ఈశ్వరుడు కపాలియయిన కథ

దేవి మహాదేవుని ఇట్లడిగెను, హిమవంతము మందరము గంధమాదనము కైలాసము నిషధము మహాకాంతి గల మేరుపృష్ఠము రమ్యమగు త్రికూటము మానన మహాపర్వతము- అను ఈ పర్వతములను రమ్యములగు నందనాది దేవోద్యానములును పుణ్యములగు తీర్థస్థానము లను తీర్థక్షేత్రములను అన్నిటిని వదలి మీకు ఈఅవిముక్త క్షేత్రమందాసక్తి ఏల? ఇచట మహా పుణ్యమేమి కలదు? ఆ పరమ రహస్యము నాకు తెల్పుడు, ఏల మీరు సదా భూత గణములతో కూడి ఇట విహరింతురు? ఈ క్షేత్రమునకు కల శ్రేష్ఠత ఏమి? ఇచటనుండు వారెవరు? వారి యందు మీ అనుగ్రహమెట్టిది? శంకరా! అది అంతయు తెలుపుడు. అన దేవదేవుడిట్లు చెప్పెను: భామినీ! నీవడిగినది ఇది అత్యద్భుతమగు ప్రశ్న, అదియంతయు చెప్పెదను వినుము, నాప్రియా! ఈ పుణ్యక్షేత్రమగు వారాణసియందు సిద్ధ గంధర్వ సేవిత త్రిపథగ (మూడు త్రోవలపోవు) పుణ్యనది గంగ ప్రవేశించినది, అందుచే సుందరీ! నాకు గజచర్మ వస్త్రమునందు వలెనే దీని యందును ప్రీతి యధికము, ఇట్లు సర్వస్థానములందు ఉత్తమము కావున ఈ స్థానమునందు నాకు రతి (ఆనందము) అధికము, సురేశ్వరీ! ఇందుచేతనే ఇచటి లింగము నందును నేను సన్నిధి చేసి ఉందును. గుణవతులలో శ్రేష్ఠ అగు దేవీ! ఈ క్షేత్ర గుణములను చెప్పెదను వినుము, వీనిని విన్నచో సర్వపాపముక్తులగుట నిస్సంశయము; పాపుడు కాని పాషండుడు (వేద బాహ్యుడు) కాని ధర్మార్థము అతిక్రమించిన వాడు కాని అవిముక్త యాత్ర చేసినచో సర్వపాప ముక్తుడగును; శుభరూపా! సర్వభూత ప్రళయమయి స్థావర చర ప్రాణులును పదా ర్థములును నశించినపుడుకూడ నేను నాకు ప్రియతరమగు ఈ స్థానమును నేను విడువను; యుగక్షయ (ప్రళయ) కాలమున దేవగంధర్వ యక్ష ఉరగ రాక్షసులును నానోరు ప్రవేశించుదురు, అపుడును నేను ఇట వారి పూజను సాక్షాత్తుగా ప్రతిగ్రహించుచుందును. ఇది సర్వ రహస్యములలో ఉత్తమమును నాకు ప్రియతరమును అగు స్థానము.

