మత్స్య మహా పురాణము
కల్యాణ సప్తమీ వ్రతము
బ్రహ్మ ఈశ్వరుని ఇట్లడిగెను. ‘భగవన్! సంసార సాగర దుఃఖమునుండి ఉద్ధరించు సాధనమగుచు స్వర్గారోగ్య ఫలప్రదమగు వ్రతమేదయిన తెలుపుము.’ ఈశ్వరుడిట్లు చెప్పెను: సౌర (సూర్యోపానస ప్రధానములగు) ధర్మములను చెప్పెదను. వాటి పేరులు-కల్యాణ సప్తమి-విశోక సప్తమి-ఫల సప్తమి- శర్కరా సప్తమి-కమల సప్తమి-మందార సప్తమి-శుభ సప్తమి. ఇవి యన్నియు అనంతఫలదములును దేవర్షులచే కూడ పూజితములును. వీటి విధానమును కల్పోక్త ప్రకారమున నామక్రమమున చెప్పెదను.
ఆదిత్య వారముతో కూడిన శుక్ల సప్తమికి కల్యాణ సప్తమియని లోకప్రసిద్ధి. ఈనాటి ఉదయమున గోక్షీర స్నానము చేయవలెను. పిమ్మట తెల్లని స్వచ్ఛ వస్త్రములు ధరించి అక్షతలతో అష్టదళ పద్మము వేయవలెను. దాని నడుమ గుండ్రని కర్ణికను వేయవలెను. ఈ పద్మము నందంతట నిండునట్లు పుష్పములతో అక్షలతో నారాయణుని ఆకృతి వేయవలెను.
పిమ్మట భూః- భువః-సువః-అను వ్యాహృతి మంత్రములతో బ్రాహ్మణులను యథా శక్తిగా భక్తిపూర్వకముగా గుడక్షీర ఘృతాదికముతో పూజించవలెను. తిలపాత్రమును హిరణ్యమును బ్రాహ్మణున కర్పించవలెను. ఈ నియమములు పాటించి వ్రతము జరిపి నిద్రించి ఉదయమున మేలుకొని స్నాన జపము లాచరించి బ్రాహ్మణులతో కూడ ఘృతపాయసము భుజించవలయును. దంభమునకుకాక నిష్కపట భావముతో వేదవేత్తయగు విప్రునకు మృతపాత్రమును ఉదకుంభ మును బంగారమును ‘దీనిచే పరమాత్ముడగు దివాకర భగవానుడు ప్రీతి చెందుగాక!’ అను మంత్రముతో సమర్పించవలయును. ఈ విధముగా ప్రతి మాసమునందును చేయవలయును. పదుమూడవ మాసమున మొగమునందు బంగారుపట్టె వస్త్రాలంకారములు కలిగిన పాడి యావులను పదుమూడింటిని దానమీయవలయును. ధనము లేనివాడు ఇతరులతో పోటీపడక ఒకపాడి ఆవునైన ఈయవలయును. ధనముకలవాడు మాత్రము తనకు శక్తియుండియు ధన లోభముచే తక్కువ ఈయరాదు. విత్త మోహము చూపుటచే అధఃపతితుడగును. ఈ విధానమున కల్యాణ సప్తమీ వ్రతము చేయువాడు సర్వ పాప వినిర్ముక్తుడై ఇహమున అనంతములగు ఆయురారోగ్యైశ్వర్యములను పొంది పరమున సూర్యలోకమున పూజితుడగును. ఈ కల్యాణ సప్తమి సదా సర్వపాప హరయును సర్వదేవతా పూజితయును సర్వ దోషోపశమనియునునైనది. అనంత ఫలప్రదయగు ఈ కల్యాన సప్తమీ విషయమును వినినను చదివినను పాపముక్తుడగును.