హిరణ్యకశిపు వధాది కథనము

సూతుడు ఋషుల కింకను ఇట్లు చెప్పసాగెను, గాడిదలు, పాములు, మొసళ్ళు, ఈహా మృగములు, వరాహములు, హంసలు, కోళ్ళు, సింహములు, కాకులు, గ్రద్దలు, పావురములు -  ఈ ప్రాణుల మోములవంటి మొగములు బాలసూర్యుడు ధూమకేతువు అర్ధ చంద్రుడు ప్రజ్వలించు అగ్ని మెరపులు చక్రములు కొరవులు -  వీటిని పోలిన మొగములు కలిగి నోరులు తెరచుకొని భయంకరులై నాలుకలు కోయుచు బలగర్వితులగు దానవులు కైలాస సదృశ శరీరము కలిగి అవధ్యుడగు ఆ మృగేంద్రునిపై యుద్ధమందు కురియించిన బాణ వర్షములు అతనికి ఏమియు వ్యథ కలిగించలేదు. దానవేశ్వరులపుడింకను మరికొన్ని ఘోర బాణముల నామృగేంద్రునిపై సర్పములవలె బుసకొట్టుచు క్రుద్ధులయి ప్రయోగించిరి. కాని దానవేంద్రులు ప్రయోగించిన ఆ ఘోర శరములన్నియు పర్వతమునందు మెరపులవలె ఆ నృసింహ శరీరమున నాశనము చెందెను. అంతట దైత్యులు క్రోధ సమన్వితులయి జ్వలించు చక్రములను అన్ని వైపులనుండి శీఘ్రముగా ఆతనిపై వినరిరి. అన్ని వైపులనుండి పడుచున్న చక్రములతో ఆకాశము ప్రళయ కాలమున మిగుల ప్రకాశించు చంద్రాదిత్యాది గ్రహములతోవలె వెలుగుచు కనబడెను. అగ్ని జ్వాలలవలె చెలరేగు ఆ చక్రములనన్నిటిని మహాత్ముడా మృగేంద్రుడు మ్రింగెను. అవి అతని నోటిలోనికి పోవుచు మేఘపు నడుమ అనుగుహలలో చొరు చంద్ర సూర్యాదులవలె నుండెను. మరల హిరణ్యకశిపు దైత్యుడు చాల పెద్దదియై ప్రజ్వలించుచు భయంకరమై శుద్ధ మొనర్చబడి తనయందలి ఆయుధముల నుండి వెలువడు మెరపుల కాంతులతో వ్యాప్తమైన శక్తిని ప్రయోగించెను. తనపైకి వచ్చిపడుచున్న ఆ ఉత్తమశక్తిని మృగేంద్ర భగవానుడు భయంకర హుంకారముతో విరచెను. అది విరిగి నేలపయి బడుచు నిప్పురవ్వలతో అంతరిక్షము నుండి రాలిపడు మహోల్కవలె కనబడెను. రాక్షసులు ప్రయోగించు శరపంక్తి నృసింహునికి దూరమందే నిలిచి ప్రకాశించు రూపముకల నల్లకలువ పూరేకుల దండలవలె కనబడెను.

ఆ దేవుడు లోకమందలి అన్ని సింహములవలె గర్జించి, లోక సాధారణ సింహమువలె విక్రమించి గాలి గడ్డికొనలనువలె ఆసేనను నశింపజేసెను. అంతట దైత్యేంద్రులు ఆకాశ మందుండి మహాకాంతిగల కొండలంతటి శిలా ఖండములతో గిరి శృంగములతో రాళ్ళవాన కురియించిరి. అది ఆ దేవుని తలపయిపడియు మిణుగురు పురువుల గుంపులవలె పది దిక్కులకు చెదరెను. మరల వారు శత్రు నాశకుడగు ఆతనిని మేఘములు జలధారలతో కొండనువలె రాలరాసులతో కప్పిరి. అయినను భయంకర వేగముగల సముద్రము పర్వత శ్రేష్ఠమగు మందరమును కదల్చలేనట్లే వారా దేవుని చలింపచేయలేకపోయిరి. ఇట్లది వ్యర్థమయి పడిపోగా జలవర్షము బండి ఇరుసంత లావగు ధారలతో అన్ని వైపులనుండి పడసాగెను. ఆకాశము నుండి తీవ్రవేగము గలిగి అన్ని వైపుల నుండి పడు జలధారలతో ఆకాశము దిక్కులు విదిక్కులు అంతరిక్షము ద్యులోకము భూమి - అంతయు క్రమ్మబడెను. కాని అవి ఆ దేవుని తాకనైన తాకకుండెను. ఆ ధారలు యుద్ధమున మృగేంద్ర రూపమున నిలిచిన అతనికి వెలుపలనేకాని మీదపడకుండెను. ఇట్లు రాలవాన అణగగా, నీటివాన ఎండగా ఆ దానవుడు అగ్ని వాయువులను చెలరేపుచు మాయనుపన్నెను. సహస్ర నేత్రుడగు మహేంద్రుడా అగ్నిని మేఘములతో కూడ కురియించిన మహాజల వర్షముతో చల్లార్చెను. అదియు శమించగా ఆ దానవుడు అన్ని వైపుల నుండి ఘోరమై క్రమ్ము తీవ్రాంధకారమును సృజించెను. ఇట్లు క్రమ్మిన చీకటి నడుమ దానవులు ఆయుధములు పట్టి చుట్టు నిలువగా భగవానుడు సూర్యుడువలె తన తేజముచే చుట్టబడి ప్రకాశించెను. మరియు దానవులా దేవుని లలాటమున త్రిశూలపు గురుతులతో మూడుగా చీలిన కనుబొమ ముడిరేక త్రిపథగ యగు (మూడు త్రోవల ప్రవహించు) గంగవలె కనబడెను. ఇట్లు తమ మాయలన్నియు హతములుకాగా దైత్యులువివర్ణులై హిరణ్య కశిపుని శరణువేడిరి.