మత్స్య మహా పురాణము
యయాతి ఉపదేశము
“బ్రహ్మచారి-గృహస్థుడు-సంప్రదాయాను సారముగ ఆ ఆశ్రమపు నియమములందు అభినివేశము కల వానప్రస్థుడు సన్యాసి-వీరు ఎట్లు నడుచుకొనినచో ఆయా ఆశ్రమ ధర్మముల నాచరించిన పుణ్యమును ఫలమును పొందగలుగుదురు? ఈ విషయము నందు అనేక విధముల గు భేదములను ఆయా ఋషులు చెప్పుచున్నారు” అని అష్టకుడు అడుగా యయాతి ఇట్లు చెప్పెను. “బ్రహ్మచారి గురువు పిలిచినప్పుడు వచ్చి అధ్యయనము చేయవలెను. అడుగనిదే చెప్పనిదే గురుని పనులు చేయవలెను. గురునికంటె ముందు మేల్కొనవలెను. గురుని తరువాత నిదుర పోవలెను. మృదు స్వభావము ఇంద్రియనిగ్రహము నిబ్బరము హెచ్చరిక స్వాధ్యాయము చేయుట-ఈగుణములు కలిగియున్నచో అతని ఆశ్రమ ధర్మములు సిద్ధించును. ధర్మముచే ధనము నార్జించ వలెను. దానితోనే యజ్ఞములు చేయవలెను. దానినే దానము చేయవలెను. దానితోనే అతిథులను భుజింపజేయవలెను. ఇతరులు తమంతతాము ఈయనిదానిని తీసికొనరాదు. ఇది సంప్రదాయా గతమయిన గృహస్థ ధర్మము. తన శ్రమతో జీవించవలెను. పాపము చేయరాదు. ఇతరుల కీయవలెను. ఇతరులను నొప్పించరాదు. ఆహారము నందును వేషమునందును నియమములు పాటించ వలెను. ఇట్లు వానప్రస్థ ధర్మమును పాటించు ముని ఉత్తమ (వానప్రస్థ ధర్మ) సిద్ధిని పొందును. విద్యలతో జీవనము నడుపరాదు. సద్గుణములు కలిగియుండవలెను. ఎల్లప్పుడు ఇంద్రియముల నిగ్రహించుకొనవలెను. అన్ని అనుభవముల నుండియు విరక్తుడు కావలెను. ఏ స్థానము నందైనను పడుకొనవలెను. అత్యత్పములైన వానినే కోరవలెను. దేశములందంతట తిరుగుచుండవలెను. ఒంటరివాడై యుండవలెను. ఇది సన్యాస ధర్మము ఏ రాత్రి యందు ఈలోకములు నాకిక చాలుననియు కామములును సుఖములును నాచే జయింపబడినవి అని యును భావనకలుగునో ఆరాత్రియే వివేకవంతుడగు మానవుడు మనోనిగ్రహము పూని వానప్రస్థుడగుటకు యత్నించవలయును. తాను వానప్రస్థుడై జీవించి శరీర ధాతువులను అరణ్యమునందు విడిచినవాడు తన వంశము వారిలో తనకు ముందరి పదితరములవారికిని తన తరువాత రాబోవు పదితరములవారికిని తనకును తన సుకృతమును పంచగలుగును.” అష్టకుడు: “మునులును మౌనములును ఎన్నివిధములో వినగోరుచున్నాము.” యయాతి: “ఎవడు తాను అరణ్యమునందు నివసించుచున్నను గ్రామము తన వెనుకనే యుండునో ఎవడు తాను గ్రామము నందున్నను అరణ్యము తన వెనుకనే యుండునో అతడు ముని యనదగియున్నాడు.” ఇది ఎట్లని అష్టకుడడుగ యయాతి: “అరణ్యమునందు మునిగా నున్నప్పుడు గ్రామములందు లభించువానిని వేనిని ఉపయోగింపరాదు. అట్టివానికి గ్రామము తన వెనుక నున్నట్లగును. గ్రామమునందు తానున్నను అగ్నిహోత్రములను (కామముతో) ఆరాధించక ఇంటిని పట్టించు కొనక తన గోత్రము వేదశాఖ మొదలగు వానికి ప్రాముఖ్యమీయక కౌపీనమును (రహస్యాంగమును) కప్పునంత మాత్రము, వస్త్రమును ప్రాణములు నిలుచునంత మాత్ర మాహారమును ఉపయోగించుచుండు మునికి అరణ్యము తన వెనుక నున్నట్లగును. కామములను కామ్య కర్మములను విడిచి జితేంద్రియుడై మునియై మౌనమును (మనన ధర్మమును) పూనియున్నచో అట్టివాడు లోకమునందుండియు సిద్ధిపొందును. స్వచ్ఛపరుపబడిన దంతములు కత్తిరించబడిన గోళ్ళు కలిగి ఎల్లప్పుడును స్నానమాడి ఉండుచు అలంకరించుకొని యున్నను ఇవి ఏవియు లేక నల్లనివాడై (మలినుడై యున్నను, నిర్మలములగు నడవడులు కలిగియున్నచో అట్టివానిని ఎల్లవారును పూజింపవలసినదే) తపస్సుచే కృశించి శుష్కించి మాంసము అస్థులు రక్తము క్షీణించియుండువాడు ఈలోకమును పరలోకమును కూడ జయించును. సుఖదుఃఖములు శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను జయించి మౌనము (మనన రూపమగు తపోధర్మమును ఆశ్రయించి మునియై ఈలోకమును జయించినవాడు మరి ఎవ్వరిని జయింపవలసి యుండును? అతడు సర్వమును జయించినట్లే మానవుడు తాను మునియై గోవువలె నోటితోనే ఆహారమును వెదకువాడగుచో అట్టి స్థితిలో లోకపూర్వుడు (సనాతనుడు) అగు పరమాత్ముడు ఇతనికి అమృతత్వము (మోక్షపదము)ను సిద్ధింపజేయును.”