మత్స్య మహా పురాణము
బాణాసుర కృత శివస్తుతి
“ప్రణవ స్వరూపా! శుభరూపుడవు శుభకరుడవు పాపుల హింసించువాడవు పాపముల హరించువాడవు మన్మథశరీర నాశకుడవు త్రిపుర నాశకుడవు అంధకుని చంపినవాడవు శూల ధరుడవు ప్రియురాలగు పార్వతియందలి ప్రీతితో దేహమును విభజించుకొని సగమామెకిచ్చి అమెకు ప్రీతిపాత్రుడయినవాడవు సుందరుడవు సురాసుర సిద్ధగణముల చేతను హయకపి సింహగజముఖులను మిగుల పొట్టివో పొడవయినవో అగు ముఖములు గలవారునగు ప్రమథుల చేతను నమస్కారము లందుకొను వాడవునగు నీకు నమస్కారము; వీరు ఇట్టి స్వభావము గల వారని గ్రహింప నలవికాని దేవతల వలనను అనేక జన్మములందు కలిగిన వందలకొలది శరీరముల వలనను చాల వ్యథల నందితిని. భవుడవగు నీయందు భక్తిగల మతిగల వాడనగుచు నిన్ను నమస్కరించుచున్నాను; చలించుచుండు చంద్రకళతో వ్యాప్తుడవగు దేవా! నమస్కారము; దేవా! నాకు పుత్రకళత్ర హయాది ధనమువలదు; సతతము నీ స్మరణము కావలయును; ఈ అనేక శత బాహువులతో కూడ నాకు వ్యథయే కలుగుచున్నది; వీని మూలమున నేను నరకగతిని పొందింపబడుదునే కాని పుణ్యగతి నందను; వీనిచే జన్మ నివృత్తి కలుగదు; పాపమతియగువాడు నిబద్ధమగు (శాస్త్ర విహితమగు) పవిత్ర కర్మమును విడిచిపెట్టును; కాని నా మనస్సు వెనువెంటనే మాటిమాటికి కంపించుచున్నది; భ్రాంతి నందుచున్నది; భయమందుచున్నది; అందుచే నన్ను దుష్కర్మము నుండి నివారించుచున్నది.”
స్నానముచేసి మడుగు వస్త్రములు ధరించి, శుచి మనస్కుడయి ఈ తోటక వృత్త రూపమగు స్తవమును పఠించువానిని శివుడు బాణు ననుగ్రహించినట్లే యనుగ్రహించి అతనికి వరదుడగును. ఈ మహా దివ్యస్తవమును విని మహేశ్వర మహాదేవుడు బాణునియందు ప్రసన్నుడై అతనితో ఇట్లనెను, వత్సా! దానవా! భయమందకుము; నీవు నీపుత్ర పౌత్ర మిత్రబంధు భార్యా తద్బంధు జనులతో కూడ సువర్ణ నగరమందుందువు; ఇకమీదటను నీవు దేవతలకును అవధ్యుడవగుదువు; అని ధర్మరాజా! శివుడు అతనికి ఇంకను మరొక వరమును ఎవరి వలనను దేని వలనను భయములేక అక్షయమును, అవ్యయమును అనగా నశించనిది మార్పులేనిది అగు లోకమందు విహరించునట్లును వరమును కూడ ఇచ్చెను.
