మత్స్య మహా పురాణము
ద్వీపాది పరిమాణ కథనము
భారతీయులు భూగోళ స్వరూప ప్రతిపాదనమున పురాణములందు మూడు భావనలను దృష్టియందుంచుకొని నారని తోచును. మొదటిది దేశ చతుష్టయ భావన. రెండవది సప్తద్వీప భావన. మూడవది నవవర్షవిభాగభావన. వీనిని భావించుటలో నాటి వారి దృష్టి ఏమనునది విచారింపవలసి యున్నది. మిగిలిన రెండు భావనల మాట ఎట్లున్నను మొదటి భావన మాత్రము చాల విశిష్టమయినది. దీనియందు మన ఋషులు మేరువు (పామీరు పీఠభూమి) మధ్యస్థానముగా గ్రహించి ఏర్పడు ఒక చతురస్రాకృతిగ ప్రదేశమును యజ్ఞవేదికనుగా భావనచేసిరి. ఇదియొక విలక్షణమగు భావన. ఇది మనవారి హృదయపవిత్రతను వైదికదృష్టిని తెలుపుచున్నది. దీనితో బాటు వారు సకల భూమండలమును అందలి నదీ పర్వత సముద్రాదికమును వానిచే ఏర్పడు ఆకృతి విశేషములను ప్రకృతియందు ఆయా పర్వత నద్యాదికము ప్రాణి సమూహమునకు కలుగజేయు ఆయా ఉపకారములను ఎంతగా ఎరిగియుండిరో కూడ దీనిచే అవగతమగుచున్నది.
ఇక సప్త ద్వీపభావనలో యావద్భూ మండలమును చేరియున్నది. నవవర్ష భావన జంబూ ద్వీప భావనలోని ఒక ఉపాంశము మాత్రమే అని తోచును.
ఋషులు సూతు నిట్లడిగిరి, ద్వీపములు సముద్రములు పర్వతములు వర్షములు నదులు ఎన్ని? మహాభూత ప్రమాణము లోకాలోక (పర్వత)ము సూర్యచంద్రుల భ్రమణ క్రమము వారి పరిమాణము ఇదియంతయు యథాతథముగను సవిస్తరముగను తెలుపుము. మేమిది యంతయును మీ నోటినుండి వినగోరుచున్నాము అన సూతుడిట్లు చెప్పసాగెను. భూమండలమున వేలకొలది ద్వీపములును నూరులకొలది ఖండములును గలవు. సకల జగత్తును క్రమము తప్పక చెప్పుట శక్యమే కాదు. (ఐనను) ఈ భూమిని సప్త ద్వీపాత్మకముగా విభజించి చంద్రాదిత్య ప్రభృతి గ్రహముల వ్యవస్థతోను ఖగోళ వ్యవస్థతోను తెలిపెదను. మనుష్యులు తర్కముతో వాని ప్రమాణమును తెలిసికొని చెప్పుచున్నారు. ఏలయన అచింత్యములు (సామాన్యబుద్ధితో ఆలోచించి ఎరుగ శక్యముకానివి) అగు భావములు (పదార్థ వ్యవస్థలు) ఏవి లోకమున కలవో అవి అచింత్యములు. కావున వానిని తర్కముతోనే ఎరుగవలయును.
ఇచ్చటినుండి మొత్తము భూమండలమును 1. జంబూ; 2. శాక; 3. కుశ; 4. క్రౌంచ; 5. శాల్మల; 6. గోమేద, 7. పుష్కర ద్వీపములను పేర సప్తద్వీపములుగా విభజించి వానిలో మొదట జంబూ ద్వీపమును గ్రహించి దానియందు చతుర్దేశ విభాగమును సప్తవర్ష విభాగమును దృష్టియందుంచుకొని భారతదేశము ప్రధానముగా వర్ణనము ఈయబడును. ఈ సప్తవర్ష విభాగమునందే ఆర్ష వాఙ్మయమున అత్యంత ప్రసిద్ధముగా నున్నదియు శ్రీమద్భాగవతాదులందు వర్ణింపబడినదియు నగు నవవర్ష విభాగము కూడ ఇమిడి యున్నది. ఈ భూమండల విభాగ భావనా పరంపర అత్యంత ప్రాచీనము పురాణ రచయితృ ఋషులకు వైదిక ఋషులనుండి అనుశ్రుతముగా అనుస్యూతముగా వచ్చిన భావనా పరంపర ఇది యనుట యందెట్టి సందియమును లేదు. వైదిక స్మార్త పౌరాణిక కర్మానుష్ఠానము లన్నిటియందును ఆయా ప్రసంగములందు ఇదియే గ్రాహ్యము. నేడు మనకు వాడుకలోనికివచ్చిన దేశఖండ ద్వీప విభాగములు దీనియందెట్లు చేరియున్నవో పరిశీలించిన గమనించవచ్చును.
వీని గమనికకై మొదట ఆయా విభాగముల స్థూలరూప ప్రతిపాదనము ఇట్లుండును.
