మత్స్య మహా పురాణము
అంగారక వ్రతము
ఈశ్వరుడిట్లు చెప్పెను, బ్రహ్మా! రూప సంపదలనొసగు మరియొక భవిష్య (ముందటి కాలమునకు పనికివచ్చు) వ్రతము చెప్పెదను? వినుము. నైమిశారణ్యమున తపస్సాచరించు చుండు తపోనిధియు ధర్మయుక్తుడునగు పిప్పలాదమునికడకు పోయి ధర్మపుత్రుడగు యుధిష్ఠిరుడు ఆరోగ్యైశ్వర్యములు ధర్మ మందు స్థిరబుద్ధి అవికలాంగత్వము శివ విష్ణుల యందు ధ్రువభక్తి కలుగు ఉపాయము తెలుపుమని అతనిని వేడును. పిప్పలాదు డతనికిట్లు చెప్పును, రాజా! చక్కగా అడిగితివి. అంగారక వ్రతమనునది కలదు. నీకదియంతయు చెప్పెదను. ఈ విషయమున విరోచన భార్గవ సంవాదమను ఇతిహాసము పరంపరలో వినబడుచున్నది.
ఎట్లనగా ఒకమారు రాక్షసగురుడు భృగు నందనుడు శుక్రుడు రూపమునను కాంతి యందును నిరుపమానుడును పదునారేండ్ల ప్రాయమువాడును ప్రహ్లాద పుత్రుడునగు విరోచనుని చూచి నవ్వుచు-బాగు- బాగు-మహాబాహూ! విరోచనా! నీకు క్షేమమా! అనెను. విరోచను డతని చిరునవ్వు చూచి విప్రా! నన్నుచూచి అకారణముగా నీవేల నవ్వితివి? బాగు బాగనియు పలికితివి! ఏల? ఇదంతయు నాకు తెలుపుమనగా పురుషోత్తముడగు శుక్రుడతని కిట్లనెను: వ్రతమాహాత్మ్య విషయమై ఆశ్చర్యముతో నవ్వితిని. పూర్వము దక్ష వినాశమునకై కుపితుడై భయంకర ముఖుడైన త్రిశూలి లలాటము నుండి స్వేదబిందువులు క్రింద పడెను. వాటినుండి సప్తపాతాళముల భేదించుచు సప్తసాగరముల దహించుచు అనేక వక్త్రనయనుడును, మండెడు అగ్నివలె భీషణుడును, పదివేల కరములు పాదములు ఆయుధములుగా కలవాడేమో యనదగిన వీరభద్రు డనునతడు జనించెను. అతడు యజ్ఞ ధ్వంసముచేసి మరల భూతలము చేరెను. అతడు మరల త్రిజగములను దహించనుండగా శివుడది వారించెను. వీరభద్రా! నీవు దక్షయజ్ఞ వినాశము చేసితివి. ఈ లోకదాహ కృత్య మిక చాలును. లోక శాంతి ప్రదాతవయి సర్వగ్రహములలో నొకడవగుము. నావరమున జనులు విస్తరించి నీపూజ జరుపుదురు. భూమి (పైపడిన స్వేద బిందువుల) నుండి పుట్టిన నీవు అంగారకుడు (అంగార-క=నిప్పుకణిక-వలె-ఉన్నవాడు) అని ఖ్యాతి నొందుదువు. నీ రెండవ రూపము దేవ లోకమునందుండును. (గ్రహముగా ఉండు రూపము అంతరిక్షము నందలిది. ) చతుర్థీ తిథియందు (మంగళ-అంగారక-వారము నాడు) నిన్ను పూజించువారు అనంత రూపారోగ్యైశ్వర్య వంతులగుదురు. శివుడిట్లనగనే ఆ వీరభద్రుడు శాంతించి కామరూపుడు కావున తత్క్షణముననే గ్రహమై యంతరిక్షమున నిలిచెను.
ఇది ఇట్లుండ నీవుపూర్వ జన్మమున నొకప్పుడు శూద్రుడవై ఉండి (ఎవరో) చేయుచుండిన అంగారక పూజను అతని అర్చామూర్తిని చూచుట తటస్థించెను. సుశత్రుకుల శ్రేష్ఠా! దానిచే నీవు రూపవంతుడ వయితివి. నీకుగల-వివిధ-రుచి(కాంతి) చాలదూరము వరకు పోవుచున్నం దున నీకు విరోచనుడు (వి-రుచ్) అను పేరు ఏర్పడినది. శూద్రుడు చేయు చుండిన వ్రతమును చూచినందువలన (అపుడు శూద్రుడుగా నుండిన) నీకు కలిగిన ఈ రూపసంపత్తి చూచి విస్మితుడనయి స్మితము చేసితిని. ఈవ్రత మాహాత్మ్య ముత్తమమని ‘సాధు- సాధు’ ‘బాగు- బాగు’ అంటిని. వ్రతమును చూచినవానికి కూడ రూపైశ్వర్యములు కలుగునే! చేసినవానికి (కలుగునని) వేరుగా చెప్పనేల! ఏలయన-రాక్షసకుమారా! నీవు వివేకవంతుడవై ధరణీ పుత్రుని పూజాదికమును గోదానాదికమును చూచినందుననే నీవు ఇట్లు రాక్షసరాజ గర్భసంజాతుడ వయితివి కదా!