సుశ్రోణీ ధన్యులు, నాభక్తులగు త్రైవర్ణికులు, నా భక్తియే ప్రధానముగాగల ఇతర నరులును అచట ప్రవేశింతురు: అచట మరణించి పరమగతినందుదురు, అవిముక్తమందుండు నరుడు సారుద్రము (నమక చమకముల)తో నన్నారాధించినవాడే; సదా దానమొనర్చినవాడే, సదా తపస్వియే, (అట్టి వానికే ఈ క్షేత్రము లభించునని యర్థము) నన్ను నిరతము పూజించువాని విషయమున నేను తృప్తుడనగుదును; సర్వదానము లాచరించినవాడు సర్వయజ్ఞములతో దేవతల నారాధించినవాడు సర్వతీర్థ స్నానమాచరించిన వాడు ఇటకు వచ్చినన్ను శరణంద గలుగును; దేవీ! సునిశ్చయముతో ఈ అవిముక్త యాత్ర చేయువారును ఇట నివసించువారును, పరమున నా అనుగ్రహమున స్వర్గమున వసించి ప్రకాశింతురు; శుభలోచనా! అట్టివారు ఎవరికి తిరస్క రించను భరించను అలవికానివారై సంతాప రహితులై అవిముక్త శుభక్షేత్రము చేరి కృతనిశ్చయులై నాకు భక్తులై పాపములను దులుపుకొని విమలులు అగుదురు, అనగా దేవి మరల ఇట్లనెను: దేవా! ఒకప్పుడు నాప్రీతికై దక్ష ధ్వంస మొనర్చితిరి; అట్లే ఇప్పుడు అవిముక్త క్షేత్రగుణములను ఇంకను తెలిపి నాకు తృప్తి కలిగింపుడు. అవి ఎంత విన్నను తృప్తి కల్గుటలేదు. అన ఈశ్వరు డిట్లనెను, దేవీ! నేను నాడు నీ ప్రీతికే క్రుద్ధుడనై దక్షయజ్ఞ వినాశ మొనర్చితిని. అట్లే ఇపుడీ అవిముక్త క్షేత్రగుణములు తెలిపి నీకు ప్రీతి కలిగింతును! మేలగు ముఖము కలదానా! కృతనిశ్చయులై మద్భక్తులై అవిముక్తమందుండువారు శతకోటి కల్పముల తరువాత కూడ పునర్జన్మమును అందరు; అన దేవి ఇట్లు పలికెను: దేవా! అవిముక్త క్షేత్రమందు ఇతరత్ర దుర్లభములగు గుణములున్నవని కీర్తించితిరి. మహేశ్వరా! వాటినన్నిటిని వాటి తత్త్వముతో కూడ తెలుపుడు; మహాదేవా! నా హృదయమందీ విషయమున చాల కుతూహలము కలదు అన ఈశ్వరుడనెను: వరారోహా! అవిముక్తవాసులు నా ప్రసాదమున అక్షయులు అమరులు ఆదేహులు అయి నన్ను ప్రవేశింతురు; విశాలాక్షీ! మరి ఇంకేమి వినగోరుదువు?

దేవి అనెను, దేవా! అవిముక్త మహాక్షేత్రమందు అద్భుతమగు పుణ్యమును, గుణములును గలవు; అవి ఎంత విన్నను నాకు తృప్తి కలుగుట లేదు; దేవా! అవి ఇంకను తెలుపుడు. అనగా ఈశ్వరుడిట్లు వచియించెను; మహేశ్వరీ! వరారోహా! నా ప్రియా! అవిముక్త క్షేత్రగుణములు చెప్పెద వినుము; శాకములు ఆకులు తినువారు ఇంద్రియ నిగ్రహము కలవారు నిరత స్నాతులు సూర్యకిరణముల త్రావి జీవించువారు దంతములు రోలుగా చేసికొని ధాన్యములు నమలి తిని జీవించువారు రాతిపై ధాన్యము లరగదీసి తిని బ్రదుకువారు నెలకొక మారే దర్భాగ్రమునకు వచ్చినంత నీరు ఆహారముగా గ్రహించి జీవించువారు చెట్ల మొదళ్లే నివాసముగా రాళ్లే పడకగా నుండువారు, రవితేజస్కులు జితక్రోధులు జితేంద్రియులునయి ఇట్టి బహువిధ ధర్మములు పాటించి ఇతరత్ర వ్రతము లాచరించుచు, తప మొనర్చువారు కూడ మూడు వేళల భుజించుచునే నావంటి పురుషుడును నీవంటి స్త్రీయు అవిముక్తమందు వసించువారి పదారవ పాలునకు సరి పోలరు; అవిముక్తవాసులు స్వర్గవాసులే; అవిముక్తమువంటి క్షేత్రమును ఇదివరకు లేవు; ఇక ముందుండవు; ఇచట పరమయోగము పరమగతి పరమ మోక్షము లభించును; కావుననే ఇట్టి క్షేత్రము మరిలేదు; వరవర్ణినీ! మహారహస్యము తెలిపెదను; నూరు జన్మములకైన యోగసిద్ధియు లక్ష జన్మములకైన మోక్షమును లభించునో లభించదో చెప్పజాలము; కాని సునిశ్చితులై అవిముక్తమును ప్రవేశించి అచట వసించువారు ఒక జన్మముతోనే యోగసిద్ధినంది పరమ దుర్లభమగు మోక్ష మందగలరు; పృథివియందు దీనికి సాటియగు క్షేత్రము మరిలేదు; ప్రియా! ఇచట ధర్మము సదా నాలుగు పాదముల సన్నిధినంది నడుచును; ఈ క్షేత్రము నాలుగు వర్ణముల వారికిని పరమ గమ్యము; అన దేవి ఇట్లనెను: ప్రభూ! నేను నీ వలన ఈ క్షేత్ర గుణ ములను ఇతరత్రకల గుణములను తెలిసికొంటిని; విప్రేంద్రులు (ద్విజులు) యజ్ఞములు చేయు నపుడు వారిచే ఆరాధింపబడు దేవత ఎవరు?