దేశ చతుష్టయ విభాగము: నట్టనడుమ మేరువు దీని సమీపమున ఇలావృతవర్షము (నేటి పామీరుముడిఅను పీఠభూమి) దీనికి దక్షిణమున 1. భారతవర్షము; 2. కైలాస హిమవత్పర్వతములు; 3. అలకనందానది (గంధమాదన మందు); 4. నందనవనము; 5. మానస సరన్; 6. కచ్ఛప భగవానుడు; 7. జంబూవృక్షము; పశ్చిమమున -1. కేతుమాల వర్షము; 2. ఋషభ పారియాత్ర పర్వతములు; 3. స్వరక్షునదీ; 4. వైభ్రాజవనము; 5. శీతోద సరస్; 6. వరాహ భగవానుడు; 7. అశ్వత్థ వృక్షము; ఉత్తరమున-1. ఉత్తర కురువర్షము; 2. శృంగవత్-జారుధి(దేవ)పర్వతములు; 3. సోమానది; 4. సావిత్రవనము, 5. మహాభద్ర సరస్; 6. మత్స్య భగవానుడు; 7. వటవృక్షము; తూర్పున-1.భద్రాశ్వవర్షము, 2. దేవ పర్వతము, 3. సీతానది; 4. చైత్రరథవనము; 5. అరుణోదసరస్; 6. హయగ్రీవ భగవానుడు; 7. భద్రకదంబవృక్షము.
సప్త ద్వీపములు: 1.జంబూ; 2. శాక; 3. ప్లక్ష (గోమేదము అని మత్స్య పురాణమున); 4. శాల్మల; 5. పుష్కర; 6. కుశ; 7. క్రౌంచ ద్వీపములు.
నవవర్షములు: భారత కింపురుష హరీలావృత రమ్యక హైరణ్యక కురు భద్రాశ్వ కేతుమాల వర్షములు. (వర్షము=స్థానము)
వీనిలో దేశ చతుష్టయ విభాగమున ఇలావృత భారత కేతుమాల కురు భద్రాశ్వ వర్షములు చేరియున్నవి. భరతవర్షమందలి నవ భాగములు (ఖండములు) మత్స్య పురానుసారమున- 1.ఇంద్ర ద్వీపము; 2. కశేరు ద్వీపము; 3. తామ్రపర్ణ ద్వీపము; 4. గభస్తిమాన్; 5. నాగద్వీపము; 6. సౌమ్య ద్వీపము; 7. గంధర్వ ద్వీపము; 8. వారుణ ద్వీపము; 9. భరతద్వీపము (ఖండము)
ఇలావృత భారత భద్రాశ్వ కేతుమాల కురు రమ్యక హిరణ్యములనెడి సప్త వర్షములను జంబూ ద్వీపమును యథాస్థితముగ వివరింతును. ఈద్వీపముల-వర్షముల-మండలపు విస్తారమును యోజనముల లెక్కలో చెప్పెదను. జంబూద్వీప వైశాల్యము లక్ష(చదరపు) యోజనములు. ఇది అనేక జనపద గ్రామ) ములతో వ్యాప్తము; అనేకులగు సిద్ధులు చారణులు దేవతలు ఇందు వ్యాపించియున్నారు. శిలా సమూహములందు మెరయుచు నుండెడి గైరిక (కొండలయందు ఏర్పడెడి) ధాతువులతో కప్పువడిన పర్వతము అనేకములును ఆ పర్వతము లందు ప్రభవించిన నదులును దీనియందంతటను గలవు. మిగుల గొప్ప సమీప ప్రదేశములును ప్రక్క ప్రదేశములును కల ఆరు వర్ష పర్వతములు పూర్వ పశ్చిమ సముద్రములందు చొచ్చుకొని తూర్పు పడమరలుగా వ్యాపించియున్నవి. అవి 1. చాల భాగము మంచుతో కప్పబడియుండు హిమవంతము; 2. బంగారుతో వ్యాప్తమగు హేమకూటము; 3. చక్కని ముఖము కలిగినదియు గొప్పదియునగు నిషధ పర్వతము అనునవి మూడు. (ఇచట వర్ష పర్వతములు ఆరని చెప్పియు మూడు మాత్రమే ఈయబడినవి. ఈ మూడును మూడు జతలను తెలుపును. వానిలో ఒక జత నీల నిషధములు; రెండవజత శ్వేత హేమకూటములు; మూడవజత హేమకూట హిమవంతములు. పైనిచెప్పిన మూడును ఈ మూడు జతలలో ముఖ్యమైనవిగా నున్నవి. వర్ష పర్వతములు అనగా ఒక వర్షమును మరియొక వర్షమునుండి వేరుపరచు అవధులు) దేశ (వర్ష) చతుష్టయ విభాగములో కేంద్ర స్థానీయమగు మేరు పర్వతము ఉల్బమయము (ఉపల మయము-ప్రచురముగా రాళ్ళు కలది. అనగా ఇది శిలా ప్రచురమగు ఉన్నత