కౌశిక వంశీయులు విష్ణులోకమును పొందుట

ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి. “కౌశిక వంశీయులు తాము జరిపిన శ్రాద్ధమునకు ఫలముగా ఉత్తమమగు యోగమును ఎట్లు పొందగలిగిరి? ఐదు జన్మముల సంబంధముతోనే వారికి కర్మక్షయము కలిగి విష్ణులోక ప్రాప్తి ఎట్లు కలిగెను?”

సూతుడు వారికి ఇట్లు చెప్ప నారంభించెను, పూర్వము కురుక్షేత్రమునందు కౌశికుడు అను ధర్మాత్ముడగు మహర్షి యుండెడివాడు. అతనికి ఏడుమంది కుమారులు ఉండిరి. వారు తమ పేరులకు తగిన కర్మలను ఆచరించెడివారు. ఎట్లన స్వసృపుడు ఇష్టముననుసరించి నడుచు కొనువాడు, క్రోధనుడు--కోపస్వభావము కలవాడు; హింద్రుడు-ఇతరులకు అకారణముగా బాధ కలిగించువాడు; పిశునుడు - చాడీలు చెప్పువాడు; కవి- కవిత్వము అల్లగలవాడు; వాగ్దుష్టుడు- చెడునోటివాడు; పితృవర్తి-తండ్రియందు భక్తితో నడుకొనువాడు అని వారి పేరులు. వీరు అందరును గర్గమునికి శిష్యులయి విద్యల నభ్యసించిరి. కొంతకాలమునకు వీరి తండ్రి మర ణించెను. పిమ్మట ఒకప్పుడు భయంకరమగు కరవువచ్చెను. సర్వలోకములకు భయం కరమగు దీర్ఘకాలికమగు అనావృష్టి ఏర్పడెను. ఈ ఏడుగురు తపోధనులును గర్గుని ఆజ్ఞచే ఆమునియొక్క పాడి ఆవును మేపుచుండగా వారిలో కొందరు “మనము ఆకలితో చాల బాధపడుచున్నాము. ఈకపిల గోవును చంపి తిందము” అనిరి. వారిలో కడపటివాడు ఇది పాపకరమని చెప్పెను. ఒకవేళ మనము దీనిని చంపి తినుట తప్పనిసరి ఐనచో పితృశ్రాద్ధము జరుపుదము. దానిలో దీనిని వినియోగించితిందము. ఆ విధముగాచేసి తినినచో మనకు పాపము అంటదు. గోవధపాపము నశించును అనికూడ అతడు (పితృవర్తి) పలికెను. మిగిలినవారు అతని మాట సరేయనిరి. వారి అనుమతితో అతడు శ్రద్ధతో శ్రాద్ధము జరిపెను. ఆ శ్రాద్ధమునందు అ గోవును అన్నమునకు మారుగా ఉపయోగించెను. పితృస్థానము నందు ముగ్గురను దైవస్థానమునందు ఇద్దరను తన సోదరులనే అర్చించి భోక్తలుగా కూర్చుండ బెట్టి భుజింపజేసెను. మరి యొకనిని అతిథిగా గ్రహించి భుజింపచేసెను. తాను శ్రాద్ధకర్త అయి ఆ పితృభక్తి పరాయణుడు మంత్రపూర్వకముగా శ్రాద్ధము జరిపెను. తరువాత వారు గోవులేకుండ దూడను ఒక్కదానినే గురునకు అప్పగించిరి. ఆవును పులి చంపినది. ఈ దూడను మాత్రమే తీసికొనుడు. అని అప్పగించిరి. ఇట్లు ఆ తపోధనులు ఏడుగురును వేదవిధిని బలముగా (ప్రమాణముగా) ఆశ్రయించి నిర్భయులై క్రూరకర్మము జరిపి గోవును తినిరి. తరువాత కొంతకాలమునకు వారు యమునికి వశులై మరణించిరి. మరు జన్మమునవారు దశార్ణదేశ రాజధానియగు దశ పురమున వ్యాధులు (బోయవారు) గా పుట్టిరి. పితృ శ్రాద్ధముతో శ్రద్ధతో జరిపిన శ్రద్ధాభావముతో భావితులై (సంస్కారముపొంది) నందున పూర్వజన్మ స్మరణము వారికి కలిగియుండెను. వారు చేసిన క్రూరకర్మకు ఫలముగా క్రూరకర్ములగు బోయల ఇంట జన్మించిరి. వారు వైరాగ్యముతో తమ జీవితము గడపిరి. అనశన (నిరాహార) వ్రతముతో దేహమువదలి తరువాత జన్మములో కాలంజర పర్వతమున పూర్వజన్మ స్మృతికల లేళ్లుగా జన్మించిరి. అచటను వారు శివుని సన్నిధిలో జ్ఞానవైరాగ్యములతో ధర్మముతో జీవించి తుదకు దేహము వదలిరి. వారు ఈమృగ జన్మమున తీర్థవాసముతోను అనశన వ్రతముతోను దేహ త్యాగము చేయుటను అచటిజనులు అందరును ప్రత్యక్షముగా చూచిరి. తరువాత వారు మానస సరస్సులో యోగులగు చక్రవాక పక్షులుగా జన్మించిరి. వారి పేరులు ఈ జన్మములో సుమనుడు మంచి మనస్సు కలవాడు; కుముదుడు లోకమునకు సంతోషము కలిగించువాడు; శుద్ధుడు-నిర్మలుడు; ఛిద్రదర్శి-ఇతరుల దోషములను ఎత్తి చూపువాడు; సునేత్రుడు- మంచిని చూచువాడు; అనేత్రుడుఏమియు చూడనివాడు; అంశుమంతుడు - కిరణ ప్రకాశము కలవాడు. వారు తమ పేరునకు తగినట్లు కర్మల నాచరించు చుండిరి. వీరు ఏడుమందియు యోగతత్త్వము నెరిగినవారయి యుండిరి. కాని వారిలో ముగ్గురు యోగ భ్రష్టులయి తక్కువ బుద్ధి శక్తికలవారయి యుండిరి.

