అవయవ స్పందన - శుభాశుభ విచారము

శుభాశుభ నిమిత్తములను తెలుపు మనిన మనువుతో మత్స్యుడిట్లనెను. అవయవములు గాని వీపుగాని హృదయముగాని కుడిపైపున స్పందించుట శుభము; ఎవమవైపున స్పందించుట అశుభము. అనగా అంగస్పందనమును శుభాశుభ విచేష్టితమును విస్తరముగ నాకుతెలిపి నన్ను అది ఎరిగిన వారిలో గొప్పవానినిగా జేయుమన్న మనువుతో మత్స్యుడిట్లు చెప్పెను. కుడి వైపున స్పందము కూడ మూర్ధమండైనచో పృథ్వీలాభము - లలాటమందు - స్థానవృద్ధి, భ్రూదేశ మందు-ప్రియజన సంగమము; అక్షిదేశమందు భృత్యలాభము; కంటికొనయందు ధనాగమము, నడుము నందు-తహతహపాటు; కంటికొలికి యందు యుద్ధమందు-శీఘ్రముగా జయము; కడగంటియందు-స్త్రీభోగము చెవికొనయందు-ప్రియ వార్తాశ్రవణము; నాసిక యందు ప్రీతి సౌఖ్యము; పెదవులయందు-ప్రియలాభము; కంఠమందు-భోగలాభము; భుజమూలముల యందు భోగవృద్ధి; భుజముల యందు మిత్రులతోడి స్నేహలాభము; హస్తము నందు ధనా గమము; వీపునందు పరాజయము; వక్షమునందు సద్యోజయము; కుక్షులయందు ప్రీతి; స్త్రీకి స్తనమందు అయినచో సంతానప్రాప్తి; నాభిదేశమందు స్థానభ్రంశము; జఘనమందు ధనాగమము; మోకాళ్ళ సంధుల యందు బలవంతులతో సంధి; అరికాళ్ళయందు ధనలాభకర ప్రయాణము కలుగును. గుహ్యావయవ మందైనచో బొబ్బలును పుండ్లును అగును; పాదముల యందు ఉత్తమస్థానప్రాప్తియగును; ఈ చెప్పిన స్పందములన్నియు స్త్రీలకు ఎడమవైపున కలిగినచో మంచి ఫలముల నిచ్చును; పురుషులకయినచో ఈ స్పందము కుడివైపు నందలి ప్రశస్తాంగమంద మయినచో విశేషముగ ప్రశస్తఫలము; ఎడమ వైపునందలి అప్రశస్తాంగమందు అయినచో విశేషముగ అప్రశస్త ఫలము; ఈచెప్పినవికాక మిగిలిన అవయవముల స్పందము విషయమున ఫలము సద్ర్బాహ్మణుల వలన ఎరుగవలయును. అనిష్ట చిహ్నములు కనబడినచో బ్రాహ్మణ సంతర్పణమును బ్రాహ్మణులకు బంగారాన్ని దానమును చేయవలయును.