ప్రదేశమేకాని అన్ని పర్వతములవంటి రూపము కలది కాదని తెలియదగినది. సువర్ణమయమని ప్రసిద్ధమైనను అది చాతుర్వర్ణము (నాలుగు వర్ణములు కలది) ఇదియుగాక పరమ పురుషుడు తన అనంతశక్తిచే అవ్యక్తతా వ్యక్తతా దశల నొందు క్రమములో అతని నుండి ప్రజాపతి హిరణ్యగర్భుడు జనించెను. ఆ జనించిన ప్రజాపతి నామక శిశువు నాభిస్థానమీ మేరువు. దానిపై అవరించిన మావి- ఉల్బపు-పొరవంటిది ఈపా మీరు శిలామయ ప్రదేశము. ఇది ఇరువది నాలుగువేల చదరపు యోజనముల వైశాల్యముగలదై నాలుగు దిక్కులందును విస్తరిల్లినది. ఇది వృత్తాకృతియు చతురస్ర రూపమును కలది. ఎట్లన - తూర్పు-పడమర-ఋజు రేఖా రూపమునను దక్షిణోత్తరములందు గుండ్రదనము తోను ఉన్నందున ఈ వృత్తాకృతిలోనే చతురస్రాకృతి ఏర్పడును. ఈ మహామేరువు తూర్పున శ్వేతవర్ణము దక్షిణమున పీత వర్ణము పడమర కృష్ణవర్ణము ఉత్తరమున రక్త వర్ణము కలిగి వరుసగా బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ వర్ణముల రూపమున విరాట్పురుషుడుండుటను తెలుపుచున్నది. ఈ మహామేరు శిలామయ ప్రదేశమునకు (పామీరు పీఠభూమికి) ఆయా దిశలందు నీలవర్ణము- వైఢూర్య రత్నకాంతి-శ్వేతవర్ణము - పీతవర్ణము-హిరణ్య వర్ణము-నెమలి పించెపు కాంతి-బంగారు కాంతి-కలిగిన ఏడు పర్వతములు వెలుగొందుచుండ వీని నడుమ ఈ మహామేరువు పొగలేక జ్వలించు అగ్నివలె ప్రకాశించుచుండును. ఈఏడు పర్వతములందును సిద్ధులును చారణులును సదా సంచరించుచుందురు. (అష్ట సిద్ధులు-మహామంత్ర సిద్దులు పొందియును పొందుటకు అయా సాధనలు చేయుచు సాత్త్విక ప్రవృత్తితో సంచరించుచుండు దేవజాతివారు సిద్ధులు. తమ దివ్య శక్తులతో అంతరిక్ష ద్యులోక సంచారము చేయుచు విమానములు లేకయు ఆయా లోకములందు సంచరించుచు వింతలు చూచుచు ఆనందించుచు అవి మెచ్చుచు తిరుగు దేవతలు చారణులు) ఈ పర్వతములలో ఒకదానికిని మరియొక దానికిని నడుమగల అంతరములన్నియు కొలిచి కూడగా అగు అంతరముల మొత్తము తొమ్మిదివేల యోజనములు (ఇది వైశాల్యముకాదు) ఈ నడుమ నున్న మహామేరువునకు చుట్టుప్రక్కల దీనినంటియున్న వర్షమునకు ఇలావృత వర్షమని వ్యవహారము. దీని వైశాల్యము ఇరువది నాలుగువేల చదరపు యోజనములు.
సృష్ట్యాదియందు భగవత్సంకల్పానుగుణముగా దేవతలు వితతమొనర్చిన ఆది యజ్ఞము నందు ఈ ప్రజాపతి నాభిస్థానము వేదియై ఆ వేదికకు నలుమూలలందున్న నాలుగు పర్వతము లును విష్కంభములు వేదికకు అవధిని తెలుపు గుంజలు - కాగా నడుమనున్న అగ్ని స్థానమీ మహామేరువని ఋషుల భావన. ఈ మహామేరువు (పామీరు శిలామయ ప్రదేశము) అను దేవయజ్ఞ వేదికలో దక్షిణార్ధము - ఉత్తరార్ధము అను రెండు అర్ధభాగములు ఉన్నవి అని భావన.
ఈ మహామేరువు ఒక గుర్తుగా చేసికొని చేయు ఈ భూగోళ సప్తవర్ష విభాగమునందు ఒక వర్షమును మరియొక వర్షమునుండి వేరుపరచు పర్వతములు వర్ష పర్వతములు. ప్రతి వర్షమునకును ఉత్తర దక్షిణముందు రెండేసి వర్ష పర్వతములు పొలిమేర గీతలై తూర్పు పడమరలుగా వ్యాపించిన ఈ పర్వతములలో ఒక్కొక్కదాని పొడవు ఇంచుమించుగ రెండేసి వేల యోజనములు.