ప్రతిమా లక్షణము

ఋషులు సూతును ఇట్లడిగిరి. గృహస్థు మొదలగు వారియందు సర్వదా క్రియా యోగము ఎట్లు సిద్ధించును? ఏలయన-వేయి జ్ఞానయోగములకంటెను కర్మ (క్రియా) యోగము విశిష్టతర మయినది కదా! కావున క్రియా యోగసిద్ధి కలుగు మార్గమెరుగుట అవశక్యము. అన సూతుడు వారికిట్లు చెప్పెను. దేవతల అర్చామూర్తులను అనుకీర్తించుట (వివరించుట) అను క్రియాయోగ ప్రకారమును మీకు ప్రవచింతును; ఏలయన దానికంటె విశిష్ట తరమగు భుక్తి ముక్తిప్రద సాధనము మరియేదియు లేదు. సంసార బంధముక్తి కలిగించునది కావునను దేవతా ప్రతిష్ఠల యందును దేవతాయజ్ఞోత్సవములందును ఆవశ్యకము కావునను దేవతల అర్చామూర్తుల స్వరూప వర్ణనము తెలిసికొనదగియున్నది; ఇందు మొదట ప్రశస్తమగు విష్ణుప్రతిమా రూపమును తెలిపెదను.

అతడు శంఖచక్రధరుడు శాంతుడు, పద్మహస్తుడు, గదాధరుడు, ఛత్త్రాకార శిరస్కుడు శంఖమువంటి మెడయు శుభనేత్రములును కలవాడు. అతని ముక్కు ఎత్తై చెవులు ముత్తెపు చిప్పలవలెను భుజక్రమములు గొప్పవై ప్రశాంతములుగను నుండును; గృహముల యందు పూజకై శాస్త్రజ్ఞుడగు పురోహితుడిది అష్టభుజమూర్తిగానో, చతుర్భుజ మూర్తిగనో, ద్విభజమూర్తిగనో చేయించవచ్చును; అష్ట భుజమూర్తికి కుడి చేతులందు ఖడ్గ గదాశర పద్మములును వామ హస్తముల యందు ధనుఃభేటక శంఖచక్రములు నుండును; చతుర్భుజునకు కుడిచేతులందు గదా పద్మములును ఎడమచేతులందు శంఖ చక్రములు నుండును. కృష్ణ ప్రతిమకు గద ఎడమ క్రింది చేతియందుండుట ప్రశస్తము; శంఖ చక్రములను తమ ఇచ్ఛానుసారము ఎడమ చేతియందో కుడి చేతియందో పై చేతుల యందు నిలుపవలయును; అనగా కుడి క్రింది చేతి యందు పద్మ ముండును; దేవుని పాదద్వయ మధ్యమున క్రింది భాగమున భూదేవియు కుడివైపున నమస్కరించుచున్న గరుత్మంతుడును ఎడమవైపున పద్మహస్తయు శుభముఖియునగు లక్ష్మీయు నుండవలయును, గరుత్మంతుని విష్ణునకు ముందు ఉంచుటయు శ్రేయస్కరమే; పద్మము ధరించిన శ్రీదేవి పుష్టిదేవులు కుడి ఎడమలందుండ వలయును; దేవునకు పైభాగమున తోరణముండును; దానిపై విద్యాధరులు దేవదుందుభులు గంధర్వ దంపతులు పత్రములు వల్లులు సింహములు వ్యాఘ్రములు కల్పలతలు స్తుతించు అమరేశ్వరులు నుందురు, విష్ణురూపము ఇది.

మూర్తి పరిమాణములో మూడవవంతు పీఠ పరిమాణముండును.

దేవదానవ కిన్నర ప్రతిమలు తొమ్మిది తాళముల ప్రమాణముతో నుండును. (తాలము= చాచిన బొటనవ్రేలి కొననుండి చాచిన నడిమివ్రేలి కొనవరకుగల దూరము.)

ఇకమీదట ఈ కొలతల తెలివిడికై సూక్ష్మభేదములతోకూడ మానోన్మానమును తెలిపెదను, (ఉన్మానమనగా తూకపు పరిమాణమని యర్ధము, కాని ఇచట దైర్ఘ్యాది మానములను కొలుచు విధానమని యర్థము); గవాక్షరంధ్రముల నుండి లోనికి రవికిరణములు ప్రవేశించుచుండగా వానియందుండి గాలిలో ఎగురుచున్నట్లు కానవచ్చు స్పష్ట రజఃకణములలోని సూక్ష్మతమ కణమును త్రసరేణువందురు; అట్టివి ఎనిమిదియైన ఒక వాలాగ్రము. అవి ఎనిమిది ఒక లక్ష యగును; అవి ఎనిమిది ఒక యూక; అని ఎనిమిది ఒక యవ; అవి ఎనిమిది (ఒకదాని ప్రక్క నొకటి అడ్డముగా పెట్టిన యవ లెనిమిదిటితో వ్యాప్తమగు దూరము) ఒక అంగుళము; (మానవుని బొటనవ్రేలి కణుపుదగ్గర అరచేతివైపున గల దూరమును ఒక అంగుళముగా గ్రహింతురు; శిల్పిదియో యజమానునిదియో కుడిచేతి బొటనవ్రేలి కణుపునొద్ద గల ఈ దూరము ప్రమాణముగా తీసికొనగా అట్టి యంగుళములు పండ్రెండు ప్రతిమా ముఖపు నిలువు ఉండవలయును; ముఖమానమునుబట్టి మిగిలిన అవయవముల కొలతలుండును; (అనగా ఇందీయ బోవు ఆయా అవయవముల కొలతలన్నియు ఈ పండ్రెండు అంగుళముల ముఖమానమును బట్టి యుండును, ఇది మారినచో ఆదియే యనుపాతములో మిగిలిన అవయవముల కొలతలను మారును.)

బంగారము, వెండి, రాగి, రత్నములు, శిల, దారువు, మిశ్ర (పంచ) లోహములు, ఇత్తడి, రాగి, కంచు మిశ్రము-చందనము వంటి శుభదారువులు- ఇట్టి వానితో దేవతార్చా మూర్తులు చేయుట ప్రశస్తము. ఇండ్లయందు అర్చించు ప్రతిమలు కుడిచేతి బొటనవ్రేలి కణుపంత మొదలుకొని జేనెడు (పండ్రెండు భారతీయాంగుళముల) వరకుగల నిలువుటెత్తుతో ఉండవలెను. దేవాలయములందలి దేవతా మూర్తులు పదునారు జేనలవరకు నిలువుటెత్తుతో ఉండవచ్చును, అంతకంటె ఎక్కువ ఎత్తుగా నుండుట తగదు; వితశక్తిననుసరించి ఈ పరిమితుల నడుమ ఉత్తమాధమ కనిష్ఠ మానములలో దేనితోనైన విగ్రహనిర్మాణము చేయవలయును; ఇందనుసరించ వలసిన పద్ధతి ఏమనిన-దేవాలయ ద్వారపుఎత్తును ఎనిమిదిగా విభజించి వాని నుండి ఒక భాగమును వదలి మిగిలిన ఏడు భాగముల పరిమాణముతో దేవతా మూర్తిని చేయించవలయును; మొత్తము పరిమాణమును మరల మూడుభాగములుచేసి అందు త్రిభాగము (1/3)తో పీఠమును అంత ఎక్కువ ఎత్తును అంత తక్కువయును కాకుండ నిర్మించవలయును.