మత్స్య మహా పురాణము
వాస్తు కర్మల ఆరంభమున శకునాదికము
గృహ నిర్మాణమునకై సూత్ర పాతము- స్తంభోచ్ఛాయము (స్తంభ ప్రతిష్ఠ) గృహ ప్రవేశము మొదలగు సందర్భములందు శిల్పి శకునాదికమునుబట్టి శుభాశుభ ఫలోదయమును గురుతించ వలయును. ఎట్లనగా 1. పక్షి ఏదైయినను సూర్యాభి ముఖముగ పరుషముగా కూయుటయు గృహస్వామికి అవయవమేదయిన అదరుటయు ఒకే మారు జరిగినచో వాస్తు పురుషుని ఆ అవయవ భాగమునకు సరిపడు ఆ గృహ నిర్మాణ ప్రదేశమున భయప్రదమగు నరాస్థి ఉన్నదని తెలియవలెను. 2. వాస్తు చక్రము లిఖించి ఆయా గురుతులు గురుతించిన వెంటనే ఆ స్థలమందు ఏనుగు గుర్రము మరేదైన క్రూర ప్రాణివచ్చి నిలిచినచో ఆ తావున శల్యముండును; 3. సూత్రమును మొదటిసారిగా కొలతకై ప్రసారించునపుడు కుక్కయో, నక్కయో ఆ స్థలమునందలి ఏతావునకు దుమికి నిలుచునో, -ఎచ్చట అది భయంకరముగ అరచునో, అచ్చట శల్యముండును; 4. ఆ స్థలపు ఈశాన్యదిశయందు కాకిమధురముగా కూసినచో ఆ స్థలమందును అది మరెచ్చట నైన కూర్చుండి మధురముగా కూసినచో ఆ ప్రదేశమునందును ధనము లభించును. సూత్రపాత సమయమున సూత్రము తెగినచో గృహస్వామికి మృత్యువు కలుగును; సూత్రము కట్టుటకు ఉద్దేశించిన కీలము తలక్రిందులయినచో వ్యాధి కలుగును; ఆ భూమియందు బొగ్గులు వచ్చినచో ఉన్మాదము, కపాలములు వచ్చినచో సంశయము, శంఖములుకాని, ఎముకలు కాని వచ్చినచో ఆ ఇంటి స్త్రీలలో జారిణీత్వము కలుగును; శిల్పితడబడినచో గృహస్వామియు గృహమును నాశమందుట జరుగును.
స్తంభమునకు మొదట రాతిపైనుంచిన జల కుంభము తన తావు నుండి జారినచో శిరో వ్యాధి-కుంభము దొంగిలింపబడినను (తన తావు నుండి తొలగినను) వంశ నాశము- అది తనతావు నుండి జారినచో మృత్యువును - పగిలినచో బంధమును కలుగును; కర (మూరల) సంఖ్యలను తెలుపు గురుతులు చెడిపోయినచో గృహస్వామికి నాశము; ఆచట చల్లిన బీజములు ఓషధులు చెడినచో భూతముల నుండి భయము కలుగును; ఈ స్తంభముపై ఆగ్నేయమున గొడుగుంచ వలయును; ఇట్లు ప్రథమ స్తంభ ప్రతిష్ఠ ఆగ్నేయమున జరిగిన తరువాత వివేకియగు శిల్పి ప్రదక్షిణ క్రమమున ఆయా ఇతర స్తంభములను కూడ నిలుపుచు పోవలయును; అప్రదక్షి ణముగ ఇతర స్తంభములుంచుట భయప్రదము; కావున స్తంభపు ప్రతిష్ఠచే కలుగదగు ఏ ఉపద్రవములును కలుగకుండ రక్షణలు (జాగ్రత్తలు) పూనవలయును; ఈ ప్రథమ స్తంభముపై పండ్లతో కూడినచెట్ల కొమ్మలు ఏవయిన కట్టవలయును; గృహ నిర్మాణ విషయమున అన్నియును తూర్పునకో ఉత్తరమునకో వాలుగ నుండునట్లు నిర్మించవలయును; అంతేకాని దిక్కుల విషయము పట్టించుకొనకుండ (దిఙ్మూఢముగ) తోచినట్లుగా స్తంభ ప్రతిష్ఠకాని భవన నిర్మాణముకాని ద్వారముకాని నివాస గృహముకాని ఏదియు చేయరాదు; దానిచే వంశ నాశమగును.