దేవితో ఈశ్వరుడిట్లు పలికెను: భావనతోను మంత్రముతోను నన్నే ఎవరు యజింతు (ఆరాధింతు)రో వారికీ లోకములందు భయములేదు; వారు భవుడు (లోకకారణుడు) రుద్రుడు (జ్ఞానావరోధమును తొలగించువాడు) అగు నన్నే పొందుదురు, దేవీ! యజ్ఞవిధి సమంత్రకము అమంత్రకము నని రెండు విధములు; యోగమును - సాంఖ్యము, యోగమునని రెండు విధములు; సర్వభూతములం దంతర్యామినైయున్న నన్ను ఏకత్వ భావన నాశ్రయించి సేవించు యోగి సర్వ విధముల లోకసంగముతో నుండియు నా యందున్నవాడే; ఏ నరుడు తనతో సమానముగా అన్ని భూతములను భావించి చూచునో అతనికి నేను కాని నా కతడు కాని లేకపోవుట ఉండదు. యోగము నిర్గుణము సగుణమునని రెండు విధములు; సగుణ యోగము విజ్ఞాన (అనుభవ) గోచరమగును; నిర్గుణ యోగము మనస్సున కతీతము; దేవీ! నీ వడిగినది ఇట్లు నీకు తెలిపినాను. అన దేవి ఇట్లడిగెను; భక్తులను అనుష్ఠించు భక్తి త్రివిధములని మీరు చాల మారులు చెప్పి యుంటిరి; దాని వాస్తవరూపము తెలియగోరుచున్నాను; నాకు తెలుపుము; అన ఈశ్వరుడిట్లనెను. భక్తుల భక్తియందు వాత్సల్యముగల మహాభాగా! దేవీ! వినుము; సాంఖ్యమును కాని యోగమును కాని ఆశ్రయించినవాడు దుఃఖాంతమును పొందును, ఎవడు సదాభిక్షా సేవనముతో జీవించునో అతడు భక్తితో రంజితుడై దానిచే భగవత్తన్మయత్వమునంది ఆ భక్తి మంతుడు భగవంతునిలో తల్లీను అగును. వరారోహా! దేవీ! శాస్త్రముల బహుకారణ (హేతువాద) ములను చూడగలిగినవారైనను వారు జ్ఞాన సంబంధి వాక్యములతో వాదింతురే కాని నన్ను చూడజాలరు; యోగముతో చిత్తమున నన్నే నిలిపి పరమార్థ జ్ఞానమునంది తృప్తులగు యోగులును విద్య(తాత్విక జ్ఞానము)చే ఆత్మ(పరమాత్మ)తత్త్వము నెరిగి యోగతత్త్వము నెరిగిన ద్విజులు మాత్రమే నన్ను దర్శింతురు; ప్రత్యాహారము (విషయ సుఖముల నుండి ఇంద్రియములను ఉపసంహరించుట)చే చిత్తమును శుద్ధ మొనర్చుకొనవలెను; మరేదియు ఆలోచింపక తత్త్వమునే ధ్యానించవలయును; గుణత్రయ సమాయోగమున తత్త్వమెరిగిన జ్ఞానవంతుడు మాత్రమే నన్ను దర్శించును; దేవీ! నీ వడిగినది నీకు చెప్పితిని, మరి ఏమి వినగోరుదువు? వరారోహా! సువ్రతా! ఇంకను మరల మరల ఎన్నిమారులయినను చెప్పెదను; గుహ్యమును పవిత్రమును నగు ఏదివిన కుతూహలము నీ హృదియందున్నను అది ఎల్ల చెప్పెదను; ప్రియా! ఏక మనస్కవై వినుము.

