శుభ సప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను, ఉపవాస పూర్వకముగా ఆచరించినచో దుఃఖ విముక్తిని భోగములను కలిగించు శుభ సప్తమీ వ్రతమును తెలిపెదను.

ఆశ్వయుజమాసము పుణ్యప్రదము. దాని శుక్ల సప్తమినాడు స్నానజపములుచేసి శుచియై విప్రులచే పుణ్యాహవాచనము చేయించవలెను. కపిలగోవును భక్తిపూర్వకముగా గంధమాల్యాను లేపనములతో అర్చించవలెను. “సూర్యుని వలన పుట్టినదియు సర్వభువనములు నివాస స్థానముగా కలదియు శుభకల్యాణ శరీరముకలదియు అగునీకు నమస్కారము” అని ఆ గోవుకు నమస్కరించవలెను. రాగి పళ్లెరములో కుంచెడు నూవులుపోసి వానిపై శ్వేతవస్త్రము వేసి వస్త్ర మాల్య-గుడ-నానావిధఫల భక్ష్యఘృత పాయసములతో కూడ బంగారు వృషభ ప్రతిమ నుంచి ‘అర్యమా ప్రీయతామ్’ ‘రవి ప్రీతి నొందుగాక!’ అనుచు సంధ్యాకాలమున విప్రునకు దానమీయవలెను. ఆపగలు ఉపవసించి, పంచగవ్యమును ఆహారముగా తీసికొని రాత్రిని గడుపవలెను. మరునాటి యుదయము బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి తానును భుజించ వలయును. సంవత్సర కాలము ఇట్లుచేసి వ్రతాంతమున ఈచెప్పిన సామగ్రితోపాటు మంచ మును పడకను (సర్వ పరికములతో) పాత్రలను ఆసనములను వేదవిదుడగు విప్రునకు ‘వివస్వాన్ ప్రీయతామ్’ ‘రవి ప్రీతి నందుగాక!’ అనెడు మంత్రముతో దానము ఈయవలెను.

ఇట్లు చేయువాడు జన్మజన్మమునందును ఇహమున నిర్మలైశ్వర్య కీర్తులను పొంది పరమున స్వర్గమునందు అప్సరోగణ గంధర్వ గణములచే పూజలందుకొనుచు సుఖించి చివరకు దేవగణాధిపుడై కల్పాంతమువరకు ఉండి మరల కల్పాదియందు సప్త ద్వీపాధిపతియై జన్మించును. ఈ వ్రతకల్పమును చదివినందున కలిగిన పుణ్యము వేయి బ్రహ్మ హత్యలను నూరు భ్రూణ హత్యలను నశింపజేయును. (భ్రూణుడు-షడంగములతో వేదముల నధ్యయనము చేసిన విప్రుడు) దీనిని చదివినను విన్నను ఇతరులకు తెలిపినను ముహూర్తకాలము ఈ వ్రతాచరణము చూచినను అట్టివాడు సర్వపాప విముక్తుడై విద్యాధర నాయకుడగును.

దీనిని ఏడేండ్లు ఏడు వేరువేరు విధానములతో ఆచరించినవాడు క్రమముగా సప్త లోకములకు అధిపతియై తుదకు ముక్తినందును.