మత్స్య మహా పురాణము
సాధారణ శ్రాద్ధ విధానము
సూతుడు ఋషులతో ఇంకను ఇట్లు చెప్పనారంభించెను. (ఇంతవరకు నేను మీకు మూడు విధములగు నైమిత్తిక శ్రాద్ధములలో మొదటిదగు పార్వణ శ్రాద్ధపు విధానమును తెలిపితిని.) ఇకమీదట మత్స్యరూప నారాయణుడు మనువునకు చెప్పిన నైమిత్తిక శ్రాద్ధములలో రెండవది సాధారణ శ్రాద్ధ విధానము తెలిపెదను. దీని వలన భుక్తి ముక్తులు లభించును.
ఈ శ్రాద్ధము జరుపవలసిన కాలమును దేశమును మీరు తెలిసుకొనవలయును. ఉత్తరాయన దక్షిణాయన ప్రవేశ పుణ్యకాలములును రెండు విషువ దినములును (రాత్రింబవళ్ళ పరిమాణము సమముగా ఉండు దినములు) సూర్యుడు ఆయారాశులయందు ప్రవేశించు దినములును అమావాస్య అష్టకా అనగా మాసమున కృష్ణపక్ష సప్తమి కృష్ణపక్ష చతుర్దశీ తిథులును ఆర్ద్రమఖా రోహిణీ నక్షత్ర దినములును శ్రాద్ధమునకు యోగ్యములగు ద్రవ్యములును యోగ్యులగు బ్రాహ్మణులును లభించిన దినములును, గజచ్ఛాయా వ్యతీపాత్ విష్టి వైధృతి యోగములున్న దినములును యుగాది మన్వంతరాది దినములును అనెడి ఈ దినములందు జరిపిన శ్రాద్ధము అక్షయమగును. అనంత ఫలమును ఇచ్చును. వైశాఖ తృతీయా కార్తీక ఫాల్గుణ చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు మన్వంతరాది దినములు. పంచాంగములలో మన్వన్తరాదులు ఈ విధముగా నున్నవి. కార్తీక శుక్ల ద్వాదశీ స్వాయంభువ-ఆశ్వయుజ శుక్ల నవమీ స్వారోచిష-చైత్ర శుక్ల తృతీయా- ఉత్తమ-భాద్రపద శుక్ల తృతీయా తామన-పుష్య శుక్షైకాదశీ రైవత - ఆషాఢ శుక్లదశమీ చాక్షుష- మాఖశుక్ల సప్తమీ వైవస్వత - శ్రావణామావాస్యా అగ్ని సావర్ణి-ఫాల్గున పూర్ణిమా బ్రహ్మసావర్ణి- కార్తిక పూర్ణిమా దక్షసావర్ణి -భాద్రపద కృష్ణాష్టమీ సూర్య సావర్ణి - ఆషాఢ కృష్ణామీ - రుద్రసావర్ణి - జ్యేష్ఠ పూర్ణిమా బౌత్య-చైత్ర శుక్ల పూర్ణిమా రౌచ్య)
వీనిలో వైవస్వత మన్వంతరాదియగు మాఖ సప్తమీ తిథినాడు సూర్యుడు తన రథమును ఆరోహించును. (సంపాదించుకొనెను) కనుక దీనికి రథ సప్తమియని వ్యవహారము ఏర్పడినది. ఈ దినమున మనుష్యుడు ప్రయతుడై (దేహమున, చిత్తమున శుచియై) తిలలతో మిశ్రితమయిన ఉదకమును మాత్రమైనను పితృ దేవతల నుద్దేశించి ఆర్పించినచో వేయి సంవత్సరముల కాలము శ్రద్ధతో యథావిధిగ శ్రాద్ధము పెట్టినంత ఫలము కలుగును. వైశాఖామావాస్యనాడును గ్రహణ దినములందును ఉత్సవ దినములందును మహాలయ దినములందును తీర్థములందును క్షేత్రము లందును గోవులు నిలుచు ప్రదేశములందును ద్వీపములందును ఉద్యాన గృహము లందును లేదా ఉద్యానవనములందును తనకు అనుకూలమయిన గృహములందును వివిక్తమగు అనగా ఎట్టి అపవిత్రతకును కలవరపాటునకును అవకాశము కలుగనీయని ప్రదేశమునందును చక్కగా అలికి ఆప్రదేశమున శ్రాద్ధముజరుపుట శాస్త్రమును సంప్రదాయమును ఎరిగినవారు చేయవలసినపని.