అన దేవి ఇట్లనెను, దేవా! ముముక్షువులగు యోగులు దర్శించు నీరూప మెట్టిది? ఇది నా సంశయము; సురసత్తమా! నీకు నమస్కారము;నా కిది తెలుపుము, అన భగవాను డిట్లనెను: అది వాస్తవమున జ్యోతీరూపమయినది; అది మూర్తము (సాకారము) అమూర్తము (నిరాకారము) అని రెండు విధములు; ఆ పరమాత్మానుభవము పొందగోరు విజ్ఞానవంతుడు అందులకై యత్నించవలయును; నిర్గుణుడగు భూతాత్మ (సర్వ భూతాంతర్యామియగు పరమాత్మ) తత్త్వము ఇట్టిదని చెప్ప శక్యము కాదు; దేవతలకు కూడ దివ్య వర్ష శతముల కయినను సాధ్యమో కాదో చెప్పజాలము అన విని దేవి ఇట్లనెను: కృత్తివాసుడు (గజ చర్మధారి) యగు ఈశ్వరుడు ప్రమథ గణములతో నిత్యము నివసించు ఆ అవిముక్త క్షేత్రము అన్ని దిశలయందును వ్యాపించిన విస్తార ప్రమాణము ఎంత? అన ఈశ్వరు డిట్లనెను, ఆ క్షేత్రపు తూర్పు పడమరల పొడవు రెండు యోజనములు; ఉత్తర దక్షిణముల వెడల్పు అర్ధ యోజనము; వారాణసీనది శుక్లనది పర్వత శ్రేష్ఠమగు భీష్మ చండికము అనువాని సమీపముగా ఈ క్షేత్రము వ్యాపించి ఉన్నది. దీనియందు విఘ్న వినాయకులను ప్రమథ గణపతులును ఉన్నారు; వారు కూశ్మాండుడు గజతుం డుడు జయంతుడు మొదలగువారు, వారెల్లరును అధిక మదశాలురు; సింహవ్యాఘ్ర ముఖులు; వికటరూపులు; మరుగుజ్జువారు; పొట్టివారు, వీరిలో నంది–మహాకాళుడు-చండ ఘంటుడు మహేశ్వరుడు దండచండేశ్వరుడు మహాబలుడుగు ఘంటాకర్ణుడు- వీరుకాక మరియు ఇతరులు అనేకులు గణములవారగు రుద్రులు ఈశ్వరులు ఉన్నారు; వారందరు పెద్ద పొట్టలు పెద్ద దేహములు కలిగి వజ్రము-శక్తి మొదలగు ఆయుధముల దాల్చినవారు; ఈ తపోధనులు శూలముద్గ రాయుధపాణులయి ప్రతిద్వారమందు నిలిచి అవిముక్త క్షేత్రమును రక్షించుచుందురు. బంగరు కొమ్ములు వెండి -గిట్టలు కంఠమున కదలియాడు గంటలు మూడు వన్నెలుకల పాడి యావును వారాణసి యందు వేదపారగుడగు బ్రాహ్మణునకు దాన మిచ్చినచో పద్మలోచనా! వరారోహా! ఆదాత తన వంశమందలి ఏడు తరములవారిని పవిత్రులజేయును. నిస్సంశయము.

