కృష్ణాజిన దానము

(కృష్ణాజినమనగా నల్లని మచ్చలుగల ఇఱ్ఱి అను మృగపు చర్మము) కృష్ణాజినమును ఎట్టి బ్రాహ్మణునకు ఏకాలమున ఏవిధానమున దానమీయవలయునో తెలుపుమని మనువడుగ మత్స్యుడిట్లు తెలిపెను. వైశాఖ పూర్ణిమ చంద్ర సూర్యగ్రహణములు మాఘ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఉత్తరాయనము ద్వాదశి తిథి - ఈ కాలములందు ఇది దానమిచ్చుట మహాఫలదము, అహితాగ్నియగు విప్రుడు దానయోగ్యుడు, విధానమిక తెలిపెదను, వినుము! నరాధిపా! గోమయముతో అలికిన శుచి ప్రదేశమున మొదట ప్రశస్తము శోభనమునగు కంబళము (తివాచీ) పరచవలెను; కొమ్ములు, గిట్టలుకల కృష్ణాజినమును దానిపై పరచి దానికి బంగరు కొమ్ములు, వెండి దంతములు, ముత్తెములతో నూవులతో తోక కుచ్చు అమర్చి నూవులతో ఆచర్మముకప్పి దానిపై నూతన వస్త్రమును ఉంచి దాని నడుమ బంగరు నుంచి రత్న గంధాదులతో యథాశక్తిగ అలంకరించవలయును, వీటియందు నాలుగు దిక్కులందు నాలుగు కాంస్యపాత్రలుంచవలెను. అట్లే నాలుగు మట్టిపాత్రలందు వరుసగా తూర్పు మొదలుగనే నేయి పాలు పెరుగు తేనె పోయవలెను. సంపెంగ కొమ్మను రంధ్రములేని కడవను వీనికి బయటగా శుభచిత్తముతో ఉంచవలెను.

ఈచర్మపు అన్ని అంగములందు వేరువేరుగ క్రొత్త పసుపుపచ్చని వస్త్రములను పాదములకడ మృణ్మయ పాత్రములను ఉంచవలెను. నేను లోభముచే చేసిన కాయిక పాపములన్నియునేచేయు ఈ లోహపాత్రాది దానముచే శీఘ్రమే నశించుగాక! అను మంత్రముతో లోహపాత్రమును దాని ఎడమ పాదముకడ నూవులతో నింపి ఉంచవలెను; నేను కామవశమున చేసిన పాపములునేచేయు ఈ కాంస్య పాత్ర దానముతో నశించుగా యనుచు తేనెతో నింపిన కంచు పాత్రను చర్మపు కుడి పాదముకడ ఉంచవలెను. పరులు నిందించుట వారిపై కొండెములు చెప్పుట పృష్ఠమాంస భక్షణము- వీనిచే కలిగిన పాపము తామ్ర పాత్ర దానముచే నశించుగాక! కన్య విషయమున అనృతము పలుకుటవలన గోవులను వరదారలను అనుమానించుట వలన కలిగిన పాపమునేచేయు ఈరాగి వెండి పాత్రల దానమున నశించుగాక! అనుచు ఈ రాగి వెండి పాత్రలను చర్మపుపై (ముందరి) ఎడమ- కుడి పాదములకడ ఉంచవలెను; జన్మాంతర సహస్రములందు దుర్బుద్ధితో నేజేసిన పాపమంతయు నేజేయు ఈ స్వర్ణపాత్ర దానమున నశించుగాక; జనార్దనా! యనుచు బంగరు పాత్రనుంచవలెను; బంగారు ముత్తెములు, పగడములు, దానిమ్మ పండ్లు, మాదీఫలములు, ప్రశస్త పాత్రమందుంచి చెవులయందు, గిట్టలయందు కొమ్ముల నడిమిచోటు నందు, ఇంకను సర్వశాక ఫలములతో కూడ ఉంచవలయును.

ఈ దానము గ్రహించు అహితాగ్నియగు బ్రాహ్మణుడును స్నానము చేసి దోవతి ధరించి ఉత్తరీయము వేసికొని యథాశక్తిగా అలంకరించుకొనవలయును; అతడు దీనిని తోకవైపున ప్రతిగ్రహించవలయును, దానమంత్ర మిది: “నల్లని కృష్ణాజినమా! నల్లని కంఠము కలవాడు, కృష్ణాజినము దాల్చినవాడునగు వృషభధ్వజుడు నీదానముచే ప్రీతినందు గాక! నా పాపములు తొలగుగాక!” ఇట్లు కృష్ణాజిన దానమయిన తరువాత దాత ఆ విప్రుని తాకరాదు; ఏలయన అతడపుడు చితియందలి యూపకాష్ఠముతో సమానుడు, అతనిని దానకాల శ్రాద్ధకాలములందు దూరముగ విడువదగును; (తాకరాదు) అంతట ఆ విప్రుని అతని ఇంటికి పంపి దాత మంగళ స్నానము చేయవలయును; చంపక శాఖతో కూడిన కుంభమందలి జలముతో అచార్యుడు ఆ కుంభమును దాత శిరము పైగా నుంచి అతని తలపై “ఆప్యాయస్వ” “సముద్రజ్యేష్ఠాః” అను ఈ మొదలగు పదునారు ఋక్కులతో జలము ప్రోక్షించవలెను, తరువాత దాత క్రొత్త వస్త్రములను (జతనుండి చించని వానిని) ఒకటి దోవతిగా-మరియొకటి ఉత్తరీయముగా) ధరించి ఆచమించినచో శుచియగును; ఆకుంభమును మిగిలిన పదార్థశేషమును నాలుగుత్రోవలు కలిసిన చోట పారవేయవలెను; దీనిచే కలుగు భగవత్ర్వీతి ఇంతయని చెప్పుట దేవతలకును శక్యము కాదు; ఐనను ఉద్దేశ మాత్రమున చెప్పెద వినుము; సమగ్ర భూదాన ఫలమబ్బును, ఇందు సంశయమే లేదు; కామచారియై పోవలె సర్వలోక సంచారియగును, ఆ ప్రళయాంతముగా స్వర్గ ప్రాప్తుడై సుఖించును, వానికి పితృ పుత్ర భార్యాదులతోడి వియోగము సంభవించదు, ధనత్యాగ దేశ త్యాగములు కలుగవు; కృష్ణునకును ఇష్టమగు కృష్ణమృగ చర్మమును సమాహిత చిత్తుడై విప్రునకు దానమిచ్చినచో ఈ యథోక్త దానఫలమున శోకరాహిత్యమును మనో భీష్టఫల సిద్ధియు కలుగును.