అంతట మహాత్ముడగు రుద్రుడు అగ్నిని నివారించి బాణుని మూడవ పురమును రక్షించెను. స్వర్ణ రజత లోహ పురములలో బంగరుపురము కొంతకాలక మిగిలెను. అది దివ్యమయి రుద్ర తేజః ప్రభావమున గగనమున తిరుగుచుండును, మహాత్ముడగు శంకరు డిట్లు త్రిపుర దహన మొనర్చెను, అవి జ్వాలా మాలలతో ప్రదీప్తములగుచు ధరణీ తలమున పడెను; వానిలో ఒకటి శ్రీశైల సమీపమున త్రిపురాంతకమున పడెను, రెండవది అమరకంటక పర్వతమున నర్మదా తీరమున పడెను. త్రిపుర దాహానంతర మమరకంటక పర్వతమున కోటి రుద్రులు (లింగములు) ప్రతిష్ఠింపబడిరి, (త్రిపురములలో ఒకటి) అచట అది జ్వలించుచు పడినందున ఆ ప్రదేశము జ్వాలేశ్వరమనబడెను, ఆ మండెడు త్రిపుర ఖండపు జ్వాలలు పైకి బయలుదేరి ద్యులోకమునకు పోయెను; అపుడు దేవతలును అసురులును మహా హాహాకారము చేసిరి. మహేశ్వరానుగ్రహ పాత్రమయిన బాణుని సువర్ణపురమందలి అగ్ని మరి ప్రజ్వలించకుండ రుద్రుడది స్తంభింపజేసెను, రాజా! పూర్వము అమరకంటకమున జరిగిన వృత్తాంతము ఇది. ఈ అమరకంటక పర్వతమందు మృతి నందు వాడు వేయియు ముప్పదికోట్ల సంవత్సరముల పాటు చతుర్దశ భువన సుఖములను అనుభవించును, తరువాత భూతలమున ధార్మికుడగు రాజగును, పృథివిని ఏకచ్ఛత్రముగా పాలించును, ఇందు సంశయము లేదు; మహారాజా! అమరకంటక పర్వతము ఇంత పుణ్యకర మయినది; చంద్రసూర్య గ్రహణకాలములందట యాత్ర చేసినచో అశ్వమేధ ఫలమునకు పదిరెట్ల ఫలము కలుగునని పెద్దలందురు. ఇట్లదంతయు పుణ్యమే, దానిని మనసా స్మరించినను మారుచాంద్రాయణ వ్రతము ఆచరించినంత ఫలము లభించును, ఇది త్రిలోక ప్రసిద్ధ ప్రదేశము.
పుణ్యకరమగు ఈ అమరకంటకము సిద్ధ గంధర్వ సేవితమగు పర్వత శ్రేష్ఠము, నానా వృక్షలతా వ్యాప్తము, నానా పుష్పశోభితము, వేలకొలది మృగములును వ్యాఘ్రములును దాని నాశ్రయించియుండును; రాజా! దానియందు దేవితో కూడి మహేశ్వరుడును బ్రహ్మయు విష్ణువును చంద్రుడును విద్యాధరులును ఋషులును యక్ష కిన్నరులును వాసుకియు అతని అనుచరులగు పన్నగ శ్రేష్ఠులును సన్నిహితులయి దానిని ఆశ్రయించియుందురు, అమరకంటక పర్వతమునకు గిరి ప్రదక్షిణము చేసిన మానవునకు పౌండరీక యజ్ఞ ఫలము లభించును; ఈ అమర కంటక మునకు తరువాతిది అగు జ్వాలేశ్వరమను తీర్థము సిద్ధులును సేవించునది, దానియందు స్నానమాడినవారు పునరావృత్తిలేక శాశ్వత స్వర్గ సుఖమందుదురు; చంద్రసూర్య గ్రహణ సమయ ములందు ఇందు స్నానమాడినవారు సర్వకర్మ వినిర్ముక్తులయి జ్ఞాన విజ్ఞాన సంయుతులగుదురు, ప్రళయకాలము వరకు రుద్రలోక వాసులగుదురు; అమరులనగా దేవతలు కావునను వారిచట నుందురు కావునను దీనికి అమరకటకమని వ్యవహారము, (కటకమనగా వసతి స్థానమనియు అర్థము, అమరులకు నివాస స్థానము కావున అమరకటకము అనబడినది) దేవతాత్మకమును అమరేశుని స్థానమును అగు ఈ అమరకంటక పర్వతపు రెండు ప్రక్కలందును సువ్రతులగు ఋషిముఖ్యులు తపమాచరించుచుందురు, అమర కంటకమునకు చుట్టునుగల యోజన దూర ములో నర్మదానదీ శుభజలము నందు స్నాన మాడినవారు పాపముక్తులై రుద్రలోక మందుదురు.