పిప్పలాదుడనెను, మహాత్ముడగు భార్గవుని (శుక్రుని) ఆ మాటవిని ధీరుడు ప్రహ్లాద నందనుడునగు విరోచనుడు విస్మితుడై మరల ఇట్లడిగెను: భగవన్! ఆ వ్రతమును జన్మాంతరమున నేనుచూచిన ఆవ్రతదానాదికమును లెస్సగా వినగోరుచున్నాను. ఆ వ్రత మాహాత్మ్య విధానములను యథావత్గా చెప్ప వేడెదను.
చవితి మంగళవారమునాడు పద్మరాగమణి ధరించి ఉత్తరాభిముఖుడై “అగ్నిర్మూర్ధాదివః” అను మంత్రమును జపించుచు మృత్తికతో స్నానము చేయవలెను. శూద్రుడైనచో మంత్రము జపింపకయే చేయవలెను. భోగము లేవియు అనుభవించకుండ నిరాడంబరుడై యుండవలెను. (పగలంతయు ఇట్లుండి) సూర్యుడు అస్తమించగనే ముంగిటని గోమయముతో అలికి పుష్ప మాలలతో అక్షతములతో అభ్యర్చనముచేసి ఆచోట కుంకుమముతో అష్టదళపద్మము వేయవలెను. రక్తచందనముతోనైన వేయవచ్చును. నాలుగు గరిగ(ఒక విధమగు మట్టిపాత్ర)లను భక్ష్యభోజ్య (పదార్థ)ములతో ఎర్ర వడ్ల బియ్యముతో పద్మరాగములతో నింపవలెను. (ఈ అలి కినచోట) నాలుగు మూలలందు వాటిని వివిధ ఫలములను గంధమాల్యాది ద్రవ్యములను ఉంచి (అంగారకునకు) నివేదించవలెను. బంగారు కొమ్ములు, వెండి గిట్టలు పిదుకుటకు కంచుపాత్ర దూడ కలదియు మెరయు వస్త్రములతో కప్పబడినది శ్రేష్ఠమయినది రత్నములు కలది సాధుస్వభావఅగు పాడి కపిలగోవును దానము చేయుదునని సంకల్పించి దానిని సిద్ధపరచవలెను.
పొడవయిన చతుర్బాహువులుకల సురూపుడగు పురుషుని విగ్రహమును బంగారముతో బొటనవ్రేలియంత పరిమాణముతో చేయించి ధాన్యముతో నింపిన తామ్రపాత్రము పైభాగమున బెల్లముంచి దానిపై ఈ ప్రతిమను నిలుపవలెను. ఇదంతయును సస్వరముగ సామవేదమును నేర్చినవాడు, జితేంద్రియుడు, దానయోగ్యుడు, మంచి శీలము, వంశము కలవాడు కుటుంబి దంభములేనివాడు నగు విప్రునకు దాన మీయవలెను.
అర్ఘ్యదాన మంత్రము, “భూమిపుత్రా! మహాభాగా! శంకర స్వేదసంజాతా! సురూపము కోరి నిన్ను శరణు చొచ్చినాను. నీకు వందనము. ఈ అర్ఘ్య మందుకొనుము” అను అర్థము నిచ్చు మంత్రముతో చందనోదకముతో అర్ఘ్యమునిచ్చి రత్న మాల్యవస్త్రాదులతో బ్రాహ్మణు నర్చించి ఇదే మంత్రముతో గోమిథునముతో కూడ (ఆవును కోడెదూడను) సర్వోపకరణములతోడి శయ్యను లోకమున జనుల కిష్టమగునదియు తన ఇంటిలో తనకిష్ట మనిపించినదియు (లభ్యమగు నంతలో) సద్గుణవంతుడగు ఆవిప్రవర్యునకు ఇది అక్షయఫలదము కావలెననుచు దానమీయవలెను. పిమ్మట ప్రదక్షిణ పూర్వకముగా బ్రాహ్మణుని వీడ్కొనవలెను. (పగలు ఉపవసించి) నక్తమున (రాత్రియందు) ఉప్పు కారము పులుపు లేకుండ నేతితో భుజించవలెను. ఎనిమిది కాని నాలుగు కాని చవితితోడి మంగళవారములందు వ్రత మాచరించినవాడు జన్మజన్మము లందును రూప సౌభాగ్య సంపదయు విష్ణుశివులందు భక్తియు నప్తద్వీపాధిపత్యమును (ఇహలోకమున) అనుభవించి (పరమున) డెబ్బదివేల కల్పములపాటు రుద్రలోకమున పూజితుడై సుఖించును. కావున దైత్యేంద్రా! నీవు ఈ వ్రత మాచరించుము.
(పిప్పలాదుడు) ఇట్లుపదేశించి శుక్రుడు వెళ్లగా విరోచనుడది యంతయు అట్లే చేసెను. కావున రాజా (యుధిష్ఠిరా!) నీవును అక్షయ ఫలదమని వేదవేత్తలు చెప్పెడి ఈ వ్రతము నాచ రించుము. అని పిప్పలాదుడు యుధిష్టిరునకు తెలిపెను.
(ఈశ్వరుడు) అద్భుతశక్తియు అద్భుత కర్మాచరణమును కల యుధిష్ఠిరుడును పిప్పలాదుని వచనము నాదరించి ఆవ్రతమట్లే యాచరించెను. అనన్య చిత్తముతో దీనిని వినిన వానికి భగవంతుడదే ఫలము నొసంగును.