మత్స్య మహా పురాణము
రాజు దండోపాయము ఆచరించవలెను
శ్రీ మత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను, సర్వభూతములను అధిగోపనము (వాటియందు తాను అధిష్ఠాతగా నుండి రక్షణము) చేయుటకై దండోపాయము ఆచరించుటకుగా స్వయం భూబ్రహ్మ సకల దేవతాంశములను ఉపాదానకారణము (ముడి సరకు) గా తీసికొని రాజును సృష్టించెను. ఈతని తేజస్సుచే ఈతని నెవ్వరును తేరిపార చూడనైన జాలరు కావున రాజు భాస్కరుడువలెనే లోకములందు ప్రభువనబడుచు రాజు రవిగా వెలుగొందుచున్నాడు; ఎపుడు (ఎందుచే) ఈతని దర్శనమున లోకము ప్రసాదమును (హాయిని) పొందునో అపుడు (అందుచే) అతడు జన నయనానందకరత్వ గుణముచే (రాజ) చంద్రుడగుచున్నాడు; ఎట్లు యముడు తగిన కాలము వచ్చినపుడు ప్రాణులకు ప్రియమగు సుఖమును ద్వేష్య(మగు దుఃఖ)మును ఇచ్చుచున్నాడో అట్లే ప్రజలకును రాజు యమ (వ్రతసమాన) వ్రతమును ఆచరించ వలసి యుండును; (రాజు ప్రజలలో మంచివారి నాదరించవలెను; దుష్టులను దండించ వల యును; వరుణుడు ఎల్లరను పాశములతో బంధించువాడుగానే కనబడుచున్నాడు; అట్లే రాజుకూడ పాపులను వారిపాపములు ననుసరించి నిగ్రహించ (దండించ వలెను; ఇది రాజాచరించ వల సిన దారుణవ్రతము (కర్మము); పరిపూర్ణుడగు చంద్రుని చూచినంతనే మానవుడు ఎట్లు హర్ష మందునో అట్లే ఎవని విషయమందు ప్రకృతులు (ప్రజలును రాజోద్యోగులును) హర్షింతురో అట్టివాడే చంద్ర సమానుడగు రాజు; రాజు ఆగ్నేయ (అగ్ని సమాన) వ్రతము నందుండి ప్రతాప యుక్తుడును తేజస్వీయునై పాపకర్ములగు మానవుల విషయమందును దుష్టులగు సామంతుల విషయమందును హింస ప్రాణుల విషయమందును, ప్రవర్తించవలయును; ధర అనగా భూమి తనంత తానై సర్వభూతములను ధరించునట్లే సర్వభూతములను ధరించు (పోషించు-రక్షించు- అదుపులో ఉంచు) ఇంద్రార్కవాయు యమవరుణ చంద్రాగ్ని పృథివుల తేజోవ్రత రూపమగు పార్థివ వ్రతమును రాజు ఆశ్రయించి చరించుచు వర్తించవలయును; ఇంద్రుడు వర్షర్తు మానముల నాలుగింటి యందును వర్షించునట్లే రాజు కూడ తన రాష్ట్రమందు ఇచ్చకు వచ్చునట్లు మిక్కిలిగా వర్షించి ఇంద్ర వ్రతవర్తి కావలెను; ఆదిత్యుడు సంవత్సర మందలి ఎనిమిది మాసముల పాటు కిరణములతో తోయమును లాగికొనునట్లే రాజును తన రాష్ట్రమునుండి పన్నులను లాగికొన వలెను: ఇది రాజు పూనవలసిన అర్కవ్రతము; మారుతుడు సర్వభూతముల యందును ప్రవేశించి సంచరించునట్లే రాజుకూడ చారుల ద్వారమున సర్వభూతముల యందును ప్రవేశించవలయును, ఇది రాజవలంబించు మారుత(వాయు) వ్రతము.