శ్రాద్ధకర్త శ్రాద్ధమునకు ఒకదినము ముందుగా గాని రెండునాళ్లు ముందుగాగాని మంచి శీలము సత్కర్మానుష్ఠానము సద్గుణములు కలిగినవారిని తగిన వయస్సు రూపము కలవారిని శ్రాద్ధమున భోక్తలుగా నిమంత్రించవలెను. విశ్వదేవస్థానమున ఇద్దరను పితృ స్థానమున ముగ్గురిని మాత్రమే భుజింపచేయవలెను. లేదా ఒక్కొక్క స్థానమునకు ఒక్కొక్కరైనను చాలును. కర్త తానెంత ధనవంతుడైనను అంతకంటే ఎక్కువమందిని పిలువరాదు. మొదట విశ్వదేవులకు ఆసనమునిచ్చి వారిని యవలతో పుష్పములతో పూజించవలెను. దర్భ పవిత్రములను ధరించి రెండు పాత్రలను జలముతో నింపవలెను. “శన్నోదేవీః” అను మంత్రముతో నీటిని ఆ పాత్రలలో పోయవలెను. “యవో సి” అను మంత్రముతో పాత్రో యవల చేయవలెను. గంధ పుష్పములతో పాత్రలను పూజించి విశ్వేదేవులముందుంచవలెను. “విశ్వేదేవానః” అను మంత్రముతో విప్రులయందు విశ్వేదేవతల నావాహనము చేయవలెను. తరువాత వారిమీద యవలను విదలించవలెను. తరువాత బ్రాహ్మణులను గంధ పుష్పములతో అలంకరించి ‘యా దివ్యాః’ అను మంత్రముతో వారిచేతుల యందర్ఘ్యము విడువవలెను. మరల వారిని అర్చించి వారినుండి వీడ్కోలు అనుమతి పొందవలెను. వీరిముందున్న మూడు పాత్రలను నీటితో నింపవలెను. పవిత్రములను ధరించ వలెను. “శన్నోదేవీః” అను మంత్రముతో పాత్రల యందు నీటిని పోయవలెను. “తిలోసి” అను మంత్రముతో పాత్రలందు తిలలను వేయవలెను. గంధ పుష్పాదులను కూడ పాత్రలో వేయవలెను. ఈ అర్ఘ్య పాత్రములు రావివంటి వనస్పతుల కొయ్యతో చేసినవి కాని ఆకుల దొన్నెలు కాని సముద్రమునుండి లభించు శంఖము మొదలైనవి కాని అయి యుండవలెను. లేదా వెండిదో, బంగారపుదో కావచ్చును. రజతము అను మాటయు రజతమును చూపుటయు దానము చేయుటయు పితృ ప్రీతికరము, వెండి పాత్రలతో కాని వెండికలిసిన లోహపు పాత్రలతో కాని శ్రద్ధతో పితరులకు ఇచ్చినది అక్షయమై అనంతఫలము నిచ్చును. అర్ఘ్య ముంచుటకును విడుచుటకును కాని పిండముల నుంచుట మొదలగు పనులలో కాని పితృ దేవతలకు వెండి చాల ప్రీతికరమైనది. వెండి శివుని కంటినుండి పుట్టినది. కనుకనే అది పితృ ప్రీతికరము. అది శుభకరము మాత్రము కాదు. కనుక దానిని దేవ కార్యములందు ఉపయోగింపరాదు.
