పార్వతి నలుపు విషయమున శివుడు పరిహసించుట

“సుందరీ! తెల్లగా ప్రకాశించు నాదేహమున నీ మేనిచాయ చందనవృక్షమును చుట్టుకొనిన నల్లని శుద్ధమగు ఆడు త్రాచువలె నున్నది. మనోహరాకాశమున వెన్నెలతో కూడిన కృష్ణపక్ష రాత్రివలె నాకు దృష్టి దోషము కలిగించుచున్నావు” అనిన శివునితో పార్వతి కోపరక్త నేత్రయై కనుబొమలు వికృతముగా ముడివేసి బిగ్గరగా ఇట్లనెను. ప్రతివాడును తన బుద్ధి మాంద్యముచే తానే అవమానమందును. చంద్రభూషణా! యాచించిన వాడు అవమానము పొందక తప్పదు. ఏదో కోరి చిరకాలము నేనాచరించిన తపస్సునకు ఫలమీ అవమానము అడుగడుగున తగులు చున్నది. శర్వా! నేను కుటిలను కాను; ధూర్జటీ! నేను విషమనుకాను; నీవు విషము (తలపై గంగా జలము-కంఠమున విషము) కలవాడవు; దోషాకరునకు (రాత్రిని ఏర్పరచు చంద్రునకు-దోషములకుగని యగు వానికి) ఆశ్రయుడవు అని కీర్తిగాంచినవాడవు; నేను పూషుడను ఆదిత్యుని దంతములును భగుడను ఆదిత్యుని కన్నులునుకాను! ద్వాదశాత్ముడగు ఆదిత్యు (సూర్యు)నకును ఇది తెలియును; నీ తప్పులు నీకు ఉండగా నన్ను నిందించు నీచే నాకు తలనొప్పిగా నున్నది; నన్ను కృష్ణ (నల్లనిది) అనిన నీకు మహాకాలుడు (చాల నల్లనివాడు) అని ప్రసిద్ధి లేదా! తపస్సుచే దేహముత్యజింప నేను గిరికేగుచున్నాను. ధూర్తునిచే అవమాన మందిన నాకు జీవితముతో పనిలేదు. ఇట్లు కోపముతో తీక్షాక్షరముగా పలికిన పార్వతి మాటలు విని తడబాటుతో మిశ్రమయిన అనురాగమున చంద్రశేఖరుడగు భవుడు ఇట్లనెను:

గిరిజా! నీవు పర్వతరాజ పుత్రివికదా! నా విషయము నీకు తెలియదు. నేను నిన్ను నిందింతునా? నిన్ను ప్రశంసించు తలపుతోనే విలాసమునకై ఆ మాట అంటిని. స్వస్థ చిత్తము కలవానికి కూడ ఒకప్పుడు చిత్తవికారము కలుగవచ్చును కాని నా చిత్తమున అట్టి మార్పు ఎన్నడును కలుగదు. కాని పిరికిదానా! ఒక వేళ నీకిందులకై కోపమే వచ్చినచో మరెన్నడు వినోదములు పలుకను; నిర్మలమగు చిరునవ్వు కలదానవు కమ్ము; కోపము మానుము; దోసిలిపట్టి శిరసు వంచి నమస్కరించుచున్నాను. ఎంత స్నేహము కలవారైనను తన్ను అవమానించినను నిందించినను వినోద వచనములు తగిలినను మనస్సు మార్పు పొందుట దుర్జనుల లక్షణము కాని సజ్జన లక్షణముకాదు. కాని శివుడనిన పైమాట దేవికి మర్మమున తాకుటచే తరువాత శివుడెంత బుజ్జగించినను, నచ్చజెప్పినను ఆమె కోపము విడువలేదు. శంకరుడు చేతితో గట్టిగ పట్టిన వస్త్రపు కొంగు కూడ చట్టున కొట్టినట్లు వదలించుకొని గిరిజ చెదరిన ముంగురులు తోనే పోవుటకు సిద్ధపడెను. ఆమె అట్లు కోపముతో పోవుచుండ పురాంతకుడు మరల ఇట్లనెను, “నీవు అన్ని అంశములందును నీ తండ్రినిపోలిన కూతురవు; మేఘ సమూహములతో కల్లోలితముగా వ్యాప్తమయిన నీ తండ్రి శిఖరములతో నీ మనస్సును చొరశక్యముకాని అడవుల నుండి నీ హృదయమును ఏర్పడినవి; కఠినత్వము వనము లందలి వృక్షముల నుండి నేర్చితివి, నీ తండ్రియందలి త్రోవలనుండి వంకరలు నేర్చితివి; మంచు మొదలగు వాని నుండి ఎవరికిని సేవింపనలవి కాకపోవుట నీకబ్బినది సుందరీ! ఇదియంతయు నీకు హిమవంతునినుండి సంక్రమించినది సుమా! అని శివుడు పలుక గిరిజ మరింత కోపముతో కన్నులెర్రవడగా పెద వులు వణకుచుండ ఇట్లనెను.