ఎవడా క్షేత్రమున బ్రాహ్మణునకు బంగారము వెండి వస్త్రములు అన్నము మొదలగునవి. దానము చేయునో వాని ఆ దానము అక్షయము అవ్యయము అగును; ఆ తీర్థపు మాహాత్మ్యమును సమృద్దిని వాస్తవమున తెలిపెదను వినుము; అచట స్నానమాడిన మానవులకు రోగబాధా నివృత్తియు దశాశ్వ మేధఫలమును లభించును. వేదపారగుడగు విప్రున కచట ఏ కొంచెము దాన మిచ్చినను దాత శుభగతి నందును, అగ్నివలె ప్రకాశించును; వరణా అసియను నదులు జాహ్నవి (గంగ)తో సంగమించు చోట యథావిధానముగ అన్నదానము చేసిన వానికి పునర్జన్మ ముండదు. దేవీ! నీ కిది ఇట్లు ఆ తీర్థపు ఉత్తమఫలము తెలిపితిని; సువ్రతవగు ఉమా! మరియొక నిశ్చయమును తెలిపెదను వినుము: అచట ఒక రేయింబవలు ఉపవాసముండి బ్రాహ్మణులను (అన్నాదికముతో) సంతృప్తిపరచినచో సౌత్రామణి యజ్ఞఫలము నందును, వరాననా! అచట మాసమాత్రము ఏకభుక్త వ్రతము చేసినచో వెంటనే యావజ్జీవము చేసిన పాపమంతయు నశించును; అవిముక్త క్షేత్రమున యథావిధానముగ అగ్ని ప్రవేశము చేసినచో వారు నా ముఖ మందు ప్రవేశించిన ఫలమును నిస్సంశయముగ అందుకొందురు, పది బంగారు పూవులను (లేదా పదినవరసుల బంగారు పూవులను) దానముచేసిన వారికి నిత్యాగ్ని హోత్ర ఫల మబ్బును, అచట ధూప, గంధ, దానముచే ఫలము లభించును; అచట గుడియందు కసవూడ్చుటచే ఐదునూర్ల దానముల ఫలము, అలుకుటచే వేయి దానముల ఫలము, మాల అర్పించినచో లక్ష దానముల ఫలము పొందును; గీతవాద్యములు జరిపించినచో అనంతఫలము లభించును.

దేవి దేవునితో ఇట్లనెను, దేవా! నీవు చెప్పినది ఇది అత్యద్భుతమగు విషయము. నీ మీ క్షేత్రమును విడువకుండుటలోని రహస్య హేతువును తెలుపుము; అనగా ఈశ్వరుడిట్లు తెలుపసాగెను: వరారోహా! సుశ్రోణీ! ఈ విషయము ఎట్టిదో తెలిపెద వినుము; మహాత్ముడగు బ్రహ్మకు పూర్వము ఐదవ శిరస్సు జనించెను; అది చాల శ్రేష్ఠమయినది-కాచిన బంగారువలె మంచి కాంతితో జ్వలించునది; ఇట్లుండగా దేవీ! అతడు నాతో నీ పుట్టుక నేనెరుగుదు ననెను; అంతట నేను క్రోధవ్యాప్తుడనయి రక్తనేత్రుడనయి నా ఎడమచేతి బొటనవ్రేలి గోటి కొనతో అతని తల త్రెంచితిని; అంతట బ్రహ్మ “అనపరాధుడనగు నా తల త్రుంచితివి కనుక నీవు శాపయుక్తుడవయి కపాలధారి వగుదువు; బ్రహ్మహత్యాదోషాకులుడవయి భూతలమందలి తీర్థములందు తిరుగుచుండుము” అనెను; దేవీ! నే నంతట హిమవత్పర్వతమునకు పోతిని, అచట నేను నారాయణుని మహాభిక్ష కోరితిని; అతడు తన పార్శ్వమును చీల్చగా మహారక్త ధార స్రవించసాగెను; అది ఏబది యోజనముల పొడవయ్యెను; అంతటి దానితో కూడ నాకపా లము నిండలేదు. ఆశ్చర్యకరమయి కనబడు ఆఘోర రక్తధార దివ్యసంవత్సర సహస్రముల పాటు ప్రవహించుచునే ఉండెను; అదిచూచి విష్ణు భగవానుడు నాతో “దేవేశా! శంకరా! శంభూ! ఇటువంటి ఈకపాలము ఎచ్చటి నుండి లభించెను; ఇది ఆశ్చర్యకరమయినది; నాకిది తెలిపి సంశయము నివారింపుము” అనెను.

