మత్స్య మహా పురాణము
సావిత్రీ సత్యవంతులు తమ ఆశ్రమమున కేగుట
మత్స్యనారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను. అనంతరము పతివ్రతయు ఉత్తమ స్త్రీయు అగు సావిత్రి సత్యవంతుడు మరణించిన చోటికి తాను వచ్చిన త్రోవనే పోయెను; సుందరాంగియగు ఆమె సూర్యాస్తమయ సమయమునకు తన భర్తనుచేరి అతని తలను తన తొడపై నుంచుకొని కూర్చుండెను; ధర్మరాజు నుండి విడుదల పొందిన సత్యవంతుడును మెల్లమెల్లగా కన్నులు తెరవసాగెను; కదలసాగెను, మనురాజా! అనంతర మతడు ప్రాణములు మరలరాగా తన ప్రియురాలితో ఇట్లనెను. ఇంతకుమునుపు నన్ను పట్టిలాగుచుండిన ఆ పురుషుడు ఎచ్చటికి పోయెను? శుభవగు వరారోహా! ఆ పురుషుడు ఎవరో నీకు తెలియునా? మనోహరాంగీ! ఈ అడవిలో నిద్రించుచుండగనే పగలు గడచినది; నా మూలమున నీవు ఉపవాసముతో కృశాంగివయితివి, మనమీది బెంగతో మన తల్లిదండ్రులు దుఃఖించుచుందురు. వారిని త్వరగా చూడవలెననియున్నది. త్వరగా పోదముపద. అన సావిత్రి ఇట్లనెను: ప్రభూ! మీ ఇష్టము ఎట్లో అట్లే చేయుదము. ఆదిత్యుడు అస్తమించు వేళకులోగానే ఆశ్రమమునకు పోవుదము, తల్లిదండ్రులును కన్నులు లేనివారుగదా! జరిగినదంతయు అక్కడనే - ఆశ్రమమునందే చెప్పెదను. ఇంత మాత్రము చెప్పి ఆమె తన భర్తతో కూడి వెంటనే వెడలెను; అతనితో కూడియే ఆశ్రమమునకు చేరెను కూడ. అంతకు లోపలనే ఆ రాజు ద్యుమత్సేనుడును అతని భార్యయును కనులు వచ్చి ఓభార్గవా! మనూ! తన అనుగు కొడుకును చిక్కియున్న కోడలును ఇంకను రాలేదేయని పరితపించుచుండిరి. అచటి తపోధనులు వారిని ఓదార్చుచుండిరి. అంతలోనే తమ కోడలితో కూడివచ్చుచున్న కుమారుడు వారికి కనబడెను. ఉత్తమస్ర్తీయగు సావిత్రి తన పతియగు సత్యవంతునితో కూడి రాజానందకరుడగు ద్యుమత్సేన రాజును అతని భార్యకు నమస్కరించెను. సత్యవంతుడు తండ్రిచే కౌగిలించుకొనబడెను. ధర్మవిదుడుగు ఆ రాజకుమారుడు ఆ వనమందలి తపోధనులను అందరకు నమస్కరించి ఆ రాత్రియంతయు ఆ ఋషులతోకూడ గడపెను.
తరువాత ఉత్తమ స్త్రీయగు సావిత్రియు జరిగినదంతయు అచటి వారికి చెప్పెను. ఆ రాత్రియందే ఆమె ఉపవాసవ్రత సమాప్తిని కూడ చేసెను, ఆ రాత్రి కడపటి జాము ముగియు వేళకు ఆ ద్యుమత్సేనుని పరిజనమంతయు సైన్యమును వెంటగొని ఆ రాజును రాజ్యపాలనమునకై రమ్మని పిలువవచ్చెను; ప్రకృతి (ప్రజా) జనమగు తమ్ము పాలించుమనియు వారు ద్యుమత్సేనుని ప్రార్థించిరి; వారిట్లనిరి; రాజా! కన్నులులేని నీ రాజ్యమును ఎవడు అపహరించెనో ఆరాజును నీ మంత్రులు చంపివేసిరి. ఆపురమునందు ఇపుడు నీవే రాజువు. అనగా విని ఆద్యుమత్సేన రాజు చతురంగ బలముతోపోయి మహాత్ముడగు ధర్మరాజు అనుగ్రహమున తన సకల రాజ్యమును పొందెను. ఉత్తమాంగనయగు సావిత్రియు నూరుగురు తమ్ములు కలదయ్యెను, పతివ్రతయు ఋజువర్తనము, వరారోహయునగు ఆ రాజ పుత్రి ఇట్లు తన పితృపక్షమును పతిపక్షమును కూడ ఉద్దరించెను, మృత్యుపాశవశగతుడైన భర్తను విడిపించుకొనెను; కావున మానవులు పతివ్రతలను దేవతలనువలె పూజించవలెను, రాజా! వారి అనుగ్రహముననే ఈ జగత్రయమును నిలుపబడుచున్నది, ఈలోకమందు వారేది పలికిన అదిసత్యమై జరుగును! సకల కామ సిద్ధియు కావలెనని కోరుకొనువారు సదా వారిని పూజించుచుండవలయును.