండ్లు తరువాత శకుడను వాడు ఇరువది ఆరేండ్లు వాని ముని మనుమడు దెబ్బది ఏండ్లు పాలింతురు.
వాని కుమారుడు దశరథుడు ఎనిమిదేండ్లు, వాని కుమారుడు తొమ్మిదేండ్లు వాని కుమారుడు డెబ్బదిఏండ్లు పాలింతురు. ఇట్లు మౌర్యులు పదిమంది నూటఇరువది ఏడు సంవత్సరములు పాలింతురు. తరువాత ఆ రాజ్యము శుంగవంశము వారికి పోవును; కడపటి బృహద్రథ వంశీయుని నుండి వాని సేనాపతియగు పుష్యమిత్రుడు రాజ్యము లాగికొని ముప్పది ఆరేండ్లు పాలించును, తరువాత వసుమిత్రుడు పదేండ్లును వసుజ్యేష్ఠుడు పదేండ్లును వాని కుమారు దంతకుడు రెండేండ్లును పుళిందకుడును వజ్రమిత్రుడును ఈ ఇరువురును మొత్తము మూడేండ్లును పునర్భవుడు రెండు సంవత్సరములును సమాభాగుడు ముప్పది రెండు సంవత్సరములును వాని కుమారుడు దేవభూమి పది ఏండ్లును పాలింతురు; ఇట్లీ క్షుద్ర (శుంగ) రాజులు పది మందియు నూరేండ్లు ఈభూమిని అనుభవింతురు; తరువాత రాజ్యము శుంగులను విడిచి శుంగ భృత్యులకు (కాణ్వాయనులకు) పోవును, (ఇచట మూలమునందు శుంగ పదము శుంగ భృత్యులు అను నర్థములో వాడబడినది;) దేవభూమియను వ్యసనియగు రాజును ఉన్మూలించి అతని యమాత్యుడగు వసుదేవుడు రాజగును; వీరి వంశము కాణ్వాయన (శుంగ భృత్య) వంశము; ఇతడు తొమ్మిదేండ్లు పాలించును, తరువాత అతని కుమారుడు భూమిమిత్రుడు పదునాలుగేండ్లును వాని కుమారుడు నారాయణుడు పండ్రెండేండ్లును వాని కుమారుడు సుశర్మ పదేండ్లు పాలింతురు, ఈ వంశపు రాజులకు శుంగభృత్యులు కాణ్వాయనులు అని వ్యవహారము. ఈ నలుగురు కాణ్వాయన బ్రాహ్మణులును నలువదియైదేండ్లు రాజ్య మేలుదురు; వీరందరును ప్రనత సామంతులును ధార్మికులును అగుదురు; వీరి అనంతరము భూపాలన అధికారము వీరి నుండి తొలగి ఆంధ్ర (ఆంధ్ర) రాజులకు పోవును.