“తప్పులారోపించి సద్గుణవంతులగు ఇతరుల నెందులకు అడిపోసికొనెదవు? నీవనిన దోషములును మాకు దుష్ట సంసర్గము వలననే సంక్రమించినవి. (నీకుగల) సర్పములనుండి వంకరతనమును నీ భస్మముతో స్నేహమును గట్టిపరచుటయు (బూడిద జిడ్డును అనగా - స్నేహమును-తొలగించును) నీ చంద్రుని వలన హృదయ మాలిన్యమును నీ కుత్తుక యందలి విషమువలన చెడు మాటలును మాకు వచ్చినవి; ఎక్కువ చెప్పవలసిన దేమున్నది; నోటికి శ్రమ కలిగించు కొనవలదు; వల్లకాటియందు నివసించు నీకు భయమేమి? దిసమొలతో నుండు నీకు సిగ్గేమి? తల పుర్రెలు పట్టుకొని తిరుగు నీకు దయఏమి? అదెప్పుడో పోయినది” అనిపలుకుచు హిమాద్రిపుత్రి ఆ మందిరము నుండి వెడలిపోసాగెను. పార్వతి యట్టు పోవుచుండ ప్రమథులు కిలకిల (దుఃఖ) ధ్వని చేసిరి. అమ్మా! ఎక్కడికి పోవుచున్నావని ఏడ్చిరి. వెంటపరుగెత్తిరి. వీరకుడు దేవి పాదములు పట్టుకొని కన్నీటితో డగ్గుత్తికతో ఇట్లనెను: తల్లీ! ఇదియేమి? కోపించిన మనస్సుతో ఎక్కడికి పోవుచున్నావు? నీవు స్నేహము వదలిపోవుచున్నను నేను నీవెంట వత్తును. లేక నీవు నన్ను వదలినచో ఈగిరి శిఖరము నుండి క్రింద పడెదను. అనగా దేవి తన కుడిచేతితో వీరకుని మొగమెత్తి (ప్రీతిచూపుచు) అతనితో ఇట్లనెను: నాయనా! శోకమును భావన చేయకుము. నీవు నావెంట వచ్చుటకాని పర్వతాగ్రము నుండి పడుట కాని తగదు. ఏ పనితో పోవుచున్నానో చెప్పద వినుము; హరుడు నన్ను నల్లని దానవనెను; దానితో నామనస్సు గట్టిపడినది; కనుక నేను తపమాచరించి గౌరత్వము (తెల్లదనము) పొందుదును. ఈ దేవుడు స్త్రీలంపటుడని పించుచున్నది. కనుక నేను వెడలిన తరువాత నీవు ఎట్టివారికి ఏ అవకాశము నీయక ద్వారరక్ష సేయుచుండవలయును. శివునికడకు అన్యస్త్రీ ఎవరును ప్రవేశింపరాదు. అట్లెవరైన ప్రవేశించినచో నాకు చెప్పుము. తరువాత శీఘ్రమే నేను తగినట్లు చేయుదును. వీరకుడు వెంటనే సరే అనెను. తల్లి అజ్ఞ అమృతమయి కలిగించిన ఆహ్లాదముతో అతని సంతాపము తగ్గెను. శరీరమును మనస్సును చల్లనయ్యెను. అతడు వెంటనే అమ్మకు నమస్కరించి కక్షాంతరమును కనిపెట్టి చూచుటకై బయలుదేరెను.