అతనితో నేను ఇట్లంటిని. “ఈ దివ్య కపాలపు ఉత్పత్తిని తెలిపెద వినుము; లక్షల దివ్య వర్షములపాటు బ్రహ్మ సుదారుణ తపమాచరించి దివ్యమును అద్భుతమును గగుర్పాటు కలిగించునదియు దివ్య సువర్ణ కాంతిమంతమును అగు దేహమును సంపాదించుకొనెను; ఆ మహాత్మునకపుడే ఐదవతలయు మొలిచెను: దేవా! నేనది త్రుంచితిని, ఇది చూడుము- జయింప నలవి కాక నేను పోయిన చోటికెల్ల నావెంట వచ్చుచున్నది;” అనగా పురుషోత్తమ దేవుడిట్లనెను: “నీవు బ్రహ్మకు ప్రీతి కలిగించు పనిచేయవలయును; నీవు పోయిన ఏచోట అది నిన్ను విడుచునో అది నీవు నీ స్వస్థానముగా చేసికొనుము, అది తన తేజస్సుతో తానే నీకు శుభము కలిగించును” అనెను. నేనంతట పరమ రహస్యములగు తీర్థములు క్షేత్రములు అన్నియు తిరుగసాగితిని; కాని పృథుశ్రోణీ! ఏమియు మేలు కలుగలేదు; అంతట నేను మహాశయా! ఈ అవిముక్తమునకు వచ్చి నా స్వస్థానమున నిలిచితిని; విష్ణు కృపవలన నా శాపము తీరెను; ఆ కపాలము వేయిగా చీలి స్వప్నమున లభించిన ధనమువలె అదృశ్యమయ్యెను; అంతట నేనిది బ్రహ్మహత్యా నివారక క్షేత్రముగా నిర్ణయించితిని; వరవర్ణినీ! ఇది దేవతల శ్మశానము; ఇటనుండి నేను కాలుడనయి జగమంతయు సృజించుచు సంహరించుచు ఉందును; దేవేశీ! ఇట్లు ఇది సర్వ రహస్య స్థానము లందును నాకు ప్రియతమమైనది; నాయందును విష్ణునందును దివాకరుడు (పగళ్ళ నేర్పరచు వాడు లోకనాథుడు అగు భాస్కరునియందును భక్తిగల ఉపాసకులు అచ్చటికి పోవుదురు; ఇచట దేహత్యాగమొనర్చినవాడు నన్ను ప్రవేశించును; అనగా దేవి దేవునితో ఇట్లనెను: దేవా! పద్మయోని (పద్మము జన్మస్థానముగాగల బ్రహ్మయును, ఆ పద్మమునకు జన్మకారణుడగు నారాయ ణుడును)చెప్పిన ఈవిషయములును, వాని ననుసరించి జరిగిన ఈఘటనలును అత్యద్భుతముగా నున్నవి, మహాతేజశ్శాలీ: త్రిపురాంతకరా! నీవు ఇచట నిత్య సన్నిహితుడగుట వలన ఇతర క్షేత్రములన్నియు కలిసినను దీని పదునారవ వంతునకును సరిపోలవు; దేవేశుడగు శంకరుడుండు ఈ స్థానమునందు కల గంగతో తీర్థ సహస్రములును సరిపోలునో పోలవో చెప్పజాలము;

దేవేశా! ఇట్టి నీవే ఉత్తమభక్తి రూపుడవు; ఉత్తమగతివి; బ్రహ్మాది దేవతలకును నీవే సనాతన (శాశ్వత) మగు ఉత్తమగతివి; ఇదియంతయు భక్తులగు ద్విజుల యందలి అనుకంపతో వారికి వినిపించవలయును.