విశోక ద్వాదశీ వ్రతము

మనువు మత్స్య నారాయణుని ఇట్లడిగెను, ఇష్టవియోగమువలన శోకము కలుగకుండ చేయునదియు కలిగిన అట్టి శోకమునుండి ప్రాణుల నుద్ధరించునదియు విభవములను కలిగించు నదియు సంసార నాశకమునునగు ఉపవాస పూర్వకమగు వ్రతమేది? అనగా మత్స్యుడిట్లు చెప్పసాగెను. నీవడిగిన ఈ ప్రశ్నము జగత్ర్పియము; దేవతలకును దుర్లభము; గొప్పది; దేవ దానవ మానవులకును గుహ్యమగునది. ఐనను నీవు భక్తుడవు అడిగితివి కావున చెప్పెదను. అశ్వయుజ మాసమున చేయు విశోక ద్వాదశీ వ్రతము ఇట్టి పుణ్యకరము.

దశమినాడు లఘు భోజనము చేసి సంప్రదాయమెరిగి నియమముతో వ్రతమారంభించవలెను. ఏకాదశినాడు స్నానాదికము నెరవేర్చి నిరాహారుడై ఉత్తరముఖుడో ప్రాఙ్ముఖుడో అయి కేశవుని, లక్ష్మిని యథావిధిగా అర్చించి ద్వాదశినాడు పారణ చేయవలయును. ఎట్లన-ద్వాదశినాడు ఉదయమున లేచి సర్వౌషధులతోను పంచగవ్య సహిత జలముతోను స్నానమాడి తెల్లని పుష్పములను వస్త్రములను ధరించి కలువపూలతో విష్ణునర్చించవలయును. మండపము ఏర్పరచి దానియందు పిడిమూర కొలత భుజముతో చతురస్రము మనోహరమగు సన్నని అరుగు ఉత్తరపు వాలుదలతో చేసి దానిచుట్టును మూడు ప్రాకారములు చేయవలెను. వానిలో బయటిది మూడంగుళముల ఎత్తు నడుమది రెండంగుళముల ఎత్తు లోపలిది ఎనిమిదంగుళముల ఎత్తుండవలెను. ఏటి ఇసుకతో లక్ష్మీ ప్రతిమచేసి చేటలో ఉంచవలెను. ఆ చేట నరుగుమీద ఉంచి లక్ష్మిని పూజించవలయును.

పూజానంతరము ఈ అర్ఘ్యమునిచ్చు మంత్రములతో ప్రార్థించవలెను. శోకములు లేకుండ జేయు లక్ష్మీదేవి నాకు వరముల నిచ్చునది యగుగాక! విశోకయగు లక్ష్మి సంతానము కలిగించు గాక! ఉన్న సంతతికి యోగక్షేమముల నిచ్చుగాక! పిమ్మట ఆ చేటను తెల్లని క్రొత్త వస్త్రములతో చుట్టవలెను. దానిని నానావిధ భక్ష్యములతో ఫలములతో పూజించి దేవికి సువర్ణ కలశము నర్పించవలెను. రాత్రులయందు దర్భలు వేసి ఉంచిన ఉదకమును త్రాగి ఉండ వలయును. రాత్రియంతయు నృత్యగీతాదికముతో గడుపవలెను. రాత్రి మూడవ జాము గడచిన వెంటనే ఆరంభించి-యథాశక్తిగా ముగ్గురను గాని ఒకరినికాని విప్ర దంపతులను స్వయముగా వారి కడకు పోయి పిలుచుకొనివచ్చి వారిని-వారికి దాన మీయ సిద్దపరచిన శయనాది సామగ్రిని క్రమముగా వస్త్రమాల్యాదికముతో అర్చించవలెను. పూజయందు ‘జలశాయినే నమః’ అను మంత్రమును వినియోగించవలెను.

ఇట్లు గీత వాద్యాదులతో రాత్రి ముగియువరకు గడపి జాగరణము ముగించి ఉదయము స్నానమాడి దంపతుల నర్చించి వారికి శయనాదిక మీయవలెను. యథాశక్తిగా ధనకాఠ్యము లేక బ్రాహ్మణ సంతర్పణము చేసి తానును భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గడుపవలెను.

ఇట్లు ప్రతి మాసమునను (సంవత్సరము ముగియు వరకు) జరిపి వ్రతాంతమున గుడ ధేనువు-దిండ్లు-పరపులు మొదలగు పరికరములు- దుప్పటి మొదలగునవి. వీనితో కూడ మంచము(ల)ను చేటతో కూడ లక్ష్మీదేవిని విప్రున(ల)కు దాన మీయవలెను. దీనిచే సర్వ శుభములును కలుగును