హిరణ్య హస్తి (గజ) రథ దాన విధానము

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను. ఇప్పుడిక శుభమగు సువర్ణ గజ రథ దాన విధానము తెలిపెదను. ఆ ప్రదానముచే వివేకులగు నరులు వైష్ణవపద (స్థాన)ము నందగలరు; శుభదినమందు తులాపురుష దానమందువలెనే విప్రులచే స్వస్తిపుణ్యాహవాచన లోకపాల ఆవాహనాదికము జరుపవలెను; ఋత్విజులను మండపమును సంభారములను భూషణ వస్త్రాది కమును కూడ అట్లే సమకూర్చుకొన వలయును, ఇందును అట్లే ఉపవసించి బ్రాహ్మణులతో కూడి భోజనము జరుపవలయును; పుష్ప రథాకారమగు బంగరు రథము చేయించవలయును, అందు మణ్యలంకారములు వింతగొలుపు వలభులు (చూరులవంటి కూర్పులు) నాల్గుచక్రములు ఉండవలెను, అష్టలోకపాలురు బ్రహ్మరవి శివులు నడుమ లక్ష్మీ పుష్టి దేవీసహితుడగు నారాయణుడు నుండవలెను; ఇవియన్నియు కృష్ణాజినముపై తిలద్రోణమందు ఉంచవలయును, దగ్గరలో అష్టాదశ ధాన్యములు పాత్రములు ఆసనములు చందనము దీపికలు పాదుకలు పాద రక్షలు ఛత్రములు అద్దములుండవలెను; రథపు ధ్వజమందు గరుడుడు కూబరపు కొనపై వినాయకుడు ఉండవలెను; దానిపై మేలుకట్టును దగ్గరలో నానాఫలములును, ఐదు వన్నెల పట్టువస్త్రమును, వాడని పూవులును, కుశచతుష్టయమును, అష్టగోవులును, సువర్ణగజ చతుష్టయమును, ముత్తెములు దండలును, రెండు వాస్తవ గజములును - ఇన్నియు ఉంచి దానమీయవలెను; బంగరు రథము మాత్రము ఐదు పలముల నుండి బారువ వరకుగల బంగారుతో చేయించ వలయును; మంగళవాద్య వేదధ్వనులతో కూడ వేదవేత్తలగు బ్రాహ్మణ పుంగవులచే స్నానము చేయించుకొని యజమానుడు పూవులు దోసిట పట్టుకొని ఆగ్న్యాదులరే త్రిః ప్రదక్షిణముచేసి ఈ మంత్రము ఉచ్చరించుచు బ్రాహ్మణులకు అవి దానము చేయవలెను.

“తేజోమయ రథమా! నమోనమః! బ్రహ్మ, విష్ణు, రుద్ర, రవి లోకపాల విద్యాధరులును వేద పురాణ యజ్ఞములును నిన్ను సేవిం(ఆశ్రయిం)చును, కావున ఇట్టి నీవు మమ్ము కాపాడుము, పరమ గుహ్యతమమును ఆనందహేతువును గుణరూప రహితమును అగు ఏ విష్ణు స్థానమును యోగైకావలంబనమగు స్వదృక్కులుగల యోగులు తమ హృదయ మధ్యమందు చూతురో ఆ మహాతత్త్వము నీవే ‘నాథుడవు’ ‘రక్షకుడవు’ అను పదమందు నిలిచినవాడవు, భవసాగరమున ముంచబడిన వారికి ఆనందకరమగు అమృతమును త్రావుట కుపయోగించు యజ్ఞాంగ పాన పాత్రమవు (చమనము) నీవే; కావున బంగరు ఏనుగుల అరదము రూపున నుండు మాధవా! పాపరాశిని శమింపజేసి ఈ దానముచే మాయందనుగ్రహమును చూపుము.”

అని ఇట్లు పలికి నమస్కరించ వలయును; ఇట్లు హిరణ్యగజ రథ ప్రదానము చేయువాడు సకల పాపవిముక్త దేహుడై విద్యాధర మునీంద్రదేవతా గణముల కాశ్రయమగు మహోత్తమ శివస్థాన మందును; తాము చేసిన అనేక పాపరాసులనెడు మంటలగములు సంపర్కముచే మండుచు బాధలనందు దేహములు కలిగి బాధలను ఉద్వేగమును అందుచున్న బంధువులను పితృ పౌత్రులను ఇతర అశేష బంధువులను కూడ ఈ దాత విష్ణు లోకమునకు తీసికొనిపోవును.