విభూతి ద్వాదశీ వ్రతము

నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పసాగెను! సర్వోత్తమమగు విష్ణుదేవతాక వ్రతమును మరియొక దానిని చెప్పెదను. విభూతి ద్వాదశీ వ్రతమనునది సర్వామరుల ప్రశంసల నందుకొనునది. చైత్ర వైశాఖాషాఢ కార్తీక మార్గశీర్ష ఫాల్గుణ మాసములలో దేనియందైన శుక్ల దశమినాడు లఘు భోజనముచేసి అనాటి సాయం సంధ్యా వందనమయిన తరువాత “నేను రేపు ఏకాదశినాడు నిరాహారుడనై జనార్దనుని అభ్యర్చించి ద్వాదశినాడు ద్విజులతోకూడి భుజింతును. నా ఈవ్రతము నిర్విఘ్నమును సఫలమగుగాక! మధుసూదనా!” అని సంకల్పించి నియమము పూనవలెను. రాత్రి నిద్రించునపుడును ‘నమో నారాయణాయ’ అని ధ్యానించుచుండ వలెను. ఏకాదశినాటి ఉదయమున మేల్కాంచి స్నాన జపములు చేసి శుచియై గంధమాల్యాను లేపనములతో పుండరీకాక్షుని పూజించవలెను.

బంగారుతో కలువపూవును మత్స్యమును చేయించి అవియును-వానితోపాటు ఉదకుంభమును-పాత్రయందు నూవులును బెల్లమును నింపి పచ్చని వస్త్రముతో దానిని కప్పి అదియు స్వామి ముందుంచవలెను. ఇతిహాస కథాది శ్రవణముతో జాగరణము చేసి ఆ రాత్రి గడుప వలెను. ద్వాదశినాటి ఉదయమున కుటుంబియగు బ్రాహ్మణునకు కలువపూవును మత్స్యమును ఉదకుంభమును గుడతిలపాత్రమును దానము చేయవలెను. దాని ప్రార్థనా మంత్రము: “విష్ణో! సర్వ విభూతి యుక్తుడవగు నీవు అశేష దుఃఖ సంసార పంకము నుండి నన్నుద్ధరించుము.” ఇట్లే సంవత్సరముపాటు మత్స్యాది దశావతార ప్రతిమలను దత్తాత్రేయ వ్యాసాదుల ప్రతిమలను కలువపూవును బంగారుతో చేయించి ఇచ్చుచుండవలెను. ఈ కాలము నందు పాషండుల (వేద నిందకుల)తో సంబంధమును ఏ మాత్రము పెట్టుకొనరాదు.

ఇట్లు యథాశక్తిగా పండ్రెండు ద్వాదశులను గడపి సంవత్సరాంతమున గురుని వస్త్రాలంకార భూషణములతో పూజించి లవణ పర్వతమును శయ్యను పాడి ఆవును గ్రామమును పొలమును భవనమును (శక్తిని బట్టి) ఈయవలెను. ఇతర బ్రాహ్మణులను కూడ యథాశక్తి భుజింపజేసి వస్త్ర గోరత్న ధనాదిక దానములచే సంతోషపరచవలెను. శక్తిలేనివాడు అల్పముగను ఈయవచ్చును. మరియు అల్పధనుడు పుష్పార్చన విధానముతో మూడుసంవత్సరములు మాధవుని ఇట్లర్చించవచ్చును.

దీని నాచరించుటచే తాను తరించి పాపనిర్ముక్తుడై నూర్గురను పితరులనుకూడ తరింప జేయును. ఈ ఫలము అతనికి నూర్ల-వేల జన్మములవరకు వెంట నుండును. అతనికి వ్యాధులు దారిద్ర్యము బంధనము కలుగవు. అతడు శైవుడైనను, వైష్ణవుడైనను దీని ఫలముగ నూట ఎనిమిదివేల యుగములపాటు స్వర్గమున వసించి కల్పాంతానంతర సృష్టిలో భూపతిగా జన్మించును.