ఒకనాడు వారు పాంచాల దేశరాజగు వైభ్రాజుడను నతనిని చూచిరి. ఆ రాజు ఒక ఉద్యానవనమున భార్యలతో కూడి వివిధ విలాసభావములతో విహరించుచుండెను.

ఈ కౌశిక కుమారులలో కడపటివాడు తండ్రియందు భక్తి కలవాడయి యుండి భక్తితో శ్రద్ధతో పితృ శ్రాద్ధమును జరిపిన పితృవర్తి అను నాతడు ఈ రాజును చూచి తానును రాజు కావలెనని సంకల్పించెను. మిగిలిన వారిలో ఇద్దరు అధికమగు పరివారమును వాహనము లును కలిగియున్న రాజమంత్రులను ఇద్దరను చూచి తామును అట్లు మంత్రులు కావలెనని కోరుకొనిరి. (వీరు ముగ్గురును యోగభ్రష్టులు) మిగిలిన నలుగురును ఏమియు కోరుకొనలేదు. తరువాత జన్మమున పితృవర్తి అనునాతడు ఈ వైభ్రాజుడను పాంచాలరాజునకు కుమారుడయి బ్రహ్మదత్తుడను పేర పుట్టెను. మిగిలిన వారు ఇద్దరును కండరీక సువాలకులు అనుపేర విభ్రాజుని మంత్రికి కుమారులైరి. ఏ కోరికలు లేని నలుగురును బ్రాహ్మణులై పుట్టిరి. కొంతకాలమునకు పండితుడగు పురోహితునిచేత బ్రహ్మదత్తుడు పాంచాల రాజుగా పట్టాభిషిక్తు డయ్యెను. అతడు విక్రమము కలవాడు. సర్వశాస్త్ర విశారదుడు. యోగము నెరిగిన వాడు. సర్వప్రాణుల ధ్వని విశేషములను ఎరిగినవాడు.

కౌశిక పుత్రులు జరిపిన శ్రాద్ధమున ఉపయోగింపబడినదగు గల్గుని కపిలగోవును ఈ కాలమున దేవలుడను రాజునకు కుమార్తెగా సన్నతి అను పేరుతో జన్మించెను. పితృకార్యమున ఉపయోగింపబడిన ఫలమున ఆమె వేదతత్త్వ వేత్రియయ్యెను. విభ్రాజరాజు పాలనము చేయు చుండెను.

ఒకనాడు బ్రహ్మదత్తునకు ఉద్యానవనమున కామ ప్రవృత్తి హేతువుగా కలహించు కొనుచున్న చీమల దంపతులు కనబడెను. మగచీమ కామబాణముల తాకిడిచే తన శరీరము కంపించుచుండ డగ్గుత్తికలో సరిగా మాట రాకపోగా ఆడు చీమను బ్రతిమాలుచు ఇట్లు పలికెను: “నీతో సమానురాలగు స్త్రీ లోకమునందు ఎవ్వతెయు ఎక్కడను లేదు. నీ నడుము సన్ననిది. నీ కటి ప్రదేశము విశాలమయినది. నీ వక్షోజములు చాలపెద్దవి. నీ నడక ధీరమయినది. నీది బంగారు ఛాయ. నాయందు భక్తి కలదానవు. నీకు బెల్లము మీదను చక్కెర మీదను ప్రీతి ఎక్కువ. నేను భుజించనిదే నీవు భుజించవు. నేను స్నానము చేయనిదే స్నానమాడవు. నేను దూర దేశమునకు పోయినచో నీవు దీనురాలై యుందువు. నేను కోపించినచో భయముతో వణకిపోదువు. కల్యాణీ! ఇట్టి నీవు ఇపుడు ముఖమున రోషముతో ఏల ఉన్నావు?”

మగచీమ మాటలు విని ఆడుచీమ కోపముతో ఇట్లు పలికెను, “ఇతరుల మనస్సును నొప్పించువాడా! నీవు నన్ను పలుకరించకుము. నీవు నిన్నటి దినమున చాల మత్తతతో లడ్డు పొడిని నాకు ఈయక మరియెక ఆడుచీమను అభిలషించి ఆమెకు ఇచ్చినావు.”

మగచీమ మరల ఇట్లు పలికెను, “ఓ సుందరీ! నీ పోలికతో ఉండుటచే తెలియక నేను ఆ లడ్డు పొడి వేరొక చీమకు ఇచ్చితిని. నీవు కోపింపకుము. నీవు నేను చేసిన ఈ ఒక అపరాధమును క్షమింపుము. ఈ జీవితములో మరి ఇంకెప్పుడును ఇటువంటి తప్పుచేయను. సత్యము ప్రమాణముగా నీ పాదములు పట్టుకొనుచున్నాను. నమస్కరించుచున్నాను. నన్ననుగ్రహించుము.”

ఇట్లు పలికిన మగచీమ మాటలు విని ఆ ఆడుచీమ కోపము విడిచి ప్రసన్నురాలయ్యెను. తన్ను తాను ఆమె తనప్రియునకు సమర్పించుకొనెను. బ్రహ్మదత్తుడును ఈ విషయమంతయు ఎరిగి ఆశ్చర్యము పొందెను. విష్ణుదేవుని అనుగ్రహమున సర్వప్రాణుల ధ్వనులను వాటి అర్థమును అతడు ఎరిగియుండుటయే ఇందులకు హేతువు.