మత్స్య మహా పురాణము
భవిష్యద్రాజాను కీర్తనము
ఋషులు సూతుని ఇట్లడిగిరి, సూతా! నీవు భవిష్యులగు రాజులతో గూడ పూరు వంశమును మాకెరిగించితివి, సూర్యవంశము నందు రాబోవు రాజు లెవరు. యాదవ వంశము నందు కలుగబోవు కీర్తి వర్ధనులను కలియుగమునందు రాబోవు వారిని-వీరి వంశాంతమందు సువ్రతులగు ఏ జాతులవారు రాజ్యమునకు వత్తురో, వారి భవిష్య క్రమమును సంక్షేపముగా తెలుపుము అన సూతుడిట్లు చెప్పసాగెను. బృహద్బలునకు వీరరాజగు ఉరుక్షయుడు వానికి మహాతపుడగు వత్సవ్యూహుడు వానికి ప్రతివ్యోముడు వానికి దివాకరుడు కలుగుదురు, దివాకరునికి మధ్య దేశమునందు శుభయగు అయోధ్యయను నగరి ఉండును, అతనికి మహా యశుడగు సహదేవుడు అతనికి మహాఘనుడుగు ధ్రువాశ్వుడు, అతనికి మహాభాగుడగు ప్రతీ పాశ్వుడు అతనికి సుప్రతీపుడు అతనికి మరుదేవుడు అతనికి సునక్షత్రుడు అతనికి పరంతపుడగు కింనరాశ్వుడు అతనికి మహామనుడగు అంతరిక్షుడు అతనికి సుషేణుడును శత్రుజేతయగు సుమిత్రుడునను వారును వారిలో సుమిత్రునకు బ్రమద్రాజుడు అతనికి వీర్యవంతుడును ధార్మికుడునగు కృతంజయుడును అతనికి విద్వాంసుడగు రణేజయుడు అతనికి వీరరాజగు సంజయుడును అతనికి శాక్యుడును అతనికి శుద్దౌదనుడును అతనికి సిద్ధార్థుడును అతనికి పుష్కలుడు అతనికి ప్రసేనజిత్తు అతనికి క్షుద్రకుడు అతనికి కులకుడు అతనికి సురథుడు అతనికి సుమిత్రుడు కలుగుదురు. ఇతడే వీరిలో కడపటివాడు, కలియుగమున కలుగబోవు ఇక్ష్వాకులు వీరు.
బృహద్బలుని వంశమున కలిగిన పురాతన రాజులను కలుగబోవు వారిని నిఃశేషముగ తెలిపితిని; ఈ విషయమందు పురాతనులగు విప్రులు గానము చేసిన అనువంశశ్లోకము ఇది: ఇక్ష్వాకుల ఈవంశము సుమిత్రునితో అంతమందును, అనగా ఈసుమిత్రుడు రాజగుటతో ఈ వంశపు అంత్యస్థితి ఏర్పడును; లోగడనే మీకు తెలుప నారంభించిన మనువంశ వృత్తాంతము ఇది: ఇకమీదట మాగధులగు బృహద్రథవంశీయుల నెరింగింతును లోగడ తెలిపిన జరాసంధుని పుత్రుడగు సహదేవుని వంశమునందలి భూత, వర్తమాన, భవిష్య రాజులను తెలిపెదను. భారత సంగ్రామము జరిగి అందు ఈ సహదేవుడు నిపాతితుడు (పడగొట్టబడిన వాడు- మృతుడు) కాగా అతని కుమారుడు సోమాధి గిరివ్రజమున మగధ రాజయ్యెను, అతడు ఏబది ఏనిమిదేండ్లు రాజ్యమేలెను, అతని వంశమున శ్రుతవ్రతుడు అరువది నాలుగు ఏండ్లు ఆప్రతీపి ముప్పదినాలుగేండ్లు నిరామిత్రుడు, నలువదిఏండ్లు సురక్షుడు ఏబదియారేండ్లు బృహత్కర్ముడు, ఇరువది మూడేండ్లు రాజ్యమేలి; ఇపుడు శ్యేనజిత్ ఏలుచున్నాడు. అతడు ఏబది ఏండ్లు ఏలును, తరువాత శ్రుతంజయుడు నలువది ఏండ్లు విభుడు ఇరువది ఎనిమిదేండ్లు శుచి ఏబది ఎనిమిదేండ్లు త్రినేత్రుడు ఇరువది ఎనిమిదేండ్లు మహాసేనుడు నలువది ఎనిమిదేండ్లు మహీనేత్రుడు ముప్పది మూడేండ్లు సుబలుడు ముప్పది రెండేండ్లు రిపుంజయుడు ఏబది ఏండ్లు పాలింతురు, ఈ బృహద్రథ వంశీయ రాజులు మొత్తము ముప్పది ఇద్దరును వేయియేండ్లు పాలింతురు; పులకుడను వాని కుమారుడు బాలకుడు అగు క్షత్రియుడు ఈ వంశపు కడపటి వాని తరువాత తాను రాజగును.