ఈ విధముగా తనకు లభించునంతలో (శ్రాద్ధమునకై) పాత్రలను సమకూర్చుకొనవలెను. మత్సరము మొదలగు మనోదోషము లేమియు లేక యుండవలెను. “యా దివ్యా” అను మంత్రముతో పితరుల నామగోత్రములను చెప్పుచు దర్భలనుచేతపట్టుకొని “పితరులను మీయందు ఆవాహనము చేయుచున్నాను” అను అర్థమునిచ్చు మంత్రముతో ఆ దర్భలను బ్రాహ్మణుల చేతి యందుంచ వలెను. ఆ సమయములో “మీయందావాహనము చేయుచున్నాను” అని కర్త అనగా “తథా” “అట్లే కానిమ్ము.” అని ఆ విప్రుడనును. “ఉశంతస్త్వా” అను మంత్రముతో కాని “ఆయంతు” అను మంత్రముతో కాని వారియందు పితరులను ఆవాహనము చేయవలెను. “యా దివ్యా” అను మంత్రముతో వారిచేతిలో అర్ఘ్యమును విడువవలెను. గంధ పుష్ప వస్త్రము లియవలెను. అర్ఘ్యము మొదట విశ్వేదేవులకు తరువాత పితరులకు. సంశ్రవ మంత్రము కూడ చెప్పుచుండవలెను. అర్ఘ్యమును విడిచిన తరువాత ముందునకు వంగినవాడై ఆ అర్ఘ్యపాత్రలను భోక్తకు ఉత్తరముగా ఉంచవలెను. “పితృభ్యః స్థానమసి” అను మంత్రముతో ఆ పాత్రలను భోక్తకు ఎడమ దిక్కుగా శుచి ప్రదేశమున ఉంచి వాటిని నీటితో పరిషేచనము చేయవలెను.
ఈ సాధారణ శ్రాద్ధమందు కూడ పార్వణ శ్రాద్ధమునందు వలెనే నిర్మలచిత్తుడై అగ్ని (గ్నౌ) కరణమును జరుపవలెను. తరువాత ప్రశాంత చిత్తుడై నిరంతరముగా దర్భలను చేత ధరించియే యుండి రెండు చేతులతోను పదార్థములను అన్నిటిని తెచ్చి భోక్తల పాత్రలయందు వడ్డించవలెను.
పితృ దేవతలను ఉద్దేశించి భోక్తలచే భుజింపజేయు అన్నము శుచియై రుచికల మంచి ఆహారమునకు ఉండవలసిన అన్ని గుణములును కలిగి ఉండవలెను. నానా విధములగు భక్ష్యములతో చేరి ఉండవలెను. పప్పు, అకుకూరలు, కాయగూరలు ఉండవలెను. పదార్థము లన్నియు చాల రుచికలవై ఉండవలెను. ఆవు పాలు, ఆవు నేయి, శర్కర ఉండవలెను. ఇటువంటి అన్నమును, మాంసమును పితరులకు తృప్తి కలిగించును అని సాక్షాత్ విష్ణువే చెప్పెను. మాంసములలో మత్స్య మాంసము రెండు మాసముల పాటు లేడి మాంసము మూడు మాసముల పాటు పొట్టేలు మాంసము నాలుగు మాసముల వరకు పాలపిట్ట మాంసము ఐదు మాసముల వరకు మేక మాంసము ఆరు మాసములవరకు ఎర్ర మేక మాంసము ఏడు మాసముల వరకు ఇఱిమాంసము ఎనిమిది మాసములవరకు తెల్లని మచ్చలు గల ఇట్టి మాంసము తొమ్మిది మాసముల వరకు అడవి పంది అడవి దున్న-మాంసములు పది మాసముల వరకు తాబేటి మాంసములు పదునొకండు మాసముల వరకు ఆవు పాలతో చేసిన పాయసము సంవత్సరము వరకు రురు మృగపు మాంసము పదునైదు మాసముల వరకు పొడవు చెవులు గల అడవి మేక మాంసము పండ్రెండు సంవత్సరముల వరకు ఖడ్గ మృగపు మాంసము కాని బలుసాకు కూరగాని అనంతకాలము వరకు పితరులకు తృప్తి కలిగించును. కాని అవు పాలతో వండి తేనె కలిపి ఆవు నేతితో సంస్కరించిన పాయసము పితృదేవతలను ఉద్దేశించి పెట్టినచో అక్షయమై యుండును అని పితృ దేవతలే స్వయముగా చెప్పిరి. (దీనిని బట్టి శ్రాద్ధముల యందు ఈచెప్పిన విధమగు పాయసముతో భోక్తలను భుజింపజేయుట సర్వోత్తమమని తేలుచున్నది.)
భోక్తలు భుజించు సమయమున వేదము నుండి పితృదేవతా విషయమును ప్రతిపాదించు అనువాకములను మంత్రములను సమస్తములగు పురాణములను బ్రహ్మ, విష్ణు, సూర్య, రుద్రుల వివిధ స్తోత్రములను ఇంద్రుడు, అగ్ని, సోముడు దేవతలుగా గల సూక్తములను పవమాన సూక్తములను బృహద్రథంతరము రౌహిణము జ్యేష్ఠము అనబడు సామవేద భాగములను శాంతికాధ్యాయము (వేదము నందలి భాగము)ను మహాబాహ్మణము మండల బ్రాహ్మణము అను వేద భాగములను పఠించుచు వారికి వినిపించుచుండవలెను. ఇంతేకాదు. తనకును పితరులకును ఏయే స్తోత్రములు పురాణాదులు వేద భాగములు మొదలైనవి ప్రీతికరములో అవి ఏవైనను పఠించి వినిపించవలెను. (దీనినే అభిశ్రవణము అందురు. ఇట్లు భోక్తలు భుజించిన తరువాత ఆ భోజన సమీపమున భోజనపు ఆకులలో (పాత్రలలో) మిగిలిన అన్నము మొదలగు అన్ని పదార్థముల నుండియు చాల కొంచెము కొంచెము అంశమును ఎత్తి తీసికొని భోక్తల ముందు భాగమున నేలపై వెదజల్లినట్లు వేసి ఉచ్ఛిష్ట భాక్కులకొరకై దానిని విడువవలెను. వికిర పిండమును అక్కడ ఉంచవలెను. ఉంచుచు ఈ అర్థమును ఇచ్చు మంత్రమును చెప్పవలెను. “నా వంశమున పూర్వులలో ఎవరైన అగ్నిచే దహింపబడినవారు గాని (మరణానంతరము) అగ్నిచే దహనసంస్కారము పొందనివారు గాని తల్లిదండ్రులు బంధువులు గోత్ర శుద్ధి లేనివారు గాని ఎవరైన నున్నచో వారును కుల స్త్రీలై యుండియు ఎవరును పట్టించుకొనకపోవుటచే మరణించిన తరువాత ఏ సంస్కారము లను పొందని స్త్రీలెవరైననున్నచో వారును నేనుభూమిపై వేసిన ఈవికిరాన్నముతో తృప్తి చెంది ఉత్తమగతిని పొందుదురు గాక!”
భోక్తలు తృప్తిగా భుజించినారని తెలిసికొనిన తరువాత వారి చేతులందు ఒక మారుగా మాత్రమే నీరు (ఉత్తరాపోశనమునకై) వేయవలెను. తరువాత గోమూత్ర గోమయములతో అలికిన నేలపై దక్షిణపు కొనలుగా దర్భలను పరచవలెను. వానిపై అన్ని పదార్థములతో కలిపి చేసిన పిండములను పితరుల నామగోత్రములతో అవనేజన పూర్వకముగా (నీటితోను చేతితోను తడిపి శుద్ధిచేసి) ఉంచవలయును. అపసవ్యముతో పిండములను దర్భలపై ఉంచవలెను. సవ్యముగా చేసికొని వాటికి ప్రదక్షిణించి నమస్కరించవలెను. ఈ పిండములు ఆయా పితరులకు చెందుగాక అని మంత్రమును చెప్పవలెను. తరువాత దర్భలను చేత ఉంచుకొని యథావిధిగా పిండములకు ధూపదీప పుష్ప నైవేద్యములతో అర్చన చేయవలెను.
పిమ్మట (భోక్తలు పాత్రల దగ్గర నుంచి లేచి కాలుచేతులు కడుగుకొని) ఆచమనము చేయుదురు. కర్తయు ఆచమనము చేయవలెను. అపుడువారికి ఒక్కొక్కమారు మాత్రమే హస్తముపై నీరు వేయవలెను. పూవులను అక్షతలను అక్షయ్యోదకమును వారి చేతులయందు వదలవలెను. తన గోత్ర నామములను అనగా ప్రవర చెప్పుచు (ఈ గోత్రమున పుట్టి ఈనామముగల నేను ఇచ్చుచున్నాను అనుచు) తన శక్తికొలది తనకును ఆ బ్రాహ్మణులకును తన పితరులకును- గోవు-భూమి-బంగారము-వస్త్రమములు-మంచి పడకలు-ఏవైనను దక్షిణగా ఈయవలెను. తన శక్తికి తగినట్లు ధన లోపము చేయక దక్షిణలనీయవలెను. ఇచ్చినచో పితరులకు తృప్తి కలుగును. కనుక ఆ విధముగా చేసి పితృదేవతలను తృప్తిపరచవలయును.
తరువాత పితృదేవతా స్థానమున భుజించిన బ్రాహ్మణుల దగ్గర స్వధావాచనికమును (‘స్వధోచ్యతాం’ ఇత్యాది మంత్రమును పఠించుట) విశ్వేదేవస్థానమున భుజించిన బ్రాహ్మణుల దగ్గర ఉదక దానమును జరుపవలెను. తరువాత సంప్రదాయమును ఎరిగి కర్త తూర్పు ముఖముగ కూర్చుండి వారి నుండి ఆశీస్సులు గ్రహింపవలెను. “పితృ దేవతలు మా యందు ప్రీతికల వారగుదురు గాక!” అని కర్త అనగా “అగుదురు గాక!” అని బ్రాహ్మణులు అందురు. “అస్మదోత్రం వర్ధతామ్” “మా గోత్రము వర్ధిల్లుగాక!” అని కర్త అనగా “అట్లే అగుగాక!” అని భోక్తలు అందురు. లోగడ చెప్పినట్లు “మాకు అడుగకయే ఇచ్చు దాతలు ఉందురుగాక!” ఇత్యాది మంత్రమును కర్త చెప్పవలెను. “ఈ ఆశీస్సులు సత్యములు అగుగాక!” అని భోక్తలు అందురు. పిమ్మట భక్తితో పిండములను ఎత్తి ఉంచి స్వస్తి వాచనికము జరుపవలెను.
భోక్తలగు బ్రాహ్మణులు ఇంటియందు ఉన్నంతవరకును ఎంగిళ్లు తీయరాదు. తరువాత తీయవలెను. అట్లు వారు తినిన ఎంగిళ్లు తీసి పిమ్మట గృహబలిని (వైశ్వదేవమును) చేయవలెను. అని ఇట్లు ధర్మ వ్యవస్థ చేయబడియున్నది.
భోక్తలు భుజించునపుడు భూమిపై పడిన ఉచ్ఛేషణము (మిగిలిన పదార్థము) శ్రాద్ధకర్త ఇంటిలో ఊడిగము చేయువారిలో కపటము కొంటెతనములేని సేవకులకు పితృశేషముగా తినుటకు ఈయవలెను అని పెద్దలు చెప్పుచున్నారు.
ఈ చెప్పిన విధముగా జరిపిన శ్రాద్దకర్త వంశములోను బంధుమిత్రాది జనములోను పుత్రులున్నవారికిని లేనివారికిని అట్టి స్త్రీలకును (పూర్వము మరణించియున్నవారికి) అందరకును తృప్తి కలిగించును. అని పూర్వము పితృదేవతా గణమువారు వ్యవస్థ చేసియున్నారు.
(ఇక ఈ శ్రాద్ధ ప్రక్రియ అంతయు ముగిసిన తరువాత భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పుట ఎట్లనిన) శ్రాద్ధకర్త భోక్తలు భుజించిన ప్రదేశమున శ్రాద్ధము జరిపిన ప్రదేశమున నిలువబడి చేత ఉదకపాత్రమును పట్టుకొని యుండి “వాజే వాజే” ఈ మొదలగు మంత్రమును చెప్పుచు దర్భకొనతో వారిని తాకుచు వారిని విసర్జించ (వీడ్కోలుచెప్ప) వలెను. వారిని ప్రదక్షిణించి వారి పాదములను స్పృశించవలెను. వారు బయలుదేరి పోవుచుండ వారివెంట కొంతదూరము పుత్ర భార్యా బంధువర్గముతోకూడ పోవలెను. తరువాత వారికొకమారు నమస్కరించి వెనుకకు మరలివచ్చి అగ్నిని పూజించి వైశ్వదేవమును నిత్యబలిని జరుపవలెను. తరువాత పితృశేషమును శ్రాద్దకర్త తన సగోత్రులతో సుతులతో బాంధవులతో అతిథులతోపాటుగ తానును భుజించవలెను.
ఈ విధమగు శ్రాద్ధము అన్ని పర్వములయందును (ఈపైని చెప్పిన వానిలో ఏ పర్వము నందైనను) జరుపవలెను. జరుపవచ్చును. దీనిని ఉపనయనము కానివాడైనను భార్యలేని వాడైనను విదేశమునందు ఉన్నవాడైనను శక్తియున్నచో (తన శక్తికి తగినట్లు) చేయవలెను. శూద్రుడైనను మంత్రహీనముగా ఇదేప్రక్రియతో శ్రాద్ధము జరుపవలెను. ఇది సాధారణ శ్రాద్ధ విధానము. మూడవ నైమిత్తిక శ్రాద్ధమునకు అభ్యుదయికము అని పేరు. దానికే వృద్ధి (శుభ) శ్రాద్ధమనియు పేరు గలదు.
ఉత్సవములు మొదలగు ఆనందకరమగు కార్యములు జరుపునపుడును యజ్ఞములు వివాహములు మొదలగు శుభకార్యముల సమయములందును ముందుగా ఈ అభ్యుదయిక శ్రాద్ధమును జరుపవలయును.
దీనియందు మాతృపితామహీప్రపితామహ్యాది స్త్రీలను మొదట పూజించవలెను. పితృ పితామహాదులను తరువాత పూజించవలెను. తరువాత మాతామహుడు మొదలగు వారిని పిమ్మట విశ్వేదేవులను పూజించవలెను. ప్రదక్షిణముగా (సవ్యముగా) ఆయా ఉపచారములు జరుపవలెను. (ఈ వృద్ధి శ్రాద్ధమునందు అపసవ్యము చేసికొనకూడదు.) పెరుగు అక్షతలు ఫలములు ఉదకము మొదలగునవి వినియోగించవలెను. (తిలలు కూడదు) తూర్పు మొగముతో పిండములను నిర్వవణము చేయవలెను. (దక్షిణ ముఖము కూడదు.) “సంపన్నం” అనియు “ప్రీయతాం” అనియు మాత్రము చెప్పవలెను. (స్వధా అని చెప్పరాదు.) సరి సంఖ్యలోనే (బేసి సంఖ్యకూడదు.) బ్రాహ్మణులను అర్చించ (భుజింపజేయ)వలెను. వస్త్రములు బంగారు మొదలగు నవి వారికిచ్చుటకును కర్మానుష్ఠానములోను వినియోగించవలెను. (వెండిపాత్రలు దర్భలు కూడదు.) తిలలకు మారుగా యవలను ఉపయోగించుచు నాందీ శబ్దముతో ఈ కార్యమును జరుపవలెను. శుభమునకు సంబంధించిన మంత్రములను స్తోత్రములను పఠించి బ్రాహ్మణులకు వినిపించవలెను. (పిత్రములగు వేదభాగములు కూడదు.) ఇది ద్విజులు వృద్ధి-నాందీ - శ్రాద్ధము- జరుపవలసిన విధానము. శూద్రులుకూడ పైవారివలెనే నమస్కార పూర్వక మయిన మంత్రములతోను ఇతర మంత్రములేవియు లేకుండగను ఈ వృద్దిశ్రాద్ధము జరుపవలెను. కాని శూద్రులు భోజనాదికము లేకుండ ఆయా పదార్థములను దానము చేయుటతోనే జరుప వలెనని భగవానుడు ప్రభువగు నారాయణుడు చెప్పెను. ఏలయన శూద్రునకు దాన మాత్రము తోనే అన్ని కోరికలు ఫలించును.