దుర్గ నిర్మాణ క్రమము

ఇట్టి ప్రదేశమునందు రాజు ధన్వదుర్గము, మహీదుర్గము, నర దుర్గము, వృక్ష దుర్గము, జలదుర్గము, గిరిదుర్గము అను ఆరువిధములగు దుర్గములలో ఏదో ఒకవిధమగు దానిని నిర్మించవలెను, వీనిలో ఆరవది చాలమేలు; దుర్గమునకు చుట్టును అగడ్తయు, ప్రాకారమును బురుజు లును శతఘ్నులు మొదలగు వందల కొలదిగ యంత్రములు తలుపులుగల మనో హరమగు పురద్వారము అనగా గోపురము, దానిపై జెండా-కలిగి రాజ ఏనుగుపై దానినుండి ప్రవేశింపదగినంతగా ఉండవలెను, దుర్గపులోపల నాలుగు పొడవగు వీథులు - వానిలో మొదటి వీథి చివర దృఢ దేవాలయము, రెండవదాని చివర రాజభవనము, మూడవదాని చివర ధర్మాధి కరణ స్థానము, నాలుగవదాని చివర గోపురము అనగా పుర ద్వారము ఉండవలెను. పురము అయతము (దీర్ఘ చతురస్రము) చతురస్రము వృత్తము త్రికోణము యవమధ్యము (దీర్ఘ వృత్తము) అర్ధ చంద్రము, వజ్రము (అష్టాన్రము అష్టభుజాకృతి) ఈ ఆకృతులలో దేనిలోనైన ఉండవచ్చును; ఇన్నిటిలోను రాజాజ్ఞ (రాజపురుషాజ్ఞ) లేనిదే జనుల రాకపోకల కవకాశము లేకుండవలెను; నదీ తీరములందు కట్టు దుర్గము అర్ధచంద్రాకృతిలోనే ఉండుట ప్రశస్తమని శాస్త్రజ్ఞులందురు.

రాజ భవనమునకు దక్షిణముగా కోశగృహము దానికి దక్షిణముగా గజస్థానము తూర్పు మొగముగా గాని ఉత్తరపు మొగముగాగాని ఉండవలెను, పురాగ్నేయమున ఆయుధాగారము, వంటశాల కర్మశాలలు (కమ్మరము-వడ్రంగము-కంచరము మొదలగునవి) రాజ భవనమున కెడమగా పురోహిత గృహము, మంత్రి గృహము, వేదపండిత గృహము, వైద్య గృహము, కోష్ఠాగారము (వంట సామగ్రిశాల-ఉగ్రాణము) గోస్థానము, అశ్వస్థానము ఉండవలెను; అందశ్వ శ్రేణి ఉత్తరపు మొగమై కాని దక్షిణపు మొగమైకాని ఉండవలెను, మిగిలిన మొగములు పనికిరావు; అశ్వశాలలో రాత్రింబవళ్లు కాగడాలు వెలుగుచుండవలెను. అందు కోళ్ళు, కోతులు విశేషించి ఎర్రమూతి కోతులు, దూడలతోకూడ పాడియావులు, మేకలు (ఇవి అశ్వరోగములు పోగొట్టు రక్తము మూత్రము మొదలగునవి ఇచ్చును) ఉండవలెను. గోగజాశ్వాది శాలలందు పేడ సూర్యస్త మయమునకు లోపలనే తీసివేయవలెను; వీటి సారథులకు క్రమమెరిగి (ఈ శాలలున్న వరుస ననుసరించి) అందరకు గృహములను ఈ శాలలకు దగ్గరలో నిర్మించవలెను, యోధు లకును శిల్పులకును మంత్రులకును దైవజ్ఞులకును ఒకే విధముగా మంచి ఇండ్లు నిర్మించి ఈయవలెను; దుర్గములందు రోగములును ప్రబలముగా నుండు అవకాశము కలదు; కావున రాజు గోగజాశ్వాది వైద్యులను తప్పక తగినవారిని సంపాదించి దుర్గమందు నిలుపుకొనవలెను; గాయనులు విప్రులు మొదలగువారికిని దుర్గమందు వసతి ఉండవలెను, ఐనను పనిలేనిదే వీరెవ్వరును చాలమంది దుర్గములోపల